ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
పీడిత ప్రజల పక్షపాతిగా తన రచనలతో, పాటలతో దోపిడీ వ్యవస్థపై యుద్ధం ప్రకటించిన కవి మల్లావఝ్జల సదాశివుడు, తనకు కాకుండా తన భావజాలానికి ప్రచారం జరగాలని కోరుకున్నాడని, వ్యక్తి ప్రచారం కంటే వ్యవస్థ ప్రక్షాళన ముఖ్యమని భావించిన మహా మనీషి అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. నవంబరు 25న హైదరాబాద్ రవీంధ్రభారతి కాన్ఫరెన్స్‌హాల్‌లో తెలంగాణ వికాస సమితి, చేతన సాహితీ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి సదాశివుడు 11వ సంస్మరణ సభ జరిగింది. సభలో నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా మరసం సభ్యుడు, కవి తైదల అంజయ్యకు సదాశివుడు స్మారక అవార్డు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సదాశివుడు వ్రాసిన పాటలు ప్రజల్లో ఎంతో పోరాట పటిమను నింపాయన్నారు. జనబాహుళ్యంలో కలిసి పోయిన ఈ పాటలు వ్రాసిన వ్యక్తి ఎవరికీ తెలియదంటే ఆయన ఎంత నిరాడంబరంగా జీవన గమనాన్ని కొనసాగించాడో అర్దమవుతుందన్నారు. ఏమున్నదక్కో.. ఏమున్నదక్కో.. అనే పాట ఎంత ప్రజాధరణ పొందిందో అందరికీ తెలిసిందేనన్నారు. దాని రచయిత ఎవరో ఇంత వరకు తనకు కూడా తెలియదంటే అది సదాశివుడు నిరాడంబరతకు నిదర్శనమన్నారు. ఇలా ప్రజా బాహుళ్యంలోకి రాకుండా తెర వెనుక ఉండి సమాజ గమనాన్ని నిర్దేశించిన తెలంగాణ కవుల జీవిత చరిత్రను వెలుగులోకి తేవాలని, ఈ విషయాన్ని వేదికపై ఉన్న తెలుగు యునివర్సిటీ, సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప కులపతులు ఎస్.వి.సత్యనారాయణ, సీతారామారావులు పరిశీలించి వారి చరిత్రను భావితరాలకు అందించాలని ఆయన కోరారు.
కార్యక్రమానికి కవి దేశపతి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా బుద్ద పూర్ణిమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, టీఎన్జీఓల సంఘ గౌరవ అధ్యక్షులు దేవీప్రసాద్, ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, తెలుగు యునివర్సిటీ ఉప కులపతి ఎస్.వి.సత్యనారాయణ, డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప కులపతి సీతారామారావు తదితరులు ప్రసంగిస్తూ సదాశివుడు పాటలు, రచనలు పీడిత ప్రజల బాధలను కళ్ళకు కట్టాయన్నారు. వరకట్న దురాచారం గురించి, దళితుల అంటరానితనం గురించి రాసిన పాటలు కదిలించేవిగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రా పాలకులతో ఎలా దోపిడీకి గురవుతున్నారో తన పాటల ద్వారా తెలంగాణ మలిపోరాటానికి ముందే కుండబద్దలు కొట్టారని పేర్కొన్నారు. తమకు సదాశివుడుతో ఉన్న పరిచయాలను, అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో సదాశివుడు కుమారులు వంశీ, ఇతర కుటుంబ సభ్యులు, సదాశివుడు అభిమానులు పాల్గన్నారు.