కాకతీయుల సామ్రాజ్యంలో పరిఢవిల్లిన సాంస్కృతిక నృత్యరూపం పేరిణి శివతాండవం. పదకొండవ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది ఈ నృత్యరూపం. కాకతీయుల సేనాని జాయప ‘నృత్త రత్నావళి’లో ఈ నాట్యానికి సంబంధించిన సమస్త అంశాలు సవివరంగా గ్రంథస్తం చేశారు.
యుద్ధానికి సిద్ధపడే సేనలకు ఉత్ప్రేరకంగా ఉపయోగపడు రీతిలో పేరిణి శివతాండవాన్ని తీర్చిదిద్దారు. ఈ నృత్యాన్ని రూపొందించడంలో ఆనాటి వీరశైవ సాంప్రదాయ పద్ధతులను పొందుపరిచారు. ప్రధానంగా ఈ నాట్యంలో ప్రదర్శించే భంగిమలు, ముద్రలు అన్నీకూడా యుద్ధ సన్నాహక సూచకంగా సైనికులను సన్నద్ధం చేసే విధంగా వుంటాయి.
పేరిణి నృత్యాన్ని రెండు సాంప్రదాయాలలో ప్రదర్శిస్తారు. పురుషులు చేసే నృత్యాన్ని ‘పేరిణి తాండవ’మని, మహిళలు చేసే నృత్యాన్ని ‘పేరిణి లాస్యం’ పేరిట ప్రదర్శిస్తారు. అయితే కాకతీయుల కాలంలో వైభవోపేతంగా ఆదరణను చూరగొన్న పేరిణి నృత్యం కాకతీయరాజుల సామ్రాజ్యం అనంతరం కాలనుగుణంగా కనుమరుగవుతూ వచ్చింది. కేవలం రామప్ప దేవాలయ ‘నాగిని’ శిల్ప భంగిమలలో నిక్షిప్తమై వుండిపోయింది.
అపురూపమైన నాట్యానికి తిరిగి ఇరవయ్యో శతాబ్దం 80వ దశకంలో డా. నటరాజ రామకృష్ణ కొత్తగా వెలుగులోకి తెచ్చారు. రామప్ప దేవాలయ శిల్పాలను పరిశీలించి, జాయప విరచిత ‘నృత్త రత్నావళి’ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని విస్తృత పరిశోధన చేసి చరిత్ర గతమైన పేరిణి నాట్యాన్ని పేర్చి, కూర్చి, తీర్చిదిద్ది వేదికపైకి తెచ్చారు. నటరాజరామకృష్ణ విశేష కృషి ఫలితంగా కొందరు శిష్యులను సంసిద్ధులను చేశారు. అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని వేదికలపైన ప్రదర్శించవలసిన పేరిణి నృత్యం అప్పటి ప్రభుత్వాల పక్షపాత ధోరణుల మూలంగా, ఒక మూలకు మాత్రమే పరిమితమయ్యింది. ఏ కళకయినా రాజాదరణ లేకపోతే చితికి పోతుంది. నటరాజ రామకృష్ణ శిష్యులకు మళ్ళీ శిష్యులు రూపొందక పోవడంతో అంతంతమాత్రం ఆదరణతో ‘పేరిణి’ పేరు అలా వుండిపోయింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, మన సంస్కృతి సాంప్రదాయాలకు పట్టం కట్టాలనే పట్టుదలతో ముందుకు కదిలింది తెలంగాణ సాంస్క ృతిక యంత్రాంగం. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆశీస్సులతో, మంత్రి అజ్మీరా చందూలాల్ పూనికతో, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ ఐఎఎస్ అధికారులు పాపారావు, కె.వి. రమణాచారి, సాంస్కృతిక శాఖ ఛైర్మన్ రసమయి బాలకిషన్, డైరెక్టర్ మామిడి హరికృష్ణల సమష్టి కృషి ఫలితంగా, నటరాజ రామకృష్ణ తొలి తరం శిష్య బృందం పేరిణి కళాకృష్ణ, పేరిణి ప్రకాశ్, పేరిణి బీమన్, రతన్ కుమార్, పేరిణి శ్రీనివాస్, పేరిణి కుమార్ తదితరుల బృందంతో రవీంద్ర భారతిలో 30 రోజుల శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తదనుగుణంగా పేరిణి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్ధిపేట, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ కేంద్రాలు వేదికగా శిక్షణా శిబిరాలను నిర్వహించి ‘పేరిణి’ నృత్యం పట్ల కొత్త తరం యువతకు ఆసక్తిని, అనురక్తిని కలిగించడం జరిగింది.
ఆరు నెలల కఠోరశ్రమ, నిరంతర పర్యవేక్షణల ఫలితంగా పేరిణి నాట్యాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణంరోజు జూన్ 2న లలిత కళాతోరణంలాంటి విశాలమైన వేదికపైన సుశిక్షితులైన 256 మంది కళాకారులతో పేరిణి నృత్య హారాన్ని రాష్ట్రానికి కంఠాభరణంగా మలిచారు. ఆ దృశ్యం అపూర్వం, అనిర్వచనీయం, అమోఘం.
ప్రభుత్వం తీసుకున్న ప్రణాళిక బద్దమైన పటిష్టచర్యల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో పేరిణి శివతాండవాన్ని విద్యా ప్రణాళికలో చేర్చడం జరిగింది. 2016 జూలై 1 నుంచి శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి.