రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు వెలగాలి. పౌరులకు సకల సదుపాయాలు, సేవలు సులభంగా అందాలి. పౌర సౌకర్యాలు మెరుగుపడాలి. అవినీతికి ఆస్కారం లేని ఆదర్శ పాలన అందించాలి. ఈ లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అనేక చర్యలు చేపట్టారు. ఆ దిశలోనే ఇప్పుడు తాజాగా ప్రజాహితం, పారదర్శకం, అవినీతిరహిత పాలనకోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపల్‌ చట్టాన్ని తీసుకువచ్చింది. దీనికి సంబంధించి తెలంగాణ పురపాలక సంఘాల బిల్లు-2019ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రత్యేకంగా నిర్వహించిన శాసన సభ సమావేశాలలో ప్రవేశపెట్టగా, ఉభయ సభలూ ఈ బిల్లును ఆమోదించాయి.

తెలంగాణ పురపాలక సంఘాల చట్టం-2019గా పిలవబడే ఈ చట్టాన్ని ప్రభుత్వం ఎంతో పటిష్టంగా, కఠిన నిబంధనలతో రూపొందించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రజలైనా, ప్రజా ప్రతినిధులయినా, అధికారులైనాసరే శిక్ష అనుభవించవలసిందే. పౌర సదుపాయాలలో భాగంగా, ఇంటిపన్నును ఎవరికివారే స్వీయ ధృవీకరణకు వెసులుబాటు కల్పించింది. అయితే, ఇందులోతప్పుడు లెక్కలు చూపినట్లయితే, వాస్తవ పన్ను సహా 25రెట్ల అపరాధరుసుము వసూలు చేస్తారు.

భవన నిర్మాణాలకు సంబంధించి నిర్మాణ అనుమతులను సరళీకరించారు. 75 చదరపు గజాలలోపు ఇంటికి అనుమతులు అక్కరలేదు. ఈ స్థలంలో జి ప్లస్‌ వన్‌ నిర్మాణం జరుపుకోవచ్చు. అయితే, దీనిని కేవలం రూపాయి ఖర్చుతో పురపాలక సంఘంలో రిజిస్టర్‌ చేసుకోవాలి. తద్వారా ఇంటినెంబరు, తదితర సౌకర్యాలు పొందవచ్చు. ఈ విధంగా నిర్మించుకున్న ఇంటికి పన్ను కూడా కేవలం రూ.100 మాత్రమే విధిస్తారు. నిజంగా ఇది పేదలకు వరం. అయితే, అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే మాత్రం నోటీసులు కూడా లేకుండా కూల్చివేసే విధంగా ఈ చట్టంలో కఠిన నిబంధనలు రూపొందించారు..

పురపాలక సంఘాలలో సిబ్బందికి బదిలీలు లేకపోవడంతో విధినిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి పెరిగిపోతోందని భావించిన ప్రభుత్వం ఆ సిబ్బందిని ఎక్కడినుంచైనా ఎక్కడికైనా బదిలీచేసే అధికారాలను ఈ కొత్త చట్టంలో కల్పించింది. ఈ చట్టంలో జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు ఇవ్వడం జరిగింది. పచ్చదనానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన ఈ చట్టంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అందుకు అనుగుణంగా బాధ్యతలు అప్పగించింది. పచ్చదనాన్ని పెంచేందుకు కలెక్టర్‌ అధ్యక్షతన గ్రీన్‌ కమిటీలు ఏర్పాటు చేసి హరితహారానికి దోహదపడే కార్యక్రమాలు చేపడతారు. అలాగే, మునిసిపాలిటీ పరిధిలో ఛైర్‌ పర్సన్‌, కౌన్సిలర్లు, కమిషనర్‌ లు మొక్కల పెంపకానికి సంబంధించి బాధ్యత స్వీకరించాల్సి ఉంటుంది. నిర్ధిష్ట లక్ష్యాలను చేరుకోకపోతే వారిపై చర్యలకు చట్టం అవకాశం కల్పిస్తోంది.

పౌరులకు పారదర్శకంగా ఉత్తమ సేవలు అందించడం, పట్టణాల అభివద్ధి, అవినీతి రహితపాలన ద్వారా పట్టణాలలో నవోదయానికి ఈ కొత్త చట్టం నాంది పలకాలని ఆకాంక్షిద్దాం.

Other Updates