తెలంగాణ రాష్ట్రంలోని రెండు పెద్దపులుల అభయారణ్యాలకు ‘స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్’ (ఎస్టీపీఎఫ్) మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కేంద్ర అటవీ, పర్యాటకశాఖ అనుమతించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమధ్య పరస్పర అవగాహనా ఒప్పందం కూడా కుదిరింది.
ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు రెండిరటిలో కలిసివున్న అమ్రాబాద్ టైగర్ ప్రాజెక్టులో పులుల ప్రత్యేక భద్రతాదళం ఏర్పాటు కానుంది. దీనిక్రింద ఒక్కో ప్రాజెక్టుకు వందమంది రక్షణ దళాలను కేటాయిస్తారు. వీరికి అవసరమైన వేతనాలు, నిర్వహణ ఖర్చులన్నీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
ప్రత్యేక భద్రతాదళం క్రింద ఒక అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌తోపాటు ముగ్గురేసి చొప్పున రేంజ్ ఆఫీసర్లు, ఎస్.ఐ.లు, తొమ్మిది మంది సెక్షన్ ఆఫీసర్లు, 27మంది బీట్ ఆఫీసర్లు, 81మంది వాచర్లను నియమిస్తారు. వీరికి ఆయుధాలు కూడా సమకూరుస్తారు. పులుల అభయారణ్యాలను రక్షించడానికి ఈ దళాలు పనిచేస్తాయి.
2611 చదరపు కిలోమీటర్ల పరిధిలో విశాలంగా ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు ప్రత్యేక భద్రతాదళం కావాలని అటవీశాఖ అధికారులు కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ 2015 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వుంది. దీనిని 2012లోనే టైగర్ రిజర్వుగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అమ్రాబాద్, అచ్చంపేట అడవుల్లో కవ్వాల్‌లో ఇటీవల పులుల సంచారం బాగా పెరిగింది.