krishana– ఓస రాజేష్‌
పశ్చిమ కనుమలలో సహ్యాద్రిలో మహాబలేశ్వరంలో ‘కృష్ణ అంశ’తో జన్మించింది.’కృష్ణా నది’. సహ్యాద్రిలో పరమేశ్వర అంశంతో వేణీనది అవతరించింది. ఎప్పుడైతే కృష్ణ, వేణీ అన్న ఈ రెండు నదులు కలిసి కృష్ణవేణీ నదిగా అవతరించిందో అప్పుడే ఆ రెండు నదులు వాటి ఆరంభస్థానం నుండి అవి సంగమించువరకు మాత్రమే పరిమితమై వాటివాటి పేర్లతో ఆయా స్థానాలలో మాత్రమే వ్యవహరించబడతాయి. ఆ రెండు కలిసిన కృష్ణ వేణీ నది మాత్రం తూర్పున సాగరసంగమం కృష్ణ వేణీ మహానదిగా వ్యవహరించబడుతుంది. ఆ విధంగా ఆవిర్భవించిన కష్ణవేణీ మహానది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ప్రయాణించి చివరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి పలు జిల్లాలను పావనం చేస్తూ దివిసీమలో వైష్ణవక్షేత్రమగు హంసల దీవిలో సాగరసంగమం చేస్తున్నది. కృష్ణ అనే ప్రాంతం వద్ద కృష్ణా నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌ నగర్‌, నల్గొండ జిల్లాల్లో 281 కి.మీ మేర ప్రవహిస్తుంది. కృష్ణ గ్రామంలోని దత్తాత్రేయ స్వామి ఆలయం పవిత్ర క్షేత్రంగా విలసిల్లుతుంది.

కృష్ణమ్మ చెంతకు పుష్కరుడు చేరే సమయం ఆసన్నమైంది. కన్యారాశిలో బహస్పతి ప్రవేశిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు 12 వతేదీ నుంచి 23 వరకు 12 రోజుల పాటు కృష్ణ పుష్కర పుణ్య కార్యక్రమంతో భక్తి సిరులు తెలంగాణ జీవగడ్డ అంతటా ప్రసరించబోతున్నాయి. ఆగస్టు 12 న సుర్యోదయ సమయంలోకృష్ణ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో కృష్ణా నది ఒడ్డున వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్త జనం పోటెత్తనుంది. కోటాను కోట్ల మంది భక్తులు కృష్ణా నది స్నానం కోసం పుష్కర ఘాట్లకు తరలిరానున్నారు. దీంతో పుష్కర ఘాట్లు ప్రత్యేక శోభతో విరాజిల్లనున్నాయి. జీవనదిగా పేరున్న కృష్ణమ్మ పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది.

స్వరాష్ట్రంలో తొలిసారి జరగనున్నకృష్ణా పుష్కరాలను నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో కుంభమేళాను తలపించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పుష్కరాల్లో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడే విధంగా కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యాచరణ రూపొందించింది. గోదావరి పుష్కరాల స్పూర్తితో కృష్ణమ్మకు కూడా ఘనంగా పుష్కరాల పండుగ నిర్వహించేం దుకు సర్వం సిద్ధం చేసింది. దేశ వ్యాప్తంగా కోట్లాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది.గోదావరి పుష్కరాలు తెలంగాణ ప్రభుత్వ కీర్తి ప్రతిష్టలను పెంచాయి. దీంతో గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో కృష్ణ పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈ ఏడాది జనవరి నుంచే పుష్కరాలకు ప్రభుత్వం సన్నధ్దమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, సీయస్‌ రాజీవ్‌ శర్మ కూడా పుష్కర ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
పన్నెండేళ్లకోసారి వచ్చేకృష్ణా పుష్కర మహోత్సవాన్ని వందేళ్లు గుర్తుంచుకునేలా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ పట్టుదలగా ఉన్నారు. అందుకు తగ్గట్టుగా పుష్కర ఏర్పాట్ల కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించారు.కృష్ణా పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 825 కోట్లను కేటాయించింది. 14 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అధికారులు పనులను చేపట్టారు. రహదారుల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులను కూడా యుద్ధ ప్రాతిపాదికన చేపట్టడం జరిగింది. ఆర్‌ అండ్‌ బీ శాఖ రూ.398 కోట్లు,పంచాయతీ రాజ్‌ శాఖ రూ.133 కోట్లతో రహదారుల నిర్మాణం,రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది. తాగు నీరు, పారిశుద్ధ్య నిర్వహణకు కూడా ఆర్‌ డబ్ల్యూ ఎస్‌ శాఖకు రూ.38 కోట్లు, పంచాయతీ రాజ్‌ విభాగానికి రూ.10.22 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.అన్ని పుష్కర ఘాట్లు, ఆలయ ప్రాంతాల్లో శుద్ధ జల ప్లాంట్లను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల తాత్కాలిక, మరికొన్ని చోట్ల శాశ్వత ప్రాతిపదికన మరుగుదొడ్లను నిర్మించారు. స్నాన ఘట్టాల వద్ద అపరిశుభత్రకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.మహిళా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.

భారీగా పెరిగిన పుష్కర ఘాట్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో పుష్కరాలు అంటే విజయవాడ ,రాజమండ్రి అని మాత్రమే అందరు అనుకునే వారు. గత ప్రభుత్వాలు పెద్దగా నిధులు కేటాయించకపోవడంతో పుణ్య స్నానమాచరించేందుకు విజయవాడకు వెళ్లేవారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పుష్కరాలకు ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. ఇంతకు ముందు నల్గొండ,మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో కేవలం 28 పుష్కర ఘాట్లు ఉండగా, ఈసారి వాటికి అదనంగా 58 ఘాట్లను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 86 ఘాట్లను 4852 మీటర్ల పొడవుతో నిర్మించడం జరిగింది. రెండు జిల్లాల్లో ఘాట్ల నిర్మాణం, మరమ్మత్తుల కోసం ప్రభుత్వం రూ.212కోట్లు కేటాయించింది.

భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట
కృష్ణ పుష్కరాలకు సుమారు మూడున్నర కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లను చేశారు. స్నాన ఘట్టాల వద్ద భక్తుల సౌకర్యం కోసం వస్త్రాలు మార్చుకునేందుకు ప్రత్యేక డ్రెస్‌ చేంజింగ్‌ రూమ్స్‌, షవర్‌ బాత్‌ చేసేందుకు షవర్స్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణ నది లో లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మత్స్య శాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను, మర బోట్లను సిద్ధంగా ఉంచనున్నారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ఎక్కడా పార్కింగ్‌ సమస్య తలెత్తకుండా పుష్కర ఘాట్లకు కొద్ది దూరంలో పార్కింగ్‌ కోసం పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ప్రధాన రహదారులపై సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా 15 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్‌ రూంలు, కాల్‌ సెంటర్లు, పెద్ద ఎత్తున సీసీ కెమరాలను కూడా ఏర్పాటు చేశారు. వీఐపీలకు కూడా కట్టుదిట్టమైన భద్రతా విధానాన్ని అమలు చేశారు.

పుష్కరాలకు ప్రత్యేక బస్సులు, రైళ్లు
కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో పాటు దక్షిణ మధ్య రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను నడపనుంది.. పుష్కరాలు జరగనున్న పన్నెండు రోజులు భక్తుల కోసం 1149 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌,రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ సహా ఇతర రీజియన్లను కలుపుకుని వెయ్యి ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ లగ్జరీ బస్సులతోపాటు మరో వంద ఏసీ బస్సులను పుష్కర ఘాట్ల వరకు టిఎస్‌ ఆర్టీసీ నడిపించనుంది. దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల్లో 238 ప్రత్యేక రైళ్లను వివిధ స్టేషన్ల నుంచి నడపనుంది.

ముస్తాబవుతున్న ఆలయాలు
పుష్కరాల నేపథ్యంలో దేవాలయాల సుందరీకరణపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ప్రత్యేక దష్టి సారించారు. ఆలయాల జీర్ణోద్ధరణకు దేవాదాయ శాఖ కు సీయం ప్రత్యేకంగా రూ. 4.54 కోట్లు కేటాయించారు.దీంతో నల్గొండ ,మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లోని ప్రముఖ ఆలయాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు.. దైవ దర్శనం కోసం భక్తులు బారులు తీరే అవకాశం ఉన్నందున ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. దేవాలయాల వద్ద ఆధ్యాత్మికత కార్యక్రమాలతో పాటు సాంస్కతిక శాఖతో కలిసి సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

దేశంలో ఉన్న శక్తి పీఠాల్లో జోగులాంబ ఒకటి. కేసీఆర్‌తో పాటు గవర్నర్‌ ఈ క్షేత్రానికి సమీపంలో ఉన్న గొందిమల్ల పుష్కర్‌ ఘాట్‌లో పుణ్య స్నానమాచరించే అవకాశం ఉంది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో బీచుపల్లి-ఆంజనేయ స్వామి ఆలయం, రంగాపూర్‌ – ఆంజనేయ స్వామి , ఆలంపూర్‌-జోగులాంబ శక్తి పీఠం, సోమశిల – లలితాంబిక అమ్మవారు, కృష్ణ – దత్తాత్రేయ స్వామి, గుందిమల్ల, నల్గొండ జిల్లాలో మట్టపల్లి – లక్ష్మీ నర్సింహ స్వామి ,వాడపల్లి – మీనాక్షీ అగస్త్యేశ్వర స్వామి, నాగర్జున సాగర్‌ – ఏలేశ్వర మాధవ స్వామి, చాయ సముద్రంకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.

Other Updates