safమన్మథ నామ సంవత్సర అధిక ఆషాడ బహుళ త్రయోదశీ మంగళ వారం జూలై 14 వ తేదీ నుండి గోదావరీ నదికి సార్థ త్రికోటి తీర్థ రాజ సహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పన్నెండేళ్ళ కొకసారి వచ్చే గోదావరీ పుష్కరాలను తెలంగాణా ప్రభుత్వం అత్యంత వైభవోపేతంగా ,నభూతో నభవిష్యతి అన్న చందంగా కుంభ మేళా ను తలపించే స్థాయిలో నిర్వహించాలనే స్థిర సంకల్పంతో ఏర్పాట్లను చేస్తున్నది. ధర్మభూమిగా,కర్మభూమిగా పేరొందిన భారతావనిలో ప్రతి యేటా ఒక నదికి పుష్కరాలు వస్తాయి. దేవ గురువు బృహస్పతి రాశి సంచారాన్ని అనుసరించి ఏ నదికి ఏ సంవత్సరం పుష్కరాలు వస్తాయో నిర్ణయిస్తారు. బృహస్పతి సింహ రాశిలో సంచరించే సమయంలో పవిత్ర గోదావరీ నదీ జలాల్లో పుష్కరుడు ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం జూలై 14 వ తేదీన బృహస్పతి సింహ రాశిలో ప్రవేశిస్తున్నందున గోదావరీ పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి.దేశంలో అన్ని పవిత్ర నదులకు పుష్కరాలు ఉన్నప్పటికీ గోదావరీ పుష్కరాలకు ప్రత్యేకత ఉంది. అన్ని నదులకు ఆరంభంలోనే పన్నెండు రోజులు పుష్కరాలు ఉంటే, గోదావరికి ఆది పుష్కరాలే కాక అంత్య పుష్కరాలు కూడా వుండడం విశేషం. బృహస్పతి సింహరాశి ప్రవేశ సమయంలో పన్నెండు రోజులు ఆది పుష్కరాలైతే, కన్యారాశిలోకి మారడానికి ముందు పన్నెండు రోజులు అంత్య పుష్కరాలుగా నిర్ణయించారు.ఈ రకంగా పుష్కరాల విషయంలో గోదావరి ప్రత్యేకతను సంతరించుకున్నట్లే, పన్నెండేళ్ళకొకసారి వచ్చే గోదావరి పుష్కరాలు ఈ పర్యాయం ప్రత్యేకతను సంతరించుకున్నాయి. తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యాక 2002 లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వం తెలంగాణా లో పుష్కరాల నిర్వహణకు సరైన ఏర్పాట్లు చేయలేదని భావించిన తెలంగాణా ఉద్యమ రథ సారధి కె.చంద్రశేఖరరావు ధర్మపురిలో పుష్కర స్నాన మాచరించి గోదావరీ మాతకు మొక్కుకున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక గోదావరీ పుష్కరాలు అద్భుతంగా నిర్వహిస్తామని అప్పుడే ప్రకటించారు. 33 కోట్ల దేవతలు పుష్కరాల సమయంలో ఆయా నదులలో వచ్చి నివసిస్తారని ఆ సమయంలో నదీ స్నానమాచరించే భక్తుల ధర్మ బద్ధమైన కోర్కెలు నేరవేరుస్తారనే ప్రతీతిని నిజం చేస్తూ ఈ సారి గోదావరీ పుష్కరాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నది.
నాలుగున్నర కోట్ల తెలంగాణా ప్రజల అభిమాన నాయకుడిగా, ప్రతినిధిగా కెసిఆర్‌ కోరిన కోర్కేను నెరవేర్చి పన్నెండేండ్లకు గోదావరి నదిలోకి వచ్చిన పుష్కరుడిని శాస్త్రోక్తంగా పురస్కరించుకోవలసిన బాధ్యత తెలంగాణా ప్రజలందరిపై ఉంది. పుష్కరాల సమయంలో ఆచరించవలసిన విధులు తెలుసుకుని శాస్త్ర బద్ధంగా వాటిని ఆచరించడం అవసరం.

రేవా తీరే తపం కుర్యాత్‌ మరణం జాహ్నవీ తటే
దానం దద్యాత్‌ కురుక్షేత్రే త్రితయం పుణ్యదం పరం

రేవా నదీ తీరంలో తపస్సు చేస్తే ముక్తి లభిస్తే ,గంగా తీరంలో తనువు చాలిస్తే ముక్తి వస్తుంది, కురుక్షేత్రంలో దానం చేస్తే ముక్తి వస్తుందన్నారు. గోదావరిలో స్నానం చేయడం వల్ల ఈ మూడు పుణ్యాల ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. వ్యాసుడు స్వయంగా ప్రతిష్టించిన జ్ఞాన సరస్వతీ మాత కొలువు దీరిన బాసర మొదలుకుని రాముడు నడయాడి, నివసించిన నేల భద్రాద్రి వరకు తెలంగాణలో గోదావరీ పరీవాహక ప్రాంతమంతా పవిత్రతకు ఆలవాలమైన ప్రాంతమే. పుష్కరాల సమయంలో గోదావరీ నదీ స్నానం, గోదావరీ తీరంలో దానం, పితృ దేవతలకు తిలతర్పణ అత్యంత పవిత్రమైన విధులు.

దేవతా స్నాపనం: గోదావరి నదీ తీరంలో వెలసిన దేవతా మూర్తులకు స్నాపనంతో పుష్కరాలు ప్రారంభ మవుతాయి. బాసర నుండి భద్రాద్రి వరకు వెలిసిన అన్ని పుణ్య క్షేత్రాలలో శాస్త్రవిధిని అనుసరించి దేవతా మూర్తులకు స్నాపనాన్ని నిర్వహించాలి.

యతీ స్నానం: ఆ తర్వాత యతులు స్నాన మాచారించాలి. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దక్షిణ భారత దేశంలోని పీఠాధిపతులను పుష్కరాలకు ఆహ్వా నించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు, విశ్రాంత ఐ.ఏ.ఎస్‌. అధికారి కె.వి. రమణాచారి ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీని ప్రభుత్వం నియమించింది.

రాజ స్నానం: యతి స్నానం తర్వాత రాజ స్నానం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య యుగం కనుక ప్రజలే ప్రభువులు, వారి ప్రతినిధులైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వారి మంత్రి వర్గ సహచరులు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్నాన మాచారించాలి. దీనితో పుష్కరాలు ప్రారంభ మవుతాయి.

దానాలు: పుష్కరాలు జరిగే పన్నెండు రోజులు రోజుకు ఒక రకమైన దానాన్ని శాస్త్రాలు నిర్దేశించాయి.
మొదటి రోజు భూమి,బంగారం,ధాన్యం,వెండి దానం ఇవ్వడం వల్ల రాజ్యము,అధికారము,ధన లాభం కలుగడంతో పాటు పాపాలు నశిస్తాయి,సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. రెండవ రోజు వస్త్ర దానం,లవణ దానం (ఉప్పు),గోదానం, రత్నదానం చేయాలి .దీని వల్ల అశాంతి,ఆరోగ్యం, ఉహా సౌఖ్యం వంటి ఫలితాలు లభిస్తాయి.మూడవరోజు బెల్లం,కూరలు, గుర్రం (వాహనం) దానం చేయాలి.దీని వల్ల ఆరోగ్యం,అధికారం, ఇంద్రభోగాలు,సౌఖ్యము లభిస్తాయి.

sdfsa

నాల్గవ రోజు నెయ్యి,నువ్వులు, తేనె, పాలు,వెన్న దానం చేయడం వల్ల నరబాద నివారణ కావడంతో పాటు ఆయుష్షు వృద్ధి చెందుతుంది.ఐదవ రోజు ధాన్యం,ఎద్దు,దున్నపోతు,నాగలి దానం ఇవ్వాలి.అపమృత్యువు తొలగి సంపదలు వృద్ధి చెందుతాయి. ఆరవ రోజు కర్పూరం,హరిచందనం,కస్తూరి వంటి సుగంధద్రవ్యాలు దానం ఇవ్వడం వల్ల సుఖ సంతోషాలతోపాటు లక్ష్మీ ప్రాప్తి ,భోగభాగ్యాలు కలుగుతాయి. ఏడవ రోజున గృహోపకరణాలైన ఇల్లు,చాప,మంచము,పల్లకి వంటివి దానం చేయాలి.దీని వల్ల సిరిసంపదలతో పాటు అధికారప్రాప్తి కలుగుతాయి. ఎనిమిదవరోజున గంధపు చెక్క, పూలు, అల్లం దానం చేయాలి. తొమ్మిదవ నాడు పరుపు దిండు వంటి శయ్యా దానాలు చేయాలి. దీని వల్ల దాంపత్య సుఖం, గౌరవ ప్రాప్తి ఫలితాలుగా లభిస్తాయి.పదవ రోజున దేవతా మూర్తులు,పూజా పుస్తకాలు సాలగ్రామ,శివ లింగాలు దానం చేయడం వల్ల దైవానుగ్రహం లభించడంతో పాటు అన్ని రకాల అరిష్టాలు తొలిగి పోతాయి. పదకొండవ రోజున కంబళ , పుస్తక దానాలు ముఖ్యమైనవి. ఈ రోజు తెల్ల గొంగడి లేదా పూజకు ఉపయోగించే ధావళి లేదా రగ్గు తోపాటు ఆధ్యాత్మిక,ధార్మిక గ్రంథాలు దానం ఇవ్వాలి. దీనివల్ల జ్ఞాన వృద్ధియే కాక అపమృత్యు భయం తొలిగిపోతుంది. చివరిరోజు షోడశదానాలు లేదా దశ దానాలు ఇవ్వాలి. పుష్కరాల్లో శక్తి మేరకు దానధర్మాలు ఆచరించడం ఇష్ట ప్రాప్తినిస్తుంది.

నదీ స్నానం: సాధారణంగా ఏ సమయంలో నైనా నదీ స్నానం అత్యంత పుణ్యప్రదమైనది.నదీ జలాలు అనేక ఔషధీయ గుణాలు కలిగి ఉంటాయి. నదీస్నానం అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుంది.

బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఇంద్రాద్య స్సర్వ దేవతా:
పితరో రుశాయశ్చైవ తత్రైన నివసంతిహి

సకల దేవతామూర్తులు,ఋషులు, పితృ దేవతలు పుష్కరాల సమయంలో నదీ జలాలలో నివసిస్తారని ప్రతీతి. పుష్కరస్నానం వల్ల అశేష పాపాలు తొలిగించడమే కాక విశేష ఫలితాన్నిస్తుంది.

యస్మిన్‌ దినే సురగురు: సింహస్తోపి యుతో భవత్‌
తస్మింస్తు గౌతమీ స్నానం కోటి జన్మాఘ నాశనం

గోదావరీ పుష్కరాల్లో స్నానం చేయడం కోటి జన్మాల పాపలను పోగొడుతుందని,ఆశ్వమేధయాగఫలితం దక్కుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

పుష్కర స్నానం చేయడానికి ముందు శాస్త్రోక్తంగా సంకల్పం చెప్పుకుని నదీమ తల్లిని ప్రార్థించాలి.

పిప్ప్లాడా సముత్పన్నే కృత్తేలోక భయంకరీ
పాషాణాంతే మయాదత్త (మృత్తికాంతే) మాహారార్థం ప్రకల్ప్యతాం

అని చెప్పి రేగుపండు పరిమాణంలో మట్టిని తీసుకుని మూడు సార్లు నదీజలాల్లో భక్తితో సమర్పించాలి. తరువాత నాభి వరకు గల నీటిలో నిలిచి జుట్టు ముడి విప్పి , పురోహితుల మంత్రోచ్చారణల మధ్య మూడు సార్లు నదీ జలాలలో మునగాలి. ఈ సమయంలో ముక్కు చెవులు మూసుకుని మౌనంగా స్నానం చేయాలి.

స్నానాంగతర్పణం: స్నానం తర్వాత నీటిలో నిలబడి దేవ ,ఋషి , పితృ తర్పణాలు చేసుకోవాలి. దేవ ,ఋషి, పితృ రుణాల విముక్తి కోసం తర్పణాలు తప్పనిసరిగా చేయాలి. తల్లిదండ్రులు జీవించి ఉన్న వారు దేవ, ఋషి తర్పణాలను మాత్రమే చేసుకోవాలి. తల్లిదండ్రులు గతించిన వారు మాత్రం వీటితో పాటు పితృ తర్పణాలు కూడా చేయాలి. దేవతలకు ఒక సారి , ఋషులకు రెండు సార్లు యజ్ఞోపవీతాన్ని నివీతిగా ( మాలగా) వేసుకుని తర్పనం చేయాలి. పితృ దేవతలకు అపసవ్యంగా (యజ్ఞోపవీతాన్ని ఎడమ వైపు వేసుకుని మూడుసార్లు తర్పణం చేయాలి.
పితృ దేవులతో పాటు మరణించిన బంధు మిత్రులకు, పరిచయస్తులకు కూడా తర్పణం చేయవచ్చు.

ఉదక ప్రక్షేపణం: ఆ తర్వాత ఒడ్డుకు దగ్గరగా నీటిలో నిలబడి ఆచమనం చేసి రెండు సార్లు దోసిలితో నీళ్ళు తీసుకుని ఒడ్డుపై విడువాలి.

యన్మయా దూషితం తోయం శారీర మల సంయుతం
తస్య పాప విశుద్ధ్యర్థం యక్ష్మాణాం తర్పయామ్యాహం
అసంస్కారాశ్చ ఏ కేచిత్‌ జలాశా: పితరో మమ
తేషా మాప్యాయ నార్థాయ దీయతే సలిలం మయా
అనే శ్లోకాలు పఠిస్తూ ఒడ్డుపై నీళ్ళు వదలాలి.

శిఖా నిష్పీడనం: నది నుండి ఒడ్డుకు వచ్చాక బొటన వేలు చూపుడువేలుతో జుట్టును కుడి వైపునకు ఒడ్డుపై పిండాలి.

వస్త్ర నిష్పీడనం: తడిసిన వస్త్రాన్ని నాలుగు మడతలుగా చేసి అపసవ్యం చేసుకుని వస్త్రాన్ని పిండుతూ ఆ నీటిని ఒడ్డున పిండాలి.

స్నానం తర్వాత శరీరంపై గల తడి ఆరిపోయే వరకు అలాగే నిలబడడం మంచిదని గోభిల స్మృతి పేర్కొన్నది. ఆరోగ్యం సహకరించని వారు పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచు కోవచ్చు. పుష్కర సమయంలో చేయగూడనివి: నదీ జలాలను అపవిత్రం చేయడం మహాపాపం .నదీజలాల్ల్లో బట్టలు ఉతక గూడదు. నదీస్నానానికి ముందే ఒక సారి స్వచ్చంగా స్నానం చేయాలి. నదిలో మలమూత్రాలు విసర్జించకూడదు. ఉమ్మి వేెయ కూడదు.ముక్కు చీదడం పనికి రాదు. అత్యంత పవిత్రమైన భావంతో స్నాన మాచరిస్తేనే సంపూర్ణ ఫలితం లభిస్తుంది. స్నానం తర్వాత తడి బట్టలతో మలమూత్ర విసర్జన చేయకూడదు.

Other Updates