konda-bapu-laxmanఅ కొండా లక్ష్మణ్‌ బాపూజీ దార్శనికత

నూనూగుమీసాల నూత్న యవ్వనంలోనే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అనంతరకాలంలో ఆయన ప్రజాస్వామ్య రాష్ట్రంలో వెనకబడిన తరగతుల శ్రేయస్సుకోసం, మరీ ముఖ్యంగా చేనేత సహకారోద్యమంలో తలమునకలయ్యారు. మొదటి నుంచి ప్రత్యేక తెలంగాణవాదిగా తన ఉనికిని ప్రస్ఫటం చేస్తూ జీవిత చరమాంకంలో రాష్ట్ర సాధనోద్యమానికి ఏక నాయకత్వం పనికిరాదని, తన ఆశలన్నీ విద్యార్థులు, యువబీనులపైనే పెట్టుకున్న ఆశాజీవి ఆయన.

దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కనులారా చూడకుండానే తన 97వ యేట 2012 సెప్టెంబర్‌ 21న వారు కన్నుమూశారు. వారి శత జయంతిని పురస్కరించుకొని రుద్రమదేవి ఉమెన్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రచురణలు ప్రొఫెసర్‌ కె.శ్రీనివాసులు సంపాదకత్వంలో ‘కొండా లక్ష్మణ్‌ బాపూజీ దార్శనికత’ శీర్షికన 134 పేజీల గ్రంథాన్ని వెలువరించింది.

ఇందులో చేనేత కార్మిక ఉద్యమం, సహకార ఉద్యమం, వెనకబడిన తరగతుల ఉద్యమంపై పరిశోధనలు, క్షేత్ర స్థాయిలో కృషి చేసిన ప్రముఖుల పరిశోధనాత్మక వ్యాసాలను చేర్చారు. వీటితోపాటు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మరణానంతరం వివిధ పత్రికలలో వెలువడిన కొన్ని వ్యాసాలను, కవితలను జోడించారు. ఇవే కాకుండా కొండా లక్ష్మణ్‌తో వివిధ రంగాలలో సాన్నిహిత్యం ఉందన్న ప్రముఖులను ఇంటర్వ్యూ ఇచ్చి సంక్షిప్త సమాచారమిచ్చారు.

” తెలంగాణ ఉద్యమం – కొండా లక్ష్మణ్‌ బాపూజీ” శీర్షికన కె శ్రీనివాసులు వ్రాసిన వ్యాసంలో ”రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ సిఫార్సు మేరకు భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది” (పేజీ 73) అన్నారు.

హైదరాబాద్‌ ఆరేండ్ల పాటు ప్రత్యేక రాష్ట్రంగా ఉండి కొత్తగా ఎన్నికైన శాసనసభ రెండింట మూడొంతుల మెజారిటీ ఆంధ్రలో విలీనం కావాలనీ, లేదంటే ప్రత్యేకంగా ఉండొచ్చని రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ సిఫారసు చేసింది. కాని ”భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌” ఏర్పాడాలని సిఫారసు చేయలేదు.

ఏమైనా ఇలాంటి వ్యాసాలతో సరిపెట్టకుండా కొండా లక్ష్మణ్‌ బాపూజీ సమగ్ర జీవితచరిత్ర వెలువరిస్తే బాగుండేది.

– టి.యు.

Other Updates