పుస్తకాలు జ్ఞాన సమాజాలు. అక్షరాలు భావజాల ఆయుధాలు. సమాజ మార్పుకు రాజకీయ సంకల్పం ఎంత ముఖ్యమైనదో ప్రజలలో మానసిక పరివర్తనం తీసుకు రావటంలో పుస్తకాలు అత్యంత కీలకపాత్రను పోషిస్తాయి. హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఏర్పడి 30 సంవత్సరాలు గడుస్తున్నప్పటికినీ తెలంగాణ రాష్ట్ర నిర్మాణం జరిగిన తర్వాత గత రెండేళ్లుగా జరుగుతున్న బుక్‌ఫెయిర్‌కు ఊహించని విధంగా ఆదరణ లభించింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఇప్పటికి రెండు బుక్‌ఫెయిర్‌లు జరిగాయి. ఈ హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ప్రతి ఏడాది డిసెంబర్ మాసంలో జరుగుతుంది. 10 రోజులపాటు జరిగే ఈ బుక్‌ఫెయిర్‌కు దేశం నలుమూలల నుంచి ఎందరెందరో పబ్లిషర్లు వచ్చి పుస్తక ప్రదర్శనలో పాలుపంచుకుంటారు. 2015 డిసెంబర్ నెలలో జరిగిన 29వ బుక్‌ఫెయిర్‌కు 10 లక్షల మంది పుస్తక ప్రియులు హాజరయ్యారు. చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు, సామాన్యుల నుంచి అసమాన్యుల వరకు, రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన మంత్రులు, పాలకుల దగ్గర నుంచి పాలితుల వరకు, భిన్న దృక్పథాలు గల వ్యక్తులు, విభిన్న రాజకీయ, సామాజిక భావజాలాలున్న ఎందరెందరో వ్యక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి ఈ బుక్‌ఫెయిర్‌కు పెద్ద సంఖ్యలో హాజరు కావటం విశేషం.
పుస్తక ప్రదర్శనలు అంటే పుస్తకాల అమ్మకాల కొనుగోళ్లు కాదు. పుస్తక ప్రదర్శన ద్వారా నూతన ఆలోచనలకు అంకురార్పణ చేయటం జరగాలి. సరిగ్గా తెలంగాణ రాష్ట్రం అవతరించాక హైదరాబాద్ బుక్‌ఫెయిర్ తెలంగాణ జ్ఞాన సమాజ నిర్మాణానికి తనవంతు కర్తవ్యంగా కృషి మొదలు పెట్టింది. అందుకు పునాదిగా పుస్తక ప్రదర్శన అంటే అది పది రోజులు పండుగలా గాకుండా సంవత్సరం మొత్తం పుస్తక ప్రదర్శనలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో జరగాలని బుక్‌ఫెయిర్ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ పుస్తక ప్రదర్శనను మహా నగరాల నుంచి మారుమూల గ్రామాల దాకా తీసుకుపోవటం ప్రధాన లక్ష్యంగా ఈ బుక్‌ఫెయిర్ కమిటి ముందుకుసాగుతోంది. అందులో భాగంగా గత ఏడాది జిల్లాలకు వెళ్లాలన్న లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో వారం పాటు ఈ బుక్‌ఫెయిర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.
కళాశాలల్లో, స్కూళ్లల్లో ప్రచార జాతాలు :
హైదరాబాద్ నగరంలో డిసెంబర్‌లో జరిగే పుస్తక ప్రదర్శనకు సంబంధించి రెండు నెలల ముందుగానే హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రదేశాలలోని పెద్ద కళాశాలలు, హైస్కూళ్లకు వెళ్లి పుస్తక ప్రదర్శనకు సంబంధించిన ప్రచారాన్ని బుక్‌ఫెయిర్ కమిటి మొదలు పెట్టింది. వేలాది మంది విద్యార్థులకు ఈ పుస్తక ప్రదర్శనకు సంబంధించి పెద్ద ఎత్తున కళాశాలల్లో సెమినార్లు పెట్టటం జరిగింది. సికింద్రాబాద్‌లోని రైల్వే వ్యాగన్‌లలో పనిచేసే కార్మికులందర్నీ సమావేశ పరిచి పుస్తక ప్రదర్శనకు సంబంధించి నిపుణులతో మాట్లాడించి పుస్తక ప్రదర్శనకు సంబంధించిన ప్రచారం చేయటం జరిగింది.
కళాశాలల్లోనే కాకుండా నగరంలోని అనేక ప్రదేశాలలో సభలు, సమావేశాలు జరిగాయి. వేల సంఖ్యలో కరపత్రాలను పంచటం జరిగింది. కవులు, రచయితలు రాసిన అనేక పుస్తకాలను ఈ సెమినార్లలో ఆవిష్కరించుకునే ఒక కొత్త సంస్కృతి మొదలైంది. కళాశాలల్లో సెమినార్లు పెట్టటం వల్ల ఈ రెండేళ్లలో మంచి ఫలితాలు కనిపించాయి. వీటి ప్రభావం వల్లనే పుస్తక ప్రదర్శనకు జనం అత్యధికంగా హాజరయ్యారని అనుభవ పూర్వకంగా తేటతెల్లమైంది. ఇవే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాలలో బుక్‌ఫెయిర్‌కు సంబంధించి సెమినార్లు జరిగాయి. అవి ఆయా జిల్లాలలో బాగా ప్రచారానికి తోడ్పడ్డాయి.
వినియోగదారుణ్ణి పుస్తకం చదివించాలంటే అతనిలో కొత్త చైతన్యం కలిగించాలి. తెలంగాణ చాలా విషయాలకు ప్రయోగశాలగా మారింది. ప్రపంచంలో ఏ మూలన యుద్ధం జరిగినా అమెరికాలో కొత్త ఆయుధం తయారవుతుంది. తెలంగాణలో ఏ మూలన ఏ సామాజిక సంఘటన జరిగినా ప్రజల చైతన్యానికి అది ఇంధనంగా మారుతుంది. అది మిలియన్ మార్చ్ కావచ్చును. ఎన్జీవోల సమ్మె కావచ్చును. దాని వలన ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని చూడటం జరిగింది. ఇప్పుడు పుస్తకాల్లో అంతర్లీనమై ఉన్న భావాలను వెదజల్లి మరొక మార్పు కోసం ఈ పుస్తక ప్రదర్శన నాంది పలకబోతోంది. ఈ బుక్ ఫెయిర్ నిర్వాహకులు ప్రతి స్కూలుకు పోతున్నారు. పిల్లలు చదివే టెక్ట్స్‌బుక్‌ను ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు గతం కన్నా ఈ ఏడాది వచ్చిన పుస్తకాలలో ఏం మార్పు వచ్చిందో విద్యార్థులకు చెబుతున్నారు. ప్రతి లైబ్రరీకి వెళుతున్నారు. ఈ సంవత్సరం వచ్చినటువంటి కథలు, నవలలు, కవిత్వంలో వచ్చిన మార్పులను, కొత్త పోకడలను చెప్పి అది సామాజిక మార్పుకు ఏ విధంగా దోహదమవుతుందో చెబుతున్నారు.
వట్టికోట వారసత్వం వర్థిల్లుతోంది :
ఆనాటి తెలంగాణను జాగృతం చేయటం కోసం ఆంధ్ర మహాసభల కాలం నుంచి వీర తెలంగాణ సాయుధ పోరాటం వరకు పుస్తకాలను చేతపట్టి జనజాగృతం చేసిన వట్టికోట ఆళ్వారు స్వామి వారసత్వాన్ని కొనసాగించేందుకు హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ముందుకు వచ్చింది. ఆనాడు పుస్తకాలకు అంతగా ప్రచారం లేని రోజుల్లో, అక్షరాస్యత అంతంత మాత్రంగా వున్న తెలంగాణలో నెత్తి మీద పుస్తకాలు పెట్టుకొని ఊరూరా తిరిగి ఆ పుస్తకాలను విక్రయించి ఆ వచ్చిన సొమ్ముతో తిరిగి పుస్తకాలనే వేసి ప్రజల వాకిళ్ల దగ్గరకు తీసుకుపోయిన వట్టికోట ఆళ్వారు స్వామి స్ఫూర్తి మరిచిపోలేనిది.
పుస్తకాలు కూడా వ్యాపారంగా మారిన సందర్భంలో, పుస్తకాల అమ్మకాలే కేంద్రంగా జరిగే పుస్తక ప్రదర్శనకు వట్టికోట ఆళ్వారుస్వామి స్ఫూర్తి పొందటం ఏమిటని ప్రశ్నించిన వాళ్లు లేకపోలేదు. పుస్తక ప్రదర్శన తేదీలలో పుస్తకాలను ఆ పదిరోజులు అమ్ముకుని చేతులు దులిపేసుకోవచ్చు. కాని ఆ పుస్తకాల దగ్గరకు కొత్త తరం వచ్చే విధంగా చేయడం, మనది వట్టికోట ఆళ్వారుస్వామి వారసత్వమని కొత్త తరానికి ప్రచారం చేయటంలో ఈ బుక్‌ఫెయిర్ కమిటి కృతకృత్యమైంది. తెలంగాణ పుస్తకమంటే అది ఆనాటి సమాజాన్ని జాగృతం చేసిన, ఆంధ్ర మహాసభలతో ప్రజలను ఉత్తేజం చేసిన చరిత్రను మళ్లొక్కసారి ఈనాటి కాలం ముందు ఆవిష్కరింప చేయాలన్నదే బుక్‌ఫెయిర్ కమిటి ఆతృత. ఆ కోణంలోనే ఆనాటి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన సాహితీవేత్తలు, తెలంగాణ యోధులు, తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ పోరాటాలు, ప్రత్యేక రాష్ట్ర తొలి, మలి దశ ఉద్యమాలు వీటన్నింటిని ఈ సందర్భంగా ప్రచారం చేసే అవకాశం ఈ బుక్‌ఫెయిర్ కమిటీకి లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పుస్తక ప్రదర్శనలకు అన్ని దిన పత్రికల సంపాదకులు, యాజమాన్యాలే బ్రాండ్ ఎంబాసిడర్‌లుగా ప్రచారం చేశారు. అన్ని దిన పత్రికలు చేసిన కృషి, బుక్‌ఫెయిర్‌కు 2 నెలల ముందునుంచే బుక్‌ఫెయిర్ నిర్వహించే సెమినార్లకు విశేష ప్రచారాన్ని ఇచ్చాయి. హైదరాబాద్ నగరంలో వున్న ప్రముఖ కవులు, రచయితలు, విద్యావేత్తలు, సామాజిక విశ్లేషకులు ఈ బుక్‌ఫెయిర్ సెమినార్లలో పాల్గొని ప్రసంగించిన అంశాలన్నింటిని దినపత్రికలు విస్తృత ప్రచారాన్ని కల్పిస్తూ వాటిని ప్రముఖ వార్తలుగా ప్రచురించాయి. ఇది సామాన్యమైన విషయం కాదు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బుక్‌ఫెయిర్‌కు కావల్సిన సహాయాన్ని చేసింది. గతంలో బుక్‌ఫెయిర్ నిర్వహణకు ఎన్టీఆర్ స్టేడియంను ఎంచుకుంటే ఆ స్టేడియంకు భారీగా డబ్బు చెల్లించాల్సి వచ్చేది. కానీ రాష్ట్రప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి చొరవతో గత ఏడాది బుక్‌ఫెయిర్ కోసం ఎన్టీఆర్ స్టేడియంను ఉచితంగా యివ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి లభించిన సహకారం ఈ బుక్‌ఫెయిర్ కమిటీకి కొత్త వూపునిచ్చింది.
ఈ పుస్తక ప్రదర్శనలు మున్నెన్నడూ లేని విధంగా తెలంగాణ స్థానికత ముద్ర నుంచి, తెలంగాణ సాంస్కృతిక కోణం నుంచి ఈ ప్రదర్శనలు మొదలయ్యాయి. 2014 డిసెంబర్‌లో ఆ బుక్‌ఫెయిర్‌కు కాళోజీ ప్రాంగణంగా నామకరణం జరిగింది. అదే విధంగా బుక్‌ఫెయిర్‌లో వేదికకు వట్టికోట ఆళ్వారుస్వామి పేరుపెట్టారు. 2015లో తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, పేరు పెట్టారు. వేదికకు ప్రజాకవి సుద్దాల హన్మంతు వేదికగా నామకరణం చేశారు. మొత్తంగా హైదరాబాద్ నగర ముఖచిత్రంపై డిసెంబర్ మాసంలో పుస్తకాల పండుగ అన్నది రికార్డు అయింది.
పోటీపరీక్షల పుస్తకాల కోసం పోటెత్తిన యువత
గత ఏడాది పుస్తక ప్రదర్శనకు యువతరం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సారిగా జరుగుతున్న పోటీ పరీక్షల కోసం పుస్తకాలు కొనుక్కునేందుకు యువత ఎగబడ్డారు. తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సామాజిక జీవనం, తెలంగాణ త్యాగమూర్తులు, తెలంగాణ వైతాళికులు, తెలంగాణ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై అనేక మంది రచయితలు రాసిన వందలాది పుస్తకాలు యువతకు లభించాయి. పోటీ పరీక్షల పుస్తకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విభిన్న అంశాలపై జాతీయ, అంతర్జాతీయ పాఠ్యాంశాల పాఠాలకు సంబంధించిన పుస్తకాలు కూడా విరివిగా లభించాయి.
వందలాది పుస్తకాలు ఆవిష్కరణ:
హైదరాబాద్ నగరంలో పుస్తక ఆవిష్కరణలంటే రవీంద్రభారతి, బషీర్‌బాగ్, సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లు, త్యాగరాయగానసభ, సుందరయ్య విజ్ఞాన కేంద్రాలు, తెలుగు యూనివర్సిటీ ఆడిటోరి యంలు గుర్తుకు వస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా హైదరాబాద్ బుక్‌ఫెయిర్ పుస్తక ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రమైంది. నగరంలో పుస్తక ప్రదర్శన జరిగే ఆ పది రోజుల్లో వందలాది పుస్తకాల ఆవిష్కరణలు ఆ ప్రాంగణంలో జరగటం విశేషం. కవులు, రచ యితలు తమ పుస్తకాల ఆవిష్కరణను బుక్‌ఫెయిర్‌లో జరుపు కోవాలన్న తలంపుతో ఎన్నో పుస్తకాలు అక్కడే ఆవిష్కరించు కుంటున్నారు. ఇది నిజంగా విశేషం. ఈ పుస్తకాల పండుగలోనే తమ పుస్తకాల్ని ఆవిష్కరించుకోవాలని ఉత్సాహం కవులు, రచ యితలలో కలిగింది. అందుకే బుక్‌ఫెయిర్‌లో పుస్తక ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఉద్యమానికి ఊపునిచ్చింది ఈ పుస్తకాలే
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపునిచ్చింది, భావజాల ప్రచారానికి తోడ్పడింది పుస్తకాలే. ప్రధానంగా కవులు, రచయితలు, కళాకా రులు, ప్రజాసంఘాలు, విద్యార్థులు ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ప్రజలందరినీ ఏకం చేయటంలో భావజాలం మాటున అందరినీ ఒక తాటిపై నడిపే విషయంలో పుస్తకాలే కీలకపాత్ర వహించాయి.
ఉద్యమానికి రాజకీయ ప్రాతినిధ్యం వహించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు విపరీతంగా పుస్తకాలు చదువుకున్నారు, కలంపట్టి పాటలు అల్లాడు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమా నికి ప్రాణంగా నిలిచిన కవులు, రచయితలు నిలబడింది పుస్తక ఆయుధంతోనే నన్నది మరువరానిది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర సాధన ఉద్యమాన్ని విజయవంతం చేసుకున్నాక తెలంగాణ రాష్ట్ర పునర్‌నిర్మాణంలో తిరిగి పుస్తకాలే ప్రాధాన్యత వహిస్తాయన్న భావజాలాన్ని ఈ పుస్తక ప్రపంచం విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చింది. ఆనాడు రాష్ట్ర సాధన ఉద్యమంలో, ఈనాడు రాష్ట్ర పునర్‌నిర్మాణంలో పుస్తకాలదే కీలకపాత్ర. ప్రధానంగా యువతరాన్ని పుస్తకాల వైపుకు మళ్లించటమే బుక్‌ఫెయిర్ లక్ష్యం.