వై.జి.గుండోజు
తెలంగాణ కళా భారతి (ఎన్.టి.ఆర్ స్టేడియం)లో ఏర్పాటు చేసిన 32వ జాతీయ పుస్తక మహోత్సవం డిసెంబరు 15 నుంచి 25 వరకు వైభవంగా జరిగింది. ఈ పుస్తక మేలా ప్రాంగణానికి సంప్రదాయ కవివతంసుడు, శతాధిక గ్రంథ కర్త కీ.శే. డా. కపిలవాయి లింగమూర్తి ప్రాంగణంగా వ్యవహరించారు. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఈ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తూ కీ.శే. కపిలవాయి లింగమూర్తి ఆత్మకథను ఆవిష్కరించారు.
పుస్తకం హస్తస్య భూషణం. మంచి పుస్తకం మన దగ్గర ఉంటే మంచి మిత్రుడు దగ్గరలేని లోటు తీరినట్లే పుస్తక పఠనం మనిషిని ఉన్నతునిగా తీర్చి దిద్దుతుంది. ఒక్కో సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక లాంటి సూక్తులను సాకారం చేసిన ఈ పుస్తక మహోత్సవానికి అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్.
డిజిటల్ యుగంలో పుస్తకాలకు ఆదరణ దొరకదనే వాదనను ఈ ప్రదర్శన పరాస్తం చేస్తూ ముద్రాక్షరాలదే అగ్రస్థానం అని చాటింది. సాహిత్య మంటే నేటి యువతరానికి కొరకరాని కొయ్య. అరచేతిలో అంతర్జాలం వచ్చాక పుస్తకాలనెవరు పలుకరిస్తారనే వ్యాఖ్యలకు ఈ పుస్తక మహోత్సవం మంగళం పలికింది. ఆధునిక జీవితంలోని ఒత్తిడి నుండి బయట పడేటందుకు విద్యార్థులు మొదలుకొని సంసార నిర్వహణలో అలసి పోయిన వారు పుస్తకాలనే ఆశ్రయిస్తున్నారనడానికి ఈ పుస్తక ప్రదర్శనే ప్రబల సాక్ష్యం ! దీన్ని దర్శించిన లక్షలాది పుస్తక ప్రియులే పుస్తకాన్ని మస్తకాన ధరించవలసిందే అనే సందేశాన్నిచ్చారు.
ఈ పుస్తక జాతర 335 స్టాళ్ళతో, 10 రోజుల ప్రదర్శనతో, 8.50 లక్షల సందర్శకులతో, సదస్సులకు, ఆవిష్కరణలకు సంగెం లక్ష్మీబాయి వేదిక, బాల వికాస్ వేదిక (జాతశ్రీ వేదిక) అనే 2 వేదికలతో, 84 పుస్తకావిష్కరణలతో, 8 సాహిత్య సదస్సులతో పుస్తక ప్రియులను అలరించింది.
ఇక్కడి మూడు వందల ముప్పది స్టాళ్ళలో పలుభాషల్లో, లక్షలాది పుస్తకాలు కొలువుదీరాయి. ఆధ్యాత్మిక పుస్తకాలు, శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక పుస్తకాలు, దళిత మైనారిటీ అస్తిత్వ వాద సాహిత్యం, కళలు, భాషా శాస్త్రాలు, తెలంగాణ సాహిత్యం, వ్యక్త్తిత్వ వికాసం, బాలల సాహిత్యం, అభ్యుదయ విప్లవ సాహిత్యం, నవలలు, నాటకాలు, కథా సాహిత్యం, శతకాలు, చరిత్రలు, జీవిత చరిత్రలు, ధ్యాన యోగా పుస్తకాలు, విమర్వనా సాహిత్యం, భక్తి సాహిత్యం చదువరుల, పుస్తక ప్రియుల జ్ఞాన తృష్ణను, పఠన పిపాసను తీర్చేందుకు కొలువు తీరాయి.
ఈ పుస్తక మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుండే కాక కోల్‌కతా, చెన్నై, బెంగుళూరు, భువనేశ్వర్, న్యూ ఢిల్లీ, ముంబై, పూణే తదితర ప్రాంతాలకు చెందిన ప్రచురణ కర్తలు, పంపిణీ దారులు పాల్గొన్నారు. సందర్శన వేళలు సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుండి రాత్రి 9 గం||ల వరకు. మిగతా రోజుల్లో 2.30 నుండి రాత్రి 8 గం||ల వరకు. విద్యార్థులకు ప్రవేశం ఉచితం. ఇతరులకు ప్రవేశ రుసుం రూ. 5/-లు.
ఈ పుస్తక మహోత్సవంలో బాలలకు పెద్ద పీట వేశారు. చిన్నారులకు చిత్రలేఖన పోటీలు, పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు విద్యా వేత్తలతో
ఉపన్యాసాలు, సదస్సులు, ప్రతి రోజూ బాలబాలికలను ప్రోత్సహించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చర్చాగోష్ఠి, బాలోత్సవ్, బాలలకు బృంద గాన పోటీలు, లఘు చిత్ర నిర్మాణంపై బాలలకు ఉచిత శిక్షణ, నృత్య ప్రదర్శనలు, ఇందులో 87 మంది బాలలు పాల్గొన్నారు. ఒక్కనిమిషం తెలుగు క్విజ్ పోటీలు నిర్వహించి వారికి బహుమతులుగా పుస్తకాలు, సర్టిఫికేట్లు యిచ్చి ప్రోత్సహించారు. చొక్కాపు వెంకట రమణ వంటి మెజీషియన్‌తో ఇంద్రజాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాదాపు 1800 మంది పిల్లలు బాల వికాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ పుస్తక మహోత్సవం పుస్తక ప్రియులను ఎంతగా ప్రభావితం చేసిందంటే ఎముకలు కొరికే చలిలో కూడా రగ్గులు కప్పుకొని, స్వెటర్లు వేసుకొని బయలు దేరివచ్చారు. పలు పాఠశాలల విద్యార్థులు బృందాలుగా వచ్చి ఉత్సాహంగా పాల్గొని, పుస్తకాలుకొన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. బుక్ ఫెయిర్ వారితో కిటకిట లాడింది. మిత్రులు, బంధువులు చిరకాలం తర్వాత కలుసుకుని, కౌగిలించు కొని ఆనందంతో ముచ్చట్లాడడం కనిపించింది. వారితో కలిసి సెల్ఫీలు తీసుకోవడం తేనీరు సేవించడం కనిపించింది.
ఇక్కడ ఏర్పాటు చేసిన 2 వేదికలపై ప్రముఖులతో సదస్సులు నిర్వహించారు. చెంచు సాహిత్యం – సమావేలోచన, తెలంగాణ విస్మృత సాహిత్యం, నన్ను ప్రభావితం చేసిన పుస్తకం మొదలగు అంశాలపై సదస్సులు నిర్వహించారు.
ప్రాంగణంలోనే జనం సందడితో పాటు, ప్రాంగణం బయట పలురుచులు ఆస్వాదిస్తూ జనం మూగారు. ప్రాంగణం లోపలి భాగంలో అడుగడుగులో త్రాగునీరు సౌకర్యం, టీ స్టాల్స్ ఉన్నాయి.
ప్రాంగణలో కొన్ని విశేషాలను గురించి కూడా చెప్పుకోవాలి. ప్రపంచంలోనే అతి పెద్ద పుస్తకం ప్రదర్శనలో వుంచారు. నాలుగు వేదాలను కలిపి, నాలుగు వేల పేజీల్లో ‘దివ్య వేదవాణి’ ఉద్గ్రంధాన్ని మహబూబ్ నగర్‌కు చెందిన కృష్ణారెడ్డి 25 ఏండ్లు శ్రమించి రచించాడు. ఆయన ఈ గ్రంథాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు అంకితమిచ్చాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను వక్తగా మార్చిన పుస్తకం ఇరివెంటి కృష్ణమూర్తి రచించిన ‘వాగ్భూషణం భూషణం’ ఈ ప్రదర్శలో విశిష్టతను సంతరించుకున్నది.
”ఇన్ ది మూడ్ ఫర్‌లవ్’ ప్రేమకథా కొత్త పుస్తకం విడుదలైన రెండురోజుల్లోనే నాలుగు వందల కాపీలు అమ్ముడయ్యాయి. ఇక్కడి బుక్ ఫెయిర్ గురించి తెలిసి జర్మనీ నుండి రిసెర్చిలో భాగంగా ‘లెనిన్’ పరిశోధక విద్యార్థి ఇక్కడికి వచ్చాడు. కొన్నిస్టాళ్ళలో ఇంగ్లిష్ పుస్తకాలు పాతిక ఐదొందలకే లభించాయి.డిసెంబర్ 22న మధ్యాహ్నం 3 గంటలకు అశోక్‌నగర్ చౌరస్తా నుండి ఎన్‌టిఆర్ గ్రౌండ్‌లోని పుస్తక మహోత్సవ ప్రాంగణం వరకు జరిగిన ”బుక్” ర్యాలీలో పాఠశాల విద్యార్థులు,
పుస్తక ప్రచురణ కర్తలు, సాహితీ ప్రియులు, అక్షరాభిమా నులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. ఈ ర్యాలీని సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ ప్రారంభించారు.
ఇలా పదిరోజులు పుస్తక ప్రియుల హృదయాల్లో, మస్తిష్కాల్లో జ్ఞాపకాల తీపి గురుతులను ముద్రిస్తూ, వాళ్ళ హృదయాలు బరువెక్కగా అతి కష్టం మీద వీడ్కోలు పలుకుతూ, మళ్ళీ సంవత్సరం కలుసుకుందామన్నారు.