harish-raoతెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పేరుతో పెద్ద ఎత్తున తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి మీకు ఎరుకే. దక్కన్‌ పీఠ భూమిలో ఉన్న తెలంగాణ, చెరువుల నిర్మాణానికి అనువైన ప్రాంతం. తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం శాతవాహనుల కాలం కంటె ముందు నుంచే కొనసాగుతున్నట్లుగా మనకు చారిత్రక అధారాలు ఉన్నా యి. అయితే కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం అత్యున్నత ప్రమాణాలతో సాగింది. కాకతీయులు నిర్మించిన రామప్ప, పాకాల, లఖ్నవరం, ఘనపురం, బయ్యారం వంటి సముద్రాలను తలపించే చెరువులు ఇప్పటికీ సేవలందిస్తున్నాయి. వారి తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్‌ షాహీలు, అసఫ్‌ జాహీలు, సంస్థానాధీశులు,స్ఠానిక ప్రభువులు కూడా తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని కొనసాగించి వ్యవసాయ విస్తరణకు తోడ్పాటునందించారు. పఠాన్‌చెరువు, హుసేన్‌ సాగర్‌, ఇబ్రహీం పట్నం, ఉదయ సముద్రం, పానగల్లు, ధర్మసాగరం చెరువుల్లాంటివి తెలంగాణలో ఎన్నో. ప్రతి ఊరికి కనీసం ఒక్క చెరువన్న ఉండేది. ఒకటి కన్న ఎక్కువ గొలుసు కట్టు చెరువులు ఉన్న ఊర్లు కూడా తెలంగాణలో అనేకం ఉన్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలంగాణలో అనాదిగా ఉన్న ఈ గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను నిర్లక్ష్యం చేసి విధ్వంసానికి గురిచేసింది. ఈ 60 ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణలో గుణాత్మకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఆర్థిక , సాంస్కృతిక జీవనానికి అనాది ఆధారాలుగా ఉన్న గొలుసు కట్టు చెరువుల వ్యవస్థ విధ్వంసమైంది. వాటి నిర్వహణను సీమాంధ్ర వలస ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. పూడికలతో నిండిపోయి నిరుపయోగంగా మారినాయి. కబ్జాల బారినపడి వందలాది చెరువులు కనుమరుగు అయినాయి.

ఇప్పటికీ అనేక చెరువులు కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. తెగిపోయిన మట్టికట్టల ను పునరుద్ధరించలేదు. కూలిపోయిన తూములను,అలుగులను మరమ్మతులు చేయలేదు. చెరువులకు నీటిని తీసుక వచ్చే కాలువలు, వాగులు ఆక్రమణలకు గురి అయితే పట్టించు కోలేదు. సీమాంధ్ర ప్రభుత్వాల సాగునీటి విధానం అంతా కూడా ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలను నెరవేర్చేందుకే ఉద్దేశించబడిరది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణానికే పెద్ద పీట వేసి తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణమైన మైనర్‌ ఇరిగేషన్‌ని నిర్లక్ష్యం చేసినారు. నిజానికి మైనర్‌ ఇరిగేషన్‌ తెలంగాణకు మేజర్‌ ఇర్రిగేషన్‌ అన్న స్పృహ సీమాంధ్ర పాలకులకు లేనేలేదు. చెరువుల వ్యవస్థ విధ్వంసం వలన స్వయంపోషక గ్రామాలుగా విలసిల్లిన తెలంగాణ గ్రామాలు కరువు పీడిత గ్రామాలుగా మారినాయి. వలసలకు, ఆత్మహత్యలకు నిలయమైనాయి. వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినారు. తెలంగాణ గ్రామాల నుంచి లక్షలాది మంది ప్రజలు, పొట్ట చేత పట్టుకుని, ముంబాయి, బీవండి, అహ్మదాబాద్‌, సూరత్‌, మరియు గల్ఫ్‌ దేశాలకు వలస పోయినారు.

తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన కృష్ణా గోదావరి జలాలు దక్కి ఉంటే , చిన్న నీటి వనరుల నిర్వహణ, అభివృద్ధి సక్రమంగా జరిగి ఉంటే తెలంగాణలో బతుకు చిత్రం భిన్నంగా ఉండేది. ఫజల్‌ అలీ కమీషన్‌ సిఫారసుల మేరకు తెలంగాణ ఒక రాష్ట్రంగా కొనసాగి ఉంటే నదీ జలాల్లో తన వాటాను తను వినియోగించుకొని ఉండేది. అనాది ఆధారాలైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను సక్రమంగా నిర్వహించుకుని ఉండేది. చిన్న చెరువులను మరింత అభివృద్ధి పరుచుకుని ఉండేది. 60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంలో తెలంగాణ అనుభవించిన వివక్షను, ఆ వివక్ష కారణంగా జరిగిన నష్టాన్ని పూరించవలసిన అవసరం ఉన్నది. సాగునీటి రంగం అభివృద్ధి మీదనే తెలంగాణ పునర్నిర్మాణం ఆధారపడి ఉన్నది. తెలంగాణలో వ్యవసాయాభివృద్ధ్ది జరిగితే తెలంగాణలో ప్రజల వలసలు ఆగిపోతాయి. రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి. వ్యవసాయం పుంజుకుంటే గ్రామంలో అనేక వృత్తి కులాలు బతుకుతాయి. అయితే తెలంగాణలో వ్యవసాయాభివృద్ధికి చెరువుల పునరుద్ధరణ ప్రధాన చోధక శక్తిగా పని చేస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలకు గంపెడు ఆశలు ఉన్నాయి. తెలంగాణకు గోదావరి బేసిన్‌ లో 175 టి ఎం సి లు , కృష్ణా బేసిన్లో 90 టి ఎం సి లు మొత్తం 265 టి ఎం సి లు చిన్న నీటి వనరుల కేటాయింపులు ఉన్నాయి. కాని తెలంగాణలో చిన్ననీటి వనరుల వినియోగం 90 టి ఎం సి లకు మించి లేదు.

harishతెలంగాణ ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించి వాటి నిల్వ సామర్థ్యాన్ని పూర్తి స్థాయికి పెంచుకోవాలనుకుంటున్నది.ఈ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగించాలనుకుంటున్నది
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గత జూలై నెలలో మొదటి సారిగా తెలంగాణలో చెరువుల సమగ్ర సర్వే జరిగింది. అన్ని జిల్లాల్లో మొత్తం చెరువుల సంఖ్య 46531 గా తేలింది. ఇందులో గొలుసుకట్టు చెరువులు 5000 ఉన్నట్టు లెక్క తేలింది. మెదక్‌ జిల్లాలోఅత్యధికంగా 7941 చెరువులు, రెండో స్థానంలోఉన్న మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 7480 చెరువులు ఉన్నట్టు సర్వేలో తేలింది.అత్యధిక చెరువులున్న జిల్లా మెతుకు సీమ , పాలమూరు కరువు జిల్లాలుగా, వలసల జిల్లాలుగా మారడం ఒక విధి వైచిత్రి. మొత్తం తెలంగాణ కరువుకు ప్రతి రూపంగా మారింది. ప్రతీ సంవత్సరం చెరువుల పునరుద్ధరణకు 20% చెరువులను అనగా 9306 చెరువులను ఎంపిక చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వారి చెరువుల వివరాలు పట్టికలో చూడవచ్చు.

ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలుపరచాలంటే మైనర్‌ ఇరిగేషన్‌కు ఒక ప్రత్యేకమైన యంత్రాంగం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతీ జిల్లాకు ఒక సర్కిల్‌ కార్యాలయాన్ని, ప్రతీ రెండూ లేదా మూడు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఒక డివిజన్‌ కార్యాలయాన్ని , ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక సబ్‌ డివిజన్‌ ని , ప్రతీ మండలానికి ఒక సెక్షన్‌ కార్యాలయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే మొదటిదశ పునరుద్ధరణకు అన్నిజిల్లాల్లో ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు చెరువుల ఎంపిక, సర్వే, పరిపాలనా అనుమతులు, టెండర్లు పూర్తి అయి చెరువుల పునరుద్ధరణ ప్రక్రియ ఊపందుకున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7500 చెరువులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.ఇప్పటి వరకు 4000 చెరువుల్లో పూడికతీత పనులు ఇతర మరమ్మత్తు పనులు ప్రారంభమయినాయి. మే నెల చివరికి ప్రతిపాదించిన అన్ని చెరువుల పునరుద్దరణ పనులు పూర్తి చెయ్యాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నది.

చెరువు వలన గ్రామానికి ఒనగూరే ప్రయోజనాలు:

చెరువులను పునరుద్దరించడం వలన ప్రత్యక్షంగా, వెంటనే ప్రయోజనం పొందే వర్గాలు రైతులు , వ్యవసాయ కూలీలు. అయితే చెరువు మీద ఆధారపడే అనేక కుల వృత్తుల వారికి.. రజకులు , కుమ్మరులు, బెస్త వారు, ముదిరాజులు, కల్లు గీత కార్మికులు , గొర్ల కాపరులు , పండ్లను సేకరించి అమ్ముకొని జీవించే తెనుగోల్లు, వ్యవసాయంపై ఆధారపడి జీవించే వడ్రంగులు, కమ్మరులు.. తమ జీవనాన్ని గ్రామంలోనే కొనసాగించడానికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తెలంగాణలో చెరువు సాంస్కృతిక కేంద్రం కూడా. బతుకమ్మ, కట్టమైసమ్మ బోనాలు, బంజారాలతీజ్‌, శ్రావణ మాసంలో సామూహిక వన భోజనాలు, బెస్తల గంగ జాతరలు తదితర పండుగలకు చెరువు అదరువుగా ఉంటది. చెరువులో నీరు నిలువ ఉండటం వలన భూగర్భజలాలు పెరుగుతాయి. బోర్ల కింద వ్యవసాయం పెరుగుతుంది. ప్రజల, పశువుల తాగునీటి అవసరాలు తీరుతాయి. చెరువు పూడిక మట్టి రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చునని, పూడిక మట్టి వాడకం వలన 50 % రసాయనిక ఎరువుల ( యూరియా, డి ఎ పి) వినియోగాన్ని తగ్గిస్తుందని, పంట దిగుబడి 15 % – 20 % పెరుగుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగులోకి తీసుకరావచ్చును. ఆ మేరకు రైతులకు ఆదాయం పెరుగుతుంది. పూడిక మట్టి వలన ఒనగూడే ప్రయోజనాలు కింద మరింత విపులంగా వివరించడం జరిగింది.

పూడిక మట్టి వలన ఒనగూరే ప్రయోజనాలు :

ఒండ్రుమట్టి మొక్కల పెరుగుదలకు అనుకూలమని రైతులకు వేల సంవత్సరాల అనుభవ జ్ఞానం ద్వారా తెలుసు. ఆ అనుభవ జ్ఞానంతోనే చెరువుల నుంచి రేగడిని కొట్టుకపోయే సాంప్రదాయం తెలంగాణలో రైతులు అమలు పరిచేవారు.అందుకు ప్రభుత్వాలు ప్రోత్సహించి సహకరించేవి. అయితే ఆధునిక వ్యవసాయ పరిశోధనలు పూడిక మట్టిలోని పోషక విలువలు , పూడిక మట్టి వలన ఒనగూరే ప్రయోజనాలను శాస్త్రీయంగా పరిశోదించి నిర్ధారించినాయి. హైదరాబాద్‌ లోని సెంట్రల్‌ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రై ల్యాండ్‌ ఏరియాస్‌ సైంటిస్టులు, ఇక్రిసాట్‌ వారు పూడిక మట్టిపై పరిశోదనలు జరిపి అనేక ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడిరచినారు.

చెరువు పూడిక మట్టి రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని సాధికారికంగా నిరూపించినారు. తగినంత పాళ్ళలో నత్రజని , పొటాషియం, ఫాస్ఫరస్‌ , జింక్‌ , బోరాన్‌ ,సేంద్రీయ కార్బన్‌ పదార్థాలు, మొక్కల పెరుగుదలకు దోహదం చేసే బాక్టీరియాలు తదితర పోషకాలు పూడిక మట్టిలో ఉన్నాయని ( చెర్వు నుంచి చెర్వుకు కొంత తేడాలు ఉన్నప్పటికీ ) వారు తమ పరిశోధనల్లో తేల్చినారు. రసాయనిక ఎరువుల్లో ఒకటో రెండో పోషకాలు మాత్రమే ఉంటాయి.మిగతావాటి కోసం మరో రసాయనిక ఎరువును కొనాలి. అయితే పూడిక మట్టిలో అన్ని పోషకాలు తగినంత పాళ్ళలో ఉంటాయి. పూడికమట్టిలో ఉండే పోషకాలు ఈవిధంగా ఉన్నట్టు ఇక్రిసాట్‌ సంస్థ పరిశోధనలు తెలుపుతున్నాయి.

పూడిక మట్టిలోని పోషకాలు :

శ్రీ నత్రజని- కిలోకు 720 మిల్లీ గ్రాములు
శ్రీ ఫాస్ఫరస్‌ – కిలోకు 320 మిల్లీ గ్రాములు
శ్రీ పొటాషియం – కిలోకు 310 మిల్లీ గ్రాములు
శ్రీ ఆర్గానిక్‌ కార్బన్‌ లు – కిలోకు 9.1 గ్రాములు
శ్రీ మైక్రోబియల్‌ బయోమాస్‌ కార్బన్‌లు –
కిలోకు 308 మిల్లీ గ్రాములు- ( 3.8 % )

పూడికమట్టిని తిరిగి పొలాల్లోకి చల్లడం వలన ఖర్చులు, లాభాల నిష్పత్తి 1:1.44 ఉన్నట్లువారి పరిశోధనలు తెలుపుతున్నాయి. మట్టిలో పోషక విలువలు పెరిగి దాని ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినట్టు , తేమను నిలుపుకునే సామర్థ్యం పెరిగినట్టు రైతులు అంగీకరించినట్టు వారు వెల్లడిరచటం విశేషం. తమిళనాడు , కర్నాటక రాష్ట్రాల్లో జరిగిన పరిశోధనల్లో కూడా ఇవే ఫలితాలు వెలువడినాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే చెరువు గ్రామ ఆర్థిక , సామాజిక,సాంస్కృతిక వికాసానికి దోహదం చేస్తుంది. అందుకని చెరువుల పునరుద్ధరణ కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే కాక ప్రజల భాగస్వామ్యంతో నడిచే కార్యక్రమంగా జరగాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే పనులు ప్రారంభమైన చెరువుల నుంచి రైతులు స్వచ్ఛందంగా పూడిక మట్టిని తమ పొలాల్లోకి తరలించుక పోతున్నరు. రైతుల చొరవ మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు నడిపిస్తున్నది. ఒక్క ఉదాహరణ ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. మార్చ్‌ 12 న గౌరవ ముఖ్యమంత్రి మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించిన నిజామాబాద్‌ జిల్లా సదాశివనగర్‌ గ్రామ పాత చెరువు పూడిక మట్టిని చుట్టుపక్కల 8 గ్రామాల రైతులు 25 ఏప్రిల్‌ నాటికి స్వచ్ఛందంగా , తమ స్వంత ఖర్చులతో 35000 ట్రాక్టర్‌ ట్రిప్పుల మట్టిని (సుమారు 87,500 క్యూబిక్‌ మీటర్లు ) తమ పొలాల్లోకి తరలించుక పోయినారు. ప్రతి రోజూ 1200 ట్రాక్టర్ల మట్టిని నిరంతరాయంగా తరలించుకపోతున్నట్టు ఇంజనీర్లు సమాచారం ఇస్తున్నారు. ఒక్క పాత చెరువులోనే కాదు తెలంగాణ అంతటా ఇదే సహకారం రైతుల నుంచి లభిస్తున్నది. ఇది అపూర్వం.

తెలంగాణ రైతులకు ప్రభుత్వం తరపున హృదయపూర్వక అభినందనలు. అదే సమయంలో తెలంగాణ సమాజం నుంచి కూడా మిషన్‌ కాకతీయకు అపూర్వ స్పందన లభిస్తున్నది. తెలంగాణ ఇంజనీర్ల జె ఎ సి, తెలంగాణ గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులు, మైన్స్‌ శాఖ ఉద్యోగులు, రెవెన్యూ శాఖ వి ఆర్‌ వో లు, ఒక రోజు జీతాన్నిమిషన్‌ కాకతీయకు విరాళంగా ప్రకటించినారు. తెలంగాణ పారిశ్రామిక వేత్తలు భారీగా విరాళాలు అందజేసి నారు. మరికొందరు చెరువు లను దత్తత తీసుకొని తమ స్వంత ఖర్చులతో పున రుద్ధరణ పనులను చేపడుతు న్నారు. తెలంగాణ జె ఎ సి ఇచ్చిన పిలుపును అందుకొని ఏప్రిల్‌ 19న తెలంగాణ వ్యాప్తంగా ఒక రోజు శ్రమదానం కార్యక్రమం అద్భుతంగా జరిగింది. రచయితలు, కవులు, కళాకారులు చెరువులపై సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పటికే అనేక కవితా సంపుటాలు, పాటల సీడీలు వెలువడినాయి. మిషన్‌ కాకతీయ కార్యక్రమం అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఆకర్శించింది. అమెరికాలోని ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌ విద్యార్థులు, హైదరాబాద్‌ జె ఎన్‌ టి యు విద్యార్థులు, ప్రొ. జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు మిషన్‌ కాకతీయ ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నరు. స్థానిక, జాతీయ పత్రికలు మిషన్‌ కాకతీయపై అనేక కథనాలు ప్రచురించినాయి. స్థానిక , జాతీయ మీడియా ప్రత్యేక కథనాలని ప్రసారం చేసినాయి. ప్రపంచంలోనే చిన్ననీటి వనరుల సంరక్షణకు అమలు పరుస్తున్న అత్యంత బృహత్తర కార్యక్రమంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. మిషన్‌ కాకతీయ నిజమైన అర్థంలో ఒక ప్రజా ఉద్యమంలా సాగుతున్నది.

చెరువుల పునరుద్ధరణ మనందరి ఉద్యమ ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని సంఘటితంగా సాధించుకున్నట్టే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసుకుందాం. మన గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్లు తాంబాళంలా మారిన చెరువును గంగాళంలా మార్చుకుందాం. ఈ మహత్తర ఉద్యమంలో చేయీ చేయీ కలుపుదాం- మన ఊరి చెరువును పునరుద్ధరించుకుందాం.

గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి కాకతీయుల కాలంనాటి చెరువుల నిర్మాణ కౌశలాన్ని, వారి విజన్‌ ని గుర్తుకు తెచ్చే విధంగా మిషన్‌ కాకతీయ అని నామకరణం చేసినారు. మన వూరు-మన చెరువు కార్యక్రమం మనందరి కార్యక్రమం. ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి మనమందరం సమిష్టిగా కృషి చేద్దామని కోరుతూ, ఈ కృషిలో తెలంగాణ సమాజ మంతా పాలు పంచుకోవాలని వినమ్రంగా విన్నవిస్తున్నాను.

Other Updates