పూణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ ద్వారా చేపట్టిన పలు ఇంజనీరింగ్‌ పనులు, పార్కుల నిర్వహణ, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, తదితర అంశాలను హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ నేతృత్వంలోని జిహెచ్‌ఎంసి అధికారుల బృందం పరిశీలించింది. నాగ్‌పూర్‌లో మెట్రోరైలు, ఇతర నిర్మాణాలను పరిశీలించిన ఈ బృందం అటుపిమ్మట పూణె నగరంలో పర్యటించారు.

జిహెచ్‌ఎంసి చీఫ్‌ ఇంజనీర్లు శ్రీధర్‌, జియాఉద్దీన్‌, ఓ.ఎస్‌.డి సురేష్‌లు మేయర్‌తో కలిసి పూణెలో పర్యటించారు. ఈ సందర్భంగా పూణె నగరంలోని రహదారులకు అప్పటికప్పుడు మరమ్మతులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్‌ మరమ్మతుల వాహనాన్ని పరిశీలించారు. పూణె స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలను కూడా పరిశీలించారు. ముఖ్యంగా పార్కుల్లో సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన ఏకో ఫ్రెండ్లీ సీటింగ్‌ ఏర్పాట్లు, సోలార్‌ టవర్‌ యూనిట్లు, ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటు, వాటి నిర్వహణను మేయర్‌ ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. పార్కుల్లో వర్షపునీరు ఇంకేలా నిర్మించిన ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పరిశీలించారు.

వీటితో పాటు నగరంలోని ఫుట్‌ పాత్‌లపై కేవలం పాదాచారులు మాత్రమే వెళ్లేలా ఏర్పాటు చేసిన బొల్లాడ్స్‌ను చూశారు. ఫుట్‌పాత్‌లపై నగరవాసులు కూర్చునే విధంగా వినూత్న ఆకారంలో ఏర్పాటుచేసిన ఛైర్లను పరిశీలించారు. పూణె నగరంలో పలు ప్రధాన జంక్షన్లు, రహదారులపై ఏర్పాటుచేసిన పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణ విధానాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆద్వర్యంలో అమలవుతున్న హైకెపాసిటీ మాస్‌ ట్రాన్సిట్‌రూట్‌, బస్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ రూట్‌, సైక్లింగ్‌ ప్లాన్‌, స్మార్ట్‌ పెడెస్టేరియన్‌ స్ట్రీట్‌ ప్రాజెక్ట్‌ల వివరాలను మేయర్‌ రామ్మోహన్‌కు అధికారులు తెలిపారు.

నాగ్‌పూర్‌ మెట్రోరైలు ప్రాజెక్ట్‌ పరిశీలన

నాగ్‌పూర్‌లో అమలవుతున్న వినూత్న ప్రాజెక్ట్‌లైన్‌ సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్వహణ, మెట్రోరైలు ప్రాజెక్ట్‌లో చేపట్టిన రెండు అంతస్తుల ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, పార్కుల నిర్వహణ తదితర కార్యక్రమాలను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ నేతృత్వంలోని జిహెచ్‌ఎంసి అధికారుల బృందం పరిశీలించింది. జిహెచ్‌ఎంసి చీఫ్‌ ఇంజనీర్లు శ్రీధర్‌, జియాఉద్దీన్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి ఓ.ఎస్‌.డి మహేందర్‌లతో పాటు సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు కూడా నాగ్‌పూర్‌లో ఈ కార్యక్రమాలను పరిశీలించారు. ముఖ్యంగా నాగ్‌పూర్‌లో రూ. 8,680 కోట్ల వ్యయంతో చేపట్టిన నాగ్‌పూర్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ ప్రాజెక్ట్‌ అమలుపై నాగ్‌పూర్‌ మెట్రో రైలు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 38.215 కిలోమీటర్ల విస్తీర్ణంలో చేపట్టిన మెట్రోరైల్‌కు డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్లను వినూత్నంగా నిర్మించారు. రెండు ఫ్లైఓవర్లను ఒకదానిపై ఒకటి నిర్మించిన వీటిలో ఒక ఫ్లైఓవర్‌లో వాహనాల రవాణా, పై ఫ్లైఓవర్‌లో మెట్రో రైలు ప్రయాణించే విధంగా నిర్మించారు. ఈ డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్లకు భూ సేకరణ, ఆస్తుల సేకరణ తక్కువగా ఉండడం, ప్రాజెక్ట్‌ వ్యయంలో దాదాపు 40శాతం తగ్గడంతో పాటు మెట్రో రైలు ప్రాజెక్ట్‌ నిర్మాణం అత్యంత వేగంగా చేపట్టడానికి అవకాశం కలిగిందని నాగ్‌పూర్‌ మెట్రో అధికారులు వివరించారు. మెట్రో ప్రాజెక్ట్‌ అమలు, నిర్మాణం, నిర్వహణ, ప్రత్యేకతలపై జిహెచ్‌ఎంసి అధికారులకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

మెట్రోరైలు ప్రాజెక్ట్‌లో భాగంగా షటిల్‌ బస్‌ సర్వీసులు, బ్యాటరీ ద్వారా నడిచే వాహనాలు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, సైకిళ్ల ఏర్పాటు తదితర సౌకర్యాలను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఏర్పాటు చేసినట్టు వివరించారు. నాగ్‌పూర్‌ నగరంలో పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్ట్‌నర్‌ షిప్‌ పద్దతిలో నిర్మించిన సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను మేయర్‌ రామ్మోహన్‌, ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌లతో కూడిన అధికారుల బృందం పరిశీలించింది. హైదరాబాద్‌ నగరంలో నిర్వహిస్తున్న సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ద్వారా వచ్చే నీటిని పార్కులకు, భవన నిర్మాణాలకు ఉపయోగించే విధంగా త్వరలోనే ఉత్తర్వులు జారీచేసే నేపథ్యంలో పిపిపి రంగంలో హైదరాబాద్‌ నగరంలోనూ ఎస్‌.టి.పిలను ఏర్పాటుచేసే అంశాలను పరిశీలిస్తున్నట్టు మేయర్‌ తెలిపారు. నాగ్‌పూర్‌లో నిర్మించిన అండర్‌పాస్‌లు, వీటిలో వర్షపునీరు చేరకుండా చేపట్టిన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించారు. అదేవిధంగా నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో చేపట్టిన వర్టికల్‌ గార్డెన్‌లను కూడా ఈ బృందం పరిశీలించింది. హైదరాబాద్‌ నగరాన్ని కూడా పర్యటించాలని నాగ్‌పూర్‌ మెట్రో అధికారులను మేయర్‌ రామ్మోహన్‌ ఆహ్వానించారు.

Other Updates