తెలంగాణలో ప్రజల భాష వుంది. దేశి సాహితీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న భాషా వ్యవహారం ఇక్కడి పల్లీయులలో వున్నది. శిష్టులకన్నా, పండితులకన్నా, విద్యావంతు లకన్నా భిన్నమైన, సహజమైన, సరళమైన, స్పష్టమైన పలుకుబడి తెలంగాణలో వున్నది. ఈ పలుకుబడి జానపదుల సంపద. తెలుగుభాషలో విద్యాధికులు మాట్లాడే ‘ఉన్నత పాఠశాల’ను తెలంగాణలో అందరూ ‘పెద్దబడి’ అనే వ్యవహరిస్తారు.
ఉన్నత పాఠశాల తెలుగు సమాసం కాదు. అందులో ఉన్న రెండు పదాలూ తత్సమాలు. పెద్దబడి అనేది అచ్చ తెలుగు సమాసం. పైగా ‘బడి’ అన్న దానికి మూలం తమిళంలో ‘పళ్ళె, అంటే ద్రావిడ భాషకు తెలంగాణ తెలుగు చాలా దగ్గర. తెలుగులోని ‘గోమాంసం’ తెలంగా ణలో ‘పెద్దకూర’ లేదా ‘పెద్ద మాంసం’ అవుతుంది. ఎద్దు మాంసాన్ని కూడా ఇప్పటి రెండు మాటలతో చెబుతారు తెలంగాణలో. ‘రాజవీధి’ అనే మాట తెలంగాణలో ‘పెద్ద బజారు’ అవుతుంది. కీకారణ్యం, కారడవి, దుర్గమాటవి మొదలైన పదాలను ఒక్క మాటలో ‘పెద్ద జెంగల్’ అంటారు. ద్వాదశ దిన కర్మను ‘పెద్దకర్మ’ అనీ, రజస్వల లేదా సమర్త లేక పుష్పవతి కావడాన్ని ‘పెద్ద మనిషి అయింది’ అనీ, భారీ వృక్షాల్ని ‘పెద్ద పెద్ద చెట్లు’ అనీ, పెడబొబ్బలు పెడుతున్నాడు అనేదాన్ని ‘పెద్ద బొబ్బలు పెడుతున్నడు’ అనీ (బహుశ: తెలంగాణలోని ‘పెద్ద’ అనే మాటే క్రమంగా తెలుగులోని ‘పెడ’గా మారి వుంటుంది),
నాగరికుల్ని, విద్యావంతుల్నీ, మోతుబరుల్నీ ‘పెద్ద లోకులు’ అనీ పలుకుతున్నారు. చాలా చిత్రంగా పుష్యమికార్తెను ‘పెద్ద పుష్యాల’ అంటున్నారు. పునర్వసును ‘పెద్దపూసాల’గా వ్యవహరిస్తున్నారు. నోరుతిరుగని పెద్దపెద్ద మాటల్ని తెలంగాణ గ్రామీణులు వాళ్ళకు అవసరమైన తీరులో అభివ్యక్తీకరించడం గమనించదగ్గ అంశం. భారీకాయం అనే మాటను చాలా హాయిగా ‘పెద్ద పెయ్యి’ అని అంటారు. అట్లాగే భారీకాయుడు అనే పదాన్ని ‘పెద్ద పెయ్యి మనిషి’ అని మాట్లాడుతారు. తెలంగాణ తెలుగులోని ఈ ‘పెయ్యి’ అనే పదము ఇప్పటివరకూ ఉన్న తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కకపోవడం ఆశ్చర్యకరం. ఆ పదం ‘మెయి’ అనే రూపంలో ఉంది. తెలుగులోని ‘ఒళ్ళూ పై తెలీకుండా మాట్లాడుతున్నాడు’ జాతీయంలోని ‘పై’ తెలంగాణలోని పెయ్యే సుమా!
ఇక ‘నది’ అనే పదం పరిశీలనార్హం. తెలంగాణలో దీన్ని ‘పెద్దవాగు’ అంటారు. పెద్దవాగు అంటే వాగుకన్నా పెద్దది. అది నదితో సమానమైనది. వాగు, ఒర్రె, కాలువ మొదలైనవన్నీ మనకు తెలుసు. వీటన్నింటికన్న పెద్దది పెద్దవాగు. మేజర్ ఆపరేషన్ అనే ఆంగ్ల పదం తెలంగాణలో ‘పెద్ద ఆపరేషన్’. దివాంధము, గుడ్లగూబ, ఘాకం (ఘాకం భేకా, భేకం బాకా-శ్రీశ్రీ) అనే పక్షి చాలా సులువుగా తెలంగాణలోని ‘పెద్ద పిట్టే’. తెలుగులో కొన్ని ప్రాంతాల్లో దీన్ని ‘పెద్ద పులుగు’ అని కొందరు అంటున్నారు. పెద్ద పిట్ట కూస్తే అపశకునం అని, ఏదో కీడు పొంచి వుందనీ, దాన్ని రకరకాల తిట్లతో బెదిరింపులతో వెళ్ళగొడుతారు తెలంగాణీయులు. తెలుగులోని ఉన్నత విద్యలు తెలంగాణలో ‘పెద్ద చదువులు’ అవుతాయి. పితృతర్పణాలు వదలడానికి బదులుగా ‘పెద్దలకు ఇచ్చుడు’ అంటారు. మహాలయ అమావాస్య, పితృ అమావాస్య, పెత్రమావాస్య ఏకంగా ‘పెద్దల అమాస’గా మారిపోతుంది తెలంగాణలో. అగ్రాసనాధిపత్యం ఇచ్చారు, అగ్రతాంబూలం ఇచ్చారు అనే వాక్యాలు పెద్దగా తలచించుకోవాల్సిన అవసరం లేకుండానే ‘పెద్దపీట వేసిన్రు’ అనే వాక్యంగా తయారవుతుంది. ‘వాడు అర్థరాత్రి’ అపరాత్రి మధ్యరాత్రి వచ్చాడు’ అని తెలుగులో అంటే తెలంగాణలో ‘వాడు ఓ పెద్దరాత్రి వచ్చిండు’ అని అవుతున్నది.
ఉదారగుణం కల్గిన వాళ్ళను ‘ఆయనకు పెద్ద గునం లేదా పెద్దబుద్ధి’ ఉన్నది అంటుంటారు. భారీ వర్షం, కుంభవృష్టి, కుండపోత మొదలైన పదాలకు సమానార్థకంగా ‘పెద్దవాన’ అంటున్నారు. పెద్దనాన్న తెలంగాణలో ‘పెద్ద బాపు’ అవుతాడు. కొందరు ‘పెద్ద నాయిన’ అని కూడా వ్యవహరిస్తున్నారు. ‘బాపు’ హిందీ పదం. పెళ్ళికి వచ్చే బ్యాండ్ మేళం వాళ్ళనీ, బాజా బజంత్రీగాళ్ళని తెలంగాణలో ‘పెద్ద చప్పుడోల్లు’ అంటారు. ప్రధానోపాధ్యాయుడు చాలా సింపుల్‌గా ‘పెద్దసారు’ అయిపోతాడు. కుష్ఠువ్యాధిని తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘పెద్దరోగం’గా పిలవడం పరిపాటి. దుర్గాష్టమినాడు పేర్చే బతుకమ్మను ‘పెద్ద బతుకమ్మ’ అంటారు. నిజానికి ఆ రోజు రెండు బతుకమ్మల్ని పేర్చుతారు. రెండోది చిన్న బతుకమ్మ. ఆంధ్రులకు ఈ బతుకమ్మ పండుగ అసలే లేదు కనుక ‘పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఎంగిలిపూల పండుగ’ మొదలైన మాటలు ఆ భాషలో వుండకపోవడం సహజమే! ‘పెద్ద వ్రేలు’ లేదా ‘బొటన వ్రేలు’ని తెలంగాణలో ‘పెద్దనేలు’ అంటారు. నుగాగమం ద్వారా పెద్దనేలు అయింది. చిన్నాపెద్దా లేకుండా మాట్లాడుతున్నాడు. అనే వ్యాకం తెలంగాణలో ‘చిన్నంత్రం’ ‘పెద్దంత్రం’ లేకుంట మాట్లాడుతున్నాడుగా మారుతున్నది.
తెలుగు భాషలో దాతృత్వానికీ, వితరణశీలానికి, దానగు ణానికీ ‘ఎముకలేని చెయ్యి’ అనే ఒక జాతీయం వుంది. ఇది తె లంగాణలో ‘పెద్ద చెయ్యి’. పెళ్లిలో అమ్మాయి తరఫువాళ్ళు తమ కూతురికి ‘పెద్ద చీరె’ తీసుకుంటారు. తెలంగాణావాసులు పెద్ద గా తలబద్దలు కొట్టుకోకుండానే తమ భావ ప్రకటనకు అలతి అలతి అచ్చ తెలుగుపదాలు వాడుతూ తమ భాషా వ్యవహారాన్ని శ్వాస తీసుకున్నంత సహజంగా నడుపుకుంటారు.
డా|| నలిమెల భాస్కర్