బోనాలు, పూనకాలు, భేరీలు సంప్రదాయబద్ధమైన నృత్యాలతో లక్షలాదిగా వచ్చిన భక్తుల రద్దీతో పెద్ద(గొల్ల)గట్టు లింగమంతుల స్వామి జాతర ఫిబ్రవరి 12వ తేదీన ప్రారంభమై అయిదు రోజులపాటు అట్టహాసంగా జరిగింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగ స్థాయిలో నిర్వహించాలనే తలంపుతో రెండు విడతలుగా 3.5 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.
జాతర ప్రారంభం రోజు అర్థరాత్రి యాదవపెద్దలు సూర్యాపేట మండలం కేసారం నుండి దేవరపెట్టె, బోనం గంపను గుట్టపైకి తీసుకువచ్చి.. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవరపెట్టెలోవున్న దేవతామూర్తులను ఆలయంలో ప్రతిష్టించడంతో ప్రధాన ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి జగదీశ్‌రెడ్డి కేసారం గ్రామానికి చేరుకుని దేవరపెట్టెకు పూజలు నిర్వహించి, దేవరపెట్టె బోనం గంపతోపాటు పెద్దగట్టుకు చేరుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రతిష్ఠించిన దేవతామూర్తులకు పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి వెంట కలెక్టర్ కె. సురేంద్రమోహన్, గట్టు ఛైర్మన్ సుంకరబోయిన శ్రీనివాస్ యాదవ్‌లుకూడా పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ జాతర సందర్శనకు వెళ్ళే భక్తులకోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడిపింది.పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీ ఛైర్మన్ బాలూనాయక్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ లింగమంతుల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం గుట్టకు రెండు కిలోమీటర్ల దూరంనుండి టెంట్లు వేసుకుని వుండి తమ మొక్కులు చెల్లించుకున్నారు.