పేదరికం మనుషుల్ని అనేక రకాలుగా వేధిస్తుంది. పేదరికంతో బాధ పడేవారికి కొన్నిసార్లు సాంప్రదాయాలు కూడా భారంగా పరిణమిస్తాయి. మన సమాజంలో పెండ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. అందులోనూ ఆడపిల్ల పెండ్లి మరింత భారంగా పరిణమించింది. ఈ భారంవల్లనే చాలామంది తల్లిదండ్రులు తమ ఇంటి మహాలక్ష్మిగా గౌరవించే ఆడపిల్లని గుండెలమీద కుంపటిగా భావించే మానసిక స్థితికి గురవుతున్నారు. ఆడపిల్ల కడుపులో ఉండగానే, ఆ పిల్ల పెండ్లికోసం చేయవలసిన ఖర్చును ఊహించి కొంతమంది భ్రూణ హత్యలకు పాల్పడుతున్న అమానుష సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు పేదల ఇండ్లలో ఆడపిల్లలు పెండ్లి కాకుండానే మిగిలిపోతున్నారు. ఆడపిల్ల పెండ్లి చేయడం కోసం కుటుంబాలు అప్పులపాలు అవుతున్నాయి. ఆర్థికంగా చితికిపోతున్నాయి.
పరిపాలనలో మానవీయ విలువలు అడుగడుగునా ప్రతిబింబించాలని భావించే తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లలు ఎదుర్కొంటున్న కష్టాన్ని, వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న ఆవేదనని తీర్చాలని భావించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ కాకున్నా, పేదరికం ప్రభావాలను అధ్యయనం చేసే క్రమంలో పరిస్థితిలోని తీవ్రత మమ్మల్ని కదిలించింది. అందుకే పేద ఆడపిల్లల పెండ్లికి ప్రభుత్వం ఆర్థికంగా అండదండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నాం. కళ్యాణలక్ష్మి అనే శుభప్రదమైన పేరుతో 2014 అక్టోబర్ 2న ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాం.
ఆడపిల్లల కన్నీరు తుడిచి వారి తలపై కళ్యాణక్షతలు చల్లిన ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టను పెంచింది. కళ్యాణలక్ష్మి వ్యక్తిగతంగా నా హృదయానికి ఎంతో దగ్గరైన పథకం. అంతకంటే ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలు మెచ్చిన పథకం. అంతకంటే ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలు మెచ్చిన పథకం. ఆడపిల్లల కండ్లల్లో ఆనందం నింపిన పథకం. మొదట ఈ పథకాన్ని ‘కళ్యాణలక్ష్మి’ పేరుతో ఎస్సీ, ఎస్టీలకు, ‘షాదీ ముబారక్’ అనే పేరుతో మైనారిటీ వర్గాల ఆడపిల్లల పెండ్లికి రూ. 51,000/- లు అందించే పథకంగా ప్రారంభించాం. ఆ తరువాత ప్రజలనుంచి వచ్చిన అభ్యర్థన మేరకు సామాజిక వర్గంతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తింపచేశా.
సార్థకమైన ఈ పథకం ప్రయోజనం మరింత పెంచాలనే ఉద్దేశ్యంతో పథకం ద్వారా అందించే మొత్తాన్ని గతేడాది రూ. 75,116లకు పెంచాము. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 3 లక్షల 60వేల మందికి లబ్ది చేకూరింది. కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకుంటున్న సమయంలో తమకందిన సహాయానికి సంతోషిస్తూ, ఆడపిల్లల తల్లులు ఆనంద భాష్పాలతో ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు.
కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం ఇతర సామాజిక ప్రయోజనాలను సాధించింది. ఈ పథకం ద్వారా లబ్ది పొందడానికి కనీస వయో పరిమితి 18 సంవత్సరాలుగా నిర్ణయించాం. దీంతో పథకం ప్రయోజనాలు పొందడం కోసం బాల్య వివాహాలు చేయకుండా 18 సంవత్సరాలు నిండే వరకు తల్లిదండ్రులు వేచి ఉంటున్నారు. ఈ విధంగా కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం బాల్య వివాహాలను నిరోధించడానికి కూడా ఉపయోగపడుతున్నది. కళ్యాణలక్ష్మి సహాయం అందుకున్న వివాహాలకు ప్రభుత్వ గుర్తింపుతోపాటు చట్టబద్ధత లభిస్తున్నది. ఇది ఈ పథకం సాధించిన మరో ప్రయోజనం.
అత్యంత మంగళకరమైన ఈ పథకానికి సంబంధించి మరో శుభవార్తను ఈ రోజు ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం కింద ఆడపిల్ల పెండ్లి కోసం అందించే మొత్తాన్ని 75,116 నుంచి 1,00,116 రూపాయలకు పెంచుతున్నామని ఎంతో సంతోషంతో ప్రకటిస్తున్నాను. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ఆడపిల్లలు, వారి తల్లిదండ్రుల నుండేకాకుండా, సమాజహితం కోరేవారందరినుండి హర్షామోదాలు లభిస్తాయని విశ్వసిస్తున్నాను. వారి ఆశీర్వాదమే కొండంత అండగా సంక్షేమరాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని సవినయంగా తెలియజేస్తున్నాను.