తగ్గిన వయోపరిమితి.. లబ్ధిదారుల్లో ఆనందం
ఆసరా పెన్షన్ల పెంపునకు సంబంధించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలుపుకున్నారు.
కె. చంద్రశేఖర రావు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలుపుకున్నారు. వివిధ వర్గాలవారికి చెల్లిస్తున్న సామాజిక పెన్షన్లను పెంచుతూ మంత్రివర్గం తీర్మానించింది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెన్షన్ల అంశంపై విస్తృతంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. పెన్షన్ల పెంపు నిర్ణయం జూన్ నెల నుంచే అమలులోకి వచ్చింది. దీనికి అనుగుణంగా లబ్ధిదారులకు పెంచిన మొత్తాన్ని అందించడంతో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది.
వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పెన్షన్ ను రూ.1,000 నుంచి రూ.2,016కు పెంచారు. దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్ ను రూ.1500 నుంచి రూ.3,016కు పెంచారు.
పెంచిన పెన్షన్లు అందించడానికి సంవత్సరానికి రూ.12వేల కోట్లు ఖర్చు అవుతుంది. దీంట్లో రూ.11,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా, రూ.200 కోట్లు మాత్రం కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది.
పెన్షన్ మొత్తం పెంచడంతోపాటు వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయో పరిమితిని 65సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామనే ఎన్నికల హామీకి అనుగుణంగా, 57 సంవత్సరాలు నిండిన పేద వృద్ధుల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను మంత్రివర్గం కోరింది. వీలైనంత త్వరలో లబ్ధిదారుల జాబితా రూపొందించి, దాని ప్రకారం పెంచిన పెన్షన్ అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
బీడీ కార్మికుల పి.ఎఫ్. కటాఫ్ డేట్ ను తొలగించాలని నిర్ణయించింది. 2019 జూలై 17 నాటి వరకు కూడా పి.ఎఫ్. ఖాతా ఉన్న కార్మికులకు పెన్షన్ అందించాలని అధికారులను ఆదేశించింది.
నూతన మున్సిపల్ చట్టానికి సంబంధించిన ముసాయిదాను మంత్రివర్గం ఆమోదించింది.