పూర్తి వ్యయాన్ని ప్రభుత్వమే భరించి, పేదలకు రెండు బెడ్ రూములు, హాలు, వంటగది, మరుగుదొడ్లు వంటి సకల సదుపాయాలతో చక్కటి విశాలమైన ఇళ్ళు నిర్మించి ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమం. శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు. నిర్వహణ కొరవడి ఎప్పుడు కూలి మీద పడతాయోనని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్న ఆ కాలనీ వాసులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ‘దసరా కానుక’గా కొత్త గృహాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆరుమాసాల్లో ఈ గృహ నిర్మాణం పూర్తిచేసి, గృహ ప్రవేశానికి కూడా తాను వస్తానని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆ పేదల ముఖాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.
అది హైదరాబాద్ నగరంలోని పద్మారావునగర్ డివిజన్‌లో గల ఐ.డీ.హెచ్. కాలనీ. ఈ కాలనీలోని 11 బ్లాకుల్లో 360 ఇళ్లు ఉన్నాయి. 1969లో ఇన్‌ఫెక్టియస్ డిసీజెస్ హాస్పిటల్ (ఐ.డీ.హెచ్) కాలనీగా దీనిని నిర్మించారు. అప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పేదల కోసం ఈ గృహాలను నిర్మించింది. నిర్వహణ కొరవడటంతో ఈ గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంత కాలం ఏదో పైపై మరమ్మతులు చేస్తూ వచ్చినా, శిథిలావస్థకు చేరిన ఈ ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాల వారు ప్రాణాలు అరచేత పట్టుకొని జీవితం గడుపుతూ వచ్చారు.
ఈ పేదల దుర్గతిని తెలుసుకున్న ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావు స్వయంగా ఐ.డీ.హెచ్. కాలనీని సందర్శించారు. నిరుపేదల పాట్లు తెలుసుకొని చలించిపోయిన ముఖ్యమంత్రి ”అర కొర మరమ్మతులు కాదు. ఇక్కడి పేదలందరికీ పక్కా గృహాలు నిర్మిస్తాం” అని హామీ ఇచ్చారు. అంతేకాదు, కాలనీని సందర్శించిన నెల రోజులకే తన హామీని అమలుపరుస్తూ, దసరా పండుగ రోజున, కాలనీ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలలో వలె పేదలకు ‘అగ్గిపెట్టె ల్లాంటి’ ఇళ్ళను నిర్మించి ఇవ్వడం కాకుండా, సకల సౌకర్యాలతో, రెండు బెడ్ రూములతో ఇళ్ళను నిర్మించి, ఉచితంగా అందజేస్తామని ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇప్పుడు ఈ గృహాలు నిర్మాణమవుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం, ఐ.డీ.హెచ్. కాలనీలో ప్రతి లబ్దిదారునికి ఒక హాలు, రెండు బెడ్ రూములు, కిచెన్, రెండు మరుగుదొడ్లను 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ కాలనీలో 396 గృహాల నిర్మాణానికి ప్రభుత్వం 36 కోట్ల 54 లక్షల రూపాయలను మంజూరు చేసింది.
మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతాం: సి.ఎం
ఐ.డీ.హెచ్. కాలనీ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలవుతాయో లేదో నన్న కొందరి అనుమానాలను పటాపంచలుచేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తామన్నారు. దళితులు, బి.సీ.లు, మైనారిటీలు ఆత్మగౌరవంతో జీవించేలా రెండు బెడ్‌రూములతో చక్కటి ఇళ్లను నిర్మించి ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ కాలనీలో షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించి, మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చెప్పారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజి, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది.
హైదరాబాద్ శివార్లలో కబ్జాకి గురైన వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని, వాటిలో కొన్నింటిని విక్రయించగా వచ్చే డబ్బుతో మురికివాడలు లేని గొప్ప నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని సి.ఎం. చెప్పారు.
”హైదరాబాద్ బస్తీల్లోని పేదలకు ఎక్కడి వారికి అక్కడే గృహాలు నిర్మించి ఇస్తాం. ఇకపై బుల్‌డోజర్లతో కూల్చివేత లుండవు” అని ముఖ్యమంత్రి హామీఇచ్చారు.
బేగంపేట – ఫతేనగర్ లింక్‌రోడ్డు ప్రారంభం
దసరా పండుగ రోజునే ముఖ్యమంత్రి శ్రీచంద్రశేఖరరావు బేగంపేట-ఫతేనగర్‌కు మధ్య నూతనంగా నిర్మించిన లింక్ రోడ్డును కూడా ప్రారంభించారు. రూ.44.5 కోట్ల వ్యయంతో 1.41 కిలోమీటర్ల పొడవున ఈ లింక్‌రోడ్డు నిర్మించారు.
గణేష్ అనే యువకుని అభ్యర్థన మేరకు సి.ఎం. నెక్లెస్ రోడ్‌లో ఉన్న అంబేద్కర్ నగర్ బస్తీని ఆకస్మికంగా సందర్శించారు. బస్తీ లోని చిన్న చిన్న సందులలో కూడా పర్యటించి, ఇరుకైన ఇళ్ళలో నివసిస్తున్న పేదల సమస్యలను ఆయన స్వయంగా తెలుసు కున్నారు. ఈ బస్తీతోపాటు పక్కనేగల వెంగళరావు నగర్ బస్తీలోని పేదలకుకూడా పక్కా ఇళ్ళు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి హామి ఇచ్చారు.