తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల వాకిళ్లు నేడు కళ్యాణ కాంతులతో కళకళలాడుతున్నాయి. ఆర్థిక ఇక్కట్ల వల్ల పేదల ఇండ్లల్లో ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఆటంకం ఎదురవకుండా చూసేందుకు కళ్యాణ లక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబారక్ పేర్లతో వివాహ పథకాలను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకాలు పేదల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద ఎస్‌సిలకు సుమారు 30 వేల మందికి, ఎస్‌టీలకు సుమారు 15 వేల మందికి, షాదీ ముబారక్ పథకం కింద ముస్లిం మైనారిటీలకు 35 వేల మందికి ఆర్థిక సాయం అందజేేశారు. ఒక్కొక్క పెళ్లికూతురుకు వివాహం కోసం 51 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో పెళ్లిళ్లకు సర్కారు నుండి సాయం అందుతుందని ఏ పేదజీవి కలలో కూడా ఊహించి ఉండరు. గతంలో ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు, కార్యక్రమాలకు, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటిస్తున్న పథకాలు, కార్యక్రమాలకు చాలా పెద్ద తేడా ఉంది. కెసిఆర్ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తోందన్న భావన అందరిలో కలుగుతోంది.
ఏ ప్రభుత్వమైనా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే పేదల జీవితాలు ఎలా నడుస్తున్నాయి? ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి? పేదల కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు వారికి ఎలా అందుతున్నాయి? అన్న అంశాలు పరిశీలిస్తే తెలిసిపోతుంది. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం గత ఇరవై నెలల నుండి అనేక పథకాలు, అనేక కార్యక్రమాలు చేపట్టింది. 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత రాష్ట్రం తీరుమారింది. పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి.
2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున దళితుల (షెడ్యూల్డ్ క్యాస్ట్-ఎస్‌సి), గిరిజనుల (షెడ్యూల్డ్ ట్రైబ్స్-ఎస్‌టి)కు కళ్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ పథకాన్ని ముస్లిం మైనారిటీలకు వర్తింప చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఎస్‌సి, ఎస్‌టిలలో 18 సంవత్సరాలు వయస్సు వచ్చిన ఆడపిల్లలకు పెళ్లి చేసేందుకు నిర్ణయిస్తే అమ్మాయి పేరుతో 51 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. ముస్లిం మైనారిటీ అమ్మాయిలకు కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేస్తే 51 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేేస్తున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన ఏ పథకమైనా అమలు చేసేందుకు కొన్ని నియమ, నిబంధనలు విధించక తప్పదు. ప్రభుత్వ నియమావళికి అనుగుణంగా ఈ పథకం అమలవుతుంది. కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసేందుకు కూడా నియమ, నిబంధనలను విధించారు. ఎస్‌సి, ఎస్‌టీ, మైనారిటీలకు చెందిన వారిలో ఏటా రెండు లక్షల రూపాయలకు మించకుండా ఆదాయం ఉన్న కుటుంబాలకే ఈ పథకం వర్తింప చేయాలన్న షరతుపెట్టారు. పెళ్లి జరిగేందుకు కనీసం నెల రోజుల ముందు అమ్మాయి, అబ్బాయికి సంబం ధించిన వివరాలను ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో పంపించాలి. ఎస్‌సిలు అయితే కమిషనర్ ఎస్‌సికి, ఎస్‌టిలు అయితే కమిషనర్ ఎస్‌టి శాఖకు, ముస్లిం మైనారిటీలు అయితే కమిషనర్/డైరెక్టర్ మైనారిటీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
పెళ్లి కూతురు, పెళ్లికొడుకు పేర్లు, ఇద్దరి ఫోటోలు (పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు) వారి తల్లిదండ్రుల పేర్లు, ఊరు/వాడ- పట్టణం, ఇంటి నెంబర్, కులం, ఉపకులం, వార్షికాదాయం, చదువు, వయస్సుకు సంబంధించి సర్టిఫికెట్టు, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు, ఆదాయం సర్టిఫికెట్టు, బ్యాంకు శాఖ, అకౌంట్ నెంబర్ తదితర వివరాలన్నింటినీ ఆన్‌లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఏ కులం వారైతే వారికి సంబంధించిన సంక్షేమ శాఖ పోర్టల్‌లో వెబ్ అడ్రసు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారం ఉంటాయి. వీటిని భర్తీ చేసి, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.
2014 అక్టోబర్ 2 తర్వాత పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు రాగానే సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు వెరిఫికేషన్ చేస్తారు. దరఖాస్తులు అందిన 15 రోజుల్లోగా నిధులను మంజూరు చేస్తున్నారు. అయితే లబ్ధిదారులు పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో అందించాల్సి ఉంటుంది. సరైన వివరాలను అందిస్తే వెరిఫికేషన్ సులువుగా చేసేందుకు వీలవుతుంది. మూడు శాఖలు కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి, పనులు తొందరగా అయ్యేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. పేదలైన ఎస్‌సి, ఎస్‌టి, ముస్లిం మైనారిటీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.