KCR‘‘మీకు కొత్త ఇండ్లు కట్టించినాంక దావత్‌ చేయాలె..దావత్‌కు నన్ను పిలుస్తరా..’’అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జిగ్రీదోస్తులాగా అడుగుతుంటే అక్కడ ఉన్న ప్రజలకు నోటమాట రాలేదు. ఇదికలా..నిజమా..అనిపించింది. వెంటనే తేరుకున్న ఓ మహిళ ‘‘పిలుస్తం సారూ..మీకు బిర్యాని పెడతం..’’ అనగానే ముఖ్యమంత్రి వారి ప్రేమకు చలించి మనస్పూర్తిగా నవ్వారు. ఈ సంఘటన పాలమూరు పట్టణంలోని పాతతోటలో చోటుచేసుకుంది. మీ సమస్యలను నాలుగు మాసాల్లో పరిష్కరిస్తా..ఇండ్లు లేనివారికి ఇండ్లు కట్టించి ఇస్త, ఇండ్ల స్థలాల కోసం పట్టణ శివారులో భూమిని కేటాయిస్తా, ప్రతి ఇంటికి నల్లా నీరు వచ్చేలా చేసి, రోజు మంచినీటిని అందిస్తా, నీటిశుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తా, సీసీ రోడ్లు, మురుగుకాలువల నిర్మాణం, మరుగుదొడ్లు నిర్మించి ఇస్తానన్నారు. మీరు ఎవ్వరికీ ఒక్కపైసా డబ్బులు ఇవ్వవద్దు, అధికారులే మీ వద్దకు వచ్చి వివరాలు సేకరించి ఇండ్లు కట్టించి ఇస్తారు.
నేను మహబూబ్‌నగర్‌ మళ్లీ వచ్చి పనులు జరుగుతున్నయో లేదో చూస్తా, పట్టణంలో చెత్త వేయడానికి డంపింగ్‌ యార్డు పెట్టిస్తా, అయిదు చోట్ల మార్కెట్లు ఏర్పాటు చేయిస్తా, మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయిస్తానని ముఖ్యమంత్రి పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు. మురికివాడలు లేని పట్టణంగా పాలమూరును తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పగానే బస్తీవాసుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇన్నాళ్ళకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి తమ మురికివాడల్లో పర్యటించడమే గొప్పగా భావిస్తున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి హామీలు ఉక్కిరిబిక్కిరి చేశాయి.
వలసలకు నిలయమె,ౖ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పాలమూరు రూపురేఖలు మార్చడానికి కంకణ బద్దుడై ఉన్న కేసీఆర్‌ జనవరి 18న పాలమూరు పట్టణంలో పర్యటించారు. అక్కడి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకోవడమే కాకుండా వాటిని వెంటవెంటనే పరిష్కరించే దిశగా అధికారులను, మంత్రులను ఆదేశించారు.
18న మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ముఖ్యమంత్రి పర్యటన రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. మొదట పట్టణంలోని పాత పాలమూరు, వీరన్నపేట, పాతతోట, రైతు బజార్‌ ప్రాంతాలలో పర్యటించి, ఆ తరువాత జిల్లాపరిషత్‌ కార్యాలయంలో అధికారులు, మంత్రులతో అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో జడ్పీ మైదానంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.
వెళ్ళిన ప్రతిచోట ప్రజల బాధలు, సమస్యలు వింటూ వెనువెంటనే వాటి పరిష్కారానికి అధికారులతో చర్చించి ఆదేశాలు జారీచేస్త్తూ వచ్చారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు 19వ తేదీ నుంచే పాలమూరులోని మురికివాడల్లో పనులు ప్రారంభమయ్యాయి. కలెక్టర్‌ శ్రీదేవి ఆధ్వర్యంలో అధికారులు కాలనీ లలోకి వెళ్ళి ఇండ్లు లేని పేదల వివరాలు సేకరించడం ప్రారం భించారు.
పాలమూరు ఎత్తిపోతల పథ కానికి శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు పథకాన్ని మంజూరు చేయడమే కాకుండా, 9వేల కోట్ల నిధులు కూడా మంజూరీ చేశారు. నీటిపారుదలశాఖా మంత్రి హరీష్‌రావు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇలా పాలమూరులో జనవరి 18న జరిగిన పర్యటనలో ఇచ్చిన హామీలను తెల్లవారి నుంచే అమలు చేయడం ప్రారంభించడంతో పాలమూరు జిల్లా ప్రజలు ముఖ్యమంత్రికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. పాలమూరు పర్యటన కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, ఎం.పి. జితేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్‌, కలెక్టర్‌ శ్రీదేవి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Other Updates