పేద బ్రాహ్మణులకు ఉపయోగపడేవిధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ దేశంలోనే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి అభిలషిస్తున్నారని రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. గోపన్నపల్లి లో నిర్మిస్తున్న బ్రాహ్మణ సంక్షేమ సదన్ కు కె.టి.ఆర్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ, ఒక సంవత్సర కాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలని అన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు మెదటి సంవత్సరం రూ.100 కోట్లు , రెండవ సంవత్సరం మరో రూ.100 కోట్లు కేటాయించామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బ్రాహ్మణులు కీలకపాత్ర వహించారని, ఉద్యమ ప్రస్థానంలో బ్రాహ్మణులు లేవనెత్తిన అంశాలపై కూడా కార్యక్రమాలు నిర్వహించామని కె.టి.ఆర్ చెప్పారు.ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచనల కు ఆనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని పరిషత్ ను కోరారు. హిందు ధర్మాన్ని పాటిస్తూ, అన్ని మాతాలను సమానంగా చూస్తున్న ఘనత దేశంలో ఒక్క కె.సి.ఆర్ కే చెందుతుందని అన్నారు. కె.సి.ఆర్. సిద్ధిపేటలో ఎం.ఎల్.ఎ గా ఉన్నప్పుడే బ్రాహ్మణ భవనాన్ని ఏర్పాటు చేశారని, అదేస్పూర్తితో బ్రాహ్మణుల సంక్షేమం కోసం విప్రహిత బ్రాహ్మణ సదన్‌ను రాష్ట్ర స్థాయిలో నేడు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్రాహ్మణుల సమస్యల పట్ల సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి అని, బ్రాహ్మణులలో అనేకమంది పేదలుగా ఉన్నట్లు తమ ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. పేద బ్రాహ్మణ పిల్లల భవిష్యత్తు కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కృషి చెయ్యాలని అన్నారు.
తెలంగాణలో ప్రధాన దేవాలయాలైన యాదాద్రి, వేముల వాడ, అభివృద్ధికి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ నిధులను కేటాయించారని, దేశంలో రాజ్యాంగ పదవిలో ఉన్నవారు, ఎవ్వరూ చేయని అయుత మహా చండీ యాగం చేశారని తెలిపారు. తెలంగాణ లో అన్ని మతాలు, అన్ని కూలాలను సమానంగా ఆదరిస్తున్న ప్రభుత్వం తమ ప్రభుత్వమని అన్నారు.
రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ఏర్పాటు చేసిందని రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా ఆదరిస్తున్నామని అన్నారు.
ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు డా.కె.వి.రమణాచారి మాట్లాడుతూ, బ్రాహ్మణ సంక్షేమ భవన నిర్మాణానికి 6 ఎకరాల స్థలాన్ని, రూ.10 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి చేతులెత్తి నమస్కరించి బ్రాహ్మణ సమాజం యావత్తూ కృతజ్ఞతలను తెలుపుతుందని అన్నారు. ఫిబ్రవరిలో ఏర్పడిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వెంటనే కార్యకలాపాలను ప్రారంభించిందని అన్నారు. రూ.10 కోట్లతో ఏర్పాటు చేస్తున్న విప్రహిత బ్రాహ్మణ సదన్ భవనంలో, విద్యార్థులకు వసతి, పీఠాధి పతులకు వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ యువతీ, యువకుల నైపుణ్య అభివృద్ధికి శిక్షణ కార్యక్ర మాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కళ్యాణాలకు కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అశుభ కార్య క్రమాలు నిర్వహించేందుకు ఒక హాలును కూడా నిర్మించ నున్నట్లు తెలిపారు. దీని స్పూర్తితో జిల్లాల్లో బ్రాహ్మణ భవ నాల నిర్మాణాలకు పలువురు దాతలు ముందుకు వచ్చారని తెలిపారు. నైతికవిలువలు పెంపొందించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, ఈ విప్రహిత భవనం వల్ల బ్రాహ్మణ సమాజానికి సంఘటిత శక్తి ఏర్పడుతుందని అన్నారు.
బ్రాహ్మణ పరిషత్ ఉపాధ్యక్షుడు జ్వాలా నర్సింహారావు స్వాగతం పలుకుతూ, బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనా విధానం అనుగుణంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు.
ప్రభుత్వ ప్రతేక ప్రతినిధి వేణగోపాలా చారి, పార్లమెంట్ సభ్యులు కె.విశ్వేశ్వర్‌రెడ్డి, కెప్టెన్ లక్ష్మి కాంతరావు, ఎం.ఎల్.సిలు పురాణం సతీశ్, రామచంద్రరావు, ఎం.ఎల్.ఎ.లు ఉడతల సతీష్ కుమార్, తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయాచితం శ్రీధర్, ఆర్ అండ్ బి ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఐ.వై.ఆర్. కృష్ణారావు , బ్రాహ్మణ పరిషత్ సభ్యులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.