డా|| నలిమెల భాస్కర్
తెలంగాణలో ”అర్తం (అర్థం)లేని బతుకు ఎర్తం (వ్యర్థం)” అనే సామెత వుంది. ఇది డబ్బు ప్రాముఖ్యాన్ని జీవితాన్ని అన్వయింపజేసి చెబుతున్నది. బతుకు బండి నడవాలంటే ధనం వుండాల్సిందే! అందుకు ”డబ్బుకు లోకం దాసోహం” అన్నారు. ఈ సమస్త ప్రపంచం ధనలక్ష్మికి బానిసత్వం చేస్తున్నది. ”డబ్బుకు లేని వాడు దుబ్బుకు కూడా కొరగాడు”-యిదో అర్థ ప్రాధాన్యాన్ని విశదీకరిస్తున్నది. హిందీలో ‘పైసా మే హై పరమాత్మ’ అని ఓ సామెత. అసలు దేవుడే డబ్బులో వున్నాడట! ధనమూలం ఇదమ్ జగత్ కదా! మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఆంగ్ల నానుడి. ‘ఇచ్చేవాడ్ని చూస్తే చచ్చేవాడు కూడా లేస్తాడు’ ఇదీ సామెతే! తెలుగులో యిచ్చేవాడు (డబ్బులు) చూస్తే చచ్చేవాడు లేస్తాడు. కన్నడంలో డబ్బులు అని వినిపిస్తే చాలు పీనుగు కూడా నోరు తెరుస్తుం దట! (హణవెందరె హెణ బాయి బడుత్తదె). ఎంత విచిత్రం! తెలుగులో చావుకు దగ్గరైనవాడు మంచమ్మీంచి లేస్తాడు. కన్నడంలో చచ్చిన పీనుగు సైతం డబ్బులు అని విన్పించగానే నోరు తెరుస్తుంది. అంత ఆశ అన్నమాట డబ్బులంటే!
తెలంగాణలో డబ్బుల్ని పైసలు అని అంటారు. పై సామెతలన్నీ పైసల ప్రాశస్త్యాన్ని చక్కగా వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో ‘పైస ముడ్లె బాగోతం’ అని సామెత. వినడానికిది కొంత అశ్లీలం ధ్వనించినా తెలంగాణ ప్రజలు పైసల పరమార్థాన్ని గొప్పగా అర్థం చేసుకున్నారనిపిస్తుంది. ఆయా భాషల్లోని సామెతలన్నీ ఒక యెత్తు-తెలంగాణ సామెత మరొక యెత్తు. ఇక్కడ బాగోతం అంటే భాగవతం మాత్రమే కాదు, మొత్తం దునియా. ‘పైసా పైసా ఏం చేస్తవే అంటే పాణమసొంటి సుట్టాన్ని పగోన్ని చేస్తా అన్నదట!’ ఇదీ సామెతే! ప్రాణ సమానమైన బంధువునీ, దోస్తునూ శత్రువుగా, దుష్మన్‌గా చేసేది డబ్బే! దీనికి అనేక దృష్టాంతాలు మన అనుభవంలో వున్నవే!
‘డబ్బుకు వాడు నానా గడ్డీ కరుస్తాడు’ అనే తెలుగు సామెత లేదా జాతీయానికి దీటుగా తెలంగాణలో ఒక మేటి పలుకుబడి వుంది. అది ‘వాడు పైసకు పి- తింటడు’ అని. ఇక్కడా అసహ్యమైన, అసభ్యమైన పదం ప్రయోగంలో వుందేమోగానీ డబ్బుల మనుషుల్ని వుద్దేశించి యింతకన్నా గొప్పగా యితర భాషల్లో చెప్పగలమా మరి? ‘నూరు అయ్యేదాకా నన్ను కాపాడు-నూరైనంక నిన్ను కాపాడుత అన్నదట పైస’ ఇది మరొక సామెత. పూర్వం వంద రూపాయలకు విలువ ఎక్కువ. వంద వరకు జమ చేస్తే, తదనంతరం ఆ వందే మనల్ని కాపాడుతుంది. డబ్బుల్ని జాగ్రత్తగా పొదుపుగా కాపాడుకుంటే అవి వడ్డీలై, చక్రవడ్డీలై మనల్ని కాపాడతాయి.
‘ధనం దాసినోనికే తెలుస్తది-లెక్క రాసినోనికే తెలుస్తది’-నిజమే యిది. పూర్వకాలంలో డబ్బుల్ని కుండల్లో, పాతరల్లో దాచేవారు. ఇప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు. ఇంకా కొంతమంది స్విసు బ్యాంకుల్లో దాస్తున్నారు. ఏమైనప్పటికీ డబ్బు దాచినవాడికి తప్ప యితరులకు సాధారణంగా తెలిసే అవకాశం తక్కువ. లెక్క కూడా అంతే! అది రాసిన వాడికే తెలుస్తుంది. నిరక్షరాస్యులే ఎక్కువగా వున్న మనదేశంలో లెక్కలు ఎవరికి తెలుస్తాయి. లెక్కలు అనగానే వైశ్యులు గుర్తుకొస్తారు, వాళ్ళు వస్తువుల్ని ఉద్దెరకు యిచ్చేటప్పుడు రాసే లెక్కలు యితరులకు తెలిసే వీలు ఎక్కడిది? నూరుదాక నన్ను కాపాడు-నూరు అయినంక నిన్ను కాపాడుత అన్నట్లే, ‘పైసకుపైస ముడివేస్తే అవ్వే పిల్లల్ని చేస్తయి’ అనే మాటతీరు తెలంగాణలో వుంది. నిజమే! ఒక పెద్ద మొత్తం జమ అయ్యేదాకా మనం పైసల్ని సమకూర్చుకుంటే అవే సంతానవృద్ధిలాగా పెరిగిపోతాయి. ‘పైసలు పిల్లల్ని చేస్తయి’ అనే మాట ఎంత కొత్తగా, కవితాత్మకంగా, సృజనశీలంగా వుంది!
ఈ ప్రపంచం మొదటినుండి ధనాన్ని యింధనంగా వాడుకుంటున్నది. ప్రపంచీకరణ తర్వాత పరిస్థితులు పూర్తిగా అధ్వాన్నమైపోయాయి. అన్ని సంబంధాలనూ ఆర్థిక సంబంధాలే నడిపిస్తున్నాయా, మార్క్స్ మహానీయుడు ఏనాడో చెప్పాడు. రక్త సంబంధాలు రిక్త సంబంధాలుగా మారినై. అశక్త సంబంధాలే అన్నీ ధనమ్ముందు, పైసలు ఎవరికీ చేదుకావడం లేదు. తెలంగాణలో అందుకే ‘అందరు పైసల మనుషులు అయిపోయిండ్రు’ అని అంటూ వుంటారు. మానవ సంబంధాలు అంతర్థానమై అంతా ధనమైపోయిన మార్కెటు/ఆర్థిక సంబంధాలు రాజ్యం చేస్తున్న రోజులివి.
డబ్బులు మా దగ్గర లేవు అని చెప్పడానికి బదులు అప్పుడప్పుడు తెలంగాణలో ‘మా యింట్ల పైసల చెట్టు వున్నదనుకుంటున్నరా ఏంది?’ అని ప్రశ్నిస్తారు. మరింత కోపాన్ని ప్రదర్శిస్తూ నా దగ్గర ‘ఒక కొత్త లేదు’ అంటారు. కొత్త అంటే హలీ పైసలు పోయి కొత్తగా వచ్చిన కల్దారు డబ్బులు అని అర్థం మొదట్లో. ఇప్పుడు డబ్బు అని క్రమంగా స్థిరపడిపోయింది. ‘నయాపైస’ అటువంటిదే! నయా అంటే కొత్త. ‘నా దగ్గర నయా కొత్త గూడ లేదు’ అనే మాట తెలంగాణలో విన్పిస్తుంది. ఇది చివరాఖరుకు, చిరు దరహాసంవంటి మాట (నయాకొత్త). ఇంకా కొందరు ‘నా దగ్గర కుచ్చులు ఉన్నయనుకుంటున్నారా?’ అని అంటుంటారు. ఈ కుచ్చులూ డబ్బులే! కొందరి యిళ్ళల్లో ‘కుక్కను కొడితె పైసలు రాల్తయి’. ఈ కుక్కను కొడితే డబ్బులు రాలడం అనేది ధనసమృద్ధిని తెల్పుతుంది.
డబ్బుల్లో ‘రూపాయి’ కీలకమైంది. డాలర్ మొదలైన వాటితోనే ఈ రూపాయి విలువను బేరీజు వేసి పెరిగిందీ లేనిదీ చెబుతారు ఆర్థిక శాస్త్రవేత్తలు. రూపాయికి పదహారు అణాలు. ఈ అణాలను వరుసగా తెలంగాణలో ఏకాన (అణ), దోవాన( రెండణాలు), తీనాన, చారాన, పాంచాన, చెయ్యాన, సాతాన, ఆఠాన, నవ్వాన, దసాన, గ్యారాన, బారాన, తేరాన, చౌదాన, పంద్రాన, సోలాన అనే వాళ్లు పూర్వం రోజులలో చారాన అంటే పావలా. తెలంగాణలో ‘పావుల’ అంటారు. ఆఠాన అంటే అర్థరూపాయి. కొంతమంది వెనుకటి రోజుల్లో సరదాగా నీకోసం చెయ్యానిస్తా అని చెయ్యి ఆనిచ్చేవారు. చెయ్యాన యిచ్చేవారు కాదు. ఇది ఓ రకం తమాష శ్లేష. ‘చారాన దావత్‌కు బారాన టాంగ’ మనకు బాగా తెల్సిన సామెతే! నూటికి నూరుపాళ్ళు అనడానికి, పదహారణాలు అవడాన్ని, తెలంగాణాలో సొలానకు సోలాన అనే వాళ్ళు. ఉదాహరణకు వాడు సోలానకు సోలాన నమ్మదగినవాడు అంటే వందశాతం నిజాయితీపరుడు అని అర్థం.