తెలంగాణకు గోదావరి బేసిన్ లో 165 టి ఎం సి లు, కృష్ణా బేసిన్లో 90 టి ఎం సి లు మొత్తం 255 టి ఎం సి లు చిన్న నీటి వనరుల కేటాయింపులు ఉన్నాయి. కాని తెలంగాణలో చిన్ననీటి వనరుల వినియోగం 90 టి ఎం సి లకు మించి లేదు. ప్రభుత్వం చేపట్టిన చెరువుల సర్వేలో రాష్ట్రంలో మొత్తం 46,500 చెరువులు ఉన్నట్టు తేలింది. ప్రభుత్వం చెరువులను దశలవారీగా పునరుద్ధరించుకొని వాటి నిల్వ సామర్థ్యాన్ని పూర్తి స్థాయికి పెంచుకోవాలని, ఈ చెరువుల కింద 25 లక్షల ఎకరాలని సాగులోనికి తీసుకరావాలని మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.
అనాది ఆదెరువులైన చెరువుల పునరుద్ధరణ ఒక తెలంగాణ ఉద్యమ అకాంక్ష. ఈ 60 ఏండ్ల సమైక్య పాలనలో చెరువు తెలంగాణ ప్రజలకు ఒక పురా జ్ఞాపకంగా మారిపోయింది. ఈ పురా జ్ఞాపకం ఒక వాస్తవం కావాలని ప్రజలు ఉద్యమం సందర్భంగా కలగన్నారు. ఉద్యమ ఆకాంక్షలు తెలిసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కలను సాకారం చేయడానికి బలమైన సంకల్పం చేసినారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని చెరువులు తెలంగాణలో నిర్మాణం కావడానికి , కరువు కాటకాలు దరిజేరని పరిస్థితులు , జలవనరులతో అలరారిన తెలంగాణకు వేర్లు కాకతీయుల విజన్ లో ఉన్నాయి. విధ్వంసమైన చెరువుల వ్యవస్థను తిరిగి పునరుద్ధరించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో సమాయత్తం అయ్యింది. అదే ” మిషన్ కాకతీయ ”. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెరువుల పునరుద్ధరణకు పెట్టిన పేరు అది. చెరువుల పునరుద్ధరణ సమగ్రంగా జరగాలని ప్రభుత్వం భావించింది. ఈ కార్యక్రమంలో ఈ క్రింది పనులని చేపట్టాలని అధికారులని అదేశించడం జరిగింది.
పూడికలు తీసి చెరువుల , కుంటల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం చెరువు కట్టను బలోపేతం చెయ్యడం చెరువు అలుగు, తూములను మరమ్మతు చెయ్యడం క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్ లను మరమ్మతు చెయ్యడం చెరువులకు నీటిని తరలించే ఫీడర్ చానళ్ళను రీ సెక్షన్ చేయడం, పూడిక తీయడం చెరువుల్లో పెరిగిన తుమ్మ చెట్లను నరికి వెయ్యడం, గుర్రపు డెక్క , లొట్టపీసు మొక్కల తొలగింపు గొలుసుకట్టు చెరువులను బాగు చేసుకోవడం తొలగించిన పూడికను రైతుల పంట భూముల్లో చల్లడం కట్ట బలోపేతానికి సరిపడే మొరం, పూడిక మట్టిని వాడుకోవడం చెరువుల శిఖం భూములను కబ్జాల బారి నుండి రక్షించడం. చెరువు కట్టపై, కింద, శిఖంలో హరితహారంలో భాగంగా చెట్లు నాటడం మొదటి దశలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోఒక పట్టణ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధిపరచడం ప్రతీ సంవత్సరం చెరువుల పునరుద్ధరణకు 9306 చెరువులను ఎంపిక చెయ్యాలని ప్రభుత్వం భావించింది. మొదటి దశలో 8217 చెరువులకు ప్రభుత్వం 2611 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 12 మార్చ్ 2015 రోజున ముఖ్యమంత్రి నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ గ్రామంలోని పాత చెరువు పునరుద్ధరణ పనులతో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి దశ పనులన్ని దాదాపు పూర్తి అయినాయి. రెండో దశలో 9000ల చెరువులకు 3000 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగింది. రెండో దశ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. చెరువు మట్టి కట్టలను వెడల్పు చేసి బలోపేతం చేయడం, చెరువుకట్టల మీద , చెరువు లోపల పెరిగిన తుమ్మ చెట్లను, లొట్టపీసు చెట్లను, గుర్రపు డెక్క తదితర పిచ్చి చెట్లను తొలగించడం, తూము, అలుగులను మరమ్మతు చేయడం, అవసరమైన చోట పునర్నిర్మాణం చేయడం, చెరువులకు నీటిని మోసుక వచ్చే కట్టు కాలువలను (ఫీడర్ చానల్స్) ను పునరుద్ధరించడం, పంట కాలువలను పునరుద్ధరించడం, చెరువు శిఖంను గుర్తించి రాళ్ళు పాతడం, చెరువు వద్ద హరిత హారంలో భాగంగా వేలాది ఈత , సిల్వర్ ఓక్, తదితర చెట్లను నాటడం జరిగింది. ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా సాగుతున్నది.
చెరువుల పునరుద్ధరణలో అత్యంత కీలకమైన పని పూడిక తొలగింపు కార్యక్రమం. ఇది రైతుల భాగస్వామ్యంతో అద్భుతంగా జరిగింది. 7 కోట్ల 50 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని రైతులు స్వచ్ఛందంగా తమ పొలాల్లోకి తరలించుకపోవడం జరిగింది. రైతులు చాలా చోట్ల తమకు సరిపడినంత పూడిక మట్టి లభించలేదని షికాయతు చేసిన సందర్భాలు , వారు పోరాడి అదనంగా పూడిక మట్టిని తరలించుకపోయినట్టు ఇంజనీర్లు సమాచారమిచ్చారు.ఈ పూడిక తీత వలన సుమారు 2.50 టి ఎం సి ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది.మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 కోట్ల రూపాయల విలువ గలిగిన పూడిక మట్టిని రైతులు స్వచ్ఛందంగా తరలించుకపోయినట్లు అంచనా. ఇది నిజంగా అపూర్వం. ప్రజల భాగస్వామ్యంతోనే మిషన్ కాకతీయ కొనసాగిందనడానికి ఇది ప్రబలమైన దాఖలా.
గత సంవత్సరం వర్షాలు లేనందున చెరువుల్లోకి నీరు రాలేదు. మిషన్ కాకతీయ ఫలితాలు మనకు అనుభవంలోకి రాలేదు. ఈ సంవత్సరం జూలై నెలలో కురిసిన వర్షాలకు అన్ని జిల్లాల్లో చెరువుల్లోకి గణనీయంగా నీరు చేరింది. వేలాది చెరువులు అలుగు దుంకినాయి. ఇప్పటివరకు గోదావరి బేసిన్ లో ఉన్న ఆదిలాబాద్ , కరీంనగర్ , వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో నీరు చేరిన చెరువుల వివరాలు ఇట్లా ఉన్నాయి. 3740 చెరువులు పూర్తి గాను, 2447 చెరువులు 50 నుండి 75 శాతం వరకు, 2455 చెరువులు 25 నుండి 50 శాతం వరకు, 10840 చెర్వులు 25 శాతం కన్నతక్కువ నీటితో నిండినాయి. అత్యధికంగా ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో చెరువులు పొంగి పొర్లినట్లు సమాచారం. అదేవిధంగా కృష్ణా బేసిన్లో ఉన్న మహబూబ్ నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో చెరువుల వివరాలు ఇట్లా ఉన్నాయి. 346 చెరువులు పూర్తి గాను, 734 చెరువులు 50 నుండి 75 శాతం వరకు, 1262 చెరువులు 25 నుండి 50 శాతం వరకు, 11,417 చెర్వులు 25 శాతం కన్నతక్కువ నీటితో నిండినాయి.
ఈ సంవత్సరం చెరువుల కింద వ్యవసాయం పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. రెండేెండ్లుగా కరువుతో విలవిలలాడిన తెలంగాణ రైతాంగం తేరుకొని నిలదొక్కుకునే అవకాశం ఉన్నది. చెరువులో నీరు నిలువ ఉండటం వల్ల భూగర్భజలాలు పెరుగుతాయి. బోర్ల కింద వ్యవసాయం పెరుగుతుంది. ప్రజల, పశువుల తాగునీటి అవసరాలు తీరుతాయి. చెరువు పూడిక మట్టి రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చునని, పూడిక మట్టి వాడకం వల్ల 50 శాతం రసాయనిక ఎరువుల (యూరియా, డిఎపి) వినియోగాన్ని తగ్గిస్తుందని, పంట దిగుబడి 15% – 20% పెరుగుతుందని ఇక్రిశాట్ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆ మేరకు రైతులకు ఆదాయం పెరుగుతుంది. తెలంగాణలో చెరువు సాంస్కృతిక కేంద్రం కూడా. బతుకమ్మ , కట్టమైసమ్మ బోనాలు , బంజారాల తీజ్ , శ్రావణ మాసంలో సామూహిక వన భోజనాలు, బెస్తల గంగ జాతరలు తదితర పండుగలకు చెరువు అదెరువుగా ఉంటది. ఒక్క మాటలో చెప్పాలంటే చెరువు గ్రామ ఆర్థిక , సామాజిక,సాంస్కృతిక వికాసానికి దోహదం చేస్తుంది. మిషన్ కాకతీయ ఆ దిశగా అడుగులు వేస్తున్నది.
– శ్రీధర్ రావు దేశ్ పాండే