తెలంగాణ గ్రామీణ ప్రజల భాషా వ్యవహారంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వినిపించే వాక్యవిన్యాసమిది. ఈ వాక్యాన్ని ఇవాల్టి ఆధునిక ప్రమాణ భాషలోనికి మార్చుకుంటే, అది ఇలా తయారవుతుంది. ”బొక్కలో నుండి శోధించుకొని వస్తాడు”. మరి దీని అర్థం ఏమిటి? ఏ సందర్భాల్లో భాషావ్యవహర్తం నోట యిది దొర్లుతుంది?

మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న ఒక వ్యక్తి దుర్లభమైన దుస్సాధ్యమైన పని చేశాడనుకోండి. పైగా ఎవరూ కనుక్కోవడానికి వీలులేని ప్రదేశంలో మనం దాచిన వస్తువును పసిగట్టాడనుకోండి. మనం ఎంత పకడ్బందీగా ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుని గుప్తంగా వుంచినా అట్లా వుంచబడిన పదార్థాల్ని అవలీలగా కనిపెట్టే మనుషులు కొందరుంటారు. ఎవరికీ ఎంత వెతికినా శోధించినా దొరకని వస్తువును సులభంగా తెలుసుకుంటారు. అదుగో… అటువంటి మనిషిని ఉద్దేశించి ”అబ్బో! వాడు మా దండి మనిషి. పొక్కలకెల్లి సోదిచ్చుకత్తడు” అని అంటుంటారు. ఈ వాక్యానికి వున్న అర్థతాత్పర్యాలు తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ”పొక్క” అంటే రంధ్రం, బొరియ, కలుగు, బెజ్జం, గొయ్యి (చిన్న పాటిది) వంటి అర్థాలు గల పదం. ”కెల్లి” అంటే ”నుండి” అని. ఇక.. సోదిచ్చుకత్తడు”ను సోదిచ్చేక + అత్తడు అని విడదీయాలి. ”సోదిచ్చుక” అంటే ”శోధించుకొని” (పరిశోధించుకొని, వెతికి, గాలించి మొదలైన అర్థాలు) అనీ, ”అత్తడు” అంటే ”వస్తాడు” అనీ అర్థం చేసుకోవాలి.

మొత్తమ్మీద ఆ మనిషెవడో వాడు దాచబడిన వస్తువో లేక ఎలుకనో లేదూ పామునో, ఎండ్రికాయనో.. ఆ కలుగులోనుండి వెతికి బయటికి తీసుకుని వస్తాడని తాత్పర్యం. కష్ట సాధ్యమైన గూఢమైన పనిని సుసాధ్యం చేసుకునే తీరు ఈ వాక్యంలో వుంది. ఇట్లా పొక్కలో నుండి శోధించుకుని తీసుకురావడం అందరి వల్లా అయ్యేపని కాదు. ఇది అసలు సిసలు తెలంగాణ పలుకుబడి. ఈ ”వాక్యరీతి” తెలంగాణేతర తెలుగు ప్రాంతాల్లో వుండకపోవచ్చును. భాషా పరంగా చూసినా ఇది నూటికి నూరుపాళ్ళు, సొలానకు సోలాన తెలంగాణ మాటతీరు. రంధ్రం, కలుగు మొదలైన అర్థఛాయలతో వున్న ”పొక్క” పదహారు అణాల తెలంగాణ పదం. దీన్ని ఆంధ్రలో ”బొక్క”గా పిలుస్తారు. నిజానికి ”పొక్క” మూలపదం. ఆ పదం మొదట వున్న అక్షరం (పరుషం) సరళంగా ఆంధ్రలో కనిపిస్తున్నది. తెలంగాణ ”కడప” ఆంధ్రలో ”గడప” అయినట్లు. ఇక.. ”కెల్లి” అనేది ప్రత్యయం. ఇది తెలంగాణకు మాత్రమే చెందిన ప్రత్యేక ప్రత్యయం. ఆంధ్ర ప్రాంతంలో ”నుండి” వుంది. తెలంగాణలో ”నుండి”కి ”నుంచి, సంది, కెల్లి, కేంచి, కాంచి” మొదలైన సమాన ప్రత్యయాలున్నై.

మరో విషయం ఏమిటంటే, ”పొక్కల కెల్లి” అనేదాన్ని ”పొక్కలకు వెళ్ళి” అని విడదీసే అవకాశం వుందా ఆలోచించాలి. అర్థభంగమైతే కలగడంలేదు. అంటే ”కెల్లి” అనే ప్రత్యయం ”కం+కెళ్ళి” నుండి ఏర్పడి వుంటుందని చెప్పే అవకాశం వుంది. మరో మాట – ”పొక్కల కెల్లి” అనేటప్పుడు ఈ ఐదక్షరాల పదంలో ”ల” అనే ఒక వర్ణం వుంది. దీనికి ”లో” అని అర్థం. తెలంగాణ ప్రత్యేక ”లో” లో లేదు. ”ల”లో వుంది. జేబుల ఎన్ని పైసలున్నై?” అనే ప్రశ్నిస్తారు గానీ, జేబులో ఎన్ని డబ్బులున్నాయి?” అని తెలంగాణ గ్రామీణులు సాధారణంగా అడగరు కనుక పొక్క, ల, కెల్లి.. ఈ మూడూ తెలంగాణ గంధంతో కూడుకున్నవే! పోతే.. ఆ తర్వాతి ”సోదిచ్చుకత్తడు” గురించి చెప్పుకోవాలి. ”సోదిచ్చుక” లోన ”సో” అనే అక్షరం ”శో” నుండి వచ్చింది. మరి ఎందుకిలా మారింది? ”శో” అనే వర్ణం తెలుగు వర్ణం కాదు. శ,ష, ఖ మొదలైనవి. తెలుగు భాషలోనికి వచ్చి చేరిన సంస్కృత అక్షరాలు. తెలుగు అక్షరం ”స”. తెలంగాణ ”సోదిచ్చుక” లోని రెండవ అక్షరం ”ది”. నిజానికి ”ధి” అని వుండాలి. కానీ తెలుగు భాషలో ఒత్తులు (మహాప్రాణాలు) లేవు. అవి సంస్కృత భాష నుండి వచ్చిన వర్ణాలు. అందుకే తెలంగాణ వాళ్ళు ”శోధించుక” అనడం లేదు, ”సోదిచ్చుక” అంటున్నారు. తెలుగుతనం ఉట్టిపడేలాగా.

ఇక.. ”శోధించుక అనే పదంలోని ”సున్నా” తెలంగాణ ”సోదిచ్చుక”లో లేకుండా పోయింది. ”శో” ”సో”గా మారడం, ”ధా” ”ది”గా కావడం తెలుగు భాషా లక్షణమైతే, ”ంచు” అనేది ”చ్చు”గా తయారవడం తెలంగాణ భాషా స్వభావం. ”వీడు నవ్వించి నవ్వించి చంపుతాడు” అనే వాక్యం తెలంగాణలో ”వీడు నవ్విచ్చి నవ్విచ్చి చంపుతడు” అని అవుతుంది. వ్యాకరణ పరిభాషలో చెప్పాలంటే ”ఇంచుకాగమం” తెలంగాణలో ”ఇచ్చుకాగమం” అవుతుంది. అదే కన్నడంలో ”ఇసుకాగమం”. కన్నడంలోని ”శోధిసు” అనే పదం తెలుగులో ”శోధించు” రూపంలో కన్పిస్తే, తెలంగాణలో ”సోదిచ్చు”లాగా మారుతుంది. ”వాడు అల్లునికి ఇల్లు కట్టిచ్చి యిచ్చిండు అంటారు గానీ, ”కట్టించియిచ్చాడు అనరు. శోధించు”లోని ”చు” తెలంగాణలో ద్విత్వరూపంలో ”చ్చు” గా ఉంటుంది. ఇదీ తెలంగాణ భాషాగుణమే! మసి (మస్సి), గసగసాలు (గస్సాలు), వేళ (యాల్ల), దయగల తల్లి (దయగల్ల తల్లి) మొదలైన పదాల్లోనూ ఎక్కువ ద్విత్వం వచ్చిందో పాఠకులు సులభంగా కనిపెట్టగలరు. ”సోదిచ్చుకత్తడు”లోని ”అత్తడు”, ”వస్తాడు” నుంచి వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో శోధించుకొని వస్తేనే గాని ”పొక్కల కెల్లి సొదిచ్చుకత్తడు” అనే తెలంగాణ వాక్యరీతికి అర్థస్ఫురణ కలగదు.

– డా|| నలిమెల భాస్కర్‌

Other Updates