– డా. నలిమెల భాస్కర్
అట్లాగే తెలుగువాడికి తన ఇంటి భాషపై, తన సొంత మాటపై కొంత చులకన భావం వుందేమో! తల్లిని ”అవ్వ” అనే దానికి బదులు ”అమ్మ” అంటాడు. ఇంకా ముందుకు వెళ్లి ”జననీ”, ”మాత” అని వ్యవహరిస్తాడు. ”బువ్వ” అని పలుకక ”అన్నం”, ”ఆహారం” ”భోజనం” అని వినియోగిస్తాడు మాటల్ని. తెలుగు భాషలోని ‘చెట్టు’కు బదులు ‘వృక్షం’ అంటే ఉదాత్తంగా వుందనుకుంటాడు. ‘గుట్ట’ను పర్వతం చేస్తాడు. ‘పిట్ట’ కన్నా ‘పక్షి’ అనే మాట వినసొంపుగా వుంటుంది. తెలుగువాడికి వాస్తవానికి జనని, మాత, అన్నం, ఆహారం, భోజనం, వృక్షం, పర్వతం, పక్షి.. యివి తెలుగు మాటలు కావు. ఇవి సంస్కృత పదాలు. పొరుగింటి పుల్లకూరలు. అయినా తెలుగు వాళ్ళకు అవి ఆయా కారణాలచేత తియ్యరాని తియ్యగూరలయ్యాయి. ఇతర భాషా పదాల మీద మోజు కూడా తెలుగులోనికి సంస్కృతాలు వచ్చి చేరడానికి ఒక కారణమని చెప్పడం సారాంశం.
పోతే… తెలంగాణ తెలుగులో, మరీ ముఖ్యంగా పల్లె ప్రజల భాషా వ్యవహారంలో సంస్కృతపదాలు ఎట్లా దొర్లుతున్నాయో పరిశీలించడం యిక్కడ పరిమితి.
‘ఆ పొల్ల తండ్రితోని, నేను ఆ పిల్లగాన్నే చేసుకుంట అని మొకమ్మీదనే చెప్పింది. విన్నోల్లందరు చిత్రపడ్డరు, పిల్ల దైర్నానికి’ ఈ వాక్యాల్లోని ‘చిత్రపడ్డరు’ అనే మాటకు ఆశ్చర్యపోయారు, నివ్వెరపోయారు అని అర్థాలు. చిత్ర పడ్డరు అచ్చంగా తెలంగాణ పలుకుబడి. ఆ మాటలోని ‘చిత్ర’ సంస్కృత ‘చిత్రం’ నుండి వచ్చింది. మరి… చిత్రం అంటే ఆశ్చర్యమే! ‘ఆయినె మన మాట విననే వినడు. ఆయినె అన్నదే సాగాల్నని అంటడు. ఏదైనా చిత్రం చేస్తడు’ వాక్యాల్లోని ‘చిత్రం చేసుడు’ అంటే ఆయనది మరీ విడ్డూరం అనీ, వింత గొలిపే ప్రవర్తన అనే అర్థస్ఫురణ. అంతేగాక, ”ఏం యిచ్చంత్రంరా! చెప్పింది విననే వినవు’ వంటి ‘ఇచ్చంత్రం’ చాలా మంది నోట విన్పిస్తుంది. ఇది సంస్కృత ‘విచిత్రం’లోంచి వచ్చింది. ‘విచిత్రం’ పదంలోని మొదటి ‘వి’ తెలంగాణలో ‘ఇ’ అయ్యింది. ఇలా అవటం విచిత్రం ఏమీ కాదు – సహజమే! నండూరి ఎంకి పాటల్లోని ‘ఎంకి’ ఎక్కడిది! అది ‘వెంకి’ కాదూ ! ఇట్లా పదాది వకారలోపం జానపదాల్లో సాజం. అది వాళ్ళ ఉచ్ఛారణా విధేయ నైజం. సరే! విచిత్రం సహజపరిణామ ఫలితంగా ఇచిత్రమై తదుపరి ఇచ్చిత్రమై ఆ తర్వాత ఇచ్ఛత్రమై చివరికి ఇచ్చంత్రంగా మారింది. ”ఇచ్చ” తర్వాత తెలంగాణ ప్రజలకు ఏ ‘ఇచ్ఛ’ వుందో ఏమిటో గాని సున్నా వచ్చింది. ఇట్లా పూర్ణానుస్వారం రావడం తెలంగాణ భాషా లక్షణాల్లో ఒకటి.
‘కొబ్బరి సూరు గీకినవా మంజర్ పీటమీద. అయ్యో! గింతగనం సూరు సూరు అయ్యిందేమిటి?” ఈ వాక్యాల్లోని ‘సూరు’ ఏమిటి? ఇది సంస్కృత ‘చూర్ణము’ శబ్ద భవం. అంటే అర్థం ‘పొడి’ అని. ప్రమాణ భాషలో ‘తురుము’ అని. (తెలంగాణ మంజర్‌పీట ప్రమాణ భాషలో తురుం పీట) శబ్దరత్నాకర నిఘంటుకారుడు బదుజనపల్లి సీతారామాచార్యులు ‘చూరును’ దేశ్యపదమనీ, యుగళం అని పేర్కొన్నాడు. (యుగళం అంటే అటు దేశ్యము ఇటు వైకృతం). వైకృతంలో సంస్కృత భవం సైతం ఓ భాగం. మొత్తమ్మీద సంస్కృత ‘చూర్ణం అనే దాన్ని తెలుగు వాళ్ళు పొడి పొడిచేశారు. చూరు, సూరు అన్నారు. వీళ్ళు శూరులే మరి!
బూమవ్వ చాష్టలు ఏం మంచిగలెవ్వు అనే వాక్యంలోని ”చాష్ట” ఏమిటో కాదు అది సంస్కృత ‘చేష్ట’. అంటే పని అని అర్థం ఎంత చక్కగా చేష్టలోని ఏత్వాన్ని చాష్టలో తలకట్టు దీర్ఘం చేశారో చూడండి! మరొక మాట ”ఏమో పేద్దగ సోద్యం చేస్తున్నవేందిరా?” అని ప్రశ్నార్థక వాక్యంలోని ”సోద్యం” సంస్కృతంలోని ”చోద్యం” నుండి పెట్టింది. చోద్యమంటే ఆశ్చర్యం. విడ్డూరం అని అర్థఛాయలు. ‘ఏమో బాగసోద్యం చేస్తున్నవేందే?” అనడంలో అంతగా పట్టించుకోనవసరం లేదని ఒక పనిని, ప్రశ్నించడం.
సంస్కృతంలో ఛత్రం అని ఓ మాట వుంది. దీనికి అనేకార్థాలువున్నప్పటికీ ప్రసిద్ధమైనది మాత్రం గొడుగు అని. తెలంగాణలో గ్రామీణులు, పెద్ద తరంవాళ్ళు ఇప్పటికీ ‘చెత్రి తేపో’ అంటుంటారు. చెత్రికి మాతృమూర్తి ఛత్రం. ఈ గొడుగు గురించి ఒక భవన నిర్మాణంలో దశల వారి పనులుంటాయి. నేలను చదును చేసి గుంతలు తవ్వి ఫుట్టింగ్‌తో పిల్లర్లు నిలిపి బీముల్ని నిలబెట్టి స్లాబ్ వేస్తారు. ఇక్కడ ”స్లాబ్”ను పట్టించుకుందాం. అది ఆంగ్లం. తెలంగాణలో దీన్ని ‘చెత్తు’ అంటారు. ‘చెత్తు పడ్డదా? పడ్డదంటే జెర్ర నీడ అయినట్లే’ అంటుంటారు. ఇలా బోలెడు పనులున్నప్పటికీ తెలంగాణ ‘చెత్తు’కి మూలం ‘ఛది’. అది సంస్కృతం అర్థం ఇంటికప్పు అని. ఛది క్రమంగా ఛత్ అయ్యి చెత్తు అయ్యింది ప్రజల చిత్తానికి అనుగుణంగా.
‘పైపుకు చిత్రం పడ్డది. జెర్రంత ఏమన్న టేప్ ఎయ్యాలే నీల్లు కారకుండ’ అనే మాటల్లో ‘చిద్రం’ వుంది. ఇది సంస్కృత ‘ఛిద్రం’ నుండి వచ్చింది. ఛిద్రం అంటే రంధ్రం అని అర్థం.
సంస్కృతంలో ‘బింగలం’ అనే పదం ఒకటుంది. దీనికి మాంసము అని ఒక అర్థం. జనం లేని చోటు అని మరో అర్థం. జనం లేని స్థలం అనగానే ఎడారి, అడవి మొదలైన నిర్మానుష్య ప్రదేశాలు స్ఫురిస్తాయి. మరి.. తెలంగాణలో అడవిని చాలామంది ‘జెంగల్’ అంటారు. ‘వీడు జెంగిలోడు’ అని వ్యవహరిస్తారు. కొంచెం అనాగరికున్ని. ‘వీల్లు జెంగలాతోల్లు’ అని పేర్కొంటారు. అటవీ శాఖా సంబంధిత అధికారుల్నీ, వుద్యోగుల్నీ ”ఇది జెంగల్ పెట్టె” అంటే అటవీ ప్రాంతం అని అర్థం. జెంగిల్ జెంగిలి చేసుడు అంటే అనాగరిక పనులని అర్థం. ‘అది ఓ అంటే ఓ అనే ఘనా జంగల్’ అంటే భీకరాటవి అని. కనుక తెలంగాణ ‘జెంగల్’ సంస్కృతం ‘బింగలం’ నుంచి జన్మించిందేమో మరి! ఆ జంగలమే హింది ‘జంగల్’కు మాతృకై వుండాలి.