గటిక విజయ్ కుమార్
అంతర్రాష్ట్ర సంబంధాల్లో దేశానికి
తెలంగాణ ఆదర్శం
ఇచ్చిపుచ్చుకునే ధోరణితో బలపడుతున్న స్నేహబంధం
దీర్ఘకాలిక వివాదాలకు తెర సరికొత్త సంప్రదాయాలకు శ్రీకారం
ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మొదటి రోజునే ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇతర రాష్ట్రాలతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఒక తల్లి పిల్లల్లాగానే భారతదేశంలో రాష్ట్రాలు ఒకరికొకరుగా ఉంటే అన్ని రాష్ట్రాలు బాగుంటాయని నమ్మిన తెలంగాణ ప్రభుత్వం అందుకనుగుణంగా అడుగులు వేస్తున్నది. ఇరుగు పొరుగు రాష్ట్రాలు సఖ్యతగా ఉంటే కలిగే ప్రయోజనాలు ఎలా
ఉంటాయో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికి చాటిచెప్పింది. సహజ సిద్ధమైన సరిహద్దు రాష్ట్రాల మధ్య ఉండే దీర్ఘకాలిక సమస్యలను ప్రజా ప్రయోజనాల దష్ట్యా సత్వరం పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపింది. దేశంలో మరే రాష్ట్రానికి ఏ కష్టం వచ్చినా తమ వంతు సాయం అందించడానికి తెలంగాణ రాష్ట్రం ప్రతీ సందర్భంలో ముందుండి నడిచింది.
తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలు. వాటితో సాగునీరు, విద్యుత్, రవాణా తదితర రంగాల్లో పరస్పర సహకార సంబంధాలు నెరిపింది. దేశంలో ఏ రాష్ట్రానికి ఎప్పుడు విపత్తు సంభవించినా తెలంగాణ రాష్ట్రం ఆపన్న హస్తం అందించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నదీ జలాల పంపిణీ విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా రాష్ట్రాలతో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివాదాలుండేవి. ఈ వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహ సంబంధాలు నెరపాలని నిర్ణయించుకుంది.
మహారాష్ట్రతో దీర్ఘకాలిక ఘర్షణలకు తెర – చారిత్రక ఒప్పందం
గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ – మహారాష్ట్ర మధ్య విభేదాలుండేవి. ఫలితంగా గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై తలపెట్టిన ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. నాలుగు దశాబ్దాల పాటు ఈ వివాదాలు పరిష్కారానికి నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక వివాదాలకు తెరదింపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రెండు సార్లు మహారాష్ట్రకు వెళ్లి, అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చలు జరిపారు. 2016 మార్చి 8న మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై రెండు రాష్ట్రాల మధ్య ఐదు బ్యారేజిలు నిర్మించడానికి మార్గం సుగమమయింది.
చత్తీస్ గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. వెయ్యి మెగావాట్లను ఛత్తీస్‌గఢ్ నుంచి పొందేందుకు 2015 నవంబర్ 3న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సమక్షంలో రెండు రాష్ట్రాల విద్యుత్ అధికారులు విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌తో సఖ్యతను చొరవ
రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసుందాం, అని తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ పదే పదే చెప్పారు. పొరుగు రాష్ట్రమే కాకుండా, దాదాపు ఆరు దశాబ్దాలు కలిసున్న ఆంధ్ర ప్రజలకు మేలు చేసే విధంగానే తెలంగాణ రాష్ట్రం నడుచుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర విషయాల్లో తన సానుకూలతను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు వ్యక్త పరిచారు. 2015 అక్టోబర్ 23న విజయవాడ సమీపంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరం ‘అమరావతి’ శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
శుభాకాంక్షలు తెలిపి, ఆ రాష్ట్రానికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఆంధ్రపదేశ్‌కు ప్రత్యేక హోదా
ఇవ్వాలని వాదించిన కేసీఆర్
పార్లమెంటులో విభజన బిల్లుకు ఆమోదం తెలిపే సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ కూడా ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. బిజెపి అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమించారు. ఈ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో 2018 మార్చి 3న జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 2017 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనే అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చలో టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ఆర్థిక సంఘం చెప్పలేదని అన్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై లోక్ సభలో జరిగిన చర్చలో పాల్గొన్న టిఆర్‌ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత కూడా ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలుగా విడిపోయినా, ప్రజలుగా కలిసుందామనే నినాదానికి కట్టుబడి టిఆర్‌ఎస్ ప్రభుత్వం, నాయకులు ఏపికి ప్రత్యేక హోదా కోసం మాట్లాడారు. 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎపికి ప్రత్యేక ¬దా ఇవ్వాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.
తెలంగాణ చొరవతో
అపెక్స్ కమిటీ సమావేశం
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల నిర్మాణం, నదీ జలాల పంపిణీ అంశాల్లో పలు సమస్యలు తలెత్తాయి. తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అనుమానాలు నివత్తి చేసేందుకు అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్ కమిటీ తొలి సమావేశం 2016 సెప్టెంబర్ 21న ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో రెండు గంటలపాటు సాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి తదితరులు తెలంగాణ తరపున పాల్గొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై నెలకొన్న అనుమానాలను పరస్పరం నివత్తి చేసుకోవడంతో పాటు, భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా ఉండే మార్గాలపై ఈ సమావేశంలో ఆశాజనకమైన చర్చ జరిగింది. ఆరు అంశాలపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
విశాఖకు రూ.18 కోట్ల విద్యుత్ పరికరాలు
2014 అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హుదూద్ తుఫాన్ వచ్చింది. తుఫాను బీభత్సం వల్ల విశాఖపట్నం అతలాకుతలం అయింది. ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఏపికి అండగా నిలిచింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.18 కోట్ల విలువైన 530 ట్రాన్స్ ఫార్మర్లు, 28,500 కరెంటు స్తంభాలు, 900 కిలోమీటర్ల వైర్లు పంపింది. వాటిని అమర్చ డానికి విద్యుత్ అధికారులు, సిబ్బందిని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పంపింది. తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రకు వెళ్లి అక్కడ కరెంటు సరఫరా పునరుద్ధరించి వచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు నిర్వహించడానికి మండలానికో ఐఎఎస్ అధికారిని నియమించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు తెలంగాణ నుంచి ఐదుగురు ఐఎఎస్ అధికారులను ఏపికి పంపింది. ఆ అధికారులు తమ సిబ్బందితో పాటు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
కేరళ రాష్ట్రానికి ఆపన్నహస్తం
2018 ఆగస్టు నెలలో కేరళలో భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. చాలా గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వేల ఇండ్లు నేలమట్టమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేరళకు అండగా నిలిచింది. రూ.25 కోట్ల నగదును పంపింది. నీటిని శుద్ధి చేయడానికి రూ.2.5 కోట్ల విలువైన ఆర్వో మిషన్లు పంపింది. వంద టన్నుల బియ్యాన్ని పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ ఒక రోజు వేతనాన్ని వరద సహాయక చర్యల కోసం పంపించారు. తెలంగాణ రాష్ట్రం తరుపున హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి 2018 ఆగస్టు 19న త్రివేండ్రం వెళ్లి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసి రూ.25 కోట్ల చెక్కు అందించారు.
రాజస్థాన్‌తో విద్యుత్ ఇచ్చిపుచ్చుకునే ఒప్పందం (పవర్ బ్యాంకింగ్ విధానం)
మొదట్లో తీవ్ర విద్యుత్ కోతలతో ఇబ్బంది పడిన తెలంగాణ రాష్ట్రం నాలుగున్నరేళ్లు గడిచే సరికి మరో రాష్ట్రానికి విద్యుత్ అందించే స్థాయికి చేరింది. 2018 నవంబర్ మాసంలో రాజస్థాన్ లో విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో తెలంగాణ రాష్ట్రం రెండు నెలల పాటు 500 మెగావాట్ల చొప్పున విద్యుత్ అందించడానికి సిద్ధపడింది. తెలంగాణలో డిమాండ్ ఉండే మార్చి, ఏప్రిల్ మాసాల్లో తిరిగి రాజస్థాన్ 500 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేస్తుంది. ఇలా రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో విద్యుత్ ఒప్పందాలు జరిగి, దౌత్య సంబంధాల్లో కొత్త సంప్రదాయానికి తెరతీశాయి. తెలంగాణ ప్రభుత్వం చొరవతో నిర్మించిన వార్ధా-డిచ్ పల్లి 765 కెవిఏ డిసి లైను ద్వారా రాజస్థాన్ తో విద్యుత్ ఇచ్చిపుచ్చుకోవడం సాధ్యమైంది. తెలంగాణలో మిగులు విద్యుత్ ఉన్నప్పుడు ఆ కరెంటును రాజస్థాన్ లో దాచుకుని, తిరిగి తెలంగాణకు అవసరమైనప్పుడు ఆ రాష్ట్రం నుంచి పొందే పవర్ బ్యాంకింగ్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్నది.
మహబూబ్ నగర్ దాహార్తి తీర్చిన కర్ణాటక
2016 ఎండాకాలంలో మహబూబ్ నగర్ జిల్లాలో మంచినీటికి తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పాటు కష్ణా బేసిన్ లోని జలాశయాలన్నీ ఎండిపోయాయి. చుక్క నీరు లేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం తరపున నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కర్ణాటకకు వెళ్లి అక్కడి నీటి పారుదల శాఖ మంత్రి ఎంబి పాటిల్ తో చర్చలు జరిపారు. దాని ఫలితంగా కర్ణాటక ప్రభుత్వం నారాయణ్ పూర్ డ్యామ్ నుంచి 1 టిఎంసి నీటిని మహబూబ్ నగర్ ప్రజల దాహార్తి తీర్చడం కోసం వదిలారు.
2019 వేసవిలో మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు తీవ్ర మంచినీటి సమస్య ఎదుర్కొన్నారు. జలాశయాలన్నీ ఎండిపోయాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామితో మాట్లాడారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 2.5 టిఎంసిల నీళ్లను జూరాల ప్రాజెక్టుకు తరలించింది. దీంతో మహబూబ్ నగర్ ప్రజల మంచినీటి కష్టాలు తీరాయి.
కర్ణాటక రైతుల పంటలు కాపాడిన తెలంగాణ
కర్ణాటకలోని తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో 2018 జనవరి నెలలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. పంటలు ఎండిపోయే పరిస్థితి రావడంతో రైతులు ఆందోళన చెందారు. ఆయకట్టు కాపాడుకోవడానికి, తాగునీటి అవసరాల కోసం కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ సహకారం కోరింది. తుంగభద్ర జలాల వాడకంపై హైదరాబాద్ లోని జలసౌధలో 2018 జనవరి 4న మంత్రి హరీశ్ రావుతో కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేల బందం చర్చలు జరిపింది. రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) లో తెలంగాణకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు అనుమతివ్వాలని కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర నీటిని వాడుకోవడానికి అనుమతిస్తే.. దాని బదులుగా జూరాలకు నీటిని విడుదల చేస్తామని కర్ణాటక హామీ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కోరినా నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు 2 టీఎంసీల నీరిస్తామని మాట ఇచ్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఆర్డీఎస్ ద్వారా కర్ణాటకకు 1.3 టిఎంసిల నీటిని అందించి, పంటలు కాపాడింది.
ఒడిషా కరెంటు కష్టాలు తీర్చిన తెలంగాణ
2019 మే మొదటి వారంలో ఫోణి తుఫాను ఒరిస్సా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. 16 జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. కరెంటు సరఫరా పునరుద్ధరణ విషయంలో సాయం చేయాల్సిందిగా ఒరిస్సా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావుతో మాట్లాడి కరెంటు పునరుద్ధరణ పనుల్లో భాగం పంచుకోవాలని కోరారు. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెందిన దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు ప్రత్యేక వాహనాల ద్వారా మే 7న ఒరిస్సా బయలుదేరి వెళ్లారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన పనిముట్లను కూడా తమ వెంట తీసుకెళ్లారు. ఆహార సామాగ్రి, గుడారాలు కూడా వెంట తీసుకెళ్లారు. ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్న వారు అక్కడే గుడారాలు వేసుకుని, వండుకుని తిన్నారు. కరెంటు లైన్లకు అడ్డంగా పడిన చెట్లను తొలగించడం, కరెంటు స్తంభాలను లేపి నిలబెట్టడం, ఒరిగిపోయిన వాటిని సరిచేయడం, కూలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లను పునురుద్ధరించడం, చెడిపోయిన ట్రాన్స్ ఫార్మర్లను మరమ్మతు చేయడం, తెగిపోయిన వైర్ల స్థానంలో కొత్త వైర్లు బిగించడం లాంటి పనులు చేశారు. వర్షం ఆటంకపరుస్తున్న ప్పటికీ నిర్విరామంగా పనులు చేశారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌తో పాటు, పూరి జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.