వి.ప్రకాశ్‌

నిజాం పాలనలో తెలంగాణ ప్రాంత ప్రముఖ ఇంజనీర్‌ నవాబ్‌ అలీ జంగ్‌ బహదూర్‌ రూపొందించిన గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు పథకం అనేక మార్పులకు లోనై ఆరు జిల్లాల్లో 28 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యాన్ని, రెండు జిల్లాల్లో 5.7 లక్షల ఎకరాలకు కుదించి పోచంపాడు పేరుతో 1963 జూలై 26న అప్పటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు. తదనంతరం బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రతి ఏటా అవసరమైన నిధులు కేటాయించకపోవటం, యంత్ర పరికరాలను, వాహనాలను సిబ్బందిని శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించడం, తదితర కారణాలవల్ల నిర్మాణంలో చాలా ఆలస్యమైంది. 1960 ప్రారంభం నుండి ఉధృతంగా సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం యెడ ప్రభుత్వ వివక్షను ప్రశ్నించింది. తెలంగాణ ప్రాంతీయ కమిటీ, తెలంగాణ శాసన సభ్యులు, వామపక్ష పార్టీల శాసన సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రొ. జయశంకర్‌ సాగునీటి రంగంపై రాసిన వ్యాసంలో పోచంపాడు ప్రాజెక్టు యెడ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షను ప్రజలకర్థమయ్యేలా వివరించారు. వీటి పర్యవసానంగా ఏడాది కాలంగా 7.75 కోట్లు నిధులను కేటాయించి, త్వరత్వరగా పనులు కొనసాగించి ప్రధాని ఇందిరను సంతృప్తి పర్చడానికే అనట్లుగా హడావిడిగా దక్షిణ కాల్వ ద్వారా 40వేల ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తూ 1970 జూలై 24న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.

నిధుల కొరతతోనే జాప్యం – ముఖ్యమంత్రి

పోచంపాడు ప్రాజెక్టు దక్షిణ కాల్వలోకి సాగునీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ”ఈ ప్రాజెక్టు యింతకు ముందే రూపు దాల్చవలసింది. అయితే నిధుల కొరత వల్ల అలా జరుగలేదు. ఆంధ్ర – తెలంగాణా ప్రాంతాలకు కూడా ప్రయోజన కారియగు నాగార్జున సాగర్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమైనాయి. భారత ప్రభుత్వం నిర్మాణం ఎక్కువ భాగం పూర్తి అయిన ప్రాజక్టులకే నిధులు సహాయం ఇస్తున్నది. ఈ కారణంగానే పోచంపాడు ఆలస్యమైంద”ని అన్నారు.

”రూ. 90 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు తెలంగాణలోని నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో 5.7 లక్షల ఎకరాల భూమికి నీటిపారుదల సౌకర్యం సమకూర్చగలదు. ప్రాజెక్టు పూర్తయితే 73.6 కోట్ల విలువగల 10.96 టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగలవు. దీని వలన యావద్భారత దేశానికీ ప్రయోజనం చేకూరగలద”ని ముఖ్యమంత్రి అన్నారు.

అహర్నిశలు కోస్తాంధ్ర ప్రయోజనాల కోసమే పని చేసే కాసు బ్రహ్మానంద రెడ్డి తన మనసులోని మాటను బయట పెట్టాడు. ”గోదావరి పై తెలంగాణలో పోచంపాడు, ఆంధ్ర ప్రాంతంలో ఇదే నదిపై రాజమండ్రి వద్ద ధవళేశ్వరం ఆనకట్ట ఇవి రెండూ పరస్పరం సహాయకారి కాగలవు. రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తి అభివృద్ధి పెంపొందించగలవ”ని ముఖ్యమంత్రి అన్నారు.

రూపాయలు 90 కోట్లు వ్యయం కాగలదని ప్రభుత్వం అంచనా వేసిన పోచంపాడు ప్రాజెక్టుకు 1963 నుండి 69 వరకు చేసిన ఖర్చు కేవలం 12 కోట్ల రూపాయలు. తెలంగాణ ఉద్యమం ఫలితంగా ఒక్క సంవత్సరమే 7.75 కోట్లు వ్యయం చేసింది ప్రభుత్వం. పోచంపాడు దక్షిణ కాల్వ పొడవు ముందుగా 70 మైళ్ళు నిర్మించాలని పనులు ప్రారంభించిన ప్రభుత్వం దీన్ని 123 మైళ్ళకు పొడిగించింది. ప్రారంభించే నాటికి (1970 జూలై 24) కేవలం 23 మైళ్ళు. కాల్వ పనులు పూర్తికాగా ఇందులో 18 మైళ్ళు నిజామాబాద్‌లో, 5 మైళ్ళు కరీంనగర్‌ జిల్లాలో వున్నది. ఈ దక్షిణ కాల్వ ద్వారా ప్రారంభ సమయానికి 1970లో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని సంకల్పించిన ప్రభుత్వం 1974 నాటికి వరంగల్‌ జిల్లా సరిహద్దు దాటించి ఆ జిల్లా కేంద్రంలో త్రాగునీటి అవసరాలకు సాగునీరు అందించాలని ప్రణాళికను సిద్ధం చేసింది. పోచంపాడు ఆనకట్ట నిర్మాణం వల్ల 174.9 చదరపు మైళ్ళ మేర జలమయమవుతుందని, 82 గ్రామాలు నీట మునిగి పోతాయని అంచనా వేశారు. నిజామాబాద్‌ జిల్లా పోచంపాడు గ్రామంలో గోదావరికి 140 అడుగుల ఎత్తుగల డ్యాం నిర్మాణం జరుగుతున్నది. 66 టి.ఎం.సిల నీటి వినియోగానికై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో ఆ మేరకు పోచంపాడుకు అనుమతులు లభించాయి. డ్యాం నిర్మాణం +1090 అడుగుల ఎత్తువరకు దశల వారీగా నిర్మిస్తారు. దక్షిణ కాల్వను 8600 క్యూసెక్కులతో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

పోచంపాడు – పూర్వ ప్రతిపాదలనలు – మార్పులు

1942లో ‘గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు’ పేరుతో అలీ నవాబ్‌ జంగ్‌ నేతృత్వంతో ఎస్‌.ఇ. అబ్దుల్‌ ఖయూమ్‌ ఖాన్‌ రూపొందించిన పథకం…

1.నాందేడ్‌కు 40 మైళ్ళ దిగువన కవ్వల్‌గూడ వద్ద రిజర్వాయర్‌ దీని ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు.

2.కవ్వల్‌ గూడకు 50 మైళ్ళ దిగువన కిష్టాపురం వద్ద ఒక రిజర్వాయర్‌. దీనికి దిగువన సోన్‌ బ్రిడ్జ్‌కు ఎగువన ఒక పికప్‌ డ్యాం (పోచంపాడు డ్యాం స్థలం).

3.కడెం ఉపనది మీద ఒక రిజర్వాయర్‌ (నిర్మాణం పూర్తయినది)

4.కిష్టాపురం దిగువ పికప్‌ డ్యాం నుండి కడెం రిజర్వాయర్‌ వరకు ఒక ఉత్తర కాల్వ కడెం నుండి నుండి ఈ ఉత్తర కాల్వ పొడిగింపు… పెద్దేరు ఆనికట్‌.

5.కిష్టాపురం దిగువ పికప్‌ డ్యాం నుండి ఒక దక్షిణ కాల్వ… ఈ దక్షిణ కాల్వ నుండి ఒక బ్రాంచ్‌ కాల్వ.

6.మానేరు రిజర్వాయర్‌… కాల్వ నిర్మాణం.

పోలీసు చర్య తదనంతరం నిజాం నుండి పాలనా బాధ్యతలు స్వీకరించిన జనరల్‌ చౌదరి మిలిటరీ ప్రభుత్వం పైన తెలిపిన ”గోదావరి ఇరిగేషన్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు”లో మొదటి దశగా గోదావరి ఉత్తర కాల్వను 9.28 కోట్లకు మంజూరు చేసింది.

ఆ తర్వాత పరిపాలనా బాధ్యతలు చేపట్టిన వెల్లోడి (సివిల్‌ సర్వీసెస్‌ అధికారి) 1951 జూలై 27, 28న కేంద్ర ప్రణాళికా సంఘం అంతరాష్ట్ర) నదీ జలాల సమావేశంలో ఈ ప్రాజెక్టుకు, హైదరాబాద్‌ రాష్ట్రంలోని గోదావరి నదులపై నిర్మించే ఇతర ప్రాజెక్టులకు నదీ జలాల్లో వాటా సాధించారు. అంతకు ముందే 1951 ఏప్రిల్‌ నెలలోనే ఒక 15 ఏళ్ళు ప్రణాళికను వెల్లోడీ ప్రభుత్వం రూపొందించి దీనిలో గోదావరి ప్రాజెక్టును చేర్చింది. 4దశలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని తొలిదశలో కడెం రిజర్వాయర్‌, కాల్వ నిర్మాణం చేపట్టింది.

హైదరాబాద్‌ తొలి పౌర (బూర్గుల) ప్రభుత్వం..

కడెం రిజర్వాయర్‌ నుండి 47 మైళ్ళ పొడవుగల కడెం ఉత్తర కాల్వ క్రింద 12 టిఎంసిల నీరు వినియోగించి 65 వేల ఎకరాలు సాగులోకి తేవాలని సంకల్పించారు. 55-56, 60-61లో రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రాథమిక రిపోర్టును బూర్గుల ప్రభుత్వ రూపొందించింది. గోదావరి ప్రాజెక్టులోని మిగిలిన 4 దశల క్రింద 8059 కోట్లు ఖర్చవుతుందని చూపించారు. ఈ రెండవ ప్రణాళికలో చూపించిన గోదావరి ప్రాజెక్టులో అప్పటి బూర్గుల ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన మార్పులను చేసింది.

కిష్టాపురం దిగువ పికప్‌ డ్యాం నుండి గతంలో సూచించిన 122 మైళ్ళ పొడవు ఉత్తర కాల్వను 35 మైళ్ళు పొడిగించి దీని క్రింద 2.74 లక్షల ఎకరాల్లో పంటలు పండించుకోవచ్చని దక్షిణ కాల్వ 66 మైళ్ళ నుండి 246 మైళ్ళకు పొడిగించి 16.96 లక్షల ఎకరాలు సాగు చేసుకోవచ్చునని, కడెం ఉత్తర కాల్వ క్రింద 80 వేల ఎకరాలకు సాగునీరందించవచ్చునని రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రతిపాదనల్లో చేర్చి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.

పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం రెండవ పంచ వర్ష ప్రణాళికను ఖరారు చేస్తూ నిధుల కొరత కారణంగా ఈ గోదావరి ప్రాజెక్టు రెండో దశ నిర్మాణాన్ని ప్రణాళిక నుంచి తొలగించింది. హైదరాబాద్‌ ప్రభుత్వం, రాష్ట్రం మొత్తం పెట్టుబడి 375 కోట్లుంటుందని అంచనా వేసి పంపిన ప్రతిపాదనలను కేవలం 105 కోట్లకే ప్రణాళికా సంఘం పరిమితం చేసింది. దీనితో రెండవ పంచవర్ష ప్రణాళికలో గోదావరి ప్రాజెక్టు రెండో దశను చేర్చలేదు. అప్పటికే హైదరాబాద్‌ రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో విలీనమై ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడింది. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గోదావరి ప్రాజెక్టుకు నిధుల లేమిని అధిగమించడానికై అప్పటికే రెండవ పంచవర్ష ప్రణాళికలో చేర్చిన దేవునూరు ప్రాజెక్టు (మెదక్‌ జిల్లాలో మంజీరా నదిపై నిర్మాణంలో ఉన్నది)ను ఉపసంహరించుకుంటూ దీనికి కేటాయించిన సుమారు 9.60 కోట్ల రూపాయలను గోదావరి ప్రాజెక్టుకు మళ్ళించి గోదావరి రెండో దశను ప్రణాళికలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది. దీనితో దేవునూరు శాశ్వతంగా ఆగిపోయింది. కానీ నీలం సంజీవరెడ్డి కోరినట్లు గోదావరి ప్రాజెక్టును రెండవ పంచవర్ష ప్రణాళికలో చేర్చలేదు.

ఎలాగైనా రెండవ పంచవర్ష ప్రణాళికలో గోదావరి ప్రాజెక్టు రెండో దశను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రతిపాదిత ఆయకట్టును కేవలం 3 లక్షల ఎకరాలకు కుదించింది. రెండవ పంచవర్ష ప్రణాళిక కాల ముగిసిపోయింది. ఈ లోగా గోదావరి ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. దీనితో గోదావరి ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల సమస్య ఉత్పన్నమైంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 300 టి.ఎం.సి.ల నీరు అవసరమైన గోదావరి ప్రాజెక్టుకు కేవలం 60 టి.ఎం.సి.లు చాలునని కేంద్రాన్ని కోరింది.

భారీ గోదావరి ప్రాజెక్టు స్థానంలో చిన్న సైజు స్టోరేజీ రిజర్వాయర్‌ను ‘పోచంపాడు’ పేరుతో నిర్మించడానికి, దీని ద్వారా నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో 3.60 లక్షల ఎకరాలకు నీరందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కుదించింది. అయినా కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించలేదు. 1961లో కేంద్రం నియమించిన గుల్హతీ కమీషన్‌ నివేదిక ఇచ్చే వరకూ ఈ ప్రాజెక్టును ఆపాలని కేంద్ర నీటిపారుదల సహాయ మంత్రి జె.ఎస్‌.హరి ఆదేశించారు.

1963లో గుల్హతీ కమీషన్‌ నివేదిక కేంద్రానికి సమర్పించిన తర్వాత జూలై 26న 5.7 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రాజెక్టుగా ‘పోచంపాడు’ను ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. (1969 ఉద్యమం తర్వాత పోచంపాడు’ పేరును 1978లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుగా మార్చి 112 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కల భారీ రిజర్వాయర్‌ను (196 టిఎంసిల వినియోగం)+1091 ఎఫ్‌.ఆర్‌.ఎల్‌.తో నిర్మించారు. శ్రీరాంసాగర్‌ మొదటి, రెండో దశలు, వరద కాల్వ నిర్మాణం చేసి సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని సంకల్పించారు. ఇసుక మేటల వలన రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్ధ్యం 80 టిఎంసిలకు తగ్గింది. బాబ్లీ వంటి పలు అక్రమ బ్యారేజీల నిర్మాణాల వలన శ్రీరాంసాగర్‌కు నీటి ప్రవాహాలు తగ్గినవి. కాళేశ్వరం ఎత్తిపోతలే శ్రీరాంసాగర్‌ ఆయకట్టుకు ప్రత్యామ్నాయం.

Other Updates