శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే – సల్లా విజయ్‌ కుమార్‌


పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని, దాని కింద ఉన్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (SRMC) సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో ప్రకటించిన సంగతిని అన్ని పత్రికలు పతాక శీర్షికతో వార్తలు ప్రకటించినాయి. ఇటువంటి ఒక తీవ్ర నిర్ణయం యొక్క పూర్వ్వాపరాలను, మంచి చెడ్డలను, తెలంగాణా రాష్ట్ర ప్రాజెక్టులపై పడే ప్రభావాన్ని చర్చించడమే ఈ వ్యాసం లక్ష్యం.

1966 హెల్సింకి రూల్స్‌ నుండి మొదలుకొని నేడు అమలులో ఉన్న యు నైటెడ్‌ నేషన్స్‌ వాటర్‌ కోర్సెస్‌ కన్వెన్షన్‌ (UNWC), 1997 వరకు నీటి వినియోగాల్లో బేసిన్లోని ప్రాంతాలకు సమన్యాయం మరియు సహేతుకత (equitable and reasonable) ఆధారంగా నీటి కేటాయింపులు ఉండాలని నిర్దేశిస్తున్నాయి. కానీ, క్రిష్ణా నదీ జలాలను ఏ విధమైన సహజ న్యాయ సూత్రాలు గానీ, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు గానీ పట్టించుకోకుండా, భిన్న వాదాలతో కేవలం ఆంధ్ర ప్రాంతాల ప్రయోజనాలే ప్రాధాన్యంగా పరిగణించి, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో తీవ్ర వివక్ష చూపించాయి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు. మొదట ఏదో విధంగా ప్రాజెక్టులను కట్టివేసి ఆ తరువాత వాటి వినియోగాలను కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికే వాడుకలో ఉన్న, స్థిరపడ్డ వినియోగాలు (Established utilisation) గా హక్కులు అడగడం ఒక వ్యూహంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల పర్వం సాగింది. సామాన్య ప్రజానీకం ఎవరైనా అమాయకంగా, అరే! ఇన్ని సంవత్సరాల నుండి వాడుతున్న వాళ్ళను ఎట్లా కాదంటారు, వాళ్ళకు నీటి కేటాయింపులు చేయడం సమంజసమే అంటారు. కానీ క్రిష్ణా నది బేసిన్లోనే ఉన్న, తెలంగాణ ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్టులను కుదించి వేసి, కావాలని అసలు మొదలే పెట్టక, మొదలుపెట్టినా ఏదో ఒక సాకుతో సాగదీస్తూ, నాన్చుతూ పూర్తి చేయకపోవడం వల్ల ఎప్పటికీ ఆ ప్రాజెక్టులకింద ఆయకట్టు వినియోగంలోకి రాక స్థిరపడ్డ వినియోగాలుగా చెప్పలేము అనే విషయం ప్రజలకు వెంటనే అర్థంకాదు.

నదీజలాల వినియోగంలో సమన్యాయం కావాలనే ఒక ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కృష్ణా, గోదావరి జలాల వినియోగంతో ముడిపడి ఉన్నాయి. ఈ సందర్భంగా, సమన్యాయ వాటా ప్రకారం ఒకసారి కేటాయించినవి తరువాతి కాలంలో సమన్యాయ వాటాగా ఉండవు, ఉండాల్సిన అవసరం లేదు అని ఇండస్‌ కమీషన్‌ 1942లో స్పష్టం చేసిన మాటలు గుర్తుకు తెచ్చుకోవాలి. మారిన పరిస్థితుల్లో ఒక ప్రాజెక్టులో అంతవరకు వినియోగించిన నీళ్ళు సర్వకాల సర్వావస్థల్లో అట్లాగే వినియోగించడం సాధ్యం కాదని కృష్ణా ట్రిబ్యునళ్ళు వ్యక్తం చేశాయి. నేడు పోలవరం, పట్టిసీమల నుండి క్రిష్ణా నదికి మళ్లిస్తున్న గోదావరి జలాలు, సాంకేతిక పురోభివృధ్ధి వల్ల వందలాది మీటర్ల ఎత్తుకు నదీజలాలను ఎత్తిపోయగలగడం, సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ, వినియోగాల్లో నూతన నీటి సరఫరా విధానాల అమలు, తక్కువ పంట కాలం ఉండే ఆధునిక వంగడాల వినియోగం, నీరు ఎక్కువ అవసరమయ్యే వరి, చెరుకు వంటి పంటల నుంచి తక్కువ నీరు అవసరమయ్యే కూరగాయలు, పండ్ల తోటలు, పూల తోటలు, ఉద్యాన వన పంటలు, తణ ధాన్యాలు, ఇతర ఆరుతడి పంటలకు మళ్లడం… తదితరాల వల్ల నదీజలాల్లో వినియోగంలో మిగులు (savings) కారణంగా మారిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రాజెక్టుల నీటి వినియోగాల్లో మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మరొక విషయం పరిగణలోకి తీసుకోవాలి. (“A river basin is a topographic entity. While political boundaries may change from time to time and the governments which excercise control over a basin may change in number or in nature, the limits of the watershed of a river remain fixed for all time. In case of scarcity of water in relation to requirements, the watershe boundary provides a definite area within which to ration the wters; otherwise there would be no end to the claims that may be made on the scarce resource.”) అని ప్రముఖ ఇంజనీర్‌ ఎన్‌ డి.గుల్హాటి 1972లో వ్యక్తం చేశారు. బేసిన్లోని వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఒక పంటకు సాగునీటికై అలమటిస్తుంటే, బేసిన్‌ ఆవల భూముల్లో రెండో పంటకు, మూడో పంటకు సాగునీరివ్వాలనడం, ఎక్కడో అయిదారు వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న భూములకు నీళ్ళివ్వాలనడం సరికాదు. ఈ విషయాలన్నీ స్ఫురణలో ఉంచుకొని ప్రకాశం బ్యారేజీ వినియోగాలైనా, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా వినియోగాలైనా చూడాలి.

నేడు అమలులో ఉన్న ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం ఎగువ రాష్ట్రాలకు 75% డిపెండబిలిటీ వద్ద కేటాయించిన మొత్తాలు వాడుకున్నాక దిగువకు వచ్చే నీళ్ళు అన్నీ మనం (తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌) వాడుకునే వెసులుబాటు ఉంది. ఆ నీళ్లపై హక్కు మాత్రం ఉండదు. భవిష్యత్తులో వచ్చే రివ్యూ ట్రిబ్యునళ్ళు ఆ నీళ్ళను నాలుగు రాష్ట్రాల మధ్య పంచవచ్చు. దాని ఆధారంగానే మనం పలు ప్రాజెక్టులు నాటి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో నిర్మించింది. ఉదా: కల్వకుర్తి, హంద్రీ-నీవా మొదలైనవి.


ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం గుర్తుంచుకోవాలి. మూడు రాష్ట్రాల (మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌) ప్రాజెక్టుల డిమాండ్స్‌లలో సరియైనవిగా భావించిన (worth consideration) వాటిని పరిగణనలోకి తీసుకొని వాటన్నింటినీ రాష్ట్రాల పరంగా కలిపి ఆ మొత్తాన్ని గంపగుత్తగా (embloc or mass allocation) రాష్ట్రాలకు ఇస్తూ, ఈ కేటాయింపులు ఏ ప్రాజెక్టులకు ముడిపెట్టి ఇవ్వడం లేదు, ఆయా రాష్ట్రాలు ఎక్కడైనా ఎట్లయినా, ఆయా రాష్ట్రాలకు కేటాయించిన మొత్తానికి మించకుండా వాడుకోవచ్చు అని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. అందువల్లనే, రాష్ట్ర విభజన తరువాత ఆ గంపగుత్త కేటాయింపును, ప్రస్తుత క్రిష్ణా ట్రిబ్యునల్‌-II కు ప్రాజెక్టుల వారీగా, రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు చేయాలని రిఫర్‌ చేయడం జరిగింది. అయితే ఆ తరువాత జరిగే కేటాయింపులను కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల్లో తమకు కేటాయించిన మొత్తం మించకుండా ఎక్కడైనా ఎట్లయినా వాడుకునే వెసులు బాటు ఉండక తప్పదు. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ క్రిష్ణా బోర్డు వద్ద, ఇరు రాష్ట్రాల మధ్య ఒక తాత్కాలిక అవగాహన అవసరాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చేసిన ప్రాజెక్టుల పరమైన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు కేటాయించిన 299 మరియు 512 టీఎం సీలు (మొత్తం రెండు రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీలు) అదే నిష్పత్తిలో వాడుకోవాలని ప్రతిపాదించింది. పర్యవసానంగా ఏర్పడిన ఒప్పందం ద్వారానే నేడు 299 మరియు 512 లకు మించకుండా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లు ఆయా ప్రాజెక్టుల వద్ద వాడుకుంటు న్నాయి. అందువల్లనే నేడు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రకాశం బ్యారేజీ వద్ద కాకుండా పోతిరెడ్డిపాడు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ తదితరాల వద్ద నుండి వాడుకోగలుగుతున్నది. అట్లాగే, తెలంగాణ తన ప్రాజెక్టుల వాటాలోంచి కల్వకుర్తి, నెట్టెంపాడు తదితరాల వద్ద వాడుకోగలుగుతున్నది. ఈ నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు వాడుకోవడం తాత్కాలికంగా ప్రస్తుత ట్రిబ్యునల్‌ తన తీర్పు ఇచ్చేవరకు మాత్రమే అని గమనించాలి. అయితే, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కెపాసిటీని విపరీతంగా పెంచి వేస్తూ నిర్మిస్తామని చెప్పడం ఆందోళన కలిగించే విషయమే. 40,000 నుండి 80,000 క్యూసెక్కులకు సామర్థ్యము పెంచడం సాధ్యమేనా అని సందేహం చాలా మందికి కలగడం సహజమే. ఒకసారి పోతిరెడ్డిపాడు మరియు దానికి దిగువన గల కాలువ సామర్థ్యాల గురించి చూద్దాం.

1964 లో ప్లానింగ్‌ కమిషన్‌ శ్రీశైలం ఒక జల విద్యుత్‌ ప్రాజెక్టుగా మాత్రమే ఆమోదించింది. ఆ తరువాత 1973 లో బచావత్‌ ట్రిబ్యునల్‌ కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఏ విధమైన నీటి కేటాయింపులు చేయలేదు, కేవలం రిజర్వాయర్లో ఆవిరి నష్టాలకు మాత్రమే 33 టీఎంసీలుగా కేటాయింపులు చేసింది. అత్యధిక మొత్తంలో ప్రకాశం బ్యారేజీ, నాగార్జునసాగర్‌ కుడి ఎడమ కాలువల (ఆంధ్ర ప్రాంతం)కు డిమాండ్స్‌ ఉంచి 75% నికర జలాల రక్షణలు పొందినందువల్ల ట్రిబ్యునల్‌ ఇంకా ఏ విధమైన కేటాయింపులు శ్రీశైలం నుండి చేయలేదు. అందువల్ల ఇక శ్రీశైలం రిజర్వాయర్‌ నుండి కుడివైపుకు నీటిని పెన్నా తదితర బేసిన్లకు తీసుకువెళ్లాలంటే ఒక కెనాల్‌ కృష్ణా-పెన్నాల మధ్య గల ఎత్తైన రిడ్జ్‌ను కట్‌ చేస్తూ తీయాల్సిన అవసరం ఉంది. ఎగువ రాష్ట్రాలు అప్పటికే, తమ బేసిన్‌ అవసరాలను కాదని ఒక లోటు బేసిన్‌ నుంచి బేసిన్‌ ఆవలకు తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి కాబట్టి ఈ సమస్యను ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రా పాలకులు చాలా చాకచక్యంగా అధిగమించారనవచ్చు. అయితే, కేవలం శ్రీశైలం కుడి వైపున ఉన్న ఆంధ్ర ప్రయోజనాలపైనే శ్రద్ధ వహిస్తూ, ఎడమ వైపు తెలంగాణ ప్రజలనుండి వ్యతిరేకత రాకుండా వారి ప్రయోజనాలను కూడా కాపాడుతున్నట్లుగా చూపే ప్రాజెక్టులను ఉత్సవ విగ్రహాలుగా చూపించారు. (ఉదా: ఎస్‌ఎల్‌బిసి, కల్వకుర్తి).

ఆంతర్రాష్ట్ర ఒప్పందం ద్వారా తెలుగు గంగ ప్రాజెక్టును, మరియు ప్లానింగ్‌ కమీషన్‌ శాంక్షన్‌ చేయించడం ద్వారా శ్రీశైలం కుడి బ్రాంచ్‌ కెనాల్‌ న్యాయబద్దమని చూపించే ప్రయత్నం చేశారు. 1973 నాటికి బచావత్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు వెలువడ్డాయి కాబట్టి, నాటి నుండే మద్రాసు (చెన్నై) నగరానికి తాగునీరు కల్పించే మిషతో కుడి వైపున ఒక కెనాల్‌ను తవ్వడానికి మూడు కృష్ణా బేసిన్‌ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందంకై ప్రయత్నాలు మొదలయ్యాయని జలరంగ నిపుణుల అంచనా. కేంద్ర ప్రభుత్వం సహాయం వల్లనే ఆంధ్ర ప్రదేశ్‌ ఎక్కువ మొత్తంలో నీటిని పొంది కృష్ణా బేసిన్లో కొరత సృష్టించిందని ఆనాడు మహారాష్ట్ర ట్రిబ్యునల్‌ ఎదుట పేర్కొనడం ఈ అభియోగానికి బలం చేకూర్చుతున్నది.

ఏప్రిల్‌ 1976లోనే మూడు కృష్ణా బేసిన్‌ రాష్ట్రాలు, తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలు శ్రీశైలం నుండి చెన్నై నగరానికి తాగునీటిని మూడు రాష్ట్రాలు చెరో 5 టీఎంసీలు ఇవ్వాలని ఒక ఒప్పందంపై సంతకం చేశారు. ఆ తరువాత 1977 ఒప్పందం జరిగింది. మొత్తమ్మీద ఒప్పందాల పర్యవసానంగా చెన్నైకి నీటిని 1500 క్యూసెక్కుల సామర్థ్యం గల ఓపెన్‌ ఛానెల్‌ ద్వారా మొత్తం 15 టీఎంసీల నీటిని తీసుకెళ్లాలి. ఇక మరో వైపున శ్రీశైలం కుడి బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా 19 టీఎంసీల నీటిని 75% నికర జలాలను కేటాయించి ప్లానింగ్‌ కమీషన్‌ క్లియరెన్స్‌ 1981 కల్లా తెచ్చుకున్నారు. దాన్లో 200 కిమీల కెనాల్‌ తో పాటుగా, ఒక అప్రోచ్‌ చానల్‌, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (SRMC) మరియు బనకచెర్ల వద్ద ఒక క్రాస్‌ రెగ్యులేటర్‌ను ప్రతిపాదించారు. 19 టీఎంసీలల్లో 11 టీఎంసీలను తెలంగాణ ప్రాజెక్టుల ద్వారా వచ్చే రిటర్న్‌ ఫ్లోస్‌ను, 8 టీఎంసీలను కేసి కెనాల్‌ ఆధునీకరణ ద్వారా మిగిలే జలాలను కేటాయించారు.

ఇట్లా తెలుగుగంగ మరియు ఎస్‌ఆర్‌బిసిలకు న్యాయబద్దత కల్పించి 1983 నాటికల్లా తమిళనాడుతో ఒక ఒప్పందం కుదుర్చుకుని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, ఇతర అన్ని అనుబంధ పనులకు శ్రీకారం చుట్టారు. ఆ పనుల్లో ప్రతిపాదించినవి చూస్తే ఆశ్చర్యం గొలుపుతుంది. హెడ్‌ రెగ్యులేటర్‌ ను 11,150 క్యూసెక్కుల కెపాసిటీతో మూడు గేట్లు మరియు ఒక స్టాండ్‌ బై గేట్‌ మొత్తం నాలుగు గేట్లు, ఎస్‌ఆర్‌ఎంసి ని 18,650 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిర్మించారు. పోతిరెడ్డిపాడు వద్ద మొదలయ్యే ఎస్‌ఆర్‌ఎంసి పొడవు 16.5 కిమీ బనక చెర్ల రెగ్యులేటర్‌ కాంప్లెక్స్‌ వరకు ఉంటుంది. బనకచెర్ల వద్ద గల మూడు క్రాస్‌ రెగ్యులేటర్లను ఒక్కొక్కటి 11,150 క్యూసెక్కుల కెపాసిటీతో నిర్మించారు. ఒకటి ఎస్‌ఆర్‌బిసికి, రెండోది ఎస్కేప్‌ రెగ్యులేటర్‌కు (వాస్తవానికి కేసి కెనాల్‌కు నీటిని విడుదల చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు), మూడోది తెలుగు గంగ ప్రాజెక్టు కెనాల్‌కై ఉద్దేశించినవి. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కేవలం 11,150 క్యూసెక్కులుగా ఉంచి, అక్కడి నుంచి వచ్చే నీటిని తరలించే మూడు క్రాస్‌ రెగ్యులేటర్‌ ల ద్వారా మొత్తం 33,450 క్యూసెక్కుల సామర్థ్యం (11,150 x 3) ఎందుకు అన్న ప్రశ్న జలరంగ నిపుణులకు కలిగేది. అయితే, దీనికి సమాధానం 2006 లో దొరికింది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను, ఎస్‌ఆర్‌ఎంసిని 44,000 క్యూసెక్కులకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దివంగత ఆర్‌ విద్యాసాగర్‌ రావు ఎండబ్ల్యుడిఎ చీఫ్‌ ఇంజనీర్‌ గా 1995లో కేంద్ర జల సంఘం ఛైర్మన్‌ ఎంఎస్‌ రెడ్డి గారితో బనకచర్ల సందర్శించినప్పుడు ఈ అంశాన్ని గమనించినారు. ఎంఎస్‌ రెడ్డితో ప్రస్తావిస్తే మనకెందుకులే అని ఆయన చర్చను మళ్ళించారు. అయితే విద్యాసాగర్‌ రావు మదిని ఈ అంశం తొలుస్తూనే ఉన్నది. ఉద్యమ సమయంలో నీళ్ళు నిజాలు పుస్తకంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ”దాల్‌ మే కుచ్‌ కాలా హై” అని రాశారు.

2006 లో గడిచిన 22 సంవత్సరాల ఆధారంగా వరద వచ్చే రోజులు 30 మాత్రమే అని నిర్ణయించి, శ్రీశైలం డ్యాం ఎగువన అన్ని ప్రాజెక్టుల వినియోగాలను పరిగణన లోనికి తీసుకొని, కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం కట్టినాక కూడా 114 టీఎంసీలు మరల్చవచ్చు అని నిర్ధారించినామని ప్రకటించి నాటి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ మరియు శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (SRMC) సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచుతూ నిర్మాణం ప్రారంభించారు. కొన్ని నెలల్లోనే పూర్తి కూడా చేశారు. ఈ 114 టీఎంసీల ద్వారా తెలుగుగంఞ ప్రాజెక్టుకు 29 టీఎంసీలు, ఎస్‌ఆర్‌బిసి 19, గాలేరు-నగరి 38, చెన్నై తాగునీరు 15, తుంగభద్ర హెచ్‌ఎల్‌సి 10 రోజులు, తాగునీరు తదితరాలు 3 టీఎంసీలు గా పరిగణించారు.

వాస్తవంగా నేడున్న నిర్మాణాల సామర్థ్యం చూద్దాం. నేడు పోతిరెడ్డిపాడు వద్ద గలవి మొత్తం పాతవి 4 గేట్లు (3+1 స్టాండ్‌ బై) మరియు కొత్తవి 10 గేట్లు (9+1 స్టాండ్‌ బై). అన్నీ గేట్ల లెవెల్లు, కొలతలు సమానమే కాబట్టి, 9 గేట్ల ద్వారా 44,000 క్యూసెక్కుల డిశ్చార్జ్‌ వెళ్తుంది కాబట్టి ఒక్కో గేట్‌ ద్వారా 4,889 క్యూసెక్కులు వెళ్తుంది. మొత్తం 14 గేట్ల ద్వారా 68,440 క్యూసెక్కుల డిశ్చార్జ్‌. ఇది 880 ఫీట్ల లెవెల్లో శ్రీశైలంలో నీటి మట్టం ఉంటే. కానీ వరద సమయాల్లో, అంటే 885 ఫీట్ల గరిష్ట లెవెల్లో శ్రీశైలంలో నీటి మట్టం ఉంటే 1,71,460 క్యూసెక్కులు విడుదల చేయవచ్చు. వీటికి తోడు 5,500 క్యూసెక్కుల ఎలెక్ట్రిక్‌ పవర్‌ స్లూయిస్‌ ద్వారా విడుదల చేయవచ్చు. అంటే మొత్తం 1,77,000 క్యూసెక్కుల డిశ్చార్జ్‌ చేయడానికి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం ఉంది. అయితే, కెనాల్‌ (ఎస్‌ఆర్‌ఎంసి) సామర్థ్యం ఎంత ఉందో అంతే డిశ్చార్జ్‌ కెనాల్లో వెళ్లగలుగుతుంది. నేడు కేవలం 44,000 క్యూసెక్కులు మాత్రమే కెనాల్‌ కెపాసిటీ (256 ఫీట్ల బెడ్‌ విడ్త్‌ మరియు 39 ఫీట్ల లోతు) ఉన్నది కాబట్టి అంతే గరిష్ట డిశ్చార్జ్‌ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులటరీ ద్వారా సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతున్నట్లుగా 80,000 క్యూసెక్కులుగా పెంచడం కూడా కెనాల్‌ కొలతలు మార్చకుండానే సాధ్యమవుతుంది. నేడు కాంక్రీట్‌ లైనింగ్‌ చేసినట్లయితే ఆ కెనాల్‌ కొలతలేమీ మార్చకుండానే 85,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కెనాల్లో డిశ్చార్జ్‌ చేయవచ్చు. బహూశా నేడు ఆంధ్రప్రదేశ్‌ యోచిస్తున్నది ఈ విధంగా పెంచడమే అనుకుంటా.


అంటే, 85,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కెనాల్లో డిశ్చార్జ్‌ పంపిస్తే రోజుకు 7.4 టీఎంసీల నీటిని తరలించవచ్చు. ఇప్పటికే బనకచెర్ల వద్ద క్రాస్‌ రెగ్యులేటర్ల కెపాసిటీని 44,000 క్యూసెక్కులకు పెంచిన ఆంధ్రప్రదేశ్‌ ఇకముందు 85,560 క్యూసెక్కుల డిశ్చార్జ్‌ కు పెంచడం పెద్ద కష్టమైన పని కాదు. కేవలం వరద జలాలను మాత్రమే తరలిస్తామని వారు చెపుతున్నప్పటికీ 854 అడుగుల మట్టంలో శ్రీశైలం జలాశయంలో నీరుంటే పోతిరెడ్డిపాడు జలాశయం నుంచి నీటిని తరలించబోరన్న గ్యారంటి ఏమిటి? దీన్ని నియంత్రించడం సాధ్యమా? ఇప్పుడు మన అనుభవాలను బట్టి చూస్తే అది సాధ్యం కాదనే తెలుస్తున్నది. ఇక తెలంగాణకు గ్రావిటీ మార్గాన కేవలం ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ స్కీమ్‌ మాత్రమే నిర్మాణంలో ఉంది. దాని కెపాసిటీ 4,000 క్యూసెక్కులు (రోజుకు 0.35 టీఎంసీ) మాత్రమే. లిఫ్ట్‌ స్కీమ్‌ అయినప్పటికీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టులు మొదలైతే శ్రీశైలం జలాశయం నుంచి సుమారు 30,000 క్యూసెక్కులను (పాలమూరు – 22,000, కల్వకుర్తి-5000, టన్నెల్‌-4000) తరలించే అవకాశం ఉంటుంది. అంటే రోజుకు 2.69 టిఎంసిలు తెలంగాణ నీటిని కరువు ప్రాంతాలకు శ్రీశైలం రిజర్వాయర్‌ నుండి ఇవ్వగలుగుతుంది.

కేసి కెనాల్‌:
తుంగభద్ర నది ఆధారంగా నిర్మించిన కేసి కెనాల్‌ ను నేడు పూర్తిగా శ్రీశైలం రిజర్వాయర్‌ పై ఆధార పడే ప్రాజెక్టుగా మార్చివేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌ లెవెల్‌ +841 ఫీట్ల సిల్‌ లెవెల్‌ (గేట్ల కింది లెవెల్‌) వచ్చే వరకు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ ద్వారా వెళ్ళే నీటిని మళ్లించడం, ఆ తరువాత +797 ఫీట్ల వరకు ముచ్చుమర్రి ద్వారా తీసుకు వెళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. కేసి కెనాల్‌ (కర్నూల్‌-కడప కెనాల్‌) ద్వారా తీసుకెళ్లే నీటిలో 90% పైగా క్రిష్ణా బేసిన్‌ అవలకు మరలిస్తారు.

ఎస్‌ఎల్‌బిసి: 1969 లో ఏర్పడ్డ బచావత్‌ ట్రిబ్యునల్‌ ఎదుట, 1970 లో శ్రీశైలం రిజర్వాయర్‌ నుండి గ్రావిటీ ద్వారా క్రిష్ణా బేసిన్లోని నల్గొండ, ఖమ్మం జిల్లాలకు 150 టీఎంసీల సాగు నీళ్ళివ్వడానికి ఎస్‌ఎల్‌బిసి స్కీమ్‌ (దాదాపుగా 15 కిలోమీటర్ల టన్నెల్‌ ఉంది) ను నాటి ప్రభుత్వం ప్రతిపాదించింది. దాంట్లో కూడా ఉంది. అయితే 1973లో ఆ ప్రాజెక్టుకు నికర జలాలు కాకుండా, మిగులు జలాలు కేటాయిస్తే చాలని నివేదించింది. (1969-70 లలో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉంది. 1973 నాటికి పూర్తిగా అణచివేయబడింది). మిగులు జలాల కేటాయింపులు నాటి బచావత్‌ ట్రిబ్యునల్‌ చేయలేదు అన్న విషయం మనందరికి తెలిసిందే. ఆ తరువాతి కాలంలో 1985లో ఎస్‌ఎల్‌బిసిని కేవలం 30 టీఎంసీలకు పరిమితం చేసి (4000 క్యూసెక్కుల డిశ్చార్జ్‌) పోలవరం ప్రాజెక్టు ద్వారా క్రిష్ణా నదికి మళ్లించే గోదావరి జలాలకు ముడిపెట్టి సిడబ్ల్యుసి క్లియరెన్స్‌ కు నివేదించింది. CWC ఆ ప్రాజెక్టు రిపోర్టును పోలవరం ప్రాజెక్టు క్లియరెన్స్‌ వచ్చాక తిరిగి నివేదించండి అని 1986 లో వెనక్కి పంపింది. అట్లా బుట్ట దాఖలైన ఆ ప్రాజెక్టును ఒక ఉత్సవ విగ్రహంగా తెలంగాణ ప్రాంత ప్రజల, నాయకులను సముదాయించేందుకు వాడుకుంటూ వచ్చాయి ఉమ్మడి ప్రభుత్వాలు. మొదట ఎస్‌ఎల్‌బిసి ని శ్రీశైలం కుడివైపున గల ఎస్‌ఆర్‌బిసి కి సమాన ప్రాజెక్టుగా, ఆ తరువాత తెలుగుగంగ ప్రాజెక్టుకు సమానంగా పేర్కొంటూ, ఆ తరువాత తాత్కాలికంగా నాగార్జునసాగర్‌ నుండి లిఫ్ట్‌ ద్వారా తెస్తామని చెప్పి సాగదీస్తూ వచ్చాయి. 2005లో, మళ్ళీ తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో గానీ పనులు మొదలు పెట్టలేదు. నేడు కొత్తగా కొంతమంది శ్రీశైలం నుండి కుడివైపున నిర్మాణం పూర్తికావస్తున్న వెలిగొండ (రోజుకు ఒక టీఎంసీ) తరలించుకు పోగల మరో టన్నెల్‌ స్కీమ్‌కు సమానమైన ప్రాజెక్టుగా ఎస్‌ఎల్‌బిసిని పేర్కొంటున్నారు. ఇక ముందు ముందు మరే స్కీమ్‌ తో సమానమని ప్రచారం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం తెలంగాణ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు లాంటిదని చెప్పక తప్పదు.

ఎన్‌ డబ్ల్యూ డి ఏ (NWDA) తెలుగు గంగ ప్రాజెక్టును ఒక గొప్ప అంతర్రాష్ట్ర నదీ జలాల తరలింపు ప్రాజెక్టుగా కీర్తిస్తూ ఉంటుంది. కానీ నిజానికి శ్రీశైలం రిజర్వాయర్‌ పక్కనే ఉన్న మహబూబ్‌నగర్‌ ప్రజలు తాగునీటికి అలమటిస్తూ ఉంటే, వందల కిలోమీటర్ల దూరంలో పంటలకై నీటిని (చెన్నైకి తాగునీటినివ్వడాన్ని మేము ఆక్షేపించడం లేదు) తరలించే పోతిరెడ్డిపాడు లాంటి ఒక ఇల్లీగల్‌ ప్రాజెక్టును, తెలుగు గంగను రాష్ట్రాల మధ్య సహకారానికి గొప్ప నిదర్శనమనడం సత్య దూరం. నిష్పక్షపాతంగా కేంద్ర సంస్థలు పనిచేసి తెలంగాణకు న్యాయం చేయాలి. బేసిన్లోని కరువు పీడిత, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాలకు తెలంగాణ ప్రతిపాదిత ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుండి నికర జలాలను మళ్లించడంలో సహాయపడాల్సిన బాధ్యత సి డబ్ల్యు సి, ఎన్‌ డబ్ల్యు డి ఏ, కె ఆర్‌ ఎం బి లాంటి సంస్థలపై ఉంది.

Other Updates