”మా తాతయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా బందూక్ పట్టుకొని పోరాడిన యోధుడు. ఆయన రాసిన ఆత్మకథను తన 88వ పుట్టిన రోజు అయిన 17 జూన్ నాడు ఆవిష్కరించి తాతయ్యను సర్‌ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. మీరు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారా” అంటూ నిధి రెడ్డి అనే 17 ఏళ్ల అమ్మాయి మంత్రి కేటీఆర్‌కు మే 4వ తేదీ నాడు రాత్రి 10:22 గంటలకు ట్విట్టర్ ద్వారా సందేశం పంపింది. సరిగ్గా రెండు నిముషాలు గడిచాయో లేదో మంత్రి కేటీఆర్ స్వ యంగా జవాబు ఇచ్చాడు ఆ అమ్మాయికి.
”తప్పకుండా చేద్దాం. అలాంటి పోరాట యోధుడి కొరకు నేను మీ ఇంటికి వస్తాను” అని. ఈ మెసేజ్ చదివిన నిధి రెడ్డి ఆనందానికి హద్దులు లేవు. కొద్దిసేపు తను ఇది కలా నిజమా నమ్మలేక పో యింది. కొద్ది నిముషాల్లోనే పూర్తి వివ రాలు పంపాలని కేటీఆర్ ఆఫీసు నుండి మరొక మెసేజ్ వచ్చింది నిధి రెడ్డికి.
ఆ తర్వాత…జూన్ 17. హబ్సిగూడా లోని స్ట్రీట్ నెంబర్ 7లో ఉంటున్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మిట్ట యాదవ రెడ్డి ఇంటికి మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లారు. నడవలేని దశలో ఎక్కువగా మంచంపైనే ఉంటున్న యాదవరెడ్డి గారిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సత్క రించారు. తెలం గాణ ప్రభుత్వం తరఫున ఒక జ్ఞాపికను కూడా అందించారు. కుటుంబ సభ్యులందరి సమక్షంలో యాదవరెడ్డి కేక్ కట్ చేయగా, వారికి మంత్రి కేటీఆర్ కేక్ తినిపించారు. గతంలో అయన చేసిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ పోరాటాల్లో తాను నిర్వహించిన పాత్రను అయన మంత్రికి వివరించారు. తదనంతరం యాదవ రెడ్డి స్వయంగా రచించిన ”నా జ్ఞాపకాలు” అనే ఆత్మకథను మంత్రులు జగదీశ్ రెడ్డి, కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ, అనుక్షణం తాను తెలంగాణ కొరకే పరితపించానని, ఇవ్వాళ కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రం సిద్ధించడం, అభివద్ధిపథంలో నడవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కూడా పరిశ్రమలు, ఐటీ రంగంలో అద్భుతంగా పనిచేస్తున్నారని యాదవరెడ్డి కితాబిచ్చారు. తెలంగాణ రాష్ట్రం సరైన దిశలో వెళుతుందని, తెలంగాణ నాయకత్వంపైన అభినందనలు తెలిపారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, యాదవ రెడ్డి వంటి యోధుల పోరాటమే భావి తరాలకు స్ఫూర్తి అన్నారు. మొక్కవోని దీక్షతో ఆయనలాంటి ఎందరో చేసిన పోరు ఫలితమే ఇవ్వాళ మనం శ్వాసిస్తున్న స్వేచ్ఛావాయువులు అని అన్నారు. చరిత్రను చూసిన యాదవరెడ్డిలాంటి పెద్దవాళ్ల ప్రశంసలు తమను మరింత స్ఫూర్తితో ముందుకు నడుపుతాయన్నారు. యాదవరెడ్డి మనుమరాలు నిధి రెడ్డి మాట్లాడుతూ, ”కేటీఆర్ ట్విట్టర్లో మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవుతారని అందరూ అంటుంటే నేను కూడా ట్రై చేశాను. బట్, మంత్రి నిజంగా స్పందించి, ఏకంగా మా ఇంటికే వస్తారని కలలో కూడా ఊహించలేదు. వారికి మనస్ఫూర్తిగా కతజ్ఞతలు” అన్నారు. యాదవ రెడ్డి కుటుంబ సభ్యులు, మిత్రులు కూడా తనకున్న బిజీ షెడ్యూల్లో కూడా పుట్టిన రోజును గుర్తుంచుకుని మరీ తమకు అద్భుతమైన బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన మంత్రి కేటీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి కెటియార్ వెంట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు. యాదవరెడ్డితో తన తండ్రి గారికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుసకాన్ని ఇంగ్లీషులోంచి తెలుగులోకి అనువాదం చేసిన అడెపు లక్ష్మీపతి, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, నవీన్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.