శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సమాజానికి రక్షణగా నిలబడతారని గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసించారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా పౌరుల భద్రతకు పాటుపడతారన్నారు. సంఘవిద్రోహ శక్తులను పారద్రోలడంలో పోలీసుల పాత్ర మరువలేనిదన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని రాజధాని నగరంలోని గోషామహల్‌ పోలీస్‌స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర కమీషనర్‌ అంజనీకుమార్‌తో కలిసి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం వుంచి నివాళులు అర్పించారు.

పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. పోలీసు అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. పోలీసులను విమర్శించడం ఇటీవలి కాలంలో పెరిగిపోయిందని, ఇది ఎంతమాత్రం సహించరానిదన్నారు. మన రక్షణకోసం వారు తమ ఇంటినీ, కుటుంబాన్ని వదలి ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇదే సందర్భంగా పోలీసులకు ఎంతో సహనం అవసరమని, ఓర్పుతో విధులు నిర్వహించాలని, పట్టుదలతో పనులు పూర్తి చేయాలని గవర్నర్‌ హితవు పలికారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 414 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని గవర్నర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు విధి నిర్వహణలో ఉంటూ అసువులుబాసారన్నారు. ఢిల్లీలో పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారని తెలిపారు. పోలీసుల సేవలను ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు.

 

 

 

 

 

గతంతో పోలిస్తే పోలీసుల విధి నిర్వహణ మరింత క్లిష్టంగా మారిందన్నారు. నేరస్తులు కూడా తెలివిమీరారని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు కూడా ఉపయోగిస్తు న్నారని అన్నారు. నేరస్తులను నియంత్రించాలంటే పోలీసులు ఎంతో చాకచక్యంగా, సాంకేతికంగా వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకుని, నేరస్తులను అన్ని ఆధారాలతో పట్టుకోవాల్సి ఉందని అన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో అందరికన్నా ముందున్నారని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు కోవడంలో వారికి వారే సాటి అని కొనియాడారు. తెలంగాణ పోలీసులు ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించకుండా మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసుల సంక్షేమం కోసం తమశాఖ ఎంతో చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. అమరవీరుల కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు ఎంతో మానసిక వత్తిడిని ఎదుర్కొంటున్నారని డీజీపీ అన్నారు. అయినా సవాళ్ళను అధిగమిస్తూ సమర్ధవంతంగా విధినిర్వహణ చేస్తున్నారని కొనియాడారు.

 

 

 

 

 

 

 

 

ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు అమరవీరుల జ్ఞాపకార్దం సిటీ పోలీసు విభాగం తుపాకులను కిందకు దించి నివాళులు అర్పించారు. కవాతు నిర్వహించారు.

Other Updates