భారతదేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల తరువాత అత్యధికంగా కోటలు, గడులు, సంస్థానాలు నెలవైన రాష్ట్రం మన తెలంగాణ. అలనాటి రాజుల చరిత్రకు, గత కాలపు వైభవానికి, నాటి శిల్పుల నిర్మాణ కౌశలానికి, ప్రత్యక్ష సాక్షీ భూతంగా నేటికీ చెక్కుచెదరకుండా నిలిచిన కట్టడాలు ఎన్నో, ఎన్నెన్నో, వందల సంవత్సరాలలో సంభవించిన ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని దర్పంగా, ఠీవిగా కళ్ళముందు కనబడుతున్న అలనాటి కట్టడాలను చూస్తున్నప్పుడు ఎవరికయినా మనసు పులకరించక మానదు. వరంగల్, గోల్కొండ, రాచకొండ కోటలకు ధీటుగా అదే స్థాయిలో అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో సుమారు 1200 సంవత్సరాల క్రితం అత్యంత పటిష్ఠంగా, శతృదుర్భేధ్యంగా, విశాలమైన ఎత్తయిన కోట గోడలతో నిర్మాణమైన కోట ”పానగల్లు కోట”.
అదొక చారిత్రాత్మక ఖిల్లా. అలనాటి రాజుల పరిపాలనా వైభవాన్ని, అనేక చారిత్రాత్మక ఘట్టాలను, సైనికుల అసమాన శౌర్యప్రతాపాలను, శిల్పుల నిర్మాణ ప్రతిభను, మన కళ్ళముందు నిలిపి నేటికీ ప్రత్యక్ష సాక్షీ భూతంగా ఠీవీగా నిలుచున్న ఖిల్లా ”పానగల్లు కోట”. అలనాడు అల్లావుద్దీన్ ఖిల్జీ, మాలిక్ కాఫిర్ లాంటి అనేకమంది శత్రువుల దండయాత్రలను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని వారి దమనకాండలను నిలువరించిన ఈ కోట పరిస్ధితి ఇప్పుడు కడుదయనీయంగా ఉంది. ఎంతటి కఠినాత్ములకైనా ఇక్కడి పరిస్ధితి చూస్తే గుండెలు ద్రవిస్తాయి. కోటలో గుప్త నిధుల కోసం, విలువైన సంపదకోసం, అద్భుత శిల్ప సంపదకోసం నిరంతరంగా దుండగులు దాడులు జరుపుతు విలువైన సంపదను ఇష్టారీతిగా దోచుకుంటున్నారు. కోటలోని కట్టడాల క్రింద నిధుల కోసం బాంబులతో అపురూప విగ్రహాలను దేవాలయాలను, భవనాలను ధ్వంసం చేసారు. ఔరంగజేబు సేనల దాడిలో జరిగిన విధ్వంసం ఒక ఎత్తయితే ఇప్పుడు కోటపై జరుగుతున్న విధ్వంసం మరో ఎత్తు.
తెలంగాణ ప్రభుత్వం ఇంత గొప్ప కోటను పరిరక్షించడానికి గట్టి చర్యలు సత్వరంగా చేపట్టాలి. కోటలో మార్బెల్ రాళ్ళతో నిర్మించిన ఉయ్యాల మండపంలో ”బంగారు ఊయాల” ఉండేదట. దాని ఆనవాళ్ళు కోటలో ఇప్పటికీ మనకు కానవస్తాయి. హైద్రాబాద్ నుండి సుమారు 163 కి.మీ. దూరంలో, నాటి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి 74 కి.మీ. దూరంగా ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లా కేంద్రానికి 15 కి.మీ. దూరంలో, పానగల్లు బస్‌స్టాండ్‌కి సుమారు 2 కి.మీ. దూరంలో ఎత్తయిన రెండు కొండల మధ్య 11, 12 శతాబ్ధాల మధ్య కళ్యాణి చాళుక్యుల కాలంలో అత్యంత పటిష్ఠంగా, ప్రణాళికాబద్దంగా, శత్రదుర్భేధ్యంగా ఈ గిరిదుర్గం నిర్మించబడింది. కోట మొత్తం విలువైన గ్రానైట్ రాయితో నిర్మించబడటం గొప్ప విశేషం. కోట లోపలికి వెళ్ళడానికి ఏడు ప్రధాన ద్వారాలు నిర్మించబడ్డాయి. ప్రతి ద్వారం కళా నైపుణ్యంతో తోణికిస లాడుతుంది.
ప్రధాన ముఖద్వారం 20 అడుగుల ఎత్తులో 16 ఇంచుల కంచు ద్వారాలతో ఏర్పాటు చేయబడ్డాయి. దుండగులు విలువైన లోహం కోసం ఆ ద్వారాలను కూడా అపహరించారని స్థానికులు వాపోయారు. ప్రధాన ముఖ ద్వారాన్ని ”ముండ్లగవిని” ద్వారంగా పిలిచేవారు. ద్వారానికి ఇరుపక్కల గోడలపై కళ్యాణి చాళుక్యుల రాజముద్రలతో పాటు ద్రావిడ భాషలో చెక్కబడిన అనేక శాసనాలు, వివిధ ఆకృతులు ముద్రలు అద్భుతంగా చెక్కబడి కనిపిస్తాయి. రాజ చిహ్నాల్లోని జూలువిదిలించిన సింహపు శిల్పాలు పదుల కొద్దీ ఈ కోటలో శిధిలాలుగా కనిపిస్తాయి. సుమారు 10 కిలో మీటర్ల చుట్టు కొలతలో నిర్మించిన ఈ ”మహా ఖిల్లా” చూట్టూ గుట్ట క్రింద ప్రాంతాలో లోతైన కందకం ఉండేది. కందంకంలోని నీళ్ళలో మొసళ్ళు, పాములు ఉండేవి. శత్రువులు కోటలోకి ప్రవేశించాలని ప్రయత్నించినప్పుడు కొండపై నుండి పెద్ద పెద్ద బండరాళ్ళను శత్రు సైనికులపై దొర్లించేవారు.
కళ్యాణి చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, బహమనీసుల్తానులు, కుతుబ్ షాహీలు, బారీద్ షాహీలు, మొఘలాయిలు మరియు అసఫ్ జాహీల పాలనలో కొనసాగిన ఈ కోట వందకు పైగా చిన్న, పెద్ద యుద్దాలను చవిచూసిందని పరిశోధకుల అంచనా. కన్నడనాడుకు చెందిన ‘హోయసల రాజులు కళ్యాణి చాళుక్యు శిల్పశైలికి, నిర్మాణశైలికి ప్రభావితులయ్యారని చరిత్రకారుల అంచనా. కారణం? ఇక్కడ రాజుల శిల్ప మరియు నిర్మాణ శైలిలోని శిల్ప సంపద కర్ణాటకలో కూడా కనిపిస్తుంది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా సంవత్సరాల పాటు కొనసాగిన గెరిల్లా యుద్ధాలకు పానగల్లు కోట ప్రధాన కేంద్రమైంది. ‘మూసారేమండ్స్’ సారధ్యంలో నిజాం సేనలు చాలా కాలం పాటు కోట మీద దండయాత్ర జరిపాయి. వేలాది మంది సైనికులు, ప్రజలు ఆ గెరిల్లా యుద్ధంలో చనిపోయారు. నాడు వారు వాడిన మర ఫిరంగులు కోటలో ఇప్పటికి అక్కడక్కడా పడే ఉన్నాయి. కోట మొదటి ద్వారం నుండి పైకి చేరటానికి కనీసం 2 గంటల పాటు కొండలపై కఠిన ప్రయాసలో నడవవలసి ఉంటుంది. కోటలోని మొత్తం శిధిల భవనాలని పరిశీలించాలంటే ఎంత తొందరగా (అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు) తిరిగినా కనీసం రెండు రోజులు పడుతుంది. దీనిని బట్టి ఎంత విశాలమైన ప్రాంతంలో ఈ కోట నిర్మాణం గావించారో తెలుసుకోవచ్చు.
వివిధ కాలాల్లో పరిపాలించిన రాజు లు వారి వారి శిల్ప కళా శైలికి అను గుణంగా కొన్ని నిర్మాణాలు ఈ కోటలో గావించారు. ఆయా కాలాలలోని రాజులు ప్రతిష్ఠించిన ఉర్దూ, కన్నడ, తెలుగు శాసనాలు మనకు కోటలో కనిపిస్తాయి. అనేక హిందూ రాజుల కాలంలో అనేక మందిరాలు, అద్భుతమైన మహళ్ళు, సైనిక స్థావరాలు,అశ్వ, గజశాలలు నిర్మాణం జరుపుకుంటే, ముస్లిం రాజుల పాలనలో మసీదులు, దర్గాలు, రాణి మహళ్ళ నిర్మాణాలు జరిగాయి. దుండగుల చేతుల్లో ఆయా అద్భుత నిర్మాణాలన్నీ నామరూపాలు లేకుండా ధ్వంసం గావించబడ్డాయి. నేటికి వారి ధ్వంస రచన కొనసాగుతూనే ఉంది. కాకతీయ రాజుల కాలంలో ఈ కోట కడువైభవాన్ని చవిచూసిందని చెబుతారు. గణపతి దేవుడు, రుద్రదేవుడు, రాణి రుద్రమతోబాటు ప్రతాపరుద్ర చక్రవర్తి కూడా ఈ కోట ప్రాధాన్యతను గుర్తించి కోటలో పలు నిర్మాణాలు గావించినట్లు తెలుస్తోంది. కోట ప్రధాన దేవత దుర్గామాత (చిన్నమ్మ) మందిరం కోట ఎగువన మనం చూడవచ్చు. నాటి సైనికుల ఆయుధాలు మందుగుండు సామాగ్రిని నిల్వ చేయడానికి నిర్మించిన ప్రత్యేక ఆయుధాగారాలు, కళాకారుల నృత్య ప్రదర్శనల కోసం నిర్మించిన నృత్యశాలలు చూపరులను అబ్బురపరుస్తాయి. నాటి సైనికులకు నిరంతరంగా కఠినమైన యుద్ధ శిక్షణ ఈ కోటలో ఇచ్చేవారని, వారి కోసం విశాలమైన ఆవాసాలు కూడా నిర్మించారని చరిత్రకారుల కథనం.
కోటలోనికి ప్రవేశించడానికి ఏడు ప్రధాన ద్వారాలతో పాటు కోట చుట్టూ సైనిక పహరా కోసం నిర్మించిన అనేక బరుజుల శిధిలాలు ఈ కోటలో మనకు కనిపిస్తాయి. కోటలో అక్కడక్కడా పూర్తిగా శిధిలమై కనిపించే రాజప్రసాదాలు, మంత్రులు, సైనికుల ఆవాసాలు మనలను గత కాలపు వైభవానికి లాక్కెళతాయి. కోటలోని ప్రజల అవసరాల కోసం నిర్మించిన చిన్న చిన్న నీటి సరస్సులు, పెద్ద పెద్ద బావుల ఆనవాళ్ళు సంపూర్ణంగా అవశేష దశలో మనకు కానవస్తాయి. కోట చుట్టూ ప్రస్తుతం చిట్టడవి వ్యాపించి కోట దగ్గరకు వెళితే తప్ప కోట ఆనవాళ్ళు మనకు కనబడని స్ధితిలో పానగల్లు కోట ఉంది. నాటి పాలకులు అటు శైవాన్ని, ఇటు వైష్ణవాన్ని సమానంగా ఆదరించటంవల్ల ఆయా మందిరాల ఆనవాళ్ళు కోటలో ఎక్కువగా ఉన్నాయి.
ఎత్తయిన కొండపై నిర్మించిన ఈ కోటకు స్థానికులు వెళ్ళే సాహసం కూడా చేయరు. అటు అడవి జంతువులతో పాటు ఇటు నిధి నిక్షేపాల కోసం ఎంతకయినా తెగించే దుండగులకు ఈ కోట ఆవాసంగా మారటం అసలు కారణం. కోట ప్రవేశ ద్వారం వరకూ రోడ్డు నిర్మించి, పర్యాటకుల కోసం సరి అయిన వసతులు కల్పించి, కోట పరిరక్షణ చర్యలు చేపడితే తెలంగాణ రాష్ట్రంలోనే ఇది గొప్ప చరిత్రాత్మక పర్యాటక ప్రదేశంగా మనకు మిగిలిపోతుంది. వర్షా కాలంలో ఈ కోటకు వెళ్ళే సాహసం చేయకూడదు. అది ప్రమాదాలకు దారి తీయవచ్చు. ఇతర సమయాల్లో కనీసం ఐదారుగురు ఒక బృందంగా స్థానికుల సాయంతో కోటలోకి వెళ్ళటం మంచిది.