పల్లె పట్టులలోని ప్రకృతి అందాలను, పల్లీయుల, గిరిజనుల జీవనశైలిని ప్రతిబింబించే రంగుల చిత్రాలను బహురమ్యంగా చిత్రించడంలో చేయి తిరిగిన చిత్రకారుడు-యల్. నరేంద్రనాథ్.
లోగిశెట్టి బాలకృష్ణ-రత్నమ్మ దంపతులకు అరవైయేడు సంవత్సరాల క్రితం జన్మించిన నరేంద్రనాథ్‌కు బాల్యంనుంచి బొమ్మలు గీయడం సరదా. హైదరాబాద్ నగరంలోని కోఠిలో బాలకృష్ణకు ఫొటోఫ్రేమ్స్ దుకాణం ఉండడంవల్ల అప్పట్లో సుప్రసిద్ధులైన చిత్రకారులు-కొండపల్లి శేషగిరిరావు, సయ్యద్‌బిన్ మహ్మద్, చరణ్‌సింగ్‌గిల్, పి. చంద్రశేఖర్ మొదలగువారు వారు గీసిన చిత్రాలకు గాజు ఫ్రేములు వేయించడానికి వచ్చి కూర్చుండేవారు. వారి మాటలు వింటూ, వారి చిత్రాలు చూసి ప్రభావితుడై గాజుల మధ్యలో వచ్చే కాగితాలు తీసుకుని వాటిపై నఖలు చిత్రాలు గీసేవారు.
ఒకసారి శాంతినికేతనంలో చిత్రకళ నేర్చుకున్న మనీష్‌డే వారి దుకాణానికి వచ్చినప్పుడు నరేంద్రనాథ్ వేస్తున్న రాధాకృష్ణుల ప్రతిచిత్రం చూసి ముచ్చటపడి, ”మీ అబ్బాయికి చిత్రకళలో శిక్షణ ఇప్పించమని బాలకృష్ణకు చెప్పాడట. అప్పటికే నరేంద్రనాథ్ పాఠశాలలో జీవశాస్త్రం బొమ్మలు వేయడంలో క్లాసులో పేరెన్నికగన్నాడు. పైగా ఆయన చిన్నాయన జగన్నాయకుడు మంచి ఫొటోగ్రాఫర్ కావడంవల్ల ఆయనతోకలిసి సుందర ప్రకృతి చిత్రాలు తీయడానికి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడం, ముఖ్యంగా ఆయాచోట్ల సంతలపై దృష్టి కేంద్రీకరించడం అలవాటైంది. అట్లా మెల్లగా చిత్రాలు గీయడంవైపు ఆయన మనస్సు మళ్ళడంతో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయానికి చెందిన హైదరాబాద్‌లోని లలితకళల కళా శాలలో బి.ఎఫ్.ఏ.లో 1981లో చేరాడు. కానీ కుటుంబ పరిస్థితులవల్ల యేడాదికే ఆ చదువుకు స్వస్తి చెప్పాడు. పిదప ఇంటర్మీడియట్‌స్థాయి డ్రాయింగ్ పరీక్షకు కూర్చుని ఉత్తీర్ణుడయ్యాడు. ఉస్మాని యా విశ్వవిద్యాలయంనుంచి బి.ఏ. చదివాడు. ఆ తర్వాత కూడా చిత్ర కళపట్ల ఏమాత్రం వ్యామోహం తగ్గక పోవడంతో నరేంద్రనాథ్ కర్నాటక విశ్వవిద్యాలయంనుంచి బి.ఎఫ్.ఏ. పూర్తి చేశాడు.
ఒకవంక తన తండ్రినుంచి సంక్ర మించిన ఫొటోఫ్రేముల దుకాణం నిర్వహిస్తూనే చురుకుగా చిత్రాలు వేయడం కొనసాగించాడు. గిరిజనులు అడవులలో తాము సేకరించిన పదా ర్థాలను సంతలలో విక్రయించి, తమకు కావలసిన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. వారంవారం జరిగే సంతలకు గిరిజనుల జీవనశైలి పరిశీలించడానికి ఇప్పటికీ నరేంద్రనాథ్ వెళ్ళి, వారి తీరుతెన్నులు వెల్లడయ్యే స్కెచ్‌లు అక్కడికక్కడే వేసుకుని వచ్చి ఇంట్లో కూర్చుని తగిన రంగులు వేయడం అలవాటు చేసుకున్నారు.
లంబాడాలు, మేకలతోనో, కోడి పుంజులతోనో లేదా పావురాలతోనో వేర్వేరు సందర్భాలలో తమ సంప్రదాయ దుస్తులతో, ఆభరణాలు వేసుకుని ఉన్న చిత్రాలను ఆ పరంపరంలోనే ఆయన వేశాడు. ఆయా అంశాలకు తగిన విధంగా కొన్ని పెన్సిల్‌తో, మరికొన్ని చార్కోల్‌తో, ఇంకా కొన్ని ఆక్రిలిక్‌తో లేదా రెండింటి కలయికతో చూడముచ్చటగా వేశాడు.
రెండు మూడేండ్ల క్రితం వారి అబ్బాయి ఉండే అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు ప్రకృతి సిద్ధమైన ప్రాంతాలు, జలపాతాలు, చర్చ్‌లు సందర్శించి, అక్కడే ప్రతిరోజూ గంటలు గంటలు కూర్చుని నలభై అందాలు చిందే జలవర్ణాలు వేశాడు. స్థానికంగా లభించే రంగులు, డ్రాయింగ్ షీట్లపై నలభైరోజులపాటు, రోజుకోచిత్రం వేస్తూ నరేంద్రనాథ్ ఈ పనిలో పూర్తిగా మునిగిపోయాడు. ప్రధానంగా గ్రాండ్ కెనియన్, బ్రేస్ కినియన్ ప్రకృతి చిత్రాలు, సంధ్యా సమయంలో బంగారు వర్ణాలు బింగే యస్‌మైట్ బిల పాత చిత్రాలు, ఆడ్నిస్ లోయచిత్రం, హరిజోనాలోయ చిత్రం, ఆంజిలెస్ చర్చ్, ప్రెస్‌బైటెర్టన్ చర్చ్, సాండియెగో బీచ్ చిత్రాలు చెప్పుకోదగినవి.
తనలోని కళా హృదయాన్ని వ్యక్తపరుస్తూ పెన్సిల్ చిత్రాలు మొదలుకొని చార్కోల్‌తో లేదా జలవర్ణాలతో, చాలాసార్లు ఆక్రిలిక్‌తో సృజనాత్మకమైన వాస్తవిక ధోరణి చిత్రాలు వేయడం నరేంద్రనాథ్ నైజం. కొంతకాలం సహచర చిత్రకారులతో కలిసి చురుకుగా గ్రాఫిక్ చిత్రాలు కూడా రూపొందించాడు. కానీ ప్రస్తుతం ఆ ప్రక్రియ జోలికి వెళ్ళడం లేదు. గ్రాఫిక్ చిత్రాలు కేవలం పోటీ ప్రదర్శనలకు పంపడానికే ఎక్కువ ఉపయోగపడతాయితప్ప వాటికి ఆశించిన మార్కెట్ ఉండదంటాడు నరేంద్రనాథ్. ఎంతైనా అవి ప్రింట్లు కదా? కొందరు చిత్రకారులు ఇటీవల ప్రింట్లతోపాటు ఆ చిత్రం గీసిన ప్లేట్ కూడా విక్రయిస్తున్నారు. ఆ ప్లేట్ తీసుకుని స్వయంగా ప్రింట్లు వేసుకున్నంత మాత్రాన, ఆ చిత్రకారుడి సంతకం ఆ కొత్త ప్రింట్‌పై ఉండదుకదా? చిత్రకారుడి సంతకంలేని చిత్రానికేం విలువ ఉంటుంది? అంటారాయన.
హైదరాబాద్‌లోని కళాభవన్‌లో 1975లో ప్రకృతి చిత్రాల వ్యష్టి చిత్రకళా ప్రదర్శన నిర్వహించిన నరేంద్రనాథ్ 1976లో గోవాలోని కళా అకాడమీలోనూ ఏర్పాటు చేశా డు. ఆ తర్వాత గ్రామీణ బొమ్మల వ్యష్టి చిత్రకళా ప్రదర్శన 1982లో, 1983లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో 1985 లో ముంబైలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించాడు. పిదప ప్రకృతి, గ్రామీణుల బొమ్మల కలయికతో వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలు-1993లో హైదరాబాద్‌లోని కళాభవన్‌లో, 1997, 1998లో ముంబైలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో 1998లో, 2005లో హైదరాబాద్‌లోని లక్ష్మణ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేశాడు.
ఇక సమష్టి చిత్రకళా ప్రదర్శనలలోనైతే 1981, 1983, 1985, 2000లో ముంబైలో, 1983, 1985, 1988లో హైదరాబాద్‌లోని కళాభవన్‌లో, 2000లో శిల్పారామంలో, 2001లో హోటల్ కాకతీయలో, 2001, 2003లో పెగాసన్ ఆర్ట్ గ్యాలరీలో, 2006, 2008లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పాల్గొన్నాడు. 1985లో న్యూఢిల్లీలోని త్రివేణి సంగమంలో, 2002, 2004లో అఖిల భారత లలితకళలు, హస్త కళా సంస్థలో, 2003లో లలిత కళా ఆర్ట్ గ్యాలరీలో, 2007లో కలకత్తాలోని అకాడమి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో, 2008లో దుబాయ్‌లోని కమ్యూనిటీ థియేటర్, 2010లో భోపాల్‌లోని భారత్‌భవన్‌లో పాల్గొన్నాడు.
అంతేకాదు హైదరాబాద్‌లోని శిల్పారామంలో 1999, 2001లో నిర్వ హించిన చిత్రకారుల శిబిరంలో పాల్గొని చిత్రాలు వేశాడు. 2000లో ఉగ్ర వాదానికి వ్యతిరేకంగా చిత్రాలు వేయడానికి అఖిలభారత లలితకళలు, హస్తకళలసంస్థ నిర్వహించిన మిలీనియం శిబిరంలో, జెఎన్‌టియు లలితకళల కళాశాల ఏర్పాటు చేసిన శిబిరంలోనూ పాల్గొన్నాడు. ఇంకా 2002లో శంకరభారతి శిబిరంలో, 2003లో రాజస్థాన్‌లో, కర్నాటకలో అఖిలభారత కళాకారుల శిబిరంలో, 2004లో న్యూఢిల్లీలో అఖిలభారత లలితకళలు, హస్త కళల సంస్థ శిబిరంలోనూ పాల్గొన్నారు. 2004లో న్యూఢిల్లీ-మనాలి నీటిరంగుల చిత్ర శిబిరంలో, 2005లో నాగార్జునసాగర్‌లో జాతీయ కళాశిబిరంలో, 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు చేసిన శిబిరంలో, పంజాబ్‌లో అఖిలభారత కళా శిబిరంలో, 2013లో హైదరాబాద్‌లో బి.డబ్ల్యూ.ఎం. కళాకారుల శిబిరంలో, న్యూఢిల్లీలో లలితకళా అకాడమీ శిబిరంలో, 2014లో జైపూర్‌లో జరిగిన అంతర్జాతీయ కళోత్సవంలో, అదే యేడాది హైదరాబాద్‌లో ఆర్ట్‌ఎట్ తెలంగాణ శిబిరంలో పాల్గొని తన ముద్రగల చిత్రాలు వేశాడు.
నరేంద్రనాథ్ గీసిన పలు చిత్రాలకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. వాటిలో ప్రస్తుతించదగినవి:- 1978, 1985లో గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ అవార్డులు, 1978లో విశాఖపట్నం చిత్రకళా పరిషత్ అవార్డు వచ్చింది. 1979లో మధ్యప్రదేశ్‌లోని మహాకోశల్ పరిషత్తు అవార్డు, భారత కళాపరిషత్ అవార్డు, విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఆర్ట్స్ అకాడమి అవార్డు లభించింది. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అవార్డులైతే-1977, 1978, 1979, 1981లో వీరిని వరించి వచ్చాయి. 1977లోనే అఖిలభారత లలితకళలు-హస్తకళల సంస్థ (న్యూఢిల్లీ) అవార్డు, 1988లో సిద్ధిపేట లలితకళా అకాడమి అవార్డు గెలుచుకున్నారు. 2004లో ప్రపంచ ప్రసిద్ధమైన సాలార్‌జంగ్ మ్యూజియం సీనియర్ చిత్రకారుడుగా గుర్తించి సత్కరించింది.
కేవలం చిత్రకారుడుగానేకాకుండా సంస్థ నిర్వాహకుడుగాను నరేంద్రనాథ్‌కు మంచి పేరున్నది. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ 1981 నుంచి ఒక దశాబ్దకాలం ఈయన గౌరవ కార్యదర్శిగా ఉండి కళారంగానికి ఎంతో సేవ చేశాడు. ఆ తర్వాత మరోసారి 1999-01లోనూ ఆయన ఆ సంస్థకు గౌరవ కార్యదర్శిగా, 2005లో ఉపాధ్యక్షుడుగా వ్యవహరించాడు. ఇంతేకాదు-1982-83లో ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమి జనరల్ కౌన్సిల్ సభ్యుడుగా, ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ గ్రూప్ గౌరవ కార్యదర్శిగా ఉన్నారు.
వీరి రూపులుదిద్దిన చిత్రాలు యూయస్‌ఏ, ఆస్ట్రేలియా, జర్మనీ, యూ.కే.లలో ఎందరో కళాభిమానులు సేకరించాడు. ముంబై వకీల్ అండ్ కో, భూపాల్ భారత్‌భవన్, అఖిలభారత లలితకళలు-హస్తకళల సంస్థ (న్యూఢిల్లీ) హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం, సాలార్‌జంగ్ మ్యూజియం, పొట్టిశ్రీరామూలు తెలుగు విశ్వవిద్యాలయం, విశాఖపట్నం చిత్రకళాపరిషత్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (హైదరాబాద్), ఐటీసీ గ్రూప్‌కు చెందిన హోటల్ గ్రాండ్ కాకతీయ, మెసర్స్ విప్రో కంపెనీ, పద్మశ్రీ జగదీశ్ మిత్తల్, అపోలో ఆస్పత్రి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లు కూడా కళాభిరుచితో వీరి చిత్రాలు సేకరించారు.
ప్రస్తుతం నరేంద్రనాథ్ తొలిదశనుంచి, ఈనాటి వరకు తాజాగా వేస్తున్న చిత్రాల సింహావలోకనం చేసే (రెట్రాస్పెక్టివ్) చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేసే ప్రయత్నంలోఉన్నారు. ఈ సందర్భంలోనే తన చిత్రకళా యాత్రను ప్రతిబింబించే చక్కని సచిత్రగ్రంథం (కాటలాగ్) ప్రచురించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు.