ప్రచండ పరశురామం
ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు రచించి అముద్రితంగా మిగిలిన గ్రంథాలలో ప్రచండ పురశురామం ఒకటి.563 గద్య పద్యాలతో కూడిన మూడాశ్వాసాల చంపూ ప్రబంధం. పరశురామ ప్రాభవాన్ని చెప్పే ప్రౌఢరచన. వేలుపుగొండ లక్ష్మీనృసింహునికి అంకితం. క్రీ.శ. 1929 నాటి రచన (1857 శాలివాహనశకం).

డా|| లక్ష్మణ చక్రవర్తి
tsmagazine

అవతారిక విశేషాలు:

ఇష్టదేవతాస్తుతి, సుదర్శన పాంచజన్యాది ఆయుధస్తుతి, అనంత గరుడ విష్వక్సేన శఠగోప రామానుజ వరవరముని మొదలైన వైష్ణవ ఆళ్వారుల ఆచార్యుల స్తుతితోబాటు తనకు విద్యాగురువైన దరూరి లక్ష్మణాచార్యులు, ఆధ్యాత్మిక గురువైన మరింగంటి లక్ష్మణదేశికుల స్తుతి ఉన్నాయి. తన వంశచరిత్ర, తాను రచించిన కావ్య వివరాలు పేర్కొన్నారు. భాగవతగోష్ఠిలో కోయిల్‌ కందాడై రంగాచార్యుల వారి కోరిక మేరకు పరశురామ కథను రచిస్తున్నానని చెప్పుకున్నారు.

కథాసంగ్రహం :

పౌరాణిక కథకు ప్రబంధరూపం ప్రచండ పరశురామం. ఆవేశావతారమైన పరశురాముని ప్రాభవాన్ని చెప్పే రచన. అంతర్లీనంగా పరతత్త్వ నిరూపణ. నారాయణ పారమ్యాన్ని ఈ ప్రబంధం బోధిస్తుంది. భృగుమహర్షి ద్వారా పరతత్త్వ నిరూపణం, పరశురామావతార కారణం, క్షత్రియాంశలో పరశురాముడు జన్మించడానికి కారణం, కార్తవీర్యార్జునితో యుద్ధం, క్షత్రియవంశ నాశనం, చివరికి పరశురాముడు రామావతారంలో లీనం కావడంతో కావ్యం ముగుస్తుంది. నిజానికిది పౌరాణిక కథను చెప్పడం కొరకే రచించిన ప్రబంధంగా కనిపించినా, మొదటి అశ్వాసమంతా విశిష్టాద్వైత తత్త్వాన్ని బోధిస్తుంది. పరశురామావతార గాథ ద్వారా కవి ధర్మ ప్రాధాన్యాన్ని బోధించారు.

కావ్య విశేషాలు :

ప్రక్రియా పరంగా ఈ ప్రబంధం అవతార మాహాత్మ్య ప్రబంధం, ప్రబంధాలలో కనిపించే వర్ణనలన్నిటిని కవి ఇందులో రచించారు. ప్రాచీన కావ్య వాఙ్మయ పద్ధతినే ఈ విషయంలో అనుసరించారు. కథాపరంగా ఈ రచన పూర్తిగా పౌరాణిక పద్ధతిని, పురాణ ఆధారాలను గ్రహించింది కానీ ఈ ప్రబంధం ప్రథమాశ్వాసం గమనించినపుడు పరశురామ కథను మిషగా చేసుకుని నారాయణ పారమ్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారని చెప్పాలి.

ప్రచండ పరశురామంలోని ప్రథమాశ్వాసమంతా తత్త్వత్రయం (పిళ్ళైలోకాచార్యులు)లోని ఈశ్వర ప్రకరణానికి వివరణగా కనిపిస్తుంది. అందులోని సూత్రాలు ఏవిధమైన క్రమాన్ని అనుసరించాయో అదేవిధంగా వీరి పద్యాల క్రమం నడిచింది. పిళ్ళై లోకాచార్యుల అష్టాదశ రహస్యం (తత్త్వత్రయం) మొదలైన సంప్రదాయ గ్రంథాల లోని విషయాలను అనువదించి చెప్పినారు. అవతారాలలోని ప్రాధాన్యాన్ని బట్టి ఆరువిధాలుగా లీలావిభూతి కన్పిస్తుంది. అంశావ తారాలు, అంశాంశలు, ఆవేశావ తరుణులు, కళాకలితులు, పూర్ణులు, పూర్ణతములు అని విశిష్టాద్వైత సంప్రదాయం అవస్థాషట్కాన్ని వివరిం చింది. వీటి వివరణను విపులంగా ఠంయాలవారు పేర్కొన్నారు. అవస్థా షట్కమని, అవస్థా పంచకమని చెప్పబడే వీటి వివరణలు చేశారు.

తత్త్వత్రయంలోని ఈశ్వర ప్రకరణం ఈశ్వర స్వరూ పాన్ని ఐదు రకాలుగా చెప్పింది. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలనేవి అవి. వీటి పరిపూర్ణ వివరణ, షట్త్రింశద వతార లక్షణం, వివరణాత్మకంగా తత్త్వత్రయంలోని ఈశ్వర ప్రకరణ పద్ధతిలో నడిచింది. అర్చావతార లక్షణం, నిత్యవిభూతి, లీలా విభూతి లక్షణాలు ఆ తర్వాత క్రమంగా వివరించారు. భగవన్నామమాహాత్మ్యం చెప్పి మూర్తిత్రయంలో మోక్షప్రదా తను తెలుసుకొనడానికి భృగుమహర్షిని పంపే కథను ఈ ఆశ్వాసంలో రచించారు.

అర్చావతార లక్షణంలో నారాయణుడు మర్త్యరూపుడైన మానవుడి హృదయంలో వేంచేసి ఉంటాడని, అటువంటి హృదయం కలిగినవారు ఆచార్యులని వారే మోక్షోపాయ బోధకులని వర్ణించారు. ప్రథమాశ్వాసమంతా ఈశ్వర తత్త్వాన్ని ప్రాధాన్యాన్ని చెప్పే విధంగా సాగింది. మోక్షాన్ని ప్రసాదించడానికి శ్రీమన్నారాయణుడే పరతత్త్వంగా, మోక్షప్రదాతగా విశిష్టాద్వైతం భావిస్తుంది. ఆ అంశాన్ని భృగుమహర్షి కథ ద్వారా కవి నిరూపించారు. రాజస, తామస, సాత్త్వికగుణాలకు వరుసగా బ్రహ్మ, శివుడు, విష్ణువు అధికారులు. సాత్త్వికగుణ భూయిష్టుడైన శ్రీమన్నా రాయణుడే మోక్షప్రదాతగా నిర్ణయించి ప్రథమాశ్వాసం ముగించారు. ఈ ఆశ్వాసం ప్రచండ పరశురామం నుంచి ప్రత్యేకించి చూస్తే ‘ఈశ్వరతత్త్వం’ చెప్పిన ఏకాశ్వాస ప్రబంధంగా నిలుస్తుంది.

ఆవేశావతారాలు గౌణమైనవి. వీటిని ఆరాధించకూడదన్న నియమాన్ని విశిష్టాద్వైతం చెబుతుంది. ఈ అంశాన్ని ఠంయాలవారు కూడా చెప్పారు. అయినా ఎందుకు ప్రచండ పరశురామ ప్రబంధాన్ని రచించారు అన్న సందేహం కలుగుతుంది. శ్రీరాముని పరతత్త్వ నిరూపణకు పరశురామావతారం ఉపయోగిస్తుంది. పరశురాముని మిషగా శ్రీరాముని పరతత్వాన్ని ఈ ప్రబంధం నిరూపిస్తుంది. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘట్టం ప్రబంధం చివర ఉంది.

”పుణ్యులెల్లరు స్వర్గంబు బోయి రాను
తంతియలు గట్టి యుంటి నా తరుణమునకు
హాని చేకూరు గావున నట్టి పథము/పైన నస్త్రంబు వేసి నబతుక సేయు”

స్వర్గానికి భార్గవరాముడు వేసిన దారిని తొలగించడం ద్వారా ఇక్కడ రాముడు పరతత్త్వమయ్యాడు. ఇదే అంశాన్ని కవి చివరి పద్యంలో ఈ విధంగా చెబుతున్నారు.

”కావున షడ్గుణ్యావిర్భావ
రఘూత్తంసుడరయ పరిపూర్ణుం దా
నావేశావతరణ సంభావితు
భృగు రామునంశ ఫణితిగ్రహించెన్‌”

రాముడు షడ్గుణ సంపన్నుడు. భృగురాముడు అంశావతారుడు. ఆవేశవతారుడు. కావ్య ప్రారంభంలో చెప్పిన సాత్త్విక గుణ తత్త్వం శ్రీరామునిలో ఉంది. ఆ తత్త్వాన్ని నిరూపించడానికి ప్రబంధ రచన ఈ పద్ధతిలో జరిగిందన్నది ఆద్యంతాలను బట్టి చెప్పవచ్చు.

పరశురాముడికి కవి వేసిన విశేషణం ప్రచండం. ప్రచండ శబ్దానికి సూర్యుడన్న అర్థం ఉంది. తాత్కాలికమైనది ఆవేశం. సూర్యుడి వేడి కూడా అంతే. కావ్యమంతా పరశురాముడి ప్రయోజనం సుదర్శనుని అహాన్ని దూరం చేయడం, ధర్మస్థాపనకు ఆయుధం కంటే ధార్మికబలం, ధార్మికచైతన్యం ప్రధానమన్నది ఈ ప్రబంధం చెప్పే అంశం. ఈ అంశాన్ని కొంత వివరంగా ఇలా చెప్పవచ్చు.

ఏ సత్కార్యాచరణం ఏ నీతి వర్తనం మానవులను అసంబాధితంగా, అనాకులితంగా జీవింపజేస్తుందో అదే ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరించడమే మానవాళి కర్తవ్యం. ఈ ఆచరణమే అందరినీ రక్షిస్తుంది. ధర్మరక్షణ లోక రక్షణానికి మూలం. ధర్మరక్షణం బ్రాహ్మణులు, లోకరక్షణం క్షత్రియులు చేయాలి. ఈ బ్రహ్మ క్షత్ర తేజస్సులు రెండు పరస్పరావగాహనంతో సంఘాన్ని కాపాడాలి. ఈ రెంటి మధ్య స్పర్ధ ఏర్పడితే లోకసంక్షోభం ఏర్పడుతుంది. క్షత్రియులు ప్రశస్తమైన ఆర్షతేజాన్ని తిరస్కరించకుండా దాని సహాయంతో లోకపాలన చేయాలి. నీతిమార్గంలో నడచిన పరిపాలన లోకకళ్యాణకారకమవుతుందన్నది పరశురామా వతార ప్రబంధం నిరూపించే పరమార్థం. ఇది లౌకికార్థం.

విష్ణుమూర్తి పరశురాముడుగా సుదర్శనుడు కార్త వీర్యుడుగా జన్మిస్తారు. సుదర్శనుడు శత్రుసంహారమంతా తానే చేస్తున్నానని అహంతో ఉంటాడు. ఆ అహాన్ని తొలగించడానికి ఈ అవతారం ఎత్తుతాడు విష్ణుమూర్తి. సుదర్శనుడు భగవద్దాసుడు, రక్షణ చేయవలసినవాడు. ధర్మరక్షణ, లోక రక్షణం చేయడానికి భగవంతుడు పయోగించుకునే ఆయుధం. అతడు తన ధర్మాన్ని విస్మరించడం వలన లోకరక్షణానికి భంగం ఏర్పడుతుంది. ధర్మరక్షణ, లోకరక్షణలు చేసే భగవంతుడికి పరివారమంతా నిమిత్తకారణమేనన్నది ఈ ప్రచండ పరశురామం బోధించే మరో పరమార్థం. ఈ రచన ధర్మాచరణమే ప్రధానమనే అంశాన్ని బోధిస్తుందనడానికి ఉదాహరణగా నిలిచే పద్యం ఠంయాలవారు రచించారు.

”వేదచోదిత మార్గముల్‌ వెలితిజేసి
ఇష్టమగు వాని నడుచుట శిష్టమనుచు
నడువ జాలుదురే కాని నడచుటేటి
ధర్మమని జూడరెప్పుడు దాతలెల్ల”

ప్రాచీనమైనదంతా పనికిరాదని, ఆర్షధర్మం, వైదికధర్మం బోధించే తత్త్వమంతా పనికిరాదని భావించే సమకాలీన సమాజానికి సార్వకాలికమైన జవాబును ఠంయాలవారు ఈ కావ్యం ద్వారా బోధించారు.

Other Updates