pandugaluభారతీయ సంస్కృతి ధర్మ స్వరూపం కలిగింది. మన సనాతన ధర్మం, అహింస ప్రపంచానికే అనుసరణీయమైంది. ప్రకృతినుంచే మన సంస్కృతి పరిఢవిల్లింది. ఈ నేల, ఈ గాలి, ఈ నీరు నాగరికతకు ఊపిరిపోశాయి. పూర్వం అరణ్యాలలో వేద పాఠశాలలు ఉండేవి. విద్యార్థులు వేదజ్ఞానాన్ని అభ్యసించేవారు. ప్రకృతిలోనే విద్యాపరిమళం వెల్లివిరిసింది. మహర్షులు అరణ్యాలలోనే తపస్సు చేసేవారు. ఆదిమానవుని జీవన పయనం అడవులలో, కొండగుహల్లో, చెట్ల తొర్రలలో సాగింది. ఆదిమకాలంనుండే మానవునికీ, ప్రకృతికీ విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది.

నేడు ప్రకృతితో ముడిపడివున్న కొన్ని సాంప్రదాయిక పండుగల్నీ మనం జరుపుకుంటున్నాం. ఈ పండుగల వెనుక పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సమతుల్యత, ప్రకృతి ఆరాధన దాగి ఉన్నాయి. కానీ నేటి ఆధనిక జీవనంలో సాంప్రదాయక విలువలు మరిచిపోయి ప్రకృతికి విరుద్ధంగా పండుగల్ని జరుపుకుంటున్నారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. కార్బన్‌ ఉద్ఘారాలు ఎక్కువై కాలుష్యం పెరిగిపోయిన తీరునూ కార్బన్‌-డై-ఆక్సైడ్‌ పరిమాణం పరిమితికిమించి పోయింది. భూ ఉష్ణోగ్రత అధికమై భూగర్భజలాలు అందనంత లోతుకు పోతున్నాయి. ఫలితంగా ఆధునిక ప్రజలు ఎదుర్కొంటున్న కరువుకాటకాలవంటి అనర్థాల గురించీ తెలియజేస్తూ ప్రజలను జాగృతపరిచే పుస్తకం పర్యావరణ పండుగలు.

ఈ నేలమీద జీవరాశుల ఉనికి ప్రశ్నార్థకమైపోతున్న విధానాన్నీ, ‘రాబందులు’వంటి పక్షి జాతులు అంతర్థానమౌతున్న తీరునూ చక్కగా వివరించిందీ పుస్తకం. వాటిని రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ సూచిస్తుంది. ఇంకా వ్యర్థపదార్థాలనుండి సేంద్రీయ ఎరువులు, సింథటిక్‌ డీజిల్‌, విద్యుత్‌ను తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏయే దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారో తెలుసుకోవాలంటే ఈ పుస్తకంలోని రీసైక్లింగ్‌ దినోత్సవంగురించి చదవాల్సిందే!

‘పర్యావరణ పండుగలు’ పుస్తకంగా రచయితలు తోట లక్ష్మణరావు, నిజాం వెంకటేశం పర్యావరణంతో సంబంధం కలిగివున్న పదిహేడురకాల దినోత్సవాల గురించి ఆసక్తికరమైన విషయాల్ని ప్రస్తావించారు. భోపాల్‌ విషవాయువును విషయ సూచికలో ‘శోకదినం’గా పేర్కొన్నారు. ఒక దుర్ఘటనగా ఇస్తే బాగుండేది. ఈ చిన్న విషయం మినహాయిస్తే పుస్తకం ఎంతో ప్రయోజనకారిగా ఉంది.

Other Updates