దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్) మరోసారి అఖండ విజయం సాధిం చింది. రాష్ట్రంలో టి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలోకి రావడం వరుసగా ఇది రెండవసారి. 2014లో జరిగిన ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినప్పటికీ కొత్తగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టి.ఆర్.ఎస్ పార్టీయే ఆధిక్యత సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోగలిగింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సెప్టెంబరు 6న శాసన సభను రద్దుచేయడంతో, తిరిగి 2018 డిసెంబరు 7న జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో మెత్తం 119 స్థానాలలోనూ ఒంటరిగా పోటీచేసిన టి.ఆర్.ఎస్ పార్టీ మొత్తం 88 స్థానాలలో విజయ ఢంకా మోగించింది.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం, సి.పి.ఐ, తెలంగాణ జన సమితి పార్టీలు ప్రజాఫ్రంట్ పేరిట కూటమిగా ఏర్పడి పోటీ చేసినప్పటికీ ప్రజాదరణ పొందలేక పోయాయి. ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీకి 19, తెలుగుదేశం పార్టీకి 2 సీట్లు మాత్రమే లభించాయి. కాగా, ఒంటరిగా పోటీచేసిన ఎం.ఎం.ఐ 7 స్థానాలను, బి.జె.పి 1 స్థానాన్ని, మరో 2 స్థానాలలో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
ఉమ్మడి జిల్లాలలో టి.ఆర్.ఎస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. ఆదిలాబాద్ లో మొత్తం 10 స్థానాలలో 9 స్థానాలలో టి.ఆర్.ఎస్ విజయం సాధించింది. నిజామాబాద్ లోని మొత్తం 9 స్థానాలలో 8, కరీంనగర్ లోని మొత్తం 13 స్థానాలలో 11, మెదక్ జిల్లాలోని మొత్తం 10 స్థానాలలో 9, రంగారెడ్డి జిల్లాలో మొత్తం 14 స్థానాలలో 11, హైదరాబాద్ లో మొత్తం 15 స్థానాలలో 7, మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 14 స్థానాలలో 13, నల్లగొండలో మొత్తం 12 స్థానాలలో 9, వరంగల్ లో మొత్తం 12 స్థానాలలో 10 స్థానాలను గెలుచుకున్న టి.ఆర్.ఎస్ పార్టీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాలలో ఒక స్థానంలో గెలుపొందింది.
శేరిలింగం పల్లిలో అత్యధికం, భద్రాచలంలో అతితక్కువ ఓటర్లు
2018 డిసెంబరు 7న జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో మొత్తం ఓటర్లు – 2,80,64,684. పురుషులు – 1,41,56,182. మహిళలు – 1,39,05,811, థర్డ్ జెండర్ – 2,691 ఉన్నారు. అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం – శేరిలింగంపల్లి. ఈ నియోజకవర్గంలో 5,75,541 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం – భద్రాచలం. ఇక్కడ మొత్తం ఓటర్లు 1,37,319. అత్యధికంగా పురుష ఓటర్లు ఉన్న నియోజకవర్గం – శేరిలింగంపల్లి. ఈ నియోజకవర్గంలో మొత్తం 3,07,348 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అలాగే, తక్కువ మంది పురుష ఓటర్లు ఉన్న నియోజకవర్గం – భద్రాచలం. ఇక్కడ 66,604 మంది మాత్రమే పురుష ఓటర్లు ఉన్నారు. అత్యధిక మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గం – కుత్బుల్లాపూర్. ఇక్కడ 2,41,064 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా, అతి తక్కువ మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గం – భద్రాచలం. ఇక్కడ 70,691 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
దివ్యాంగులకు సౌకర్యాలు
రాష్ట్రంలో ఓటుహక్కుగల దివ్యాంగులు అంతా ఓటుహక్కు వినియోగించుకొనే విధంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో దివ్యాంగులైన ఓటర్లు 4,57, 809 మంది ఉన్నారు. వీరిలో చూపులేనివారు 60,012 మంది, మూగ, చెవిటివారు 50,714, నడవలేని వారు 2,52,790 మంది, ఇతర దివ్యాంగులు 95,116 మంది ఉన్నారు.
దివ్యాంగులు ఓటుహక్కు వినియోగించుకోవడానికి సహకరించేందుకు గాను 31 జిల్లాలలో జిల్లా సమన్వయ కర్తలను ఏర్పాటు చేశారు. ఇందుకుగాను ఎన్.ఎస్.ఎస్, ఎన్.సి.సి, ఎన్.వై.కె వాలెంటీర్లు 29,541 మందిని వినియోగించారు. అలాగే, పోలింగ్ కేంద్రాలవద్ద అవసరమైన ర్యాంపులు, ఇతర సౌకర్యాలు కల్పించడం జరిగింది.
పోటీలో 1821 మంది
రాష్ట్రంలో 119 శాసన సభా నియోజకవర్గాలకు గాను మొత్తం 1821 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో ఒక్క మల్కాజిగిరి నియోజకవర్గంలోనే అత్యధికంగా 42 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాగా, తక్కువ సంఖ్యలో బాన్సువాడ నియోజకవర్గంలో కేవలం 6 గురు మాత్రమే పోటీ చేశారు. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు 515 మంది పోటీ చేశారు. గుర్తింపులేని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 1306 మంది పోటీ చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థులు – 99, బి.జె.పి అభ్యర్థులు -118 మంది, సి.పి.ఎం – 26, సి.పి.ఐ -3, ఎన్.సి.పి – 22, బి.ఎస్.పి – 107, టి.ఆర్.ఎస్-119, టి.డి.పి – 13, ఎం.ఐ.ఎం – 8 మంది పోటీ చేశారు. 25 నియోజక వర్గాలలో 15 మంది వరకూ పోటీలో ఉన్నారు. 78 నియోజకవర్గాలలో 16 నుంచి 31 వరకూ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 16 నియోజకవర్గాలలో 32 కంచే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఇ.వి.ఎంలు, వి.వి.ప్యాట్లు
రాష్ట్రంలో పారదర్శకంగా పోలింగ్ నిర్వహణలో భాగంగా తొలిసారిగా వి.వి. ప్యాట్లు వినియోగించారు. ఈ ఎన్నికలలో మొత్తం 55,329 బ్యాలెట్ యూనిట్లు వినియోగించగా, 39,763 కంట్రోల్ యూనిట్లు, 42,751 వి.వి.ప్యాట్లు వినియోగించారు. ఈ పరికరాలకు అవసరమైన మరమ్మతులు తక్షణం చేసేందుకు 31 జిల్లాలలో 238 మంది బెల్ ఇంజనీర్లతో కూడిన 31 బందాలను సిద్ధంగా ఉంచి ఏవిధమైన అవాంతరాలు రాకుండా చూశారు.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఈవిఎంల టాంపరింగ్ జరిగిందని కొందరుచేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఈవిఎంల కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర బలగాలు భద్రతగా ఉన్నాయని, భెల్ కంపెనీ అధికారులు కూడా తప్పిదాలు లేవని స్పష్టం చేశారని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిందని సీఈఓ తెలిపారు. ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించామన్నారు.
రికార్డు స్థాయిలో పోలింగ్
రాష్ట్రంలో పరిశీలకుల అంచనాలను కూడా చిత్తుచేస్తూ, పోలింగ్ భారీగా జరిగింది. ఓటర్లు వెల్లువలా పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. మరీ ముఖ్యంగా నగర వాసుల కంటే గ్రామీణ ప్రాంత ఓటర్లు మరింత చైతన్యవంతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్రంలో మొత్త 73.2శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలోని 74 నియోజకవర్గాలలో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదుకాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోని 24 సెగ్మెంట్లలో మాత్రం పోలింగ్ 50 శాతానికి మించకపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది. పోలింగ్ శాతం పెంచడానికి ఎన్నికల కమీషన్ ఎంతగానో ప్రయత్నించినప్పటికీ నగరవాసులు ఆసక్తి కనబరచక పోవడం ఆశ్చర్యకరం.రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో సగటున 73.2 శాతం పోలింగ్ నమోదయినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాథికారి రజత్ కుమార్ వెల్లడించారు. 2014 ఎన్నికలలో పోల్చి చూస్తే ఈ సారి సుమారు 3.70 శాతం మేర పోలింగ్ పెరిగింది. 2014 ఎన్నికలలో 69.5 శాతం పోలింగ్ జరిగింది.
7 నియోజకవర్గాలలో 90 శాతం పైగా…
రాష్ట్రంలో 7 నియోజకవర్గాలలో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయింది. ఖమ్మం జిల్లాలోని మథిర నియోజకవర్గంలో అత్యధికంగా 91.65 శాతం పోలింగ్ నమోదు అయింది. ఆ తర్వాత నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలో 91.33 శాతం, మునుగోడులో 91.07 శాతం, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో 90.99 శాతం, వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలో 90.53 శాతం, భువనగిరిలో 90.53 శాతం పోలింగ్ రికార్డు అయింది. కాగా, రాష్ట్రంలోనే అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గం లో కేవలం 40.18 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది.
ఈ ఎన్నికలలో మహిళలు పెద్దఎత్తున పాల్గొనడం మరో విశేషం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో దాదాపు మహిళలంతా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో మహిళల ఓటింగ్ శాతం 99.74 గా నమోదయింది. కాగా, అతి తక్కువగా చార్మినార్ నియోజకవర్గంలో 37.95 శాతం మహిళల పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో మొత్తం 73.2 శాతం మొత్తం పోలింగ్ జరుగగా, పురుషుల ఓటింగ్ శాతం 72.54, మహిళల ఓటింగ్ శాతం 73.88గా నమోదు అయింది. మొత్తం 14 జిల్లాలలో మహిళలు పురుషులకంటే అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు.
పటిష్ట పోలీస్ భద్రత కారణంగా పోలింగ్, కౌంటింగ్‌ల సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబరు 11న పోలీస్ భద్రతతోపాటు, సీసీ కెమేరాల నిఘాలో కౌంటింగ్ నిరాటంకంగా సాగిపోయింది.
మొత్తం మీద నామినేషన్లు దాఖలు నాటినుంచి, ప్రచార పర్వం, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలన్నీ ప్రశాతంగా ముగియడంలో పోలీస్, తదితర అధికార యంత్రాంగం క్రియాశీలక, ప్రశంసనీయమైన కృషి చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాలు – 119