గజ్వేల్ సమగ్రాభివృద్ధికి సూచికలు
గ్రామ స్థాయిలో ప్రజలు వారి అవసరాలను వారే గుర్తించి వాటిని ప్రభుత్వానికి అందచేస్తే వాటినుండే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, ఆ దిశగానే గజ్వేల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కొనసాగుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి సంస్థ గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (గడా) ప్రత్యేక అధికారి హన్మంతరావు తెలిపారు.
ఆయన, తెలంగాణా పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను పేర్కొన్నారు. సహజంగా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రూపొందిన పద్ధతుల ప్రకారం గ్రామస్థాయిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఈ మేరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశారు.
అలాగే మండలస్థాయిలో కూడా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన జరిగినట్లు తెలిపారు. అన్ని కలిపి నియోజకవర్గ స్థాయిలో అమలు జరుగుతాయని హన్మంతరావు పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కంకణబద్ధులై ఉన్నారన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో పరిశ్రమలు, వ్యవసాయం, రైతులకు మార్కెటింగ్ సౌకర్యం, సంక్షేమ పథకాల అమలు, అన్ని గ్రామాలకు రోడ్డు, రవాణా సౌకర్యం కల్పించడానికి కృషి జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలోని కొండపాక, తూప్రాన్, వర్గల్, ములుగు, గజ్వేల్, జగదేవ్‌పూర్ సహా ఆరు మండలాలలో ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా మార్చడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కేసీఆర్ ఆదేశించినట్లు హన్మంతరావు తెలిపారు. కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి, వర్గల్ మండలంలోని చౌదరిపల్లి, జగదేవ్‌పూర్ మండలంలోని ఎర్రపల్లి, గజ్వేల్ మండలంలోని అలియాబాద్, తూప్రాన్ మండలంలోని వెంటాయపల్లి గ్రామాలను కేసీఆర్ దత్తత గ్రామాలుగా తీసుకుని అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు.
తాగునీటి సమస్య ఎక్కువ
తమకు గ్రామస్థాయిలో ప్రజలనుంచి వచ్చిన విజ్ఞాపనలు, తాము గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు ఏకరువు పెడుతున్న సమస్యలను పరిశీలిస్తే ఎక్కువగా తాగునీటి మమస్య ఉందని తెలిసిందని హన్మంతరావు పేర్కొన్నారు. దీనితోపాటు మురుగు కాలువల నిర్మాణం, అంతర్గత రోడ్లు, రవాణా సౌకర్యం తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు తమదృష్టికి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. వీటి పరిష్కారానికి నిధులు మంజూరీ చేసి ప్రాధాన్యతా క్రమంలో చేపడతామని చెప్పారు.
గజ్వేల్ పట్టణంచుట్టూ రింగ్‌రోడ్ నిర్మాణం
గజ్వేల్ పట్టణం చుట్టూ రింగ్‌రోడ్ నిర్మాణానికి నిర్ణయం జరిగిందన్నారు. దీనికై భూసేకరణకు సంబంధించిన సర్వే జరుగుతుందన్నారు. అలాగే ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద బస్టాండ్ నిర్మాణానికి స్థల పరిశీలన పూర్తయ్యిందని, త్వరలో శంకుస్థాపన జరుగు తుందన్నారు. గజ్వేల్`ప్రజ్ఞాపూర్ మధ్యలో రోడ్డును నాలుగులైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయం జరిగిందన్నారు. నియోజకవర్గ స్థాయిలో 5వేల పక్కా గృహాల నిర్మాణానికి కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
చెరువుల మరమ్మతులు
నియోజకవర్గ ప్రజల సాగునీటి అవసరాలు తీర్చడానికై చెరువుల మరమ్మతులు, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. వీటితోపాటు ప్రాణహిత`చేవెళ్ళ ప్రాజెక్టు ద్వారా కూడా సాగునీటిని అందించడానికి ప్రణాళికలు తయారవుతున్నట్లు తెలిపారు. ప్రతి మండలానికి ఒక మార్కెట్‌యార్డు రూపొందించి రైతుల పంటకు గిట్టుబాటు ధర వచ్చేవిధంగా కూడా ప్రయత్నిస్తామన్నారు.
పారిశ్రామికాభివృద్ధి
నియోజకవర్గంలో ప్రస్తుతం తూప్రాన్ మండలంలో పరి శ్రమలు ఎక్కువగా ఉన్నాయని, గజ్వేల్ ప్రాంతంలో కూడా పారి శ్రామికాభివృద్ధి జరగడానికి పారిశ్రామిక వేత్తలకు మౌలిక వసతులు కల్పించి తద్వారా పరిశ్రమల స్థాపనకు కృషి చేయను న్నట్లు తెలిపారు.
మొత్తంగా గజ్వేల్ నియోజకవర్గంలో వ్యవసా యికంగా, పారిశ్రామికంగా, వ్యాపారపరంగా, అన్ని విధాల అభి వృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు అవి శ్రాంతంగా కృషి చేస్తున్నట్లు హన్మంతరావు వివరించారు.