kcrతెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తన పాలన సాగిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతించారు. ఆగస్టు 7న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటిని అందించే మిషన్‌ భగీరథ పథకాన్ని ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గమైన మెదక్‌జిల్లా గజ్వేల్‌ మండలం కోమటిబండ వద్ద నల్లా తిప్పి ఆయన ప్రారంభించారు. పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభావేదిక వద్ద ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌లోని సింగరేణి విద్యుత్‌ ప్లాంటు ప్రారంభం, రామగుండం ఎన్టీపీసీ రెండోదశ విద్యుత్‌ ప్లాంట్‌, రామగుండం ఎరువుల కర్మాగారం, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, మనోహరాబాద్‌-కొత్తపల్లి రైలుమార్గాలకు శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం రెండు లక్షల మంది ప్రజలు హాజరైన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. మొదట సోదర, సోదరీమణులారా అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. తరువాత హిందీలో ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఎప్పుడు తెలంగాణ అభివృద్ధిపైనే ధ్యాస ఉంటుందని, ఢిల్లీలో తనను ఎప్పుడు కలిసినా అభివృద్ధి గురించిన విషయాలే చర్చించేవాడన్నారు. సాగు, తాగునీటి విషయంలో ఎంతో ఉద్విగ్నంగా తనతో మాట్లాడేవాడన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం వల్లనే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ రెండేండ్ల తక్కువ వ్యవధిలోనే రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని కేసీఆర్‌ నిరూపించారని అన్నారు. అతనికి తమ కేంద్ర ప్రభుత్వం వైపున పూర్తి సహాయ, సహాకారాలు ఉంటాయన్నారు. మీకు హైదరాబాద్‌ ఎలాగో, ఢిల్లీ అలాగే భావించాలన్నారు. భుజం, భుజం కలిపి నడుస్తూ ఇటు రాష్ట్రాలను, దేశాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళదామని పిలుపునిచ్చారు.

నేను ప్రారంభించిన అయిదు కార్యక్రమాలు పంచశక్తులుగా ప్రజలకు ఎంతో ఉపయోగపడేవిగా ఉన్నాయి. మంచినీరు, విద్యుత్తు, ఎరువులు, రవాణా సౌకర్యం ప్రజలకు ఎంతో అవసరమైనవన్నారు. ఇలాంటి వాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషిచేయడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. సమాఖ్య స్ఫూర్తికి ఇవి నిదర్శనంగా నిలుస్తాయన్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఉండేదన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చాక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడిచినపుడే దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో జరిగిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ జీఎస్‌టీని కేసీఆర్‌ సమర్థించారని కృతజ్ఞతలు తెలిపారు.

సాగునీరుంటే రైతులు బంగారం పండిస్తారు

దేశంలో రైతులకు సాగునీరు అందించగలిగితే వారు బంగారం పండిస్తారని ప్రధాని పేర్కొన్నారు. అందుకే ”ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన” పేరుతో ప్రత్యేకంగా ఒక పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. నదులు, వాగులు, వంకలు లాంటి నీటి వనరులు ఉన్నచోట ప్రాజెక్టులు చేపట్టి సాగునీటిని అందించడానికి ఈ పథకాన్ని వినియోగిస్తామన్నారు. భారత ఆర్థికశక్తి వ్యవసాయంపైనే ఆధారపడి ఉందని, దానికి మూలాధారమైన గ్రామాలను సాగునీటి వనరులుగా ఉన్న గ్రామాలుగా తయారుచేస్తామన్నారు. నీరు పుష్కలంగా ఉన్నపుడు మనకు నీటి విలువ తెలియదు. అవి దొరకనపుడు, నీటి కొరత ఉన్నపుడు వాటి విలువ బోధపడుతుందన్నారు. అందుకే జీవాధారమైన నీటిని కాపాడుకోవాలని, ప్రతి నీటిబొట్టును నిలువచేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

విద్యుత్‌లో స్వయంసమృద్ధి

విద్యుత్‌ ఉత్పత్తిలో దేశం స్వయంసమృద్ధి సాధించిందని ప్రధాని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే దిశగా దేశం ముందడుగు వేసిందన్నారు. గతంలో ఒక యూనిట్‌ విద్యుత్‌ కొనాలంటే రూ. 11.50 వెచ్చించాల్సివచ్చేదన్నారు. ఇప్పుడు రూ. 1.10 కే యూనిట్‌ విద్యుత్‌ కొనగలుగుతున్నామన్నారు. గతంలో రాష్ట్రాలు విద్యుత్‌ సమస్యతో అల్లాడేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, రెండేళ్ళలో కోతలున్న రాష్ట్రాలను మిగులు రాష్ట్రాలుగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మిషన్‌ భగీరథకు సోలార్‌ విద్యుత్‌ను వాడితే ఎంతో ధనం ఆదాఅవుతుందని ప్రధాని సూచించారు.

రైల్వేలైను పూర్తి చేస్తాం..

మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైను గురించి ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కానీ ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదన్నారు. ఎందరో ప్రధానులు ఈ ప్రాంతాన్ని సందర్శించినా ఇది పూర్తి కాలేదు. కానీ ఇప్పుడు నిర్ధిష్ట కాలపరిమితితో ఈ రైల్వేలైను పూర్తి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

ఎరువుల విషయాన్ని ప్రస్తావిస్తూ తాను ప్రధానమంత్రి అయిన కొత్తలో యూరియా గురించి ముఖ్యమంత్రుల వద్ద నుంచి లేఖలు వచ్చేవన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, దేశంలో సరిపోయేంత యూరియా దొరుకుతుందన్నారు. రైతులు రసాయన ఎరువుల గురించి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు లేవన్నారు. ప్రస్తుతం రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి పనిచేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు ఎరువులపై సబ్సిడీలు ఇచ్చేవని, ఎరువులే దొరకనపుడు సబ్సిడీలు ఏంచేసుకుంటామని ఆయన ప్రశ్నించారు. రైతులు ఎరువులను బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసే దుస్థితులు ఉండేవన్నారు. ఎరువుల కోసం రైతులు పోరాటాలు చేస్తే లాఠీచార్జీలు జరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు పోయాయన్నారు. యూరియా బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా వేపపూత పూస్తున్నామని దీనితో కెమికల్‌ పరిశ్రమలు ఉపయోగించుకోలేని పరిస్థితిని కల్పించి, సరిపోయే యూరియాను సరఫరా చేస్తున్నామని ప్రధాని తెలిపారు. వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమను కూడా కొనసాగించాలని పీఎం రైతులకు పిలుపునిచ్చారు. గోవులను వ్యవసాయంతో జోడించాలని సూచించారు. కొందరు గోరక్షకుల పేరుతో సమాజంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గోవును తల్లితో సమానంగా చూడాలన్నారు. అమ్మ చిన్నతనంలో పాలిస్తుంది, ఆవు జీవితాంతం పాలిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. అలాంటి గోవును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రధాని ప్రసంగం ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ తాను 40 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉండి, వివిధ పదవులు నిర్వహించానని, కేంద్రంలో రెండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా నేరాలు గణనీయంగా తగ్గిపోయాయని పేర్కొన్నారు. దాన్ని ఉటంకిస్తూ ప్రధాని మాట్లాడారు. కేసీఆర్‌ తమ ప్రభుత్వం గురించి చెప్పిన విషయాలు మా పాలనకు గీటురాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

పీఎంకు వెండి నెమలి బహూకరించిన సీఎం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి సారి తెలంగాణకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఘనంగా సత్కరించారు. వెండి నెమలిని బహూకరించారు. శాలువా కప్పి నెమలి ప్రతిమను బహూకరించి తెలంగాణ ప్రజల అభిమానం, ఆదరణా చాటిచెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, సురేష్‌ప్రభు, పీయూష్‌గోయల్‌, అనంతకుమార్‌, గవర్నర్‌ నరసింహన్‌లను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాలువాలు కప్పి, మొమెంటోలు ఇచ్చి సత్కరించారు. మంత్రి హరీష్‌రావు, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు, ఎం.పి.లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Other Updates