తెలంగాణ ప్రజా సమితి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన
డా॥ మర్రి చెన్నారెడ్డి 1969 మే 26వ తేదీనుంచి ప్రత్యేక తెలంగాణ ఆందోళన ‘‘రెండవ దశ’’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తొమ్మిది తెలంగాణా జిల్లాల్లోనూ (అప్పటికింకా రంగారెడ్డి జిల్లా ఏర్పడలేదు) ప్రజలు, విద్యార్థులు జట్లుజట్లుగా తెలంగాణ మంత్రుల, శాసనసభ్యుల ఇళ్ళ ఎదుట సత్యాగ్రహం, ధర్నా జరుపుతారని, అంచెలవారి నిరాహారదీక్షలు కూడా తిరిగి ప్రారంభమవుతాయని చెన్నారెడ్డి ప్రకటించారు.
తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల్లో మూడవవంతు మంది సభ్యులు, ముగ్గురు ఎం.పి.లు, 75 శాతం పంచాయతీలు, 50 శాతం పంచాయతీ సమితుల నుండి ప్రత్యేక తెలంగాణకు మద్ధతు లభించిందని చెన్నారెడ్డి ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి పెద్దఎత్తున శాసనసభ్యులు, ఎంపీలు, రాజకీయ నాయకులు మద్ధతు ప్రకటించడం చూసి ఓర్వలేని ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు కాకాని వెంకటరత్నంలు ఆరుగురు కాంగ్రెస్ శాసనసభ్యులను ‘పార్టీ క్రమశిక్షణ’ను ఉల్లంఘించారనే ఆరోపణపై మూడు సంవత్సరాలపాటు పార్టీనుంచి బహిష్కరించారు. బహిష్కరణకు గురైన వారిలో తెలంగాణ ప్రాంతీయ సంఘం మాజీ అధ్యక్షులు కె. అచ్యుతరెడ్డి, జి. రాజారాం, నర్సింగరావు, టి. అంజయ్య, ఎం.ఎం.హషీం, ఎం. మాణిక్యరావులు ఉన్నారు. వీరిలో రాజారాం ఏ.ఐ.సి.సి. సభ్యులు. కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులను బహిష్కరించే అధికారం ఏ.ఐ.సి.సి. కే ఉన్నా పార్టీ నియమాలనుసైతం తుంగలో తొక్కారు కాకాని.
మిగిలిన తెలంగాణ నాయకులపై విచారించి చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. ఇదొక హెచ్చరిక. ఈ సమావేశంలో పాల్గొన్న జె. చొక్కారావు, శ్రీమతి సుమిత్రాబాయి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పి.సి.సి. వ్యవహారాల్లో ఏ.ఐ.సి.సి. వెంటనే జోక్యం చేసుకోవాలని తెలంగాణ ప్రాంత సభ్యులతో ప్రదేశ్ కాంగ్రెస్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఏ.ఐ.సి.సి. అధ్యక్షులైన నిజలింగప్పకు చొక్కారావు లేఖ రాశారు. చెన్నారెడ్డి ప్రారంభించిన రెండోదశ తెలంగాణ ఉద్యమపు తొలిరోజైన మే 26న ఆంధ్ర పాలకులు స్పందించిన తీరు ఇది.
తెలంగాణ జిల్లాల్లో మే 26న ప్రారంభమైన సత్యాగ్రహం విజయవంతమైంది. నగర నడిబొడ్డున ఆబిడ్స్‌లో మాజీమంత్రి శ్రీమతి సదాలక్ష్మిని, శాసనసభ్యులు, ఏ.ఐ.సి.సి. సభ్యులైన రాజారాంను నిర్భంధంలోకి తీసుకోగా న్యాయస్థానం వీరిని, మరో 142 మందిని పది రోజులు జైలుకు పంపింది. వివిధ తెలంగాణ జిల్లాల్లో, పట్టణాల్లో వేలాదిమంది అరెస్టుకాగా వారిపై తప్పుడు కేసులు బనాయించింది కాసు ప్రభుత్వం.
తమ ఉద్యమం రాష్ట్రం కోసమే తప్ప ఆంధ్ర సోదరులకు వ్యతిరేకంగా కాదని, ఉద్యమం అహింసాయుతంగానే నడిపిస్తామని ఒకవైపు సమితి అధ్యక్షులు చెన్నారెడ్డి, మరోవైపు పోటీ ప్రజా సమితి అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి పదేపదే ప్రకటిస్తూనే ఉన్నా ప్రభుత్వం మాత్రం ఉద్యమకారులను రెచ్చగొట్టే విధంగా కవ్వింపు చర్యలకు దిగింది. అక్రమకేసులు, నిర్భంధాలకు వ్యతిరేకంగా తొమ్మిది జిల్లాల్లో ధర్నాలు, సత్యాగ్రహాలు కొనసాగాయి. బస్సుల ధ్వంసం, రైల్వే సంస్థకు నష్టం కలిగించే చర్యలతో విద్యార్థులు అక్కడక్కడ నిరసన తెలియజేసారు.
మే 27న మాజీ ప్రధాని నెహ్రూ ఐదవ వర్థంతిని రహస్యంగా అక అభిమాని ఇంట్లో కాంగ్రెస్ పెద్దలు జరుపుకున్నారంటే ఉద్యమ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఆబిడ్స్‌లో శాంతి కపోతాన్ని ఎగరేస్తున్న నెహ్రూ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఢల్లీినుండి రావడానికి ప్రధానితోసహా ఏ జాతీయ నాయకుడూ ధైర్యం చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న వేలాది విద్యార్థులను ఉద్యమం నుండి వేరు చేయడానికి బ్రహ్మానందరెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. ఆంధ్ర ముఖ్యమంత్రి ఆగడాలకు, కుట్రలకు బాసటగా నిలిచి తెలంగాణ ఉద్యమాన్ని చీల్చడానికి, అణగదొక్కడానికి ప్రయత్నించిన వారిలో గురుమూర్తి, కొండల్‌రెడ్డి, జె.వి.నర్సింగరావు, జలగం వెంగళరావు, శీలం సిద్ధారెడ్డి తదితరులున్నారు. ఎస్. జైపాల్‌రెడ్డి, సరోజినీపుల్లారెడ్డి సమైక్య రాష్ట్రం కొనసాగాలన్నారు. అప్పటి రెవెన్యూమంత్రి వి.బి. రాజు తెలంగాణ వేరైతై ఆర్థిక వనరుల కొరతవలన మనజాలదన్నారు.
పి.వి. నరసింహారావు తటస్థంగా ఉన్నా ఆయన సుపుత్రుడు పి.వి. రంగారావు మాత్రం రాష్ట్ర సమైక్యతా సంరక్షణ సమితి అధ్యక్షునిగా ఉంటూ విద్యార్థి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసారు. విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలంటూ మే 28న బషీర్‌బాగ్‌లోని లేడీ హైదరీక్లబ్ నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియం వరకు ప్రభుత్వ మద్ధతుతో ఊరేగింపు నిర్వహించారు.
హైదరాబాద్‌లో తల్లిదండ్రుల సంఘం పేరుతో మరికొందరు ఆంధ్రతొత్తులు విద్యార్థుల ఐక్యతను చీల్చే ప్రయత్నం చేసారు.
బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం వేలాదిమందిని జైళ్ళలో నింపడమే కాకుండా ఆంధ్ర ఖైదీలతో, జైలు పోలీసులతో సత్యాగ్రహం చేస్తున్న తెలంగాణ ఖైదీలపై లాఠీలతో, కర్రలతో దాడులు చేయించింది. మే 31న హైదరాబాద్ చంచల్‌గూడ జైళ్ళో జరిగిన దాడిలో 52మంది ఖైదీలు గాయపడినారు. వీరిలో 24మందికి ఉస్మానియా దవాఖానాలో చికిత్స చేసారు.
చెన్నారెడ్డి రాజకీయ రంగప్రవేశంతో తెలంగాణ వేడెక్కింది. చెన్నారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన ఇంటిమందు సమైక్యవాదులు ప్రతాపరెడ్డి నాయ కత్వంలో ధర్నా చేసారు. అదే సమయంలో చెన్నారెడ్డిని కలవడానికి వచ్చిన తెలంగాణ ప్రాంతీయసంఘం మాజీ అధ్యక్షులు, ఎం.ఎల్.ఏ. అచ్యుతరెడ్డిపై దాడికి విఫలయత్నం చేశారు.
జూన్ 3న విద్యార్థులకు పరీక్షలు జరపాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. విద్యార్థి కార్యాచరణ సంఘం అధ్యక్షులు మల్లికార్జున్ పరీక్షలను బహిష్కరించాలని, హాల్‌టికెట్లు, ప్రశ్నాపత్రాలు తగులబెట్టాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
పరీక్షలను వాయిదావేయాలని ప్రజాకవి కాళోజీ నారాయణరావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి పి. రామబ్రహ్మం కూడా పరీక్షల వాయిదాకు విజ్ఞప్తి చేసారు. టీచర్స్ గిల్డ్ పరీక్షలు నిర్వహింపబోమని తేల్చి చెప్పింది. ప్రభుత్వం మొండికేసింది. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది.
తెలంగాణ పి.సి.సి. ఏర్పాటు
జూన్ ఒకటిన గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్లో కొండా లక్ష్మణ్ అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పడిరది. అధిక సంఖ్యలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరైన ఈ సభలో మాజీ ఉప ముఖ్యమంత్రి కె.వి. రంగారెడ్డి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రసంగించారు.
‘పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణకు స్వంత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉండాలనే నిబంధనను కాలరాచి, పి.సి.సి.ని రద్దుచేసి తెలంగాణ కాంగ్రెస్‌వాదులచేత దాసోహం చేయించుకునే పరిస్థితులు ఈనాడు కల్పించార’ని కె.వి. రంగారెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. ఈ దాసోహంనుంచి విము క్తులు కావాలంటే తెలంగాణ వారు తమ స్వాతంత్య్రాన్ని, స్వ శక్తిని ప్రదర్శించుకోవడం అవసరమని ఆయన అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి ఆంధ్రప్రదేశ్ అనే వలలో తెలంగాణను ఆంధ్ర నాయకులు దించారని, నెహ్రూ తమకు చెప్పిన మాటలను ఆధారంగా చేసుకొని తాముకూడా మోసపో యామని కె.వి. రంగారెడ్డి చెప్పారు. పరిస్థితులు అర్థం చేసుకో కుండా శ్రీమతి ఇందిరాగాంధీ చేసిన ప్రతిపాదనలను (అష్ఠ సూత్ర పథకం) ‘‘మేకలకు తోడేలును కాపలా ఉంచినట్లు బ్రహ్మా నందరెడ్డిని అమలు జరపమనడం హాస్యాస్పదం’’ అన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి బ్రహ్మానందరెడ్డి కొం దరు తెలంగాణవారిని మంత్రివర్గంలోకి తీసుకొనే ప్రయత్నం చేస్తున్నాడని విన్నామని, అందుకు అంగీకరించే తెలంగాణవారి రాజకీయ చరిత్ర అంతటితో ముగుస్తుందని గుర్తిం చాలని కె.వి. రంగా రెడ్డి తన ప్రారం భోపన్యాసంలో అన్నారు. ఉద్యమాన్ని ప్రశాంతంగా నడపాలని, అల్లర్లు జరుగనివ్వరాదని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని, శాసనసభ రద్దు చేసి రాష్ట్ర పతి పాలన విధించాలని తెలంగాణ ప్రత్యేక పి.సి.సి.ని అధికారికంగా గుర్తించా లని సభ తీర్మానాలను ఆమోదించింది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కొండా లక్ష్మణ్ బాపూజీ, ఉపాధ్యక్షులుగా కె. రాజమల్లు ఎం.ఎల్.ఏ, సంగం లక్ష్మీబాయి, ఎం.పి., కార్యదర్శులుగా రాజారాం ఎం.ఎల్.ఏ, హయగ్రీవాచారి, కె. రామచంద్రారెడ్డి ఎం.ఎల్.ఏ, కార్యవర్గ సభ్యులుగా చెన్నారెడ్డి, అచ్యుతరెడ్డి, సదాలక్ష్మి, బాగారెడ్డి, పి. గోవర్థన్‌రెడ్డి, జగన్నాధరావు తదితరులతో పి.సి.సి. కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రోద్యమ చరిత్రలో టి.పి.సి.సి. ఏర్పాటుతో ఒక నూతనాధ్యాయం మొదలైందని ఆంధ్ర పత్రికలు రాశాయి.
దాసోహం అంటూ బానిసల్లా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పడి వుండాలని, ఆంధ్రనేతల పెత్తనానికి ఎదురు తిరగకుండా వుండడానికే హైదరాబాద్ రాష్ట్ర పి.సి.సి.ని 1958లో రద్దు చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఉన్న నీలం సంజీవరెడ్డి తెలంగాణ జిల్లాల్లోని తాలూకా కేంద్రాల్లో, సమితి అధ్యక్షునిగా లేదా సభ్యునిగా ఎన్నిక కావాలన్నా తెలంగాణ నేతలు ఆంధ్ర నేతల శరణు వేడుకోవాలి. ఇక ఎం.ఎల్.ఏ., ఎం.ఎల్.సి. స్థానాలకైతే సరేసరి. అణగిమణిగి ఉండాలని తెలంగాణకు పి.సి.సి. లేకుండా రద్దు చేస్తే పదకొండేళ్ళ తర్వాత మళ్ళీ ఈ ప్రాంత నేతలు తమ స్వంత పి.సి.సి.ని ఏర్పాటు చేసుకున్నారు. అదికూడా తెలంగాణ రాజకీయ ఉద్దండులైన, పెద్ద మనుషుల ఒప్పందంపై ఆనాడు సంతకాలు చేసిన మాజీ ఉపముఖ్యమంత్రి కె.వి. రంగారెడ్డి, డా॥ మర్రి చెన్నారెడ్డి, తెలంగాణకోసం మంత్రి పదవిని త్యజించిన కొండా లక్ష్మణ్ బాపూజీ, పలువురు శాసనసభ్యులు, పంచాయతీ సమితి అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు… ఇలా తమ స్వంత పి.సి.సి.ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఏకంగా తమ స్వంతపార్టీ ముఖ్యమంత్రినే బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన కావాలని కోరారు. దీంతో ఆంధ్రనేతలకు, ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ పి.సి.సి. అధ్యక్షునికి చెమటలు పట్టినవి. ఢల్లీిలోని కేంద్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేసినవి. ఏ.ఐ.సి.సి. కార్యదర్శి సాదిక్ అలీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డితో చర్చించి, ప్రధానికి, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులైన నిజలింగప్పకు ఈ విషయాన్ని తెలిపారు. శ్రీమతి గాంధీ హోంమంత్రి చవాన్‌ను, సీఎంను హుటాహుటిన ఢల్లీికి రావాలని ఆదేశించారు.
మే 31న చంచల్‌గూడా జైళ్ళో శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న 300మంది తెలంగాణ ఖైదీలపై 700మంది ఆంధ్ర ఖైదీలు, జైళ్ళోని ఆంధ్ర పోలీసులు కర్రలతో, చువ్వలతో దాడిచేసి చావబాదారు. సరిగ్గా ఆ సమయంలో జైళ్ళశాఖ ఉన్నతా ధికారులు, ముషీరాబాద్, ఇతర జైళ్ళ సూపరింటెండెంట్‌లు చంచల్‌గూడా జైళ్ళో వుండటం చూస్తే ఇది ఖచ్ఛితంగా ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి కక్షసాధింపు చర్య అని తెలంగాణ నేతలు భావించారు.
జూన్ మూడవతేదీని ‘పగసాధింపు వ్యతిరేక దినం’గా బంద్ పాటించాలని, ఖైదీలపై దాడికి నిరసనగా రెండో తేదీన నిరసనదినం పాటించాలని పోటీ తెలంగాణ ప్రజా సమితి నాయకుడు శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో వున్న తెలంగాణ ప్రజాసమితి రెండో తేదీన నిరసన దినం పాటించాలని శ్రీధర్‌రెడ్డితో బాటు విద్యార్థి కార్యాచరణ సంఘం ఇచ్చిన పిలుపును సమర్థిస్తూనే 3వ తేదీన బంద్‌లో తమ ప్రమేయం ఉండదని ప్రకటించారు. ఉద్యమకారులపై, అమా యక తెలంగాణ ప్రజలపై దౌర్జన్యకాండ కొనసాగించడానికే బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం మొగ్గు చూపింది.
తెలంగాణ ప్రజలపై దాడికోసం సైన్యం రప్పింపు
తెలంగాణ ఉద్యమ సంస్థలు ఇచ్చిన అణచివేత వ్యతిరేకదినం పిలుపునందుకొని ప్రజలు అన్ని పట్టణాల్లో, జంటనగరాల్లో వీధుల్లోకి వచ్చి కనీవినీ ఎరుగని రీతిలో ఆందోళన చేసారు. ఇలాంటి ఒక పిలపుకోసం బ్రహ్మానందరెడ్డి, ఆయన అనుచరులు ఎదురుచూస్తున్నారు. చెన్నారెడ్డి సమితి అధ్యక్షులైన వెంటనే శాంతియుత సత్యాగ్రహాలకే పరిమితంగా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించారు.
జూన్ 2 నాటికే కర్నూలు, గుంటూరు జిల్లాలనుంచి పెద్దఎత్తున గుండాలను, రౌడీలను జంటనగరాలకు రప్పించి ఆబిడ్స్‌లోని బృందావన్ హోటల్లో, దుర్గావిలాస్‌లో బస కల్పించారు. వీరినేకాకుండా సికింద్రాబాద్‌కు చెందిన పహిల్వాన్ కొండల్‌రెడ్డి ఆయన రాజకీయ గురువైన ఖైరతాబాద్ శాసనసభ్యులు, పరిశ్రమల శాఖామంత్రి గురుమూర్తి అనుచరులైన గుండాలు బాకులు, కర్రలు, తుపాకులతో, పెట్రోల్, కిరోసిన్ డబ్బాలతో ఆందోళనకారుల్లో కలిసిపోయి గృహదహనాలకు, లూఠీలకు దిగారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 35 చోట్ల దహనకాండలకు పాల్పడినట్లు మరునాడు దినపత్రికలు వెల్లడిరచాయి.
హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పోలీసులు పలుమార్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పత్రికల కథనాల ప్రకారం జటనగరాల్లో ఇద్దరు, వరంగల్‌లో ఇద్దరు మరణించగా ఆంధ్ర గుండాల కత్తిపోట్లకు గురై మరో తెలంగాణ యువకుడు నేలకొరిగాడు. ఆబిడ్స్‌లో జరిగిన ఈ కత్తిపోట్ల సంఘట నకు ప్రతీకారంగా ఉద్యమకారులు పక్కనే ఉన్న ఆంధ్రా గుండాల క్యాంపు ఉన్న బృందావన్ హోటల్‌పై దాడిచేసి, ఫర్నీచర్‌ను దగ్ధం చేసారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత (ఆ తర్వాతి కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న) భవనం వెంకట్రాం గోడదూకబోయి కాలు విరగ్గొట్టుకున్నారు. 2002లో ఆయన మరణించేదాకా తెలంగాణ ఉద్యమాన్ని పదేపదే గుర్తు చేసుకునే విధంగా కుంటుతూనే ఉన్నారు.
ఆంధ్ర గుండాలదాడిలో పలువురు తెలంగాణ బిడ్డల తలలు పగిలాయి, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి బృందావన్ హోటల్ యజమానిని జీపులో ఎక్కించుకొని అతన్ని కాపాడారు. ఈ ప్రతీకార దాడికి నాయకత్వం వహించింది పోటీ ప్రజా సమితి నేత శ్రీధర్‌రెడ్డి మరికొందరు విద్యార్థులు.
‘‘ఆబిడ్స్‌లోని ఒక హోటల్‌ను మూసివేయాలని ఉద్యమకారులు కోరినపుడు వారిపై కొందరు సమైక్యవాదులు రాళ్ళు, సీసాలు విసిరార’ని ఆంధ్రపత్రికే రాసినాయంటే ఆంధ్ర గుండాలవల్లనే శాంతియుతంగా సాగుతున్న ఉద్యమం హింసాయుతంగా మారి దహనాలకు, దౌర్జన్యాలకు దారితీసిందని ఎవరైనా భావించవచ్చు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన లూఠీలకు, దహనకాండకు, దౌర్జన్యాలకు, కత్తిపోట్ల సంఘటనలకు ఆంధ్ర గుండాలు, రౌడీలు, ప్రభుత్వమే కారణమని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు 1969`70 తెలంగాణ ఉద్యమంలో కన్పిస్తాయి. ప్రశాంతంగా సాగుతూ ప్రజలు భాగస్వామ్యం వహిస్తున్న తెలంగాణ ఉద్యమాన్ని అపఖ్యాతిపాలు చేయడానికి బ్రహ్మానందరెడ్డి చేసిన కుట్రలో భాగమే ఈ దహనాలు, లూఠీలు. ఆవేశపూరిత తెలంగాణ యువకులు ఎక్కడైనా బస్సుల దహనాలకు, దౌర్జన్యాలకు దిగినా వారిని పురికొల్పింది, ప్రతీకార దాడులకు దించింది ఆంధ్ర గుండాలు. ఒకప్రక్క ఆంధ్ర గుండాలు తెలంగాణ యువకుల తలలు పగులగొడ్తుంటే పోలీసులు ఆపగలస్థితిలో వుండికూడా ప్రేక్షకపాత్ర వహించడం ప్రభుత్వ పాత్రను నిర్ధారిస్తున్నది.
జూన్ 3న బంద్ రక్తసిక్తమైంది. అనేక పట్టణాల్లో, జంటనగరాల్లో పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి డజన్లమంది తెలంగాణ బిడ్డలను పొట్టనపెట్టుకున్నారు. కేవలం 6గురు మాత్రమే ఈ కాల్పుల్లో మరణించారని పోలీసులు చెప్పిన వార్తనే ప్రముఖంగా పత్రికలు ప్రచురించాయి. ఈ సంఖ్య 13 అని అదే రోజు చెన్నారెడ్డి ప్రకటించినా ఆ తర్వాత సుమారు 40మంది దాకా మృతుల సంఖ్య ఉండవచ్చునని అంచనాకు వచ్చారు.
జూన్ 3న ఖమ్మం జిల్లాలోని కొన్ని కేంద్రాల్లోతప్ప ఏ విద్యాసంస్థలోనూ పరీక్షలకు విద్యార్థులు హాజరుకాలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధ్యాయులే విధులను నిరాకరించారు. ఏ ఒక్క విద్యార్థీ పరీక్ష రాయలేదు. ప్రభుత్వం కొందరు తల్లిదండ్రుల సహకారంతో కొందరు విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో విజయవాడకు పంపి పరీక్షలు రాయించే ప్రయత్నం చేసారు. కానీ జూన్ 4న పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయడంతో ఈ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. వరంగల్, హైదరాబాద్ నగరాల్లో 24 గంటలపాటు కర్ఫ్యూ విధించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రశ్నేలేదని ముఖ్యమంత్రితో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అన్నట్లు అన్ని పత్రికలకు సీఎం లీకులిచ్చారు. మంత్రివర్గాన్ని వెంటనే రద్దు చేసి, ప్లెబిసైట్ (జనవాక్య సేకరణ చేయాలని, పరిస్థితిని చక్కదిద్దడంలో సీఎం, ప్రభుత్వం విఫలమైందని, పరిస్థితి మరింత దిగజారకముందే ప్రధాని జోక్యం చేసుకోవాలని పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసిన ఆంధ్రప్రాంత నేతల్లో ముఖ్యలైన గౌతు లచ్చన్న ప్రధానికి టెలిగ్రాం పంపినారు.
తెలంగాణ ఆందోళనకారులు, సానుభూతిపరులపై దాడికిగాను ఆంధ్ర, హైదరాబాద్‌కు చెందిన గుండాలను వినియోగించడం జరగుతున్నదని, ముఖ్యమంత్రి చర్యలు అంతర్యుద్ధానికి దారితీస్తున్నవని ప్రజా సమితి అధ్యక్షులు డా॥ చెన్నారెడ్డి ఆందోళన వెలిబుచ్చారు. ఈ అభిప్రాయాన్ని టెలిగ్రాం రూపంలో ఢల్లీి నేతలకు, ప్రతిపక్ష నేతలకు పంపించారు.
తెలంగాణ చరిత్రలో చీకటిరోజు జూన్ 4
తెలంగాణలోని నగరాల్లోని ప్రజలకు కర్ఫ్యూ కొత్త. కర్ఫ్యూ విధిస్తున్నట్టు సరైన ప్రచారం కూడా ప్రభుత్వం చేయలేదు. సైన్యం, పోలీసులు రెచ్చిపోయి కర్ఫ్యూ సంగతి తెలియక వీధుల్లోకి వచ్చిన వారిపై ఎక్కడికక్కడే కాల్పులు జరిపారు. విచ్చలవిడిగా ఆంధ్రపోలీసులు సాగించిన కాల్పుల్లో ఒకే ఇంట్లో ‘టీ’ తాగుతూ వున్న ఇద్దరు గృహిణులు, 70 ఏళ్ళ వృద్ధుడు ఇంటి ప్రక్కనుండి పోతున్న బాటసారి తూటాలు తగిలి మరణించారు. ఇంట్లో ఉన్న మరో నలుగురికీ తూటాలు తగిలాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
జూన్ 4న జరిగిన పోలీసు కాల్పుల్లో వరంగల్, హైదరాబాద్, ఇతర పట్టణాల్లో 40మందికిపైనే మరణించారని ఉద్యమనేతలు చెప్తుంటే కేవలం 8మంది మాత్రమే మరణించారని, 41 మంది గాయపడినారని అధికారులు చేసిన ప్రకటనను ఆంధ్రపత్రికలు ప్రచురించాయి. గత జూన్ 2నుండి 3 రోజుల్లో వందకుపైనే పోలీసు కాల్పుల్లో మరణించివుంటారని ప్రజా సమితి నేతలు ప్రకటించారు. ఈ పరిణామాలపై అన్ని పార్టీల నేతలు, జాతీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. మరు నాటి ఉదయాన్నే ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్న ప్రధాని ఇందిరాగాంధీ రాత్రి 10 గంటలకు హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు.
(సశేషం)