tsmagazine
తెలంగాణ రాష్ట్రంలో ధాన్య సేకరణ, పౌరసరఫరాలో ప్రజా పంపిణీ విధానం అద్భుతంగా ఉందని పంజాబ్‌ రాష్ట్ర ఫుడ్‌, సివిల్‌ సప్లయిస్‌, కన్‌స్యూమర్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ అనిందిత మిత్ర, ఐఎఎస్‌ ప్రశంసించారు.

రాష్ట్రంలో ధాన్య సేకరణ, ప్రజా పంపిణీ విధానాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చిన అనిందిత మిత్ర సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, గోదాములను సందర్శించారు. అలాగే రేషన్‌ షాపుల్లో ఈ పాస్‌ విధానం ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఆ తరువాత హైదరాబాద్‌లోని పౌరసరఫరాల భవన్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, టీ రేషన్‌ యాప్‌ పనితీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా అనిందిత మిత్ర మాట్లాడుతూ, రైతుల నుండి ధాన్యం కొనుగోలు, చెల్లింపుల వరకు మధ్యవర్తుల ప్రమేయానికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా ధాన్య సేకరణ విధానం బాగుందనీ, ఈ విధానంలో రైతులకు కనీస మద్దతు ధర కచ్చితంగా లభిస్తుందనీ, మద్దతు ధరకు సంబంధించిన చెల్లింపులు కూడా వారి ఖాతాల్లోనే నేరుగా జమకావడం రైతులకు చాలా ప్రయోజనకరమనీ అన్నారు.

రేషన్‌ సరుకులు అర్హులకే అందేలా సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, రేషన్‌ బియ్యం తరలించే వాహనాలకు జీపీఎస్‌ యంత్రాలతో అనుసంధానం చేయడం, వేలిముద్రల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్న తీరు ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్‌ చంద్ర ప్రకాశ్‌, పౌరసఫరాల సంస్థ జనరల్‌ మేనేజర్‌ లక్ష్మీనారాయణ, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ (ఐటి) రఘునందన్‌ పాల్గొన్నారు.
tsmagazine

Other Updates