tsmagazine
భారతీయ శిల్పకళలో ఆధునిక పోకడలు పోయిన ప్రజాశిల్పి ఆయన. శిల, దారువు, ప్లాస్టర్‌, మృణ్మయ, రాగి, ఇత్తడి, తదితరాలు, ఏ మాధ్యమమైనా తన ముద్రను వేసిన ప్రయోగశీలి ఆయన. ఈ అనంత విశ్వంలో ఎన్ని వస్తువులున్నా, ప్రజా సంబంధ అంశాలనే స్వీకరించి సార్వజనీనం చేసిన సృజనాత్మక శిల్పి ఆయన. ఇవ్వాళ గొప్ప శిల్పులుగా చెలామణి అవుతున్న వారికి మార్గనిర్దేశం చేసిన మహోపాధ్యాయుడాయన. ఆయన అసలు పేరు మహ్మద్‌ ఉస్మాన్‌ సిద్ధిఖీ.

– టి. ఉడయవర్లు
చిత్రలేఖనంపై ఆయా చిత్రకారులు సంతకం చేసిన మాదిరిగా శిల్పం చెక్కిన కళాకారుడు తన పేరును దీనిపై చెక్కే పద్ధతి లేకపోయినా బహిరంగంగా తిరుపతి పాలిటెక్నిక్‌ కళాశాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తిని, శక్కర్‌ నగర్‌లోని నిజాం చెక్కర కర్మాగారంలో ప్రతిష్టించిన అభ్యుదయ శిల్పాన్ని, హైదరబాద్‌ కళాభవన్‌ ముందు గల స్నానాంతరం జుట్టారబోసుకున్న యువతి శిల్పాన్ని చూసిన వారెవరైనా కనీసం ఒక్క నిమిషం అక్కడ నిలబడి శిల్పి పనితనానికి అబ్బురపడకపోరు. ప్రపంచ ప్రఖ్యాత సాలార్‌జంగ్‌ మ్యూజియం, హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియం, కేంద్ర లలిత కళా అకాడెమీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, ఛండీఘర్‌ ప్రభుత్వ మ్యూజియం, ముంబైలోని జహంగీర్‌ ఆర్ట్‌ గ్యాలరీ, మద్రాసు కార్నెట్‌ మ్యూజియం, జమ్మూ కశ్మీర్‌ అకాడెమిక్‌ ఆర్ట్‌, హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ, బెంగుళూరు ఆర్ట్‌ కాంప్లెక్స్‌, కర్నాటక చిత్రకళా పరిషత్‌ వారు సేకరించిన ఉస్మాన్‌ సిద్దిఖీ శిల్పాలు చూస్తే కళా హృదయమున్న ప్రతి వాడు పరవశించి పోతాడు.

tsmagazine
పూర్వపు నిజాం రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలోని సుల్హాపేటలో 1925 మార్చ్‌ 3వ తేదీన పీర్‌ మహ్మద్‌ సిద్దిఖీ – జహెరాబీబీలకు జన్మించిన ఉస్మాన్‌ సిద్దిఖీ బాల్యమంతా ఆటపాటలతో గడిపాడు. బొగ్గుముక్క తీసుకుని ఎవరు వారించినా వినకుండా తెల్లని గోడలన్నీ నల్లని బొమ్మలతో నింపివేసేవాడు. ఇరుగు పొరుగు వారు ఉస్మాన్‌ సిద్దిఖీ తండ్రికి ఈ విషయం ఫిర్యాదుచేసేవారు. ఆయన కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. పాఠశాలలో డ్రాయింగ్‌ బోధించే వెంకటేశ్వర రావు మాత్రం సిద్దిఖీని ఎంతో ప్రోత్సహించేవాడు. ఏమైనా ఇక గత్యంతరం లేక ఉస్మాన్‌ సిద్దిఖీ మట్టి బొమ్మలు చేయడం ప్రారంభించాడు. ఆయా పండగలకు సంబంధించిన మైసమ్మ, పోశమ్మ, వినాయక తదితర దేవతల విగ్రహాలు చేసి ఊళ్లో స్నేహితులకు బహూకరించేవాడు. ఎంత సేపూ బొమ్మలు రూపొందించడంపైనే మనస్సుపెట్టి చదువులోకొంచెం వెనకబడిపోయాడు. అతి కష్టం మీది మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశాడు.

ఇది ఇట్టా కొనసాగుతుండగా ఒకసారి అజంతా – ఎల్లోరా సందర్శనకు సిద్దిఖీ వెళ్ళాడు. ఎల్లోరాలో శిల్పాలు తిలకిస్తున్న సిద్దిఖీకి అక్కడ ఒక అంధ యువకుడు తారసపడ్డాడు. కళ్ళులేని కబోదికి ఇక్కడ ఏమి పని అనుకుంటున్న తరుణంలో ఆయన ఆయా శిల్పాలను తనవితీరా తడిమి చూస్తూ పొందిన అనుభూతితో కళ్ళనుంచి నీళ్ళు కార్చడం సిద్దిఖినీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. మూడు ఆయతనాలు కలిగి ఉండడం వల్ల ఈ శిల్పకళామందిరానికి అంధులు కూడా వచ్చి ఆనందిస్తున్నారని గ్రహించాడు. ఇక అంతకు ముందుగల చిత్రకళాభిలాశను ఒదులుకుని పూర్తికాలం శిల్పిగా మారిపోయాడు. తదనుగుణంగానే ఆయన హైదరాబాద్‌లోని ‘స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ క్రాఫ్ట్స్‌’లో చేరి శిల్ప శాస్త్రం అభిమానాధ్యాయన అంశంగా స్వీకరించాడు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఖాన్‌ బహద్దూర్‌ సయ్యద్‌ ఆహ్మద్‌, సుప్రసిద్ధ చిత్రకారుడు – జలాలుద్దీన్‌లు ఉస్మాన్‌ సిద్దిఖీలోని సృజనాత్మక శక్తిని చిత్రణ నైపుణ్యాన్ని చూసి ఎన్నో సలహాలిచ్చేవారు. అనంతరకాలంలో ప్రిన్సిపాల్‌గా వచ్చిన సుకుమార్‌ దేవ్‌స్కర్‌ ఉస్మాన్‌ సిద్దిఖీ పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి గొప్ప శిల్పిగా రూపొందడానికి తగిన సూచనలు చేసేవాడు. శిల్పంలో నవ్యరీతులను ఉస్మాన్‌ సిద్దిఖీ ఆకలించుకోవడానికి ఎంతగానో దోహదం చేశాడు.

tsmagazine
తొలిరోజులలో నీటి రంగు చిత్రాలు వేసి విద్యార్థిగానే పలు బహుమతులు పొందిన ఉస్మాన్‌ సిద్దిఖీ శిల్పిగా రూపొందిన తర్వాత ఆయనకు శిష్ఠ సంప్రదాయక శైలిలో గట్టి శిక్షణ లభించింది. హోయసల, హళెబీడులలోని శిల్పాల ఆధారంగా ఆయన రూపొందించిన ‘శృంగార’ శిల్పానికి 1945లోనే బహుమతి గెలుచుకున్నాడు. ఆ తర్వాత ”వర్ణ” శీర్షికన ఒక అందాలు మూట గట్టిన మహిళ ముఖ శిల్పాన్ని మనోహరంగా తీర్చిదిద్దాడు. శిల్పకళా బోధకులైన జిలానీ, యం. గులాం అలీ ఉస్మాన్‌ల వద్ద దృశ్యకళా సాంకేతిక అంశాలను, వినూత్న ప్రక్రియలను శ్రద్ధగా నేర్చుకున్నాడు. అమరావతి శిల్పాలను, మహాబలిపురం శిల్పాలను అధ్యయనం చేశాడు.

ఈ దశలోనే జనాబ్‌ అక్బర్‌ ఉపఖాని చేసిన కళేతిహాసానికి సంబంధించిన ఉపన్యాసానాలను ఉస్మాన్‌ సిద్దిఖీ విని ఎంతగానో ప్రభావితుడయ్యాడు. నలుగురు నడచిన దారిలో కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక మార్గం రూపకల్పన చేసుకున్నాడు. ఆ మార్గంలో నిత్యం మనం చూసే అట్టడుగు మట్టి మనుషులు, వారి కుటుంబాలు వారి తీరుతెన్నులు, ప్రజావర్గాలతో, ప్రకృతితో వారి సంబంధాలను సార్వజనీన రీతిలో భావాత్మకంగా ఉస్మాన్‌ సిద్దిఖీ చెక్కాడు. చరిత్రకెక్కాడు.

జనసామాన్యంలోని అమాయకత్వం చురుకుదనం, వేదనలు – అన్నింటిని మూడు ఆయతనాలలో రూపొందించిన ఉల్బణ ఫలక శిల్ప పరంపరలో అనితర సాధ్యంగా చూపాడు. ఇట్లాంటి ప్రయోగాలు ఈ ప్రాంతంలో చేయడం ఇదే ఓం ప్రథమం కావడం వల్ల ఉస్మాన్‌ సిద్దిఖీ తీర్చిదిద్దిన శిల్పాలకు 1947 నుంచి పదేండ్లు వరసగా ప్రతి సంవత్సరం హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ వారి వార్షిక ప్రదర్శనల్లో బహుమతి లభించింది. 1956లోనైతే కోదండరాముడు ప్లాస్టర్‌ శిల్పానికి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.

అనంతర కాలంలో రాతిని నాతిగా మలచడంలోను, కంచుపోత పోయడంలోను ఉస్మాన్‌ సిద్దిఖీ బరోడా వెళ్ళి యం.యస్‌. విశ్వవిద్యాలయంలో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ ఆచార్య శంభోచౌదరి నిర్దేశకత్వంలో నిరుపమాన శిల్పిగా రూపొందించాడు. ఈ క్రమంలో 1962-65లో, 1974లో వరసగా మాక్రానా, జయపూర్‌, గ్వాలియర్‌, మహాబలిపురంలో నిర్వహించిన ప్రసిద్ధ శిల్ప శిబిరాలలో పాల్గొనడానికి ఉస్మాన్‌ సిద్దిఖీని ఎంపిక చేశారు. ఆయాచోట్ల చలువరాయి, నల్లరాయి, ఎర్ర ఇసుకరాయిలతో అత్యాధునిక రీతిలో రూపులు దిద్దిన శిల్పాలు ఆయనకు ఒక విశిష్ట వరిష్ట శిల్పిగా గుర్తింపు తెచ్చాయి.

అంతే కాకుండా అప్పటి ఆంధ్రప్రదేశ్‌ లలిత కళా అకాడెమీ ఏటేటా ఏర్పాటు చేసిన కళా ప్రదర్శనలలో ఆయన ఠంచనుగా పాల్గొని 1965, 1966, 1967, 1969 సంవత్సరాలలో అత్యుత్తమ కళాఖండానికిచ్చే బహుమతులను ఆయన శిల్పాలకు పొందాడు.

ఫలకాలపై ఉబ్బెత్తుగా తీర్చిదిద్దే ఉల్బణ ఫలక శిల్పాలు దీర్ఘ చతురస్రాకృతులలో లేదా ఇతర విధాల ఆకృతులలో ఇతరుల మాదిరి ఇమిడిపోకుండా ఉస్మాన్‌ సిద్దిఖీ ఉల్బణ ఫలక శిల్పాలు కడ అంచువరకు వ్యాపించి ఉంటాయి. ఫ్రేము నామ మాత్రమే. ఇలాంటి ఉల్బణ ఫలక శిల్పాలలో ‘సహచరులు’, ‘కుటుంబము’, ‘దేవమ్మ’ ‘సంతనుంచి’ మొదలగు చెప్పుకోదగినవి. ఈ శిల్పాలలో మానవతావాదిగా ఉస్మాన్‌ సిద్దిఖీ సాక్షాత్కరిస్తాడు. ఆయా కళాఖండాలలోని గ్రామీణ యువతుల అమాయకత్వం, సొగసు, పొంకము ద్యోతకం చేయడంలో ఉస్మాన్‌ సిద్దిఖీ పనితనం, కళాహృదయం, ప్రగతి శీలం ప్రస్ఫుటమవుతుంది.

అట్లాగే ఆయన మలచిన ”పక్షి”, ”వణకే మనిషి”, ”జానపద నర్తకి|| ఇత్యాది అనేక శిల్పాలు ఉస్మాన్‌ సిద్దిఖీ స్వీకరించే వస్తువైవిద్యానికి మచ్చుతునకలు.

ఈయన రూపొందించిన కొన్ని శిల్పాలు రూపాతీతములైనను సౌందర్య రసస్పోరకములైన చూపరులను ఇట్లే ఆకర్షిస్తాయి.

1947 సంవత్సరంలో శిల్పకళలో డిప్లొమాలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన ఉస్మాన్‌ సిద్దిఖీ తాను చదివిన కళాశాలలోనే 1948లో అధ్యాపకుడై, లలిత కళలు – వాస్తు కళాశాలైన జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం క్రిందికి వచ్చాక అక్కడ ఆచార్యుడై ఎక్కా యాదగిరి రావులాంటి ఎందరో విద్యార్థులను సృజనాత్మక శిల్పులుగా తయారు చేశారు. భౌతికంగా ఇవాళ లేకపోయినా, ఆయన రూపులు దిద్దిన శిల్పాల ద్వారా, తయారు చేసిన శిష్యుల ద్వారా ఉస్మాన్‌ సిద్దిఖీ యశ్శకాయుడు.

Other Updates