వి. ప్రకాశ్‌
ఖైరతాబాద్‌ శాసనసభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి నాగం కృష్ణ విజయం సాధించడం భవిష్యత్తులో తెలంగాణ ప్రజా సమితి ఉద్యమ సంస్థనుండి రాజకీయ సంస్థగా పరిణామం చెందే అవకాశం వుందని రాజకీయ పండితులు, పాత్రికేయులు భావించారు. జూన్‌ 16న ఎన్నిక ఫలితం ప్రకటించిన తర్వాత ప్రజాసమితి అధ్యక్షుడు డా|| మర్రి చెన్నారెడ్డి పత్రికలవారితో మాట్లాడినప్పుడు ఒక విలేకరి ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపట్ల ప్రజాభిప్రాయ ప్రకటనే ఈ గెలుపు
డా|| చెన్నారెడ్డి పత్రికలవారితో మాట్లాడుతూ నాగం కృష్ణ గెలుపుతో మరోసారి ప్రత్యేక తెలం గాణ యెడ ప్రజాభిప్రాయం వెల్లడైందన్నారు. ‘ప్రధానమంత్రి తమ దృక్పథాన్ని స్పష్టీ కరించుకోవలసి ఉన్నది. ప్రజాస్వామ్య ప్రభుత్వా ధినేత ప్రజల పక్షాన నిర్వహించవలసిన విధులు కూడా ఉంటాయ’ని డా|| చెన్నారెడ్డి అన్నారు.

‘తెలంగాణ ప్రజాసమితిని రాజకీయ సంస్థగా మారుస్తారా?’ అని అడిగిన ప్రశ్నకు డా|| చెన్నారెడ్డి సమాధానమిస్తూ.. గత కొంత కాలంగా ఈ విషయం చర్చకు వస్తూ వున్నది. గత సంవత్సరం జరిగిన తెలంగాణ ప్రజాసమితి మహాసభ తగిన సమయంలో ఈ విషయమై నిర్ణయం తీసుకునే అధికారాన్ని తెలంగాణ ప్రజాసమితికి ఇచ్చిందని, జూన్‌ 28న జరిగే ప్రజాసమితి కార్యవర్గం ఈ సమస్యను చర్చిం గలదనీ, ఈ సమస్య గురించి విశాల ప్రాతి పదికపై నిర్ణయం తీసుకునేందుకు వీలుగా తెలం గాణా ప్రజాసమితి రాష్ట్ర కౌన్సిల్‌ను సమావేశ పరచవలసిందిగా తాను సూచిస్తానని చెప్పారు.

ఈ గెలుపు తెలంగాణ ఉద్యమంలో ఒక నూతనాధ్యాయాన్ని తేనున్నదని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణా? లేక ‘సమైక్య ఆంధ్రప్రదేశా?’ అన్న ఏకైక సమస్య ప్రధాన పాత్ర వహించిన సంగతి విస్మరించ రాదని డా|| చెన్నారెడ్డి ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బ్రహ్మాండమైన విజయం ఏమీ చెయ్యకుండా తనకు పట్టనట్టు కూర్చున్న కేంద్ర ప్రభుత్వ ధోరణిని ఏమైనా మార్చగలదేమో చూడవలసి ఉన్నదని ఆ ప్రకటనలో డా|| చెన్నారెడ్డి అన్నారు. ఆగస్టు 2తో కాలపరిమితి ముగుస్తున్నందున కార్పొరేషన్‌కు వెంటనే ఎన్నికలు జరిపించా లన్నారు.

నాగం కృష్ణను అభినందిస్తూభారీ ఊరేగింపు
ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచిన ప్రజా సమితి అభ్యర్థి నాగం కృష్ణా రావును ఓపెన్‌టాప్‌ జీబులో నియోజకవర్గంలో భాగంగావున్న సికింద్రాబాద్‌ వీధుల్లో ప్రజలు ఊరేగించారు. కింగ్స్‌వేలోని ప్రజా సమితి కార్యాలయం నుండి ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు సికింద్రాబాద్‌ ప్రధాన వీధులగుండా జీరాకు చేరుకునేవరకు 7 గంటలు పట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. యువకులు ఊరేగింపుముందు తెలంగాణ నినాదాలు చేస్తూ తప్పెటలు వాయిస్తూ నృత్యాలు చేశారు. వేలాదిగా జనం పాల్గొన్న ఈ ఊరేగింపు మోండా మార్కెట్‌, కుమ్మరిగూడ, శివాజీనగర్‌, ఆవులమంద, కలాసిగూడ, జేమ్స్‌ స్ట్రీట్‌, నల్లగుట్ట, పాన్‌బజార్‌, రంగ్‌రేజ్‌బజార్‌, జీరాలగుండా సాగింది.

ఊరేగింపు వెళ్ళిన వీధుల్లో ప్రజలు నాగం కృష్ణపై పుష్ప వృష్టి కురిపించారు. నగర మేయర్‌ లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ కౌన్సిలర్లు ఈ.వి. పద్మనాభం, రాందాస్‌, కర్రె నరసింహా, హరినా రాయణ్‌, శాసనసభ్యులు జె. ఈశ్వరీభాయి, ఎం. మాణిక్‌రావు, రాజారామ్‌, తెలంగాణ ప్రజా సమితి ఉపాధ్యక్షులు ఎ. మదన్‌మోహన్‌, ఎస్‌.బి. గిరి తదితరులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. పార్క్‌లేన్‌ హోటల్‌వద్ద 45 ఏళ్ళ ఆంధ్ర ఓటరు నాగంకృష్ణకు పుష్పమాల వేశారు. వీధులగుండా ఊరేగింపు సాగుతుండగా వర్తకులు తమ దుకాణాలు మూసి ఊరేగింపులో చేరినారు. శివాజీనగర్‌ డొక్కలమ్మ దేవాలయంలో నాగం కృష్ణ పూజలు చేశారు.

నాగం కృష్ణకు పలువురి అభినందనలు
గుంటూరు నుంచి నడింపల్లి నరసింహారావు నాగంకృష్ణను అభినందిస్తూ ఒక టెలిగ్రాం పంపారు. నిజామాబాద్‌ నుండి ఇండిపెం డెంట్‌గా ఎన్నికైన లోకసభ సభ్యులు ఎమ్‌. నారాయణరెడ్డి హృదయపూర్వక అభినందన సందేశాన్ని పంపారు. హైస్కూల్‌ విద్యార్థుల కార్యాచరణ సమితి అధ్యక్షుడు ఎ. ప్రకాశ్‌, ఉపాధ్యక్షుడు కె.సుధాకర్‌, కార్యదర్శి ఎ.అశోక్‌కుమార్‌ నాగం కృష్ణను అభినందిస్తూ ‘తెలంగాణ ఉద్యమం’ కొందరు నాయకుల ఉద్యమం కాదని, ఇది ప్రజా ఉద్యమమని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని ఒక ప్రకటనలో తెలిపారు.

రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షులు జి. ఎల్లారెడ్డి, తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సంఘం సభ్యులు ఆరిఫుద్దీన్‌, ఎం. రమాకాంత్‌, సుధాకర్‌రెడ్డి, కె. జంగంరావు, బాలాచారి, బి.ఎమ్‌. నర్సింహ, స్వతంత్రరెడ్డి, ఠాకూర్‌ హృదయనాధ్‌సింగ్‌, పి.జె. సూరి, వై.ఎం.సి.ఏ. హైస్కూల్‌ విద్యార్థి సంఘా ధ్యక్షులు ఎన్‌. రమేశ్‌, నల్లగుట్ట జూనియర్‌ కళాశాల విద్యార్థి సంఘాధ్యక్షులు ఎం. సురేశ్‌ బాబు, విద్యార్థి నేతలు జలీల్‌ పాషా, బి. గోపాల్‌, కె. సత్తయ్య, వరంగల్‌ సాయం కళాశాల, న్యూసైన్స్‌ సాయం కళాశాల నాయకులు, సికింద్రాబాద్‌ విద్యార్థి కార్యాచరణ సంఘం అధ్యక్షులు టి.డి. గౌరీశంకర్‌, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు పి.ఆర్‌. దయానంద్‌, తులసీదాస్‌, హబీబ్‌ హరున్‌, జి. సుభాష్‌ (జీరా విద్యార్థి కార్యా చరణ సంఘం), కాచిగూ డ విద్యార్థి నాయకులు కె.ఎన్‌. ఓం ప్రకాశ్‌, గౌలిపుర ప్రజా సమితి ప్రధాన కార్యదర్శి ఆకుల జైహింద్‌, సికింద్రాబాద్‌ హోల్‌సేల్‌ బట్టల వర్తక సంఘం నేత పి. సుధా కర్‌, సోషలిస్టు పార్టీ నగర నాయకులు శీతల్‌ సింగ్‌ లష్కరి తదితరులు నాగం కృష్ణారావును పూలమాలవేసి అభినందించారు. ఈ ఊరేగిం పులో డా|| చెన్నారెడ్డి నాగం వెంట ఉన్నారు.

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకుముందు సుమారు ఐదారు నెలలు పైన తెలిపిన ప్రజాసమితి, విద్యార్థి సంఘాల నేతలంతా ఉద్యమాన్ని పున:ప్రారంభించడంలో, ఉధృతంగా నడపడానికి శక్తివంచన లేకుండా కష్టపడినవారే. ఈ గెలుపువారిలో ఒక నూతనోత్తేజాన్ని నింపింది.

ప్రజా సమితి గెలుపుకు రాజకీయ ప్రాముఖ్యం లేదు: ముఖ్యమంత్రి కాసు
ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి విజయానికి రాజకీయంగా ప్రాముఖ్యమేమీ లేదని, ఉప ఎన్నికల ఫలితాలు జాతీయ విధానాలను నిర్ణయిస్తాయని తాను భావించడంలేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానిం

చారు. ‘ప్రజా సమితి తనశక్తినంతా సమీకరించి ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో దాదాపు మూడవ వంతు ఓట్లు తెచ్చుకోగలిగిం దన్న విషయం మాత్రమే ఉప ఎన్నికల ద్వారా వెల్లడవుతున్నద’ని వెటకారపు వ్యాఖ్య చేశారు ముఖ్యమంత్రి.

ఏఐసీసీ సమావేశాలకు హాజరై ఢిల్లీనుండి రాగానే ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడి నారు. ఒక విలేకరి ‘సమైక్య రాష్ట్రం’, ‘రాష్ట్ర విభజన’ అనే అంశాలు ప్రాతిపదికగా ఖైరతా బాద్‌ నియోజకవర్గంలో ఇరువర్గాలవారు పోటీ చేశారు కదా అని ప్రశ్నించినప్పుడు బదులిస్తూ ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేశారు.

‘ఎన్నికల్లో ప్రజా సమితి పలు అనుచిత మార్గాలు అనుసరించింద’ని ముఖ్యమంత్రి ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచా రంలో కొన్ని లోపాలున్నాయ’ని ముఖ్యమంత్రి ఒక ప్రశ్నకు జవాబుగా అన్నారు.

ఖైరతాబాద్‌ ఫలితం.. ఒక విశ్లేషణ
ఉప ఎన్నికలో తెలంగాణా ప్రజా సమితి అభ్యర్థి నాగం కృష్ణారావు విజయంపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆయన ఆక్రోశాన్ని తెలుపుతున్నాయి. నిజానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి యాదగిరిని గెలిపించడానికి ముఖ్యమంత్రి చేయని ప్రయత్నమంటూ లేదు. తను పరోక్షంగా పనిచేసినా, తన మంత్రివర్గంలోని దాదాపు అందరు మంత్రులను, పి.సి.సి. అధ్యక్షుణ్ణి (నరసారెడ్డి) కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ఎన్నికల ప్రచారంలో వీధివీధి త్రిప్పినారు. నియోజకవర్గం పరిధిలోని ఆంధ్ర కాలనీలలో ఆంధ్ర ప్రాంత మంత్రులు ‘తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు ఆపాలంటే సమైక్యవాది యాదగిరిని గెలిపించాల’ని ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేశారు. కేంద్రమంత్రి ఎ.కె. గుజ్రాల్‌ ప్రచారంలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు నాగం కృష్ణ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారు. 144 సెక్షన్‌ క్రింద నిషేధాజ్ఞులు విధించారు. పలు ప్రాంతాల్లో ప్రజా సమితి నేతలను అక్రమంగా అరెస్ట్‌ చేసినారు. తెలంగాణ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి అగ్ర నాయకులు మల్లికార్జున్‌, పులి వీరన్నలను నిర్భంధించి జైల్లో పెట్టారు. (ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజే హైకోర్టు బెయిల్‌పై వీరిని విడుదల చేసింది). నాగం కృష్ణ మద్దతుదారులపై, డా|| చెన్నారెడ్డి ఇంటిపై గుండాలు దాడులు చేసి భయోత్పాతాన్ని సృష్టించారు. సీతాఫల్‌మండి ప్రజా సమితి ఉపాధ్యక్షుడు సాంబయ్యను గుండాలు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఓటర్ల జాబితానుండి తెలంగా ణావాదుల పేరు తొలగించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. పోలింగ్‌కు ముందు ఎన్నికల కోడ్‌ను మంత్రులే బాహాటంగా ఉల్లంఘించి పబ్లిక్‌ నల్లాలు, ఇతర అభివృద్ధి పనులు ప్రారంభిం చారు. ఈ పరిస్థితిని గమ నించే ప్రజా సమితి అధ్యక్షులు డా|| చెన్నారెడ్డి ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించడానికి పరిశీలకు లను ఢిల్లీనుండి పంపిం చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితిని గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం డా|| చెన్నారెడ్డి అభ్యర్థనను పరిగణన లోకి తీసుకుని ఇద్దరు సీనియర్‌ అధికారులను హైదరాబాద్‌కు పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు పంపిం చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఎస్‌.ఎ. ఖాదర్‌ సహాయంతో వారి ద్దరూ ఎన్నిక ఫలితం వెల్లడయ్యేదాకా హైదరా బాద్‌లోనే ఉండి ప్రశాంతంగా ఎన్నికలు జరిపించారు.

మరో ప్రక్క తెలంగాణా వాదుల మధ్య అనైక్యత గతంలో వలెనే ఉప ఎన్నిక సమయంలో కూడా కొనసాగింది. తెలంగాణ సానుకూల ఓటు చీలవద్దనే అభిప్రాయంతో తమ అభ్యర్థిని ఎన్నికల బరిలోనుంచి చివరి నిముషంలో తప్పిం చినా తెలంగాణ పి.సి.సి. అధ్యక్షుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఎన్నికల ప్రచా రంలో పాల్గొనలేదు. తెలంగాణా ఉద్యమంలో ముఖ్యపాత్ర నిర్వహించిన జి.ఎం. అంజయ్య ఎన్నికల్లో శంకరయ్యను పోటీకి నిలిపారు.

పోలైన ఓట్లు 38,134 (55 శాతం).మొత్తం ఓట్లు 68,974. పోలైన ఓట్లలో ప్రజా సమితి అభ్యర్థికి వచ్చిన ఓట్లు 24,391, కాంగ్రెస్‌కు 10,401 ఓట్లు వచ్చాయి. దాదాపు మూడింట రెండువంతుల ఓట్లు సంపాదించిన ప్రజా సమితి గెలుపును ముఖ్యమంత్రి పరిహసిం చడాన్ని రాజారాం, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, వి.బి. రాజులతో సహా పలువురు నేతలు విమర్శించారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికల్లో ప్రజా సమితి ఘన విజయం సాధించడంతో డా|| చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని వీధి పోరాటాలనుండి రాజకీయ ఉద్యమరూపంలో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారని అనంతర పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Other Updates