pratapagiriఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ జిల్లాకు అనాది నుండి ఉజ్వలమైన చరిత్ర వుంది. గోదావరి నదిని ఆనుకొని దక్షిణంగా వ్యాపించి వున్న ఈ జిల్లా చరిత్రారంభకాలం నుండి మహోన్నతమైన సంస్కృతి మహత్తర నాగరికతలకు నిలయంగా భాసిల్లింది. కరీంనగర్‌ జిల్లాలోని ప్రతి ప్రాంతానికి అద్భుతమైన చారిత్రక వారసత్వంతో పాటు గొప్ప చారిత్రక వైభవం మనకు కనబడుతుంది.

హైదరాబాద్‌ రాజధానిగా నిజాం సంస్థానాన్ని 200 ఏళ్ళ పాటు పాలించిన అసఫ్‌జాహీల కాలంలో ఎలగందుల ఖిలేదారుగా పనిచేసిన ‘కరిమొద్దిన్‌’ తన పేరిట స్థాపించిన పట్టణమే నేటి జిల్లా కేంద్రమైన కరీంనగర్‌ పట్టణం. ఆనాటి కరీంనగర్‌ జిల్లా చరిత్ర, రాజకీయ, సాంఘిక, సాంస్క ృతిక పరిస్థితులను తెలియజేయటానికి వివిధ కాలాల్లో ఆయా రాజులు ప్రతిష్టించిన శాసనాలే ప్రధానాధారాలు. కరీంనగర్‌ జిల్లాలో పురావస్తు శాఖా వారి తవ్వకాల్లో అనేక శాసనాలు నగునూరు, కాళేశ్వరం, వేములవాడ, ధర్మపురి, కోటిలింగాల, మంథెన తదితర ప్రాంతాల్లో లభించాయి. కరీంనగర్‌ జిల్లాలో లభ్యమైన మొట్టమొదటి శాసనాలు వేములవాడను పాలించిన రెండవ అరికేసరి (క్రీ.శ. 930-955) కాలానికి చెందినవి.

నేటి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల ప్రాంతమే ఆనాటి సపాదక్షి. వేములవాడ పాలకుల శాసనాలు అరడజనుకు పైగా జిల్లాలో లభ్యమయినాయి. ఇంతటి ఘన చరిత్రకు ఆధారమైన కరీంనగర్‌ నేల అంతే ఘన చరిత్ర కలిగిన ఎన్నెన్నో అపురూప దేవాలయాలకు, అలాగే అనేక గొప్ప కోటల నిర్మాణాలకు నెలవైంది.

అలాంటి చారిత్రక కట్టడాలలో తొలి చారిత్రక యుగము లోని ధూళికట్ట, కోటిలింగాలలో బయల్పడినాయి. కోటలు, దుర్గములు మధ్య యుగములోని రామగిరి, ఎల్గందుల, ప్రతాపగిరి, మొలంగూర్‌ దుర్గములు, అసఫ్‌జాహీల కాలంనాటి జగిత్యాల ఖిల్లా ఈ ఖిల్లాల చరిత్ర రూపకల్పనకు తోడ్పడుతున్నాయి. అంతే గాకుండా ఈ జిల్లాలోని కొన్ని సంస్థానాలలో, జాగిర్లలో, గ్రామాలలో భూస్వాములు నిర్మించిన గడీలు ఆధునిక చరిత్రకు ఆధారాలుగా నిలిచివున్నాయి. గడీలు అంటే దొరలుండే భవంతులు. అవి నిజాం రాజ్యకాలం నాటి భూస్వామ్య సంస్క ృతిని ప్రదర్శిస్తాయి.

అయితే చారిత్రక రాజ నిర్మాణాలైన కోటల విషయానికి వస్తే ప్రతాప గిరి కోటది. ప్రత్యేకమైన చరిత్ర. కరీంనగర్‌కు ఈశాన్యంగా 120 కి.మీ. దూరంలో జిల్లా తూర్పు సరిహద్దు ప్రాంతమైన దట్టమైన మహదేవ్‌పూర్‌ అడవులల్లో కాటారం మండలంలో వున్న వన దుర్గమే ఈ ‘ప్రతాపగిరి కోట’.

తెలంగాణ ప్రాంతంలో నిర్మించబడిన దుర్గాలలో కొన్ని గిరి దుర్గాలు దుర్భేధ్యమైన కొండ ప్రాంతాలపై నిర్మింపబడ్డాయి. జీవనదుల సమీపాన నిర్మింపబడ్డ దుర్గాలని జల దుర్గాలు అంటారు. అలాగే అడవీ ప్రాంతాలలో నిర్మింపబడ్డ దుర్గాలను వన దుర్గాలు అంటారు. తెలంగాణలోని అలాంటి వన దుర్గాలలో ముఖ్యమైనది ఈ ప్రతాపగిరి కోట. మంథని నుండి మహదేవపూర్‌లు దాటి కాటారం అటవీ ప్రాంతం గుండా 35 కి||మీ|| ప్రయాణిస్తే ఈ వన దుర్గాన్ని చేరవచ్చు. ఈ దుర్గాన్ని చేరుకోవడానికి సరైన మార్గం, ప్రయాణ సౌకర్యం కూడా లేదు కనుక ప్రతాపగిరి కోటను సందర్శించటం ఒక దుస్సాహసం, చాలా కష్టమైన, కఠినమైన విషయంగా చెప్పవచ్చు. కారణం అనేక క్రూర, విష జంతువులకు ఈ ప్రాంతం శాశ్వత ఆవాసంగా భావిస్తారు.

ఇంతటి దట్టమైన అటవీ ప్రాంతాలలో సుమారు వేయి సంవత్సరాల క్రితం ఈ ప్రతాపగిరి కోటను, ఇంత గొప్ప నిర్మాణాన్ని, శిల్పులు అనన్యసామాన్య రీతిలో ఎలా చేపట్టారన్నది ఒక అంతుచిక్కని రహస్యం. మానవ మాత్రుడే పోలేని ప్రాంతంలో 1000 ఏళ్ళ క్రితం కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ కోట నేటికీ అంతుచిక్కని రహస్యంగా చరిత్రకారులు అభిప్రాయపడతారు. గట్టిగా ప్రయత్నించి శోధిస్తే కోటలో అనేక విశేషాలు, చారిత్రక అవశేషాలు తప్పకుండా లభిస్తాయి. ఆ దిశగా ప్రతాప గిరి కోటపై చారిత్రక పరిశోధకులు, పురావస్తు శాఖవారు ప్రత్యేక పరిశోధన సాగించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

పెద్దగుట్ట పైభాగాన వున్న రాతి కోటగోడపై తొమ్మిది పంక్తుల తెలుగు శాసనం నేటికీ వుంది. శక సంవత్సరం సంఖ్య లేని ఈ శాసనంలో కీలక సంవత్సర వైశాఖ శుద్ధ తదియ మాత్రం చెక్కబడినాయి. ఇతర వివరాలు సరిగా చదవలేని స్థితిలో శాసనం ఉంది.

ముచ్చనాయనింగారు ప్రతాపగిరి కోటను 1000 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. అతనికి గల ఇరువత్తు గండడు, గండగోపాలుడు, కంచి రక్ష పాలకా, చోళరాజ్య స్థాపనాచార్య, పాండ్య మనువిభాళ, దాయ గజకేసరి, అరిరాయ గజకేసరి, తెలుగు రాయుడు మున్నగు బిరుదులు ఈ శాసనమందు పేర్కొనబడ్డాయి.

దాయగజకేసరి, రాయగజకేసరి, కాకతీయుల బిరుదులను బట్టి ఈ శాసనములు కాకతీయుల కాలపు శాసనమని భావించవచ్చు. కాకతీయ ప్రతాపరుద్రదేవుని పేరిట నిర్మింపబడిన దుర్గము గనుక ఇది ప్రతాపగిరి కోటగా ప్రసిద్ధి చెందింది. కోటలో శిథిలమైన ప్రవేశ ద్వారం, కోట చుట్టూ నిర్మించిన 12 అడుగుల ఎత్తయిన రాతి గోడ ఇప్పటికీ కనిపిస్తాయి. అక్కడక్కడా నిర్మించిన బు రుజులు కూడా మనకు దర్శనమిస్తాయి. ఇంత పెద్ద అడవిలో నిర్మించిన ఈ కోటను చూస్తే ఎవరికైనా దడ పుట్టక మానదు. కోటపై నాటి శిల్పులు అద్భుత ప్రతిభతో నిర్మించిన అనేక నిర్మాణాలు నేటి తరాలవారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తెలంగాణలోనే అత్యంత ప్రశస్తి కలిగిన ఈ వనదుర్గాన్ని తెలంగాణ ప్రభుత్వం పర్యాటక ప్రదేశంగా మారిస్తే బాగుం టుందని స్థానికుల అభిప్రాయం. ఈ దుర్గానికి కొన్ని మరమ్మ తులు చేయించి, పర్యాటకుల కోసం కొన్ని వసతులు కల్పించి, రవాణా సౌకర్యాలు మెరుగు పరిస్తే ‘ప్రతాపగిరి కోట’ గొప్ప పర్యాటక ప్రదేశంగా మారటమేగాక నేటి తరం వారికి మన ఘనమైన చరిత్రను తెలియజేసిన ఘనత కూడా దక్కుతుంది. .

నాగబాల సురేష్‌ కుమార్‌

Other Updates