నల్లగొండ జిల్లా పెదవూర మండలానికి చెందిన ‘సిరిసెనగండ్ల’ గ్రామ పర్వతంపై నెలకొన్న లక్ష్మీనరసింహస్వామి సన్నిధి చాలా ప్రాచీనమైనది. కుతుబ్‌షాహీ సుల్తానులకన్న పూర్వం నుండి వున్న మరింగంటి కవులు ఈ స్వామిని కొలిచి తమ గ్రంథాలను అంకితమిచ్చారు. అనంతరం వచ్చిన ఎందరో కవులు ‘సిరిసెన గండ్ల నృసింహుల సరసిజ, సచ్చరణ సేవను చేసి వర్థిల్లినారు.
ఇది మహా ప్రతిభావంతమైన క్షేత్రం. శేష రూపంతో స్వామి దర్శనం కాగలదని స్థానికుల కథనం. ఈ సిరిసెనగండ్ల క్షేత్ర పర్వతానికే ప్రతాపాద్రి. లేదా ప్రతాపగిరియనే నామాంతరాలున్నాయి. పర్వతానికి రెండువైపులా ప్రవహించే పెద్దవాగు, చిన్నవాగు అనే వాటిని కావేరిగను, స్వామిని శ్రీరంగనాయకునిగను భావించి వర్ణించిన కవులున్నారు. ‘శ్రీప్రతాపాద్రి రంహలక్ష్మీనృసింహా’ ప్రతాపగిరీట్ నృకేసరీ’ అనే మకుటాలతో శతక రచన చేసిన మహాకవి గోవర్థనం వెంకటనరసింహాచార్య తన కృతులనన్నిటినీ ఈ స్వామికే సమర్పించిన భక్త కవి. ఈయన నివాసం అహల్యా మండలంలోని ఇబ్రహీంపేట అనే గ్రామం, సిరిసెనగండ్లకు ఈ గ్రామం అనతి దూరంలో వుంటుంది. కవి క్షేత్ర వైభవాన్ని తెలుసుకున్నవారు కాబట్టి ‘ప్రతాపగిరి మహత్మ్యము’ అనే ఒక క్షేత్ర చరిత్రను ప్రబంధీకరించి అనాదృతంగా అటవీ ప్రాంతంలో వున్న ఒక క్షేత్రానికి ఆనాడే (సుమారు 1900 ప్రాంతంలో) చక్కని చరిత్రను వినూత్న రీతిలో రచించి, మన సాహితీలోకంలో ఒక క్షేత్ర వైభవ రచన మొనర్చి మార్గదర్శకుడైనాడు.
గోవర్థనం వెంకట నరసింహాచార్యులు (1845-1936) బహువిధ గ్రంథకర్త, ప్రతాపగిరి…’యేగాక ‘సారంగాచల శ్రీరామ మహాత్మ్యము’ అనే మరొక క్షేత్ర మహాత్మ్యం కూడా అముద్రితంగా వున్నది. కవి శతక, యక్షగాన, ప్రబంధ, ప్రహరి రచనలనేగాక తన నాటి నల్లగొండ జిల్లా వివిధ ప్రాంతాల గూర్చి చెప్పిన ఎన్నో చాటుపద్యాలున్నాయి. (అభినవ) శ్రీనాధునివలె అనేక స్థలాలను సందర్శించి అక్కడి పద్ధతులను రమణీయ చాటువులుగా చిత్రించిన వెంకటనరసింహాచార్య కవి ‘లోకజ్ఞుడైన సాంఘిక వ్యక్తి’. ఇంతటి మహానుభావుని రచనయే ప్రస్తుత ‘ప్రతాపగిరి మహాత్మ్యము’. మూడాశ్వాసాలలో 560 గద్య పద్యాలుగా రచితమైన దీనియందు ప్రబంధ ప్రౌఢరీతి వర్ణనలు. అలంకారయుత పద్యగద్యాలు. వాటితోపాటు, కళిక, స్రగ్ధర, ముక్తపద, పృథ్వి, భుజంగ ప్రయాత, నిరోష్ఠ్యకంద, సీస, మత్తకోకిలా వృత్తాలున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కవి కవితా సర్వం కష ప్రతిభ కొక నిదర్శనంగా దీన్ని సిద్ధం చేసినట్లనిపిస్తున్నది. రచనలోని అనేక గద్యపద్యాలు ఉత్తర రామాయణ, విజయవిలాస, మనుచరిత్రల ప్రభావపూరితాలుగా వున్నాయి.
దీనిలోని కథ-సూతుడు శౌనకాది మహర్షి గణానికి ఈ వృత్తాంతాన్ని చెప్పినట్లు చిత్రించి కథకొక ప్రాచీనత-గౌరవ భావాన్ని కలిగించిన కవి’ తన స్వస్థలంపై వున్న అభిమానంతో ఈ కథను ‘కల్పించి’నట్లున్నాడు. ప్రబంధ ప్రారంభంలో సంప్రదాయానుసారం-పంచాయుధాలు-ఆళ్వార్లు, శ్రీరామానుజులు, దశావతారాలు, గురుస్తుతి, సుకవిస్తుతి, కుకవినింద మొదలైనవి చమత్కారంగా చేయబడినాయి. తర్వాత తన కులస్వామి సిరిసెనగండ్ల లక్ష్మీనరసింహస్వామి స్వప్నంలో సాక్షాత్కరించి ప్రబంధ రచనకుపక్రమించవలసిందిగా ఆదేశిస్తారు. వంశవర్ణన, షష్ఠ్యంతాలు పూర్తిచేసి ‘ప్రతాపగిరి మహాత్మ్యమను దివ్య ప్రబంధ రచన ఆరంభించినారు. సంక్షిప్తంగా ఇది కృత్యాది.
త్రేతాయుగంలో సూర్యవంశోద్భవుడైన ప్రతాపుడనే రాజు ఈ ప్రాంతానికి విచ్చేసి ముక్తి పొందిన కథను తెలుపవలసిందిగా ప్రార్థించిన మునులందరికీ సూతుడు చెప్పినదీ కథ.
చాలాకాలం క్రితం సర్వ సంపదల కావాసమైన ‘అయోధ్య’ అనే నగరాన్ని ఉత్తముడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన సంతాన రహితుడు. పెద్దలు, వైదికుల సలహాననుసరించి ‘సరిద్వతీ’తటంలో భాగీరథీ పరిసరాలయందు ‘పుత్రకామేష్ఠి’యాగం ప్రారంభించి-అశ్వమేధాన్నిచేసి నిర్విఘ్నంగా యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. దీని ఫలితంగా ఉత్తమునికి పుత్రోదయం ప్రాప్తిస్తుంది. ఆయనకు ‘ప్రతాపు’డనే పేరుబెట్టి-విద్యాబుద్ధులు-రాజనీతి మొదలైనవి నేర్పించి యుక్త వయస్సులో మణికంఠపుర ప్రభువైన జయధ్వజుని కూతురు ‘కనకాంగద’తో వైభవంగా వివాహం జరుపుతాడు.
కొంతకాలం గడిచినతర్వాత ప్రతాపభూపతి తపస్సు నిమిత్తం బదరీ క్షేత్రానికి వెళ్లియుండగా నారాయణమూర్తి కలలో కనబడి ‘నీవు దండకాటవీ భాగమైన ప్రణీతా నది ప్రాంతం-భార్గవముని తపోభూమియైన దేవరకొండ ప్రాంతానికి వెళ్లి సమీపంలోని అహల్యా నది సమీపంలో వుండే సిరిసెనగండ్ల గుహలో తపస్సు చేయమని’ దివ్యశక్తిని ప్రసాదిస్తే, క్షణకాలంలోనే ప్రతాపుడు ఈ ప్రాంతానికి విచ్చేసి-నారాయణ ప్రోక్త క్షేత్రభాగంలో తపస్సు చేస్తుంటాడు.
ఇంతలో కశ్యపుడనే మహర్షి బదరీ నారాయణుని ఆనతి ననుసరించి ఒక ప్రాచీన దేవళంలోని లక్ష్మీనృసింహ విగ్రహాలను కావడిలో పెట్టుకుని దివ్యశక్తిచే అహల్యా నదీ ప్రాంతానికి వచ్చి – వాటిని దించి స్నానాదికృత్యాలు నిర్వర్తించుకొని మళ్లీ ఆ కావడిని లేపగా అది కదలదు. భూమి కంపిస్తుంది. వెంటనే శ్రీమన్నారాయణుడు కనపడి, ఇది నా కనువైన ప్రదేశం, ఇక్కడే వుంటానంటాడు. ప్రతాపరాజునకీ విషయం తెలిసిన తర్వాత ఆయన వచ్చి పూజించి ఆ స్వామిని సిరిసెనగండ్లగిరి గుహలో ప్రతిష్ఠించి వేల సంవత్సరాలు పూజాదికాలు నిర్వహించి దైవశక్తిలో లీనమైనాడు.
ఆనాడు తెచ్చిన కావడి బుట్టలే ఇప్పుడు అహల్యా నదీ తీరంలో వున్న గుట్టలు-అంత ప్రభావవంతుడైన నృసింహుడే సిరిసెనగండ్లస్వామి. ఇది ప్రతాపనామకరాజుచే ప్రతిష్ఠితం కాబట్టి ప్రతాపాద్రియైనది. కవి ప్రబంధంలోని కథకిది మిక్కిలి సంక్షిప్త పరిచయం-
ప్రతాపగిరి మహాత్మ్య కథ కల్పితమే. ఐనా-కవి ప్రాంతీయాభిమానం. తన కులస్వామిని గూర్చి ఒక ప్రబంధాన్ని రచించి దానికి శాశ్వతత్వాన్ని కూర్చటం దీని ముఖ్యోద్దేశ్యం అని భావించవచ్చు. నల్లగొండ జిల్లాలో వచ్చిన క్షేత్ర మహాత్మ్య కథలు వివిధ పధ్ధతుల్లో వున్నా ఈ గ్రంథకర్త వలె తన ప్రాంతాన్ని వర్ణించినవారు లేరు.
కవి గ్రామానికి సమీపంలోవున్న అహల్యా నది, సిరిసెనగండ్ల నృసింహులు, దేవరకొండ దీనిలో వర్ణింపబడటమేగాక ‘సదమలమైన యహల్యా నదికి సమీపంబు నేల నామక విలసత్ పృథవీధర’మన్నాడు. (నీలనామక పృథివీధరం’ నీలగిరి లేదా నల్లగొండ జిల్లా.
కవి ఈ ప్రాంతాన్ని ‘దండకాటవి’ అనడం సమంజసం. పూర్వమిది దేవరకొండ సీమ. నేటి అచ్చంపేట. నాగర్‌కర్నూలు. అమరాబాదు-ఆవంచ మొదలైన ప్రాంతాలన్నీ దీనిలోని దండకారణ్యములే. ఇట్లే నేటి వాడపల్లి, మట్టపల్లి ప్రాంతాలన్నీ బదరికావన ప్రాంతాలుగా ప్రసిద్ధాలు. అందుకే కవి ప్రబంధమంతా అటవీ పర్వత, నదీనద-దైవ క్షేత్రాలతో నిండుకున్నది. వీటికితోడు ప్రతి సందర్భంలోను శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రవచనం, అష్టాక్షరి, పంచ సంస్కారాలు, శరణాగతి మొదలైన వాటిని తెలుపటంవలన విష్ణుక్షేత్ర వైభవం వ్యక్తీకరణమైంది, కవి భావనలో-దేవరకొండ యిట్లు గలదు….
ఖద్యోత రథతురంగ మఖురోత్కర భి
దగ్ర శృంగ సప్తక ప్రథితమగుచు
దీర్ఘశాఖా సముద్దీప్త చందన ముఖా
ఖిల వృక్ష నికర సంకీర్ణమగుచు
మహిషాచ్చభల్లసామజ సింహశార్దూల
మృగ నికురుంబ సమ్మిళతమగుచు
సితవారి వాహ గర్భిత గండశైలాగ్ర
సంచరత్ కపిలోక సహిత మగుచు
చక్రవాక చకోర సారసబలాక
కనదులూకచలత్కార కాలకంఠ
కాది పక్షి ప్రకరవాదనాది భేద
గుంభితంబగు దేవరకొండగాంచి
ఇదంతా మిర్యాలగూడెం, దేవరకొండ, అచ్చంపేట అటవీ ప్రాంత చిత్రణ. నాగార్జునసాగరం ఏర్పడిన తర్వాత ఈ పద్ధతి పురాతన వర్ణనలు పద్యాలకే పరిమితమైనాయి. ఈ గ్రంథంలోని ఎన్నో పద్యాలు-కవి వర్ణనా నిపుణత్వానికి, శబ్ద చమత్కారాలకు నిలయంగా వున్నాయి.
తర్లిపోవటం, ఎదుర్కోళ్లు(లు), స్తాంబాళాలు, విడిది, అల్కచెంబు వంటి పదాలను సందర్భోచితంగా తెల్పి వ్యవహార రూఢ పదాలకొక స్థిరత్వాన్ని కల్పించినారు. ఉదాహరించవలసిన పద్యాలనేకం వున్నా, రెండు పద్యాలను మచ్చునకిస్తున్నాను.
కనదభ్రంకష వప్రసంకలితరంగ చ్చంద్రకాంతోపలా
భినవప్రాంచిత సాలభంజికలు సంప్రీతిన్‌పురీసౌధద
ర్మనహేలాగతివ్రాలు సౌరవనితా సందోహమోనాగ భ్రాం
తిని చెందన్ మణికంఠ పట్టణము నెంతేజూచి రాశ్చర్యతన్
నిరోష్ఠ్య సీసం: దీనరక్షణ చర్య ధృతి జితాహార్యన
దీన శిక్షణ శౌర్య తేజొహారు
రాజుఖద్యోతాక్షరక్షోహరణరాజు
రాజాంచిత కటాక్ష తేజోహారు
ధృత చారు కేశేయ దృఢకాయకరతల
స్థిత ఘోర కౌక్షేయ తేజోహారు
రాజితోద్యద్గుణారచిత లోకత్రాణ
తేజోల్లసద్దేహతేజొహారు
త్రిగుణసంగత హృత్కంజతేజొహారు
రాజదం ఘ్రి సరోజాత తేజొహారు
నైజ సౌశీల్య గుణహార తేజొహారు
ఆజగల్లోల చారిత్ర తేజోహారు
కవి తెలిపిన అహల్యా నది చాలా ప్రాచీనమైంది. నల్లగొండజిల్లాలోనే దాదాపు 132 కిలోమీటర్లు పయనించి వాడపల్లి వద్ద కృష్ణలో కలుస్తుంది. నేడు వాడుకలోవున్న ‘ఆలియా’, ‘హాల్యా’ అనేవి ముస్లిముల పరిపాలనలో చెడిపోయిన పదాలు కాబట్టి-ప్రాచీనమైన ‘అహల్యా’ నామాన్ని చట్టబద్ధం చేసి వ్యాప్తి చేయవలసిన అవసరం కలదు. ఈ ప్రాంతం సిరిసెనగండ్ల పర్వత శ్రేణుల్లోనూ స్ఫటికం పొరల రాయి వున్నది. ఈ వరుసనే కొత్తవారు, అనుముల ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది. ఇట్లా అనేక విధాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న ప్రతాపగిరి లేదా సిరిసెనగండ్ల క్షేత్రం అభివృద్ధి చెందవలసి యున్నది.
డాక్టర్ శ్రీరంగాచార్య