ప్రతిభకు-ప్రోత్సాహంప్రతిభ వుంటే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ వుండదు. హైదరాబాద్‌ పాతబస్తీలోనూ ప్రతిభకు కొదువలేదు అని చాటి చెప్పింది రాబోయే కాలంలో కాబోయే పైలట్‌ ‘సల్వా ఫాతిమా’. చదువుకోవాలంటే దండిగా డబ్బులు ఖర్చు చేయాల్సిన ఈ కాలంలో, అవేవీ అడ్డుకాదని నలుగురికీ చాటిచెప్పేవిధంగా సదివి సూపెట్టింది సల్వా ఫాతిమా.

సల్వా తండ్రి బేకరీలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. చదువుమీద వుండే శ్రద్ధతో ఇంట్లో ఆర్థికస్థితి సరిగాలేకున్నా, అమ్మమ్మ అందించిన అండతో పదో తరగతి చదువు పూర్తి చేసింది సల్వా. ఈ అమ్మాయి ప్రతిభను చూసి ఓ ప్రయివేట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆర్థిక సాయం చేశారు. 8వ తరగతి చదువుతున్నప్పటినుండే విమానాలు, పైలట్ల గురించి ఆసక్తి కనబరిచి అప్పుడే పైలట్‌ కావాలని మదిలో పదిలపరుచుకున్నది.

ఇంటర్మీడియట్‌ పూర్తయిన తరువాత ఓ దినపత్రిక నిర్వహించిన ఉచిత ఎంసెట్‌ కోచింగ్‌ శిక్షణకోసం వెళ్ళింది. అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మీ భవిష్యత్‌ ప్రణాళికలేమిటి అని అందరు విద్యార్థులను అడిగినపుడు అక్కడ శిక్షణ పొందుతున్న అమ్మాయిలందరూ ఇంజినీర్లు, డాక్టర్లమవుతామని చెప్పగా, సల్వ ఫాతిమా మాత్రం తాను పైలట్‌ కావాలనుకుంటున్నట్టు చెప్పింది. అందరిలో భిన్నమైన ఆలోచన గురించి చెప్పడం అక్కడికి వచ్చిన ప్రముఖులను ఆకర్షించింది. దాంతో ఆ దినపత్రిక ఎడిటర్‌ జాహెద్‌ అలీఖాన్‌ వాళ్ళ సంస్థనుండి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలా 2007లో కమర్షియల్‌ పైలట్‌ శిక్షణలో చేరింది. 2013లో 200 గంటలపాటు విమానం నడిపి కమర్షియల్‌ లైసెన్స్‌ కూడా తీసుకున్నది సల్వ.

సల్వా ఫాతిమా సంగతి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దృష్టికి వచ్చింది. ప్రతిభను ప్రోత్సహించేవిధంగా మల్టీ ఇంజిన్‌, టైప్‌రేటింగ్‌ శిక్షణకోసం 35.5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని స్వయంగా కేసీఆర్‌ సల్వఫాతిమాకు అందజేశారు. ఈ ఆర్థికసాయంతో కోర్సు, శిక్షణను పూర్తిచేస్తే, పూర్తిస్థాయి మల్టీ ఇంజిన్‌ కమర్షియల్‌ పైలట్‌గా మారిపోతుంది సల్వఫాతిమా.

ప్రతిభకు-ప్రోత్సాహం2నా ప్రతిభను, నా ఆర్థిక స్థితిని తెలుసుకుని ఆదుకుంటానని సి.ఎం.సాబ్‌ హామీ ఇవ్వడంతోపాటు దాన్ని అమలు చేసి చెక్కు చేతికందించడాన్ని నా జీవితపర్యంతం గుర్తుంచుకుంటానని, ప్రతిభకు పేదరికం అడ్డురాదనడానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం అన్నది సల్వాఫాతిమా.

Other Updates