బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలతో పాటు వినూత్నమైన పర్యావరణహిత చర్యలతో దేశంలో ప్రత్యేక గుర్తింపును పొందిన సింగరేణి సంస్థ 2015 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డు కు ఎంపికైంది. ఏప్రిల్ 20 వ తేదీన దుబాయ్‌లో జరిగిన ఐ.ఓ.డి. అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డును సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎం.డి.ఎన్.శ్రీధర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారఖ్ అల్ నహ్యాన్ చేతులమీదుగా అందుకున్నారు.
ఈ ఏడాది ఐ.ఒ.డి (ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్) సంస్థ వారి ఆధ్వర్యంలో వినూత్న ఉత్పత్తులు, సేవలు (ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ / సర్వీస్) విభాగం లో సింగరేణి సంస్థ కు ఈ ‘గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ / సర్వీస్ అవార్డ్ 2015’ ను ఇవ్వడం జరిగింది.
సింగరేణి సంస్థ ఓపెన్‌కాస్టు గనుల నుండి తొలగిస్తున్న మట్టి పొరలు (ఓవర్ బర్డెన్) నుండి ఇసుకను తయారు చేసే ఒక వినూత్నమైన పర్యావరణ హిత పద్ధతిని వరంగల్ జిల్లా భూపాలపల్లి ఏరియాలో 2010 సంవత్సరం నుండి ఆచరిస్తోంది. ఈ పద్ధతిలో ఓ.బి. నుండి ఇసుకను తయారుచేసేందుకు ఒక ప్లాంటును ఓపెన్ కాస్టు సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాంటునుండి తయారయ్యే ఇసుకను స్థానిక భూగర్బ గనుల్లో శాండ్ స్టోయింగ్ (బొగ్గు తవ్వగా ఏర్పడిన ఖాళీ ప్రదేశాన్ని ఇసుకతో నింపడం) కోసం ఎక్కువమొత్తంలో వినియోగిస్తున్నారు. అంతకు పూర్వం ఈ తరహా శాండ్ స్టోయింగ్ కోసం పూర్తిగా గోదావరి నది నుండి తెచ్చే ఇసుకను వాడుతుండే వారు. ఇప్పుడు గోదావరి నుంచి తెచ్చే ఇసుక చాలావరకు తగ్గిపోయింది.
ప్లాంటు సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతున్న నేపథ్యంలో ఓ.బీ. నుంచి తీసే ఇసుకనే శాండ్ స్టోయింగ్ కు పూర్తి స్థాయిలో వినియోగించే ఆలోచనతో కంపెనీ ఉంది. దీనితో పాటు ప్రాసెస్డ్ ఓ.బి (ఓ.బి. నుంచి వచ్చే ఇసుక)ను స్థానికంగా భవన నిర్మాణాలకు, ఇటుకల తయారీకి కూడా వినియోగిస్తున్నారు.
పర్యావరణ హిత ఆలోచనల్లో భాగంగా కంపెనీ చేపట్టిన ఈ ప్రాసెస్డ్ ఓ.బి.పద్ధతిని ప్రజలతోపాటు పర్యావరణ హితాభిలాషులు కూడా అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ఐ.ఒ.డి. వారు ఈ వినూత్న పర్యావరణ హిత ప్రక్రియను గుర్తించి అంతర్జాతీయ స్థాయి ‘గోల్డెన్ పీకాక్’ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు అందుకున్న ఛైర్మన్ ఎం.డి. ఎన్. శ్రీధర్ సింగరేణి సంస్థకు అంతర్జాతీయ స్థాయి అవార్డు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. భూపాలపల్లి తరహా ప్రాసెస్డ్ ఓ.బి. ప్లాంట్లు మరికొన్ని ఇతర ప్రాంతాల్లో ప్రారంభించడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలుపుతూ సింగరేణి సంస్థ మొదటినుండి పర్యావరణ హిత మైనింగ్ పద్ధతులను ఆచరిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తోందని అన్నారు.