ప్రతి ఇంటికి శుద్ధిచేసిన నీటిని అందిస్తాంరాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా శుద్ధిచేసిన, పరిశుభ్రమైన తాగునీటిని అందించడమే వాటర్‌గ్రిడ్‌ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటిశాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అక్టోబరు 6న శాసనసభలో వాటర్‌గ్రిడ్‌పై జరిగిన స్వల్ప వ్యవధి చర్చ సందర్భంగా ఆయన సమాధానమిచ్చారు. వాటర్‌గ్రిడ్‌కు వేసే పైపులైన్లు తెలంగాణ ప్రజల పాలిట లైఫ్‌లైన్లుగా మారబోతున్నాయన్నారు. రాబోయే ముప్పయి సంవత్సరాల్లో పెరిగే జనాభాకు అనుగుణంగా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా అంతర్జాతీయ స్థాయిలో రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. పనులన్నీ కూడా పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు.

అక్రమాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కృష్ణా, దాని ఉపనదుల నుంచి 19.65 టీఎంసీలు, గోదావరి దాని ఉపనదుల నుంచి 19.62 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు తీసుకుంటామని తెలిపారు. ఎల్లంపల్లి పైపులైన్‌ ద్వారా 3 టీఎంసీల నీటిని హైదరాబాద్‌ మహానగర నీటి అవసరాలకోసం తరలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మంచినీటి అవసరాల కోసం గ్రామాలలో నిర్మించిన పైపులైన్లు, వాటర్‌ట్యాంకులను ఈ వాటర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేసి వాడుకుంటామని తెలిపారు. వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు రూపకల్పన చేసినందుకే హడ్కొ వంటి సంస్థ అవార్డు ఇచ్చిందని, ఇది రాష్ట్రానికే గర్వకారణమన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి బీరేంద్రసింగ్‌ వచ్చి వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని మెచ్చుకున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తే దేశానికే స్పూర్తిదాయకంగా ఉంటుందని అన్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రపంచంలోనే ఇటువంటి ప్రాజెక్టు ఎక్కడా లేదని స్పష్టం చేశారు. లక్షా 25వేల కిలోమీటర్ల పొడవున్న ఈ పైపులైన్‌ ప్రపంచంలోనే పెద్దది కావచ్చన్నారు. మొత్తం 427 మండలాలు, 64 మున్సిపాలిటీలు, 98 అసెంబ్లీ నియోజకవర్గాలు వాటర్‌గ్రిడ్‌ కింద నీటిని పొందుతాయన్నారు. ఈ పథకాన్ని ప్రకటించే ముందు ఇది పూర్తిచేసి ఇంటింటికీ నల్లాల ద్వారా నీరు ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగమని ధైర్యంగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు. ఈ ప్రకటన తమకు ఈ పథకం పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియచేస్తుందన్నారు.

సిద్దిపేటకు ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఆ నియోజకవర్గంలోని 180 గ్రామాలకు రూ. 62 కోట్ల వ్యయంతో ఇంటింటికీ నీరందించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఆ స్పూర్తితోనే ఇప్పుడు తెలంగాణాలోని గడపగడపకు నీరివ్వాలని సంకల్పించారని తెలిపారు. ఇదే వాటర్‌గ్రిడ్‌ పథకానికి శ్రీకారం చుట్టడానికి కారణమైందన్నారు.

పారదర్శకంగా టెండర్లు

టెండర్ల విషయంలో పూర్తి పారదర్శకంగా ఉంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు అనుసరించిన ఈపీసీ విధానానికి స్వస్తి చెప్పినామన్నారు. సీడీఆర్‌కు లోనైన కంపెనీలకు ఇందులో అవకాశం కల్పించలేదని తెలిపారు. ఆర్థిక స్థోమత ఉన్న నిర్మాణరంగ సంస్థలకు మాత్రమే టెండర్లకు అవకాశం ఇచ్చామని, లెస్‌ టెండర్లు దాఖలైనాయని తెలిపారు.

Other Updates