రైతులను అన్ని విధాల ఆదుకోవడానికి, పండించిన పంటలకు మద్దతు ధర అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్ లో మద్దతు ధర రాకుంటే ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసే విధానం తీసుకురావాలని అధికారులకు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారని, అందువల్ల రైతాంగం నష్టపోయిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, చెరువులు పునరుద్ధరించామని, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశామని, గోదాములు నిర్మించామని, ఎకరానికి ఏడాదికి ఎనిమిది వేల పెట్టుబడిని ఈ ఏడాది నుంచే అందిస్తున్నామని, ప్రతీ 5వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించామని, రైతులను సంఘటిత శక్తిగా మార్చామని, వ్యవసాయ యూనివర్సిటీని బలోపేతం చేశామని, భూరికార్డుల ప్రక్షాళన ద్వారా వ్యవసాయ భూముల యాజమాన్య విషయంలో స్పష్టత వచ్చిందని, ఈ చర్యలతో పాటు రైతులకు పండించిన పంటకు మద్దతు ధర రావడమే లక్ష్యంగా ప్రభుత్వం విధానాన్ని రూపొందిస్తుందన్నారు.
”రైతులు సుస్థిరంగా ఉంటేనే రాష్ట్రం ప్రశాంతంగా వుంటుంది. వ్యవసాయం బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. అందుకే రైతులు పండించిన ప్రతీ గింజకు మద్దతు ధర వచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం” అన్నారు.
ప్రగతి భవన్‌లో వ్యవసాయంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. డిప్యూటి సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస రెడ్డి, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్ రావు, జోగు రామన్న, మహేందర్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎండిసి ఛైర్మన్ సుభాష్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ పాల్గొన్నారు.
రైతులు సుస్థిరంగా ఉంటేనే రాష్ట్రం ప్రశాంతంగా వుంటుంది. వ్యవసాయం బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. అందుకే రైతులు పండించిన ప్రతీ గింజకు మద్దతు ధర వచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.
”రాష్ట్రంలో 70 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఆర్థిక వేత్తలు ఏమి చెప్పినా ఎక్కువ మంది ఆధారపడిన ప్రధాన రంగం వ్యవసాయమే. అయితే వ్యవసాయ దారులు మాత్రం తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. తమనెవరూ పట్టించుకోరు అనే భావనలో ఉన్నారు. తమ కర్మ ఇంతే అనే బాధలో వారున్నారు. అలాంటి రైతుల్లో ధైర్యం నింపాల్సిన అవసరం
ఉంది. అవసరమైన చేయూత అందించి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల కొంత మార్పు వచ్చింది. రైతులకు మేలు జరుగుతున్నది. అంతిమంగా రైతులు పండించిన పంటకు మంచి ధర రావాలి. ఇది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న లక్ష్యం. రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో అత్యంత పట్టుదలతో, కృతనిశ్చయంతో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ‘వరి, మక్కల లాంటి దిగుబడులకు ప్రస్తుతం కనీస మద్దతు ధర లభిస్తోంది. పత్తి లాంటి ఇతర పంటలకు మద్దతు ధర విషయంలో అనిశ్చితి నెలకొంటున్నది.
అంతర్జాతీయ మార్కెట్లు, కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రభావం చూపుతున్నాయి. సిసిఐ లాంటి సంస్థలు కొనుగోలు చేస్తున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించే వ్యూహం రూపొందించాలి. రైతు సమన్వయ సమితిల ద్వారా ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసి, తిరిగి అమ్మాలి. ఇలా చేయడం వల్ల ఏమైనా నష్టం వస్తే కూడా ప్రభుత్వమే భరించాలి. రాష్ట్రంలో పండిన ప్రతీ పంట మార్కెట్ నెట్ లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. వివిధ రాష్ట్రాల్లో వివిధ పంటలకు మద్దతు ధర ఇచ్చే విషయంలో ఎలాంటి విధానం పాటిస్తున్నారో అధ్యయనం చేయడానికి అధికారులు మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో పర్యటించాలి. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు నాయకత్వంలో అధికారుల బృందం దేశ వ్యాప్తంగా మద్దతు ధరలకు సంబంధించిన విధానాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. రైతులకు మద్దతు ధర వచ్చే విషయంలో ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తుంది. వరిధాన్యం, మక్కలు, పప్పులు లాంటి సంప్రదాయ పంటలే కాకుండా పసుపు, మిర్చి, పత్తి లాంటి వాణిజ్య పంటలకు, మామిడి, నిమ్మ, బత్తాయి లాంటి పండ్లకు కూడా మంచి ధర రావాలన్నదే మా లక్ష్యం. అందుకనుగుణంగానే ప్రభుత్వ విధానం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్
రైతులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి నిధుల కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ ఏడాది నుంచి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడతామని సీఎం ప్రకటించారు. రైతులకు పెట్టుబడిగా అందించే నిధులతో పాటు, మద్దతు అందించడం కోసం కొంత నిధిని కూడా బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు. వ్యవసాయాన్ని అభివద్ది చేయడానికయ్యే ఖర్చును ముందే అంచనా వేసి, బడ్జెట్లో పొందుపరుస్తామని, దీనివల్ల నిధుల సమస్య రాదని సీఎం వెల్లడించారు.
”మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరింత ఉదారంగా వ్యవహరించాల్సి ఉంది. వరి, మక్కలకు ప్రస్తుతం ప్రకటించిన మద్దతు ధర పెరగాల్సి
ఉంది. ఈ రెండింటికి రూ.2వేల మద్దతు ధర ప్రకటించాలి. కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు అసలు మద్దతు ధరే లేదు. కాబట్టి దేశంలో పండే ప్రతీ పంటకు మద్దతు ధర ప్రకటించే విధంగా కేంద్ర విధానం ఉండాలి. దీనికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాం. టిఆర్‌ఎస్ పార్టీ పరంగా పార్లమెంటులో కూడా ఈ విషయం ప్రస్తావిస్తాం” అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
‘రైతులకు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం’ ఈ ఏడాది నుంచే అమలవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. మే 15 నాటికి మొదటి విడత ఎకరానికి 4వేల చొప్పున పెట్టుబడి రైతులకు అందిస్తామన్నారు. వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకాన్ని ఎలా అమలు చేయాలి? రైతులకు డబ్బులు నేరుగా అందివ్వాలా? బ్యాంకుల ద్వారా అందివ్వాలా? సాగు చేస్తున్న భూములను గుర్తించడం ఎలా? ఏ ప్రాతిపదికన పెట్టుబడి అందించాలి? తదితర అంశాలను అధ్యయనం చేయడానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఈ కమిటీలో మంత్రులు ఈటల రాజేందర్, టి.హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.
ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, జెన్ కో/ట్రాన్స్ కో సిఎండి డి. ప్రభాకర్ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి. హర్టికల్చర్ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, సిసిఎల్‌ఎ డైరెక్టర్ వాకాటి కరుణ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు రఘునందన్ రావు, ఎంవి రెడ్డి తదతరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 70 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఆర్థిక వేత్తలు ఏమి చెప్పినా ఎక్కువ మంది ఆధారపడిన ప్రధాన రంగం వ్యవసాయమే. అయితే వ్యవసాయ దారులు మాత్రం తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. అలాంటి రైతుల్లో ధైర్యం నింపాల్సిన అవసరం ఉంది. అవసరమైన చేయూత అందించి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల కొంత మార్పు వచ్చింది. రైతులకు మేలు జరుగుతున్నది.
- రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించే విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్య కార్యదర్శి పార్థసారథి నాయకత్వంలోని అధికారులు విశేష కృషి చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
- పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులతో పాటు, రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల పనులను శరవేగంగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్న నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అధికారులను సిఎం ప్రశంసించారు
- తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో అత్యుత్తమ సేవలందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా సీబీఐపీ అవార్డు అందుకున్న జెన్ కో, ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావును సీఎం అభినందించారు
- మొదటి దశ భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో 71,75,096 వ్యవసాయ ఖాతాలున్నట్లు తేలిందని, 1,42,12,826.17 ఎకరాల వ్యవసాయయోగ్యమైన భూమి ఉన్నట్లు లెక్కకొచ్చిందని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన డైరెక్టర్ వాకాటి కరుణ, రెవెన్యూ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఇతర సిబ్బందికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. వీలైనంత తొందరలో రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందివ్వనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇప్పటి నుంచి భూముల క్రయ, విక్రయాలు జరిగిన వెంటనే ఆ వివరాలు రాష్ట్ర అధికారుల వద్ద కూడా నమోదు కావాలని చెప్పారు. భూముల మ్యుటేషన్ అధికారం కూడా ఎమ్మార్వోలకే అప్పగిస్తున్నామని, ఇక ఆర్డీవోల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు
- రాష్ట్రంలో ప్రజలు వినియోగించే ఆహార పదార్థాలు ఎన్ని అనే విషయంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో అధ్యయనం చేయిస్తున్నదని, దానికి అనుగుణంగా క్రాప్ కాలనీలు నిర్థారించి, పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. మంచి మార్కెట్ ఉన్న పంటలను, నాణ్యతారకాలను ఎంపిక చేసుకుని సాగు చేయాల్సిందిగా రైతులను కోరనున్నట్లు వెల్లడించారు
- కల్తీ విత్తనాలను అరికట్టడంలో గత ఏడాది ఎంతో కృషి జరిగింది. ప్రభుత్వం పిడి యాక్టు కూడా తెచ్చింది. ఈ ఏడాది కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. విత్తనాల తయారీ దారులు, అమ్మకం దారుల వివరాలు, ఫోటోలు ముందే సేకరించి పెట్టుకోవాలని, ఎక్కడ ఏ పొరపాటు జరిగినా వెంటనే స్పందించాలని సూచించారు
- ఎరువుల కొరత రాకుండా ముందే స్టాక్ పెట్టుకున్నారని, అయినప్పటికీ ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకోవాలని సీఎం కోరారు.
- రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ కొత్తగా గోదాముల నిర్మాణం జరుగుతుందని, దీంతో 22.50 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు అందుబాటులోకి వస్తాయన్నారు. వేర్ హౌజింగ్, ఎఫ్.సి.ఐ. గోదాములు కూడా కలుపుకుంటే రాష్ట్రంలో 53 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములుంటాయని, వీటిని ఎరువులు, విత్తనాలు నిల్వ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చని సీఎం చెప్పారు.
- పంటలకు చీడ, పీడలు రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ విస్తరణాధికారులు రైతులను చైతన్య పరచాలని సీఎం కోరారు.
- రాష్ట్రంలోని ఏ ఎకరంలో ఏ పంట వేశారనే లెక్కలు వ్యవసాయ శాఖ వద్ద ఉండాలి. రెవెన్యూ శాఖపై ఆధారపడవద్దు. వ్వయసాయ విస్తరణాధికారులతో సమాచారం తెప్పించుకోవాలి అని సీఎం కోరారు.