-కన్నోజు మనోహరా చారి
మనం చేసే పొరబాట్లలో కొన్ని నిజాలు మనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. హైదరాబాద్ నగరంలోని కోటి ముప్ఫయ్ లక్షల మంది జనాభాకు సరఫరా అవుతున్న సుమారు 448 మిలియన్ గ్యాలన్ల మంచినీటిలో (203 కోట్ల లీటర్లు) 30 మిలియన్ గ్యాలన్ల మంచినీరు (13 కోట్ల లీటర్లు) మానవ తప్పిదాల వల్ల వృధా అవుతున్న సంగతి గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక కిలో లీటర్ మంచినీటిని మనంకృష్ణా, గోదావరి నదులనుండి తీసుకురావడానికి సుమారు 45 రూపాయలు ప్రభుత్వానికి ఖర్చవుతున్నది. 13 కోట్ల లీటర్ల మంచినీటి వృధాకు మనం డబ్బు కన్నా విలువైన మంచినీటిని వృధాచేస్తున్నామనే విషయాన్ని గ్రహించినపుడు వినడానికి బాధగా ఉంటుంది. కేవలం మనిషి నిర్లక్ష్యం వలన ”పొతే పోనీలే.. మన సొమ్మేం పోయిందనే” బాధ్యతా రాహిత్యంతో విలువైన మంచినీటిని వృధా చేస్తున్నామనే నిజాన్ని మనం గ్రహించడం అవసరం.
ప్రపంచంలో 150 దేశాలు నీటికోసం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు వరల్డ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ రెండునెలల కింద విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. వీటిలో కతార్, ఇరాన్, జోర్ధాన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయిల్, లెబనాన్‌తో సహా ఇండియా కూడా వుంది. ఇటీవల చెన్నయ్ పట్టణంలో ప్రజలు ఎదుర్కొన్న నీటి ఇబ్బందులను మనం ప్రత్యక్షంగా చూశాం. కేరళనుండి మంచినీటి రైళ్లను నడిపితేగానీ సమస్య కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే జలశక్తి అభియాన్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలోని 256 జిల్లాలలో నీటి ఎద్దడి వున్న 1592 బ్లాకులను గుర్తించి నీటి సంరక్షణా చర్యలను వేగవంతం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి వచ్చిన ముప్పేమి లేకపోచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నగరానికి మంచినీటిని అందించే దిశగా కొనసాగుతున్న మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, కేశవపూర్ రిజర్వాయర్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నప్పటికీ, ఆకాశంలో మబ్బులని చూసి ముంత ఒలక బోసుకున్నట్లుగా నీరు ఎలాగూ వుంటుందిగా ఇక మనం వృధా చేయవచ్చనే భావన పనికిరాదు.
సాగునీటి సంగతి దేవుడెరుగు, కనీసం తాగునీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితి పలు స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్నాయి. కర్ణాటకలో బహుళ అంతస్తుల నిర్మాణాలు నిలిపివేసే ఆలోచనలో ఉంటే, తమిళనాడులో ‘ఆఫీసుల్లో నీళ్లు లేవు, ఇంటినుంచే పనిచేయండి’ అని పలు కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు ఇటీవల పిలుపు నిచ్చాయి. నీటి దుర్వినియోగం కొనసాగితే 2050 నాటికి భారత్ జిడిపిలో 6 శాతాన్ని కోల్పోతుంది. ఆరోగ్యం, వ్యవసాయం, స్థిర, చరాస్థి రంగాలపై నీటి కొరత తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దేశంలో నీటి కటకటకు ఇష్టారాజ్యంగా నీళ్లను వృధా చేయడం కూడా ఒక కారణమని సెంట్రల్ వాటర్ కమీషన్ చెబుతోంది. పైపుల ద్వారా సరఫరా అయ్యే నీటిలో 40 శాతం వృధా అవుతోంది. 2040 నాటికీ మన దేశ జనాభాలో 40 శాతం మందికి తాగేందుకు నీళ్లు దొరకవు. 2021 నాటికీ ఢిల్లీ సహా 21 నగరాల్లో భూగర్భ జలాలు కనుమరుగైపోతాయని నీటి నిర్వహణ నిపుణులు రాజేంద్ర సింగ్ హెచ్చరించారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో నీటి పరిస్థితి ఈ విధంగా ఉంటే, గత నాలుగేళ్లుగా హైదరాబాద్ నగరంలో మంచి నీటి ఎద్దడి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. జలభాగ్యం పేరుతో ఇంకుడు గుంతలను ప్రోత్సహించడం, ‘జలం జీవం’ పేరుతో నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహనా సదస్సులు, సమావేశాలను ఏర్పాటు చేయడం, ప్రస్తుతం వాటర లీడర్ షిప్ అండ్ కన్జర్వేషన్ పేరుతో వృధా అవుతున్న కోట్ల లీటర్ల మంచినీటిని ఆదా చేయడం కోసంకృషి జరుగుతున్నది.
గత 50 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం 24 శాతం తక్కువగా వానలు కురుస్తున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. పడుతున్న వర్షాలు కూడా కొన్నిసార్లు ఆలస్యం కావడం, మరి కొన్ని సార్లు ముందే కురవడం, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలే కురవకపోవడం కొన్నేళ్లుగా జరుగుతున్నది. హైదరాబాద్ నగరంలో ఈ సంవత్సరం సగటు వర్షపాతం కన్నా ఎక్కువే కురిసినప్పటికీ, నగరానికి నీరందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా, సింగూరు ల్లోకి నీరు రాలేదు. ప్రస్తుతం మనం నీటి పొదుపుపై మాట్లాడాల్సిన అవసరం ఎంతో వుంది. వృధాగా పోతున్న నీటి గురించి చర్చించాల్సిన అవసరం వుంది. మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న నీటి వృధాపై ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. అదే వాక్.. వాటర్ లీడర్ షిప్ అండ్ కన్జర్వేషన్. నీటి వృధాను తగ్గించాలి. వ్యక్తిగతంగా, సంఘపరంగా నీటి వృధాను తగ్గించడం కోసం అందరూ సమాయత్తం కావాల్సిన అవసరం వుంది. నీటి వృధాను అరికట్టడానికి వ్యక్తుల్లోనే మార్పు రావాలి. ఈ మార్పు రావాలంటే నాయకులు కావాలి. నీటి విలువలను ప్రజలకు వివరించే కార్యకర్తలు కావాలి. ప్రజలకు విస్త త భాగస్వామ్యం కల్పిస్తూ వారిని కార్యోన్ముఖులుగా చేసే నిబద్ధత కలిగిన నాయకత్వం ఉంటే, మన హైదరాబాద్ నగరమే కాదు, దేశం మొత్తం మనవైపు చూస్తుంది.
గత మూడు మాసాలుగా జరుగుతున్న వాక్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో నీటి వృధాపై ఒక అవగాహన ఏర్పడింది. జల సంరక్షణ ఉద్యమాన్ని క్షేత్ర స్థాయి లో బలంగా తీసుకువెళ్లాలి. ఇందుకోసం, కాలనీ సంఘాలు, యువ వాలంటీర్లు, మహిళా స్వయం సంఘాలు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరం. ప్రజలందరూ తమ బాధ్యతగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి.
భూగర్భ జల మట్టాలు క్షీణించకుండా చూసుకుంటూ, వినియోగంలో పొదుపు పాటించి, నీటి వృధాను నివారించడం ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డం, దక్షిణాఫ్రికా దేశాల్లో జాతీయ అజెండాగా అమలు చేస్తున్నారు. భవనాలపై కురిసిన వాననీటి సంరక్షణలో జర్మనీ ఇతర దేశాలకు పాఠాలు నేర్పుతున్నది. ఆకాశం నుండి పడే ప్రతి నీటి బొట్టునుండి బహుళ ప్రయోజనాలు పొందే విధంగా సింగపూర్ వాసులు వాటర్ మేనేజ్‌మెంట్‌ను రూపొందించుకున్నారు. ఈ లెక్కన, నీటి వృథాను అరికట్టడం కోసం చేస్తున్నకృషిలో హైదరాబాద్ నగరం ముందంజలో వుంది.
హైదరాబాద్ నగర జనాభా రోజురోజుకి పెరిగిపోతున్నది. నగరంలో పేదలు నివసించే చాలా ఇళ్లకు సంపులు వుండవు. నల్లాలకు ఆన్ ఆఫ్ చేసే మర చుట్లు వుండవు. అవసరాలకు పట్టుకున్నాక, మిగితా నీరు మురుగు నీటి కాల్వలోకి వదులుతున్నారు. పైపులతో చాలామంది తమ కార్లు, ద్విచక్ర వాహనాలు, అపురూపంగా పెంచుకునే కుక్క పిల్లలని, పిల్లి పిల్లలను నిత్యం శుభ్రం చేస్తుంటారు. ఇంటి వసారాలు పైపు నీళ్లతో కడుగుతుంటారు. రహదారులు శుభ్రం చేయడానికి కూడా ఈ నీళ్లనే వాడుతున్నారు. ధారగా వచ్చే నల్లా నీళ్లతో దుస్తులు ఉతకడం, వంట పాత్రలు కడగటం, చెట్లకు మొక్కలకు నీళ్లు పట్టడం, షవర్ తో స్నానం చేయడం, నిత్యం జరిగే నీటి వృధాకు తార్కాణాలు.
కొన్ని బకెట్లతో మాత్రమే సరిపోయే పై అవసరాలకోసం ధారగా పోస్తుండే ఒక పెద్ద నీటి వైపునే వాడుతుండటం మనం చూస్తుంటాం. నీళ్లు ఎందుకు వేస్ట్ చేస్తున్నారో వీళ్లకు తెలియక కాదు.. కేవలం నిర్లక్ష్యం… పొతే పోనీయ్.. అనే భయంలేని తనం. 2021 వరకు మన నగర జనాభా 163 లక్షలకు చేరుకుంటేే, తాగునీటి డిమాండ్ 838 మిలియన్ గ్యాలన్లకు పెరిగే అవకాశం వుంది. 2031 వరకు జనాభా 234 లక్షలకు చేరుకుంటే, 1203 మిలియన్ గ్యాలన్స్ అవసరం ఉంటుంది. 2041 వరకు జనాభా 317 లక్షలకు చేరుకుంటే, 1,625 మిలియన్ గ్యాలన్లు కావాలి. ఇవన్నీ అంచనాలు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానే వుంది.కృష్ణా, గోదావరి నదుల నీటికి అనుబంధంగానే కేశవపూర్, దేవలమ్మ నగరం రిజర్వాయర్ నీళ్లు అందుబాటులోకి వస్తాయి. 3000 ఎం.ఎం డయాతో నిర్మించే రింగ్ మెయిన్ కూడా అందుబాటులోకి వస్తే, నగరానికి నీటి సమస్య ఉండదు. కానీ నీళ్లు ఉన్నాయికదాని, వృధా చేయడం ఎంతవరకు మంచిదని అందరూ ఆలోచించాలి. వాననీరు భూమిలోకి ఇంకిపోయేలా జాగ్రత్తలు తీసుకుంటే భూగర్భ జలాలను పునరుద్ధరించవచ్చును. భూమిని ఒక బ్యాంకు గా పరిగణించాలి. బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్లుగానే, భూమిలోపలికి నీటిని ఇంకేవిధంగా చర్యలు తీసుకోవాలి. బ్యాంకులో డిపాజిట్ పెరిగినట్లుగానే, భూమిలోపల కూడా నీటి డిపాజిట్లు పెరుగుతాయి. ఈ డిపాజిట్ భవిష్యత్ తరాలకు పనికి వస్తాయి. ఎవరూ నీటిని వృధా చేయవద్దు. రాబోయే తరాలకు మనం డబ్బులు కాదు ఇవ్వాల్సింది… గుక్కెడు మంచినీళ్లను ఇస్తే సరిపోతుంది. జల సంరక్షణ అందరి బాధ్యత.
25 ఏండ్లుగా నీటి ఎద్దడి ఎరుగని జల వాయు విహార్, ప్రతి వర్షపు నీటి బొట్టును ఎక్కడికక్కడ ఇంకిపోయేలాగా ఇంటింటికీ నీటి గుంతలను ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలను పెంపొందించే నాగోల్ కో ఆపరేటివ్ బ్యాంకు కాలనీ వాసులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. వంద ఇంకుడు గుంతలు నిర్మించి కాలనీ మొత్తానికి ఒకే బోరుతో నీటి సరఫరా చేస్తున్న శేర్ లింగంపల్లి నల్లగండ్ల గ్రామంలో నిర్మించిన లక్ష్మి విహార్ పేజ్ -2 గేటెడ్ కమ్యూనిటీని మనం ప్రశంసించాలి. 14 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేసిన ఈ కాలనీలో ప్రతి వర్షపు నీటి చుక్క వృధా కాకుండా కాపాడుతున్నారు. నీరు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. అన్నింటి అభివృద్ధి నీటి మీదనే ఆధారపడి వుంది. ఆ నీటిని కాపాడుకోవడం, వృధా కాకుండా చూసుకోవడం మనందరి బాధ్యత.