తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రారంభానికి సిద్ధమైన మొదటి దశ 2018 మార్చి నాటికి మిషన్ భగీరథ పూర్తి 2017 చివరి నాటికి 90 శాతం పూర్తి దేశంలోనే అతి పెద్ద మంచినీటి పథకంగా రికార్డు ప్రధాని సహా అన్ని వైపుల నుంచి ప్రశంసలు గటిక విజయ్ కుమార్ నల్లా నీరంటే మనకున్న అనుభవం ఏమిటి? రెండు మూడు రోజులకోసారి వచ్చే కాసిన్ని నీళ్లు… కొన్నిప్రాంతాలకైతే వారానికోసారి వచ్చి కనిపించే చుట్టం…
శివారు పల్లెలకు, తండాలకు,గూడేలకు నల్లాలంటే తెలియవు…
వచ్చిన చోట కూడా ఇంటికి రెండు బిందెలు కూడా రావు…
వచ్చిన కాసిన్ని నీళ్లు కూడా తాగడానికి పనికొచ్చేవి కావు…
బట్టలుతకడానికి, అంట్లు తోమడానికి మాత్రమే ఉపయోగపడేవి…
ఎండాకాలంలో నల్లా పైపులు నీళ్లు రాని ఇనుప గొట్టాలే…
చిలుం పట్టిన పైపుల నుంచి వచ్చిన నీళ్లు రోగ కారకాలు…
ఫ్లోరైడ్ కలిసిన నీళ్లతో పసిడి ప్రాయంలో అవిటితనం…
వాననీళ్లు, భూగర్భజలాలను బట్టే నల్లా నీళ్ళ అదృష్టం…
నల్లా ద్వారా మంచినీళ్లు వచ్చినా క్యాన్ల నీళ్లు కొనాల్సిందే…
కానీ తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి కథ మారుతున్నది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ సురక్షిత మంచినీటిని ప్రతీ రోజు చాలినన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. కరువు కాటకాలు సంభవించినా, భూగర్భజలాలు అడుగంటినా సరే ఇంటికి మంచినీరు వచ్చి తీరాలనే లక్ష్యంతో ‘మిషన్ భగీరథ’ కార్యక్రమం చేపట్టారు. అటు కృష్ణ, ఇటు గోదావరి నదుల నుంచి నీళ్లను చిలుంపట్టని పైపుల ద్వారా తెచ్చి ప్రతీ గ్రామంలో సరఫరా చేసే బృహత్తర కార్యక్రమం ఇది. నదుల నీళ్లను వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు చేర్చి అక్కడ శుద్ధి చేసి నీటిని గ్రామాలకు పంపుతారు.గ్రామాల్లోని ఓహెచ్‌ఎస్‌ఆర్ ల ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తారు. వచ్చే 30 ఏళ్ల వరకుండే జనాభాను అంచనా వేసి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేశారు. అప్పటి వరకు మంచినీటి సమస్య లేకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టును 26 సెగ్మెంట్లుగా విభజించి సమాంతరంగా పనులు చేస్తున్నారు. రూ.42,853 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్నారు.
సవాల్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలోని ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందివ్వడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ గా తీసుకున్నారు. గ్రామాలు,పట్టణాలు,నగరాల్లో మాత్రమే కాదు, ప్రతీ తండాలో, ఆదివాసీ గూడేల్లో, శివారు కాలనీల్లో కూడా ప్రతీ ఇంటికి మంచినీటి పైపులైన్ల నిర్మాణం జరుగుతున్నది. ప్రతీ ఇంట్లో నల్లా పెట్టే పని కూడా ప్రభుత్వమే చేస్తున్నది. వచ్చే ఎన్నికల లోపు ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేది లేదని ప్రకటించి తనకు తాను సవాల్ విసురుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనుకున్నది అనుకున్నట్లుగా పనులు సాగుతున్నాయి. ముఖ్యమంత్రే స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు.
మిషన్ భగీరథ లక్ష్యాలు
- రాష్ట్రంలోని 25వేల నివాస ప్రాంతాలకు నల్లా ద్వారా సురక్షిత మంచినీరు అందించడం.
- 2018 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి
- 2016 ఆగస్టులో మొదటి దశ ప్రారంభం
- 2016 డిసెంబర్ నాటికి 6 వేల గ్రామాలకు మంచినీరు అందించడం.
- 2017 డిసెంబర్ నాటికి 90 శాతం గ్రామాలకు మంచినీరు ఇవ్వడం
- గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఇంటికి ప్రతీ రోజు 100 లీటర్ల మంచినీరు అందాలి
- మున్సిపాలిటీలు/నగర పంచాయితీల్లో ప్రతీ ఇంటికి ప్రతీ రోజు 135 లీటర్ల మంచినీరు అందాలి
- మున్సిపల్ కార్పోరేషన్లలో ప్రతీ ఇంటికి ప్రతీ రోజు 150 లీటర్ల మంచినీరు అందాలి
- మిషన్ భగీరథ పైపులైన్ల ద్వారానే పరిశ్రమలకు ప్రాజెక్టుల్లోని 10 శాతం నీరు సరఫరా చేయాలి
- ప్రతీ నీటిపారుదల ప్రాజెక్టులోని రిజర్వాయర్లలో 10 శాతం నీటిని మిషన్ భగీరథకు వాడుకోవాలి
శాశ్వత నీటి వనరులే మిషన్ భగీరథకు ఆధారాలు
- 365 రోజులూ మంచినీళ్లు అందించడం కోసం ఎప్పుడూ ఎండిపోని ప్రాంతాల నుంచి నీటిని తరలిస్తారు.
- కృష్ణ, గోదావరి బేసిన్ల నుంచి 4.27 టింఎంసిల నీటిని వాడుతారు.
- కృష్ణ బేసిన్లోని శ్రీశైలం బ్యాక్ వాటర్, కృష్ణా నది, టేల్ పాండ్, పాలేరు నుంచి 19.65 టిఎంసిల నీటిని వాడతారు
- గోదావరి బేసిన్లోని సింగూరు డ్యామ్, ఎల్‌ఎండి, ఎంఎండి, గోదావరి నది, ఎస్‌ఆర్‌ఎస్పీ, కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి, కొమురంభీమ్ ప్రాజెక్టుల నుంచి 19.62 టిఎంసిల నీటిని వాడతారు.
- హైదరాబాద్ కు మంచినీరు సరఫరా చేసే ఎల్లంపల్లి లైన్ నుంచి 3 టిఎంసిల నీరు వాడతారు.
- ప్రభుత్వం, ప్రైవేటు భూముల నుంచి మంచినీటి పైప్ లైన్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రైట్ ఆఫ్ వే చట్టాన్ని తెచ్చింది.
ప్రధాని సహా పలువురి ప్రశంసలు
తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే మిషన్ భగీరథ దేశంలోనే అతిపెద్ద మంచినీటి పథకం. కేవలం మంచినీటికోసం లక్షా 30వేల కిలోమీటర్ల పైపులైన్ మరెక్కడా నిర్మించలేదు. నదీ జలాల తరలింపు నుంచి మొదలుకుని డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్, ఓహెచ్‌ఎస్‌ఆర్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు తదితర అన్ని విషయాల్లో మిషన్ భగీరథ కొత్త చరిత్రను లిఖిస్తున్నది. ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చి అతి తక్కువ సమయంలోనే మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నో ప్రశంసలు లభించాయి. 2016 మే 22న జరిగిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోది మిషన్ భగీరథ పథకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. నీతి ఆయోగ్ కూడా దీనిని ఉపయుక్తమైన కార్యక్రమంగా పేర్కొంటూ మిగతా రాష్ట్రాలు కూడా ఇలాంటి పథకాలు రూపొందించాలని సిఫారసు చేసింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రుుాలు తమ రాష్ట్రాల్లో ఇలాంటి పథకం అమలు చేయడం కోసం అధ్యయనం చేస్తున్నాయి.
మిషన్ భగీరథ ముఖ్యాంశాలు
- సెగ్మెంట్లు : 26
- నియోజకవర్గాలు: 99
- మండలాలు: 437
- కార్పొరేషన్లు/మున్సిపాలిటీలు/
- నగర పంచాయితీలు: 63
- ఆవాస ప్రాంతాలు : 24,224
- గ్రామీణ కుటుంబాలు: 49,19,007
- ఇన్ టేక్ స్ట్రక్చర్స్: 17
- ట్రాన్స్ మిషన్ లైన్స్: 49,260 కిలోమీటర్లు
- డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్: 40,605 కిలోమీటర్లు (ప్రస్తుతం ఉన్నవి) :40,303 కి.మీ (కొత్తవి)
- పైప్ లైన్ నెట్ వర్క్: 1,30,168 కిలోమీటర్లు
- ఓహెచ్‌ఎస్‌ఆర్ లు: 17,066 15.34
- లక్షల లీటర్ల సామర్థ్యం (ప్రస్తుతం ఉన్నవి): 18,507
- 10.75 లక్షల లీటర్ల సామర్థ్యం (కొత్తవి)
- వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్:
- 60 (804 మిలియన్ లీటర్ల సామర్థ్యం)
- ప్రస్తుతం ఉన్నవి: 50 (3311 మిలియన్ లీటర్ల సామర్థ్యం) కొత్తవి