సంపద సృష్టించాలి, అది పేదలకు పంచాలి.. ఇదే కేసీఆర్ ప్రగతి సూత్రం
వికె గటిక
భారతదేశానికి పేదలున్న సంపన్న దేశంగా పేరు. అపారమైన సహజ వనరులు, ఖనిజ వనరులు, ఆర్థిక వనరులు, మానవ వనరులున్న దేశం. కానీ దేశంలో అత్యధికులు పేదలే. దేశ సంపద దేశంలోని పేదల సంక్షేమానికి ఉపయోగపడడం లేదనే విమర్శలున్నాయి. దేశ ఆర్థిక విధానాలు, ప్రభుత్వం రూపొందించే పథకాలు కూడా పేదరిక నిర్మూలన లక్ష్యంగా కాకుండా, పెట్టుబడి దారులకు అనుకూలంగా ఉంటున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా రానురాను ఏ పథకం ప్రవేశ పెట్టినా దానివల్ల పడే ఆర్థిక భారం, దాని వల్ల వచ్చే ఆర్థిక ప్రతిఫలం గురించి ఆలోచించడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు పొందడం ప్రారంభమయిన దగ్గరి నుంచి పేదరిక నిర్మూలన, పేదల సంక్షేమం, సామాన్యులకిచ్చే సబ్సిడీలలో కోత అనివార్యమైంది. ప్రభుత్వం కూడా ఓ వ్యాపార సంస్థలా ఆలోచించే పరిస్థితి వచ్చింది. పేదరిక నిర్మూలన కోసం, పేదల సంక్షేమం కోసం చేసిన వ్యయం నిరర్ధకమైనదనే అభిప్రాయం ఆర్థిక వేత్తలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా పేదల సంక్షేమ పథకాలకు, సామాన్యులకిచ్చే సబ్సిడీలకు కోతలు విధిస్తూ వస్తున్నారు.
కేసీఆర్ ఆలోచనా దృక్పథంలోనే భిన్నం
సంపద సృష్టించాలి.. అది పేదలకు పంచాలి అనేదే కేసీఆర్ ప్రగతి సూత్రం. తెలంగాణ ధనిక రాష్ట్రమని పదే పదే చెప్పే కేసీఆర్, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆదాయ వృద్ధి రేటు 17.82 శాతం. దేశంలో ఇంతగా ఆదాయ వృద్ధి రేటున్న రాష్ట్రం మరోటి లేదు. ప్రతీ ఏడాది కూడా 15 శాతం కన్నా తక్కువ
వృద్ది ఉండదని, ఈ వృద్ధి రేటు స్థిరంగా కొనసాగుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ బడ్జెట్ కూడా ప్రతీ ఏటా 15 శాతానికి మించి పెరుగుతూ పోతోంది. ఇలా పెరిగిన బడ్జెట్ అంతా పేదల సంక్షేమానికే ఉపయోగపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆకలి దప్పులులేని, ఆత్మహత్యలులేని తెలంగాణను స్వప్నించామని, ఆ స్వప్నం సాకారం కావాలంటే పేదరికం పోవాలనేదే సీఎం తలంపు. తిండి కూడా దొరకని వారి పట్ల, ఎలాంటి అండ, ఆదరణ లేని వారిపట్ల అత్యంత మానవత్వంతో వ్యవహరించే వైఖరి తీసుకున్నారు. దీని ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ప్రజలకు నిజంగా అవసరమనుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుందనే అంచనా కూడా లేకుండానే పథకాలు రూపొందించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసిన తర్వాతనే మిగతా పథకాల గురించి ఆలోచించాలని అనేక సార్లు సిఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా అదే బాటన పయనిస్తున్నది.
పెన్షన్లు బిచ్చం కాదనుకునే ధోరణి
వ ద్దులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లిచ్చే విధానం చాలా కాలంగా దేశ వ్యాప్తంగా ఉంది. రూ.200 పెన్షన్ ఇచ్చేవారు. కానీ 200 పెన్షన్ ఏ మూలకూ సరిపోదని, వాటి ద్వారా ఏ అవసరమూ తీరదని కేసీఆర్ భావించారు. పెన్షన్ బిచ్చం ఏసినట్లు ఉండవద్దని, అది మనిషి కనీస అవసరాలు తీర్చాలని వాదించారు. ఎన్నికలకు ముందే మానిఫెస్టో రూపొందించినప్పుడే ఈ విషయంపై దృష్టి పెట్టారు. ఒక మనిషి కడుపునిండా అన్నం తినడానికి, మందులు కొనడానికి, ఇంకా చిన్న చిన్న అవసరాలు తీరడానికి ఎంత అవసరమవుతుందో లెక్కకట్టి కనీసం వెయ్యి రూపాయలైనా ఇవ్వాలని నిర్ణయించారు. అదే విషయం మేనిఫెస్టోలో పొందుపరిచారు. ప్రభుత్వంలోకి రాగానే వెయ్యి రూపాయల పెన్షన్ అమలు చేస్తున్నారు. మిగతా వారికన్నా వికలాంగులకు ఇంకా ఎక్కువ అవసరాలు
ఉంటాయి కాబట్టి వారికి నెలకు 1500 రూపాయలు అందిస్తున్నారు. అన్ని రాష్ట్రాల మాదిరిగా కేవలం
వృద్దులు, వితంతువులు, వికలాంగులకే కాకుండా అవసరం అనుకున్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మిగతా రాష్ట్రాల్లో లేని విధంగా గీత కార్మికులకు, నేత కార్మికులకు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు పెన్షన్ అందుతున్నది. ఒంటరి తనం అనుభవిస్తున్న మహిళలకు, బీడీలు చుట్టి ఆరోగ్యం పాడుచేసుకుంటున్న మహిళలకు, ముస్లిం ప్రార్థనా మందిరాల్లో ఆధ్మాత్మిక కార్యక్రమాలు నిర్వహించే ఇమామ్, మౌజమ్‌లకు కూడా పెన్షన్ అందుతున్నది. తెలంగాణలో పెన్షన్ బిచ్చమేసినట్లు ఉండవద్దని, వారు ఆత్మగౌరవంతో బతకడానికి దోహదపడే విధంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించి, రూ.4,844 కోట్ల వ్యయంతో ఆసరా పెన్షన్లను అమలు చేస్తున్నది.
ఆడపిల్లల అమ్మకాలను ఆపేందుకు కళ్యాణలక్ష్మి
ఆడపిల్ల పుట్టిందంటే చాలు కుటుంబాల్లో గుబులు మొదలవుతుంది. ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి భారంగా మారడంతో కన్నవారు ఆడపిల్లను గుండెలపై భారంగా భావించే పరిస్థితి వచ్చింది. అందుకే ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే చంపేయడం, లేదంటే పుట్టిన తర్వాత చంపేయడం లేదా అమ్మేయడం లాంటి సంఘటనలు చూసినవే. ఆడపిల్ల అనే చులకన భావంతో పెద్దగా చదివించకుండానే బాల్య వివాహాలు చేయడం కూడా నిత్యానుభవమే. ఈ పరిస్థితిలో మార్పు రావాలని, ఆడపిల్ల పుట్టిందంటే కుటుంబం సంతోషంగా ఉండాలని సిఎం భావించారు. అందుకోసమే ఆడపిల్ల పెళ్లి భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే కళ్యాణలక్ష్మి అనే కార్యక్రమం తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లలకు రూ.51వేల సాయం అందించారు. మైనారిటీల కోసం షాదీ ముబారక్ కార్యక్రమం అమలు చేశారు. అన్ని కులాల్లో, కుటుంబాల్లో కూడా ఆడపిల్ల పెళ్లి భారంగానే ఉందనే విషయం గమనించి, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను అనుసరించి కళ్యాణలక్ష్మి కార్యక్రమాన్ని బిసి, ఇబిసిలకు కూడా అమలు చేస్తున్నారు. దీని ద్వారా అందించే సాయాన్ని రూ.75,116లకు పెంచారు. కళ్యాణలక్ష్మి ద్వారా లబ్ది పొందాలంటే అమ్మాయికి కనీసం 18 సంవత్సరాలు నిండాలనే నిబంధన పెట్టడం వల్ల బాల్య వివాహాలు కూడ గణనీయంగా తగ్గిపోయాయి.
తెలంగాణ వచ్చే నాటికి హాస్టళ్లలో విద్యార్థులకు దొడ్డు బియ్యం, పురుగులు పట్టిన ముక్కిన బియ్యం, నీళ్ల చారుతో భోజనం పెట్టేవారు. అది తినలేక, పస్తులుండలేక పిల్లలు రోగాల బారిన పడేవారు. సంక్షేమ హాస్టళ్లు నరకానికి నకళ్లు అనే వార్తలు పేపర్లలో వచ్చేవి. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ .. తెలంగాణ రాష్ట్రంలో హాస్టల్ పిల్లలకు నాణ్యమైన సన్నబియ్యంతో అన్నం పెట్టాలని, పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించారు. భవిష్యత్తులో దేశానికి సేవ చేయాల్సిన పిల్లలు అనారోగ్యంతో నీరసించి పోవడం దేశానికే మంచిది కాదని సిఎం భావించారు. అందుకే ఇవాళ అన్ని హాస్టళ్లకు, మధ్యాహ్న భోజనానికి, అంగన్ వాడీ కేంద్రాలకు ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేస్తున్నది. దాని ద్వారా పిల్లలు కడుపునిండా అన్నం తిని, మంచిగా చదువుకుంటున్నారు.
రక్తం అమ్ముకుని రంజాన్ బట్టలా?
సిఎం కేసీఆర్ ఒక సందర్భంలో మిత్రులతో చర్చించుకుంటుండగా రంజాన్ పండుగ గురించి చర్చ వచ్చింది. రంజాన్ సందర్భంగా ప్రతీ ముస్లిం కుటుంబమంతా కొత్త బట్టలు కొంటారని, అవసరమైతే అప్పులు కూడా చేస్తారని కొందరు సీఎంకు చెప్పారు. అప్పు దొరకని వారు బ్లడ్ బ్యాంకుల్లో రక్తం అమ్ముకుని మరీ రంజాన్ కు బట్టలు కొంటారని మరొకరు చెప్పారు. దీంతో తీవ్రంగా కలత చెందిన కేసీఆర్ రంజాన్ బట్టలను పేదలకు ప్రభుత్వం తరుఫునే అందించాలని, బట్టల కోసం రక్తం అమ్ముకునే దుస్థితి పోవాలని నిర్ణయించారు. దాని ఫలితంగానే రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు బట్టల పంపిణీ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. తర్వాత క్రిస్టియన్లలోని పేదలకు దుస్తుల పంపిణీ ప్రారంభమయింది. ఈ ఏడాది నుంచి బతుకమ్మ సందర్బంగా హిందువులలోని పేదలకు కూడా బట్టల పంపిణీ చేయాలని సిఎం నిర్ణయించారు.
నిండు గర్భిణులు కూడా కూలీకి వెళ్లడమేంటి?
పేద కుటుంబాల్లో ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ తలో పని చేసుకుని బతుకుతారు. మహిళలు కూడా కూలీ పనిచేస్తే కానీ, కుటుంబం గడవని కుటుంబాలున్నాయి. ఆ కుటుంబాల్లోని మహిళలు నిండు గర్భవతులైనప్పటికీ కూలీ పనులు చేస్తారు. నిజానికి ఏడు నెలలు నిండిన గర్భిణులు ఇంటి పట్టునే ఉండి పోషకాహారం తిని, విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పటికప్పడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రసవం జరిగిన తర్వాత మూడు నెలల పాటు కూడా శిశువు వెంటే ఉండి తల్లి, బిడ్డలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కాని పేద కుటుంబాల్లో అది సాధ్యం కావడం లేదు. కూలీకి వెళ్లకుంటే కుంటుంబమే గడవదు, ఇక పౌష్టికాహారం ఎలా దొరుకుతుంది. అందుకే నిండు గర్భిణీలు కూడా కూలీకి వెళ్తున్నారు. ప్రసవం జరిగిన వారం రోజులకే మళ్లీ కూలీకి వెళ్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు గర్భిణీలు, బాలింతలు కూలీకి వెళ్లకుండా, వారు నష్టపోయే కూలీని ప్రభుత్వమే చెల్లించే విధంగా, తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. గర్భిణీకి రూ.12వేల ఆర్థిక సహాయం అందించాలని, ఆడపిల్ల పుడితే ప్రోత్సాహకంగా మరో వెయ్యి రూపాయలు అందించాలని, మాతా శిశు సంరక్షణకు రూ.2వేల విలువైన కిట్ అందిచాలని నిర్ణయించారు.
పుస్తెలమ్మి పెట్టుబడి పెట్టే పాడు కాలం పోవాలని..
దేశానికి అన్నం పెట్టే రైతన్నలు పెట్టుబడి డబ్బుల కోసం పడే అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇండ్లు, భూమి కుదవ పెట్టి, భార్య పుస్తెలమ్మి మరీ పెట్టుబడి వ్యయం సమకూర్చుకుంటారు. ఏదో కారణం చేత పంట పోతే పెట్టిన పెట్టుబడంతా పోయి అప్పులు మిగులుతాయి. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఖర్చయినా సరే వెనుకాడకుండా రైతులకు పెట్టుబడి సమకూర్చాలని నిర్ణయించారు. ప్రతీ ఎకరానికి ఒక పంటకు రూ.4వేలు ఖర్చు అవుతుందని లెక్క గట్టారు. రెండు పంటలకు పెట్టుబడి కింద ఎకరానికి రూ.8వేలు ఇవ్వాలని నిర్ణయించారు. 2018 ఖరీఫ్ నుంచి పెట్టుబడి అందించే కార్యక్రమం అమలు అవుతుంది.
మృతదేహాల తరలింపు ఎంత నరకం?
జబ్బున పడి, చివరికి మరణిస్తే ఆ మృతదేహాన్ని తరలించడానికి పేదలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అప్పటికే వైద్యం కోసం ఎంతో ఖర్చు చేసి ఉంటారు. ఇక మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి ప్రైవేటు వాహనాలు కిరాయికి తీసుకోవడం వారికి శక్తికి మించిన పని అవుతోంది. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన వారి మృతదేహాలను ప్రభుత్వ వాహనంలో స్వగ్రామాలకు తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రధాన వైద్య శాలల్లో వాహనాలు సమకూర్చారు.
చిన్న ఉద్యోగులతో వెట్టి చాకిరి చేయించుకోవద్దని జీతాలు పెంచారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం తీసుకొచ్చారు. దళితులు కూలీలుగానే మిగిలిపోవద్దని మూడెకరాల భూ పంపిణీ చేపట్టారు. దాదాపు అన్ని వర్గాలకు ప్రమాద బీమా అమలు చేస్తున్నారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ కార్యక్రమం వెనుక మానవీయ కోణం ఉంది. మానవతా కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వానికి దేశ వ్యాప్తంగా పేరుంది.