రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇటీవల న్యూఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షాలను కలుసుకున్నారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్‌లో చేపడుతున్న వివిధ కార్యక్రమాలపట్ల ప్రధాని ప్రశంసించారని గవర్నర్ తెలిపారు.
రాజ్ భవన్ లో ప్లాస్టిక్ వినియోగాన్ని సంపూర్ణంగా అరికట్టడం, యోగా తరగతులు నిర్వహించడం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో కలసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి పలు కార్యక్రమాలపై ప్రధానికి నివేదిక సమర్పించినట్టు ఆమె తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ సామాజిక కార్యక్రమాలలో కూడా తాను పాల్గొంటున్నట్టు గవర్నర్ ప్రదానికి వివరించారు.బతుకమ్మ పండుగ సందర్భంగా రాజ్ భవన్‌లో సాంప్రదాయబద్ధంగా ఐదు రోజులపాటు నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలపై ప్రచురించిన ఒక పుస్తకాన్ని కూడా ఆమె ప్రధానికి అందజేశారు.