ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై 50 నిమిషాల పాటు చర్చించారు. 22 అంశాలకు సంబంధించి లేఖలు అందచేశారు. ఈ లేఖల్లో విజ్ఞప్తులు ఇలా ఉన్నాయి:
- ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా రూ.450 కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. గత ఐదేళ్లలో నాలుగు సార్లు విడుదలయినప్పటికీ, ఒక ఏడాదికి సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆ నిధులు వెంటనే విడుదల చేయాలి.
- నేషనల్ హైవేస్ అథారిటీ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను పునరుద్ధరించాలి.
- తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలి.
- తెలంగాణలో ఐఐఎంను నెలకొల్పాలి.
- తెలంగాణకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఇఆర్) మంజూరు చేయాలి.
- హైదరాబాద్ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్.ఐ.డి.)ని ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ లో నెలకొల్పాలని ప్రతిపాదించిన ఎన్.ఐ.డి.ని రాష్ట్ర పునర్విభజన తర్వాత విశాఖపట్నానికి తరలించారు.
- అన్ని జిల్లాల్లో నవోదయ విద్యలయాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం మేరకు తెలంగాణలో మరో 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
- రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలి. రైల్వే పనులకు అవసరమైన నిధులు విడుదల చేయాలి.
- నీతి ఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా మిషన్ కాకతీయ పథకానికి రూ.5,000 కోట్లు, మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు విడుదల చేయాలి.
- బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి.
- జహీరాబాద్ నిమ్జ్ కు నిధులు విడుదల చేయాలి.
- తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన మేరకు, రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి.
- పిపిపి పద్ధతిలో కరీంనగర్ లో ఐఐఐటి నెలకొల్పాలి.
- తెలంగాణలో రిజర్వేషన్లు పెంచాలి. ముస్లింలలోని వెనుకబడిన కులాలకు 12 శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం బిసిలకు 37 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, రిజర్వేషన్లు కల్పించాలి.
- పార్లమెంటులో, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.
- హైదరాబాద్ – నాగపూర్, వరంగల్ -హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ను అభివద్ధి పరచాలి.
- వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అభివద్ధి కోసం పి.ఎం.జి.ఎస్.వై. ద్వారా 4వేల కోట్ల రూపాయలు కేటాయించాలి.
- వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే రహదారుల పనులకు 60:40 నిష్పత్తిలో కాకుండా, వందశాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలి.
- సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో పూర్తి కేంద్ర ఖర్చుతో వరంగల్‌లో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పాలి.
- వరంగల్ టెక్స్‌టైల్ పార్కు కోసం వెయ్యి కోట్ల రూపాయలను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా అందించాలి.
- రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి.
- వరద కాలువకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలి.